’యమా’’(హా)నటుడు కైకాల
కృష్ణా జిల్లాకు చెందిన మరో సినీ నక్షత్రం రాలిపోయింది క్రిందటి శుక్రవారం 23వ తేదీన .యమ పాత్రలలో యమహా గా నటించి మెప్పించాడు నవరస నటనా సార్వభౌముడు అనిపించుకొన్నాడు కైకాల సత్యనారాయణ .జానపద ,పౌరాణిక సాంఘికాల్లో తనదైన నట ముద్రను వేశాడు .ఎస్వి రంగారావు ను మించకపోయినా సమాన స్థాయి చూపాడు. ఇద్దరూ కలిసి నటించి మెప్పించారు .ఎన్ని చేసినా ‘’యముండ ‘’అనే పదంతో స్మృతి పధం లో ఎప్పుడూ నిల్చిపోతాడు .వైవిధ్యభరిత పాత్రలనే పోషించాడు .విలనీని బాగా ఒలికించాడు .శారద సినిమాలో శారద అన్నగా చాలా సౌమ్యమైన పాత్ర వేయించి ,నటిమ్పజేయించాడు దర్శకుడు విశ్వనాథ్ .ఈ పాత్ర విలన్ ఆర్. నాగేశ్వరరావు ఇలవేలుపు సినిమాలో ఆశ్రమాదికారి ‘’నాన్న గారు ‘’పాత్రను గుర్తుకు తెస్తుంది .ఇద్దరూ ఆయా పాత్రలకు పూర్తీ న్యాయాన్ని రొటీన్ కు భిన్నంగా నటించి సెభాష్ అని పించారు .
కృష్ణాజిల్లా కౌతవరం లో 25-7-1935 న కైకాల లక్ష్మీనారాయణ,సీతమ్మ దంపతులకు పుట్టిన కైకాల సత్యనారాయణ ప్రాధమిక,హైస్కూల్ విద్య అక్కడే చదివి ,తర్వాతగుడివాడలో ఎ ఎన్ ఆర్ కాలేజిలో చదివి డిగ్రీ పొంది నాగేశ్వరమ్మను వివాహం చేసు కొని ఇద్దరు కూతుళ్ళకు ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు .మాంచి స్ఫురద్రూపం చక్కని డైలాగ్ డెలివరి తో ఉన్న ఆతడు హీరో వేషాలకోసం మద్రాస్ వెళ్ళాడు .నిర్మాత డిఎల్ నారాయణ అతడిని గుర్తించి సిపాయి కూతురు సినిమాలో హీరో వేషం వేయించాడు .సినిమా బాక్సాఫీస్ వద్ద డింకీ కొట్టనా దర్శకుడు కైకాల ప్రతిభను గుర్తించి ,అందులోనూ ఎన్టిఆర్ పోలికలు బాగా ఉండటంతో బాగా పనికోస్తాడని నిర్ణయించుకొన్నాడు .ఎస్ డి.లాల్ దర్శకత్వం వహించిన ‘’అపూర్వ సహస్రశిరచ్చెద చింతామణి ‘’’లో రామారావు అతడికి ఒకవేషం ఇప్పించాడు
జానపద చిత్రనిర్మాత దర్శకుడు బి .విఠలాచార్య కు సత్యనారాయణలో విలన్ బాగా ఉన్నాడని గుర్తించి ,తన చిత్రాలలో’’కనకదుర్గ పూజా మహిమ ‘’తో ప్రారంభించి ప్రతినాయక పాత్రలిచ్చి గొప్పగా నటించే అవకాశం కల్పించాడు .అలానే నటించి సత్తా నిరూపించుకొన్నాడు .విలన్ పాత్రలనే కాక సహాయనట పాత్రలు కూడా ఎంచుకొని వాటిలోనూ నటనతో మెప్పించాడు .ఆతర్వాత కేరక్టర్ నటుడు గా స్థిరపడ్డాడు అగ్రనాయకులందరికి తండ్రిగానో అన్నగానో మామ గానో నటించి సమర్ధత చాటుకొన్నాడు .అంటే సంపూర్ణ నటన ప్రదర్శించాడన్నమాట .యమలీల ,యమగోల సినిమాలలో యముడుగా నటించి రంగారావు కు భిన్నంగా తనదైన వరవడి పెట్టాడు .ఇవన్నీసూపార్ హిట్ అయ్యాయి .పౌరాణికాలలో దుర్యోధన,రావణ ,యమ పాత్రలు అత్యద్భుతంగా చేశాడు .జానపదాల్లో హీరో లు కాంతారావు రామారావు లతోపాటు గొప్పగా కత్తి యుద్ధాలూ చేసి వారిని మెప్పించాడు .సాంఘికాల్లో హీరోల తండ్రి ,తాత పాత్రలలో కూడా బాగా ఒదిగిపోయాడు .ఒకానొక సమయంలో కైకాల లేనిసినిమా ఉండేదికాదు .రమా ఫిలిమ్స్ సంస్థస్థాపించి’’ఇద్దరుదొంగలు ,కొదమ సింహం ,బంగారుకుటుంబం ,ముద్దులమొగుడు సినిమాలు నిర్మించాడు .
అన్న ఎన్టిఆర్ తెలుగు దేశం స్థాపించినప్పుడు అందులో చేరి 1996లో మచిలీ పట్నం నుంచి 11వ లోక్ సభ కు పోటీచేసి లోక్ సభ సభ్యుడయ్యాడు .
బంగారుకుటుంబం సినిమాకు నంది అవార్డ్ ను ,2011లో రఘుపతి వెంకయ్య అవార్డ్ ,2017లో జీవిత సాఫల్య పురస్కారం పొందాడు .ఇవికాక ఎన్టిఆర్ ట్రస్ట్ అవార్డ్ ,నటశేఖర అవార్డ్ ,కళాప్రపూర్ణ ,నవరస నటనాసార్వభౌమ పొందాడు
మొత్తం 777సినిమాలలో నటించాడు అందులో పౌరాణికాలు 28,జానపదాలు 51,చారిత్రకాలు 9,మిగిలినవి సాంఘికాలు .200మందిదర్శకులతో పని చేశాడు .100రోజులుఆడిన సినిమాలు 223,అర్ధశతదినోత్సవాలు 59,సంవత్సరం పైగా ఆడిన సినిమాలు 10 .శతదినోత్సవం చేసుకొన్నవి 10.ఇదంతా ఘనమైన రికార్డే .
నందమూరితో కలిసి 101 సినిమాలో నటించాడు .రౌద్ర ,వీర ,భీభత్స ,భయానక ,హాస్య ,కరుణ ,అద్భుత ,శాంతి ,శృంగార రసాలను అత్యద్భుతంగా పోషించి నవరస నటనా సార్వ భౌముడు అయ్యాడు .
భోజన ప్రియుడైన సత్యనారాయణకు ‘’కౌతవరం వెంకట నారాయణ చెరువు చేపలు ‘’అంటే మహా ఇష్టం .వీలునిబట్టి ఇక్కడి ఈ చెరువు చేపలకూరను వండించి తెప్పించుకొని తన కుటుంబం తో పాటు అగ్రనటుల కుటుంబాలకు కూడా పంపేవాడు .అందుకే ఆ చెరువు చుట్టూరివెట్ మెంట్ ఏర్పాటు చేశాడు ఎంపి అయ్యాక .గ్రామం లో అనేక సిసి రోడ్లు వేయించాడు .ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించాడు .ఆయన ముఖ్యస్నేహితులు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు శ్రీ కే ఎల్ ఎన్ ప్రసాద్ ,గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి స్థాపకుడు వల్లూరుపల్లి వెంకటరామ శేషాద్రి రావు ,వల్లభనేని బాబూరావు ,మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి మాజీ డిఎస్పి లు ఉన్నారు .కౌతవర గ్రామ జనాలను పలకరిస్తూ తన సినిమాలు చూసి తప్పొప్పులను రాయమని కోరేవాడు .ఆరోగ్యాల గురించి వాకబు చేసేవాడు .కౌతవరం అంటే విపరీతమైన ప్రేమ కైకాలకు .
బందరు తోనూ గొప్ప అనుబంధం ఉండేది .బందరువస్తే కళా బంధు చలమల శెట్టి నా౦చారయ్య ,జిల్లా గ్రంధాలయ శాఖాధ్యక్షుడు గొర్రెపాటి గోపీ చ౦ద్ మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు ఇంట్లోనో గడిపేవాడు .అక్కడి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో మహా ఇ ష్టంగా పాల్గొనేవాడు .హిందూకాలేజిలో కైకాలను సత్కరించే కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసినవారందరికీ ఆయనే ముందుగా సత్కరించాడు .హిందూకాలేజీ లెక్చరర్ ,నాటకరచయిత జంధ్యాల రాదా కృష్ణ ,రంగస్థల కళాకారుడు గాంధీ లతో మంచి స్నేహాన్ని నిలబెట్టుకొన్నాడు .బందరు రంగస్థల కళాకారుల సమాఖ్య మునిసిపల్ పార్క్ లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరయ్యేవాడు .కళాకారులపై ఆయన అభిమానం ఇంతా అంతా కాదు కొండంత .మాజీ మంత్రి కొల్లురవీంద్ర కైకాల అభిమాని .బందరులో గెలిచాక రామారావు ను కలవటానికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతగా కైకాల అన్నగారితో మాట్లాడిన మాటలను ఇప్పటికీ మరచిపోలేదని గొర్రెపాటి గోపీ చ౦ద్ గుర్తు చేసుకొన్నారు . ఈ గోపీ చంద్ గారేదక్షిణ భారతం లో ఎక్కడా లేని ఎ.సి. గ్రంధాలయాన్ని ఉయ్యూరులో ఏర్పాటు చేయటానికి అమెరికాలో ఉన్న శ్రీ మైనేని గోపాలక్రిష్ణగారిని ఎం ఎల్ సి తాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయనను ఒప్పించి 5లక్షల రూపాయలునిధులు సేకరించి మైనేనిగారితలిదండ్రులు మైనేని వెంకట నరసయ్య శ్రీమటి సౌభాగ్యమ్మ జ్ఞాపకార్ధం కట్టించారు నన్ను ఆభవన నిర్మాణానికి కన్వీనర్ చేశారు .నటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీని ప్రారంభోత్సవానికి రావాలని ఉత్సాహపడ్డారు కానీ ఎన్నికలలో ఆప్రభుత్వం ఓడిపోవటం కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వలన 204 జులై లో ప్రారంభోత్సవం కొత్తమంత్రుల చేత జరిగింది .మైనేనిగారు ఆయన అక్కగారు బావగారుడా. అన్నపూర్ణాదేవి డా రాచకొండ నరసింహ శర్మగారు ,గొర్రెపాటి గోపీచంద్ ,వెలగా వెంకటప్పయ్య మొదలలైన వారుపాల్గొన్నారు .
గుడివాడ లో కైకాల 1951-54వరకు ఇంటర్ ,డిగ్రీ చదివినపుడు ఎన్నో నాటికలలో నటించి మెప్పు పొందాడు .కాలేజి గోల్డెన్ జూబిలీ సమయం లో పూర్వ విద్యార్ధుల సంఘం లో కైకాల కీలక పాత్ర పోషించాడు .
నాటకాలను నాటక కళాకారులను ప్రోత్సహించాలని భావించేవాడు కైకాల .గుడివాడ అభివృద్ధికి ఆయన సేవలను గుర్తించి స్థానిక నెహ్రు చౌక్ సెంటర్ వద్ద గల ఒక వీధికి ‘’కైకాల వారి వీధి ‘’అని గౌరవంగా నామకరణం చేసింది గుడివాడ పురపాలక సంఘం . గుడివాడలో పూర్తీ హంగులతో ఒక కళామందిరాన్ని ఏర్పాటు చేయాలని కైకాల భావించి 8-6- 2011న తాను పూర్వం స్థాపించిన కైకాల కళామందిరాన్ని పునర్నిర్మించటానికి అప్పటి మంత్రులను రప్పించి శ౦కు స్థాపన చేయించాడు .తను 5లక్షలు ఇచ్చి టిటిడి నుంచి 10,పర్యాటక శాఖ నుంచి 10లక్షలు నిధులను సేకరించాడు .మిగిలినఖర్చు మునిసిపాలిటి భరించింది 15-2-2019 కి నిర్మాణం పూర్తీ చేసి ,మాజీ శాసన సభ్యుడు రావి వెంకటేశ్వరరావు ,మునిసిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు లు కళామందిరాన్ని ప్రారంభించి కళాకారులకు అందు బాటులోకి తెచ్చారు .పాతప్రభుత్వం పోయి కొత్తది వచ్చినదగ్గర్నుంచి దాని ఆలనా పాలనా పట్టించుకొన్న వారు లేరు .కైకాల కృషిని నీరు గార్చారు ఘనతవహించిన వారు .సా౦స్క్రుతిక కార్యక్రమాలతో ,నాటకాలతో కళకళ లాడాల్సిన కళామందిరం నేడ నిరుపయోగం గా మారింది.వేరే అవసరాలకు వాడుతూ కళాకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ ,కైకాలను అవమానించారని ఆవేదన చెందారు శ్రీ రావి వెంకటేశ్వర రావు .కైకాల కళామందిరాన్ని తిరిగి కైకాలకు అంకితం చేయాలనీ కోరారు .
ఇక్కడ నాకో విషయ౦ జ్ఞాపకం వచ్చింది .సుమారు 20ఏళ్ళ క్రితం అనుకొంటాను గుడివాడలో అవధాని శ్రీ కడిమిళ్ళ వరప్రసాదరావు ఆయన శిష్యుడు శ్రీ కోట లక్ష్మీ నరసింహం కలిసి జంట శతావధానం చేశారు .ఉయ్యూరు నుంచి నేనూ గూడపాటికోటేశ్వరరావు ,పీసపాటి కోటేశ్వరావు తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు పృచ్చకులుగా ఉన్నాం .ఒక రోజు ఉదయంసెషన్ అవగానే నేనూ గూడపాటి భోజనాలు చేసి అలా బయటికి తిర్గి వద్దామని బయల్దేరితే దగ్గరలో కైకాల సభ జరుగుతోందని తెలిసి వెళ్లాం .సభలో సినీ పాటల రచయిత జాలాది కూడా ఉన్నారు .ఆ సభ గుడివాడకు చెందిన ఒక నాటకకళాకారుని జయ౦తి సందర్భం ఆయన్ను ఆయన సేవలను ఇద్దరూ బాగా మెచ్చుకొన్నారు .ఆయన శిలావిగ్రహం ఆవిష్కరించారు .వారిద్దరికీ స్థానిక కళాకారుల సంఘం గొప్ప సన్మానం చేశారు .సభ అయ్యాక మేమిద్దరం కైకాలను జాలాదిని కలిసి కాసేపు మాట్లాడాం.ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడు నేను సరసభారతి స్థాపించలేదు .మా గురువుగారు శ్రీ లంకా బసవాచారి గారు స్థాపించిన సాహితీ మండలికి కన్వీనర్ గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. జాలాది ఫోన్ నంబర్ తీసుకొని ఉయ్యూరు కు ఆహ్వానిస్తాం వస్తారా అని అడిగితె తప్పక వస్తానన్నారు .ఒకటి రెండు సార్లు ఫోన్ లో మాట్లాడానుకూడా .ఆతర్వాత ఎందుకో ఆకార్యక్రమం రూపు దాల్చలేదు .జాలాదిపాట ‘’చూరట్టుకు రాలుతుంది సురుక్కుసురుక్కు వాన సినుకు ‘’,ప్రాణం ఖరీదులో ‘’యాతమేసి తోడినా యేరు ఎండదూ –పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు –దేవుడి గుడిలోనైనా ,పూరి గుడిసె లోనైనా –గాలి ఇసిరికొడితే –దీపముండదు ‘’పాటలు అంటే నాకు మహా ఇష్టం .కృష్ణా జిల్లా రచయితల సంఘం బెజవాడలో నిర్వహించిన రెండవ ప్రపంచ రచయితల సభలలో జాలాది ప్రసంగం విని ఫిదా కాని వారులేరు .గంట సేపు మాటలతో పాటలతో గుండె తలుపు తట్టాడు. జాలాది మాటల గాలమేసి లోని మనస్సును పైకి ల ఏడ్పించాడు, నవ్వించాడు హెచ్చరించాడు మానవత్వ విలువలు చెప్పాడు .ప్రాణం ఖరీదు లో పైన చెప్పిన పాట కైకాల సత్యనారాయణ నోటి నుంచి వచ్చిందే .అందుకే గుర్తు చేశా.మిగిలిన వివరాలు రేపు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-22-ఉయ్యూరు