అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు-2(చివరిభాగం )
తెలుగు భాష పరిరక్షణకోసం ప్రతి ఇంటి నుంచి ఉద్యమం రావాలి అని కోరారు వెంకయ్యనాయుడు. ప్రాధమిక విద్యలో తెలుగు ,పరిపాలనలో తెలుగు తప్పవు అన్నారు. ఉపాధ్యాయులు సాధించలేనిది ఎమీలేదన్నారు గరికపాటి సామాజికంగా భాషా పరంగా రావాల్సిన మార్పులు సూచించారు జస్టిస్ వెంకట రమణ .తెలుగు భాషను ఆధునిక మాధ్యమం లో ,నూతన ప్రక్రియలతో ముందుకు తీసుకు వెళ్ళటానికి ,భావితరాలకు తెనుగును నిత్యనూతనంగా తీర్చిదిద్ది అందించాలనే సంకల్పంతో అంతర్జాలం లో ‘’కోటి మాటలకోట ‘’గొప్ప ఉపకరణంగా తయారు చేస్తున్నామని కూచిభొట్ల ఆనంద్ చెప్పారు .ఇందులోని మాటలు ఏ ఒక్కరివోకావు అందరివీ అన్నారు .తెలుగు ఉనికిని కోల్పోవటం బాధాకరం గా ఉందని ఫ్రాన్స్ తెలుగు ఆచార్య డేనియల్ నిగార్స్ అన్నారు బుర్రకధలపై పరిశోధనలు చేశానని ,ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సభలు జరుగుతున్నా హాజరవుతున్నానని చెప్పారు .ప్రాధమిక విద్యనూ పరభాషలో నేర్పే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని వక్తలందరూ గర్హించారు .తెలుగు మనుగడ ఉపాధ్యాయులపై ఉందని ఉద్ఘాటించారు .తెలుగు మనుగడ కోసం ఇప్పటికీ పోరాడాల్సి రావటం చాలా బాధాకరం అన్నారు బుద్ధ ప్రసాద్ .తానా సాహిత్యవేదిక ‘’తెలుగు వెన్నెల ‘’పేరుతొ ప్రతినెలా ఆఖరి ఆదివారం అంతర్జాలం లో అనేక అంశాలపై నిర్వహిస్తున్నామని వేయి మందికి పైగా కవులు కళాకారులు సాహితీ వేత్తలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారని తోటకూర అన్నారు .స్కూళ్ళు పెట్టి తెలుగు పిల్లలకు తెలుగును దగ్గర చేస్తున్నామని చెప్పారు .బండి ఉష అమ్మకు అక్షర నైవేద్యం చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ,జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ తనకు రావటం అదృష్టం అన్నారు .మరుగున పడిన సాహిత్యకారుల రచనలు ఇంకా ఎన్నో వెలుగు చూడలేదని వాటిని ముద్రించాలని కోరారు వీస్ ఆర్ ఎస్ సోమయాజులు .ఖర్గపూర్ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్ళపల్లి సుందరరావు తమ సంస్థ 16రాష్ట్రాలలో తెలుగు భాషా పరిరక్షణ చేస్తోందని ,రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా ఉన్నాయని బాధ పడ్డారు .అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అహమ్మదాబాద్ కు చెందిన పిఎపిసి ప్రసాద్ అన్నారు .సింగపూర్ లో రెండేళ్లలో 40కార్యక్రమాలు నిర్వహించామని 35దేశాలను కలుపుకొంటూ ఆన్ లైన్ లో కళాకారులను ఒక చోట చేరుస్తున్నామని సింగపూర్ సాంస్కృతిక కళా సారధి ఆర్గనైజింగ్ ప్రతినిధి మంగిపూడి రాధిక చెప్పారు .కందుకూరి స్ఫూర్తితో పత్రికా నిర్వహణ జరగాలని కవి సంధ్య అధ్యక్షులు శిఖామణి కోరారు .యువత నచ్చేలా మెచ్చేలా రచనలు చేయాలని రెంటాల జయదేవ్ అన్నారు .నాగబాల రాజన్న కవి పద్య కవితా పుస్తకాన్ని ఆ సాహిత్య వేదిక అధ్యక్షులు ఎం ప్రభాకర్ రామారావు వేదికపై ఆవిష్కరించారు .సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ‘’ప్రస్తుతం అమ్మభాష అంపశయ్య పై ఉంది ‘’అని ఆవేదన చెందారు .ఫ్రాన్స్ ఇటలిపోలాండ్ దేశాల తెలుగు ప్రతినిధులు తెలుగులొఅనర్గళ౦గా పద్యాలు పాటలు పాడి ఆశ్చర్యపరచారు . దివ్యాంగు డైన చిత్రకారుడు ‘’బ్నిం ‘’సభా వేదికపై ఉండటం అందరికి గొప్ప స్పూర్తి నిచ్చింది .లండన్ కు చెందిన జాక్ ఫ్రూట్ లాంటి కుర్రాడు,మహేష్ బాబులాఉన్న వాడు జాక్ ఘంట సాలపాటలను అలవోకగా పాడి అలరించి ప్రశంసలు పొందాడు .
రచయితలే సమాజ నిదేశికులని సామాజిక రుగ్మతలపై సమైక్యంగా నినదిద్దామని ,యువత ఎందుకో ముందుకు రావటం లేదని సాహిత్యా౦శాలపై లోతైన అధ్యయనం జరగాలని ,సినీనటులు స్టార్డం తో అనవసర ప్రచారం చేస్తున్నారని సమాజ బాధ్యత తీసుకోవటం లేదని కామోన్మాద కులోన్మాద మతోన్మాదాలు పెరిగాయని ఉక్కు పిడికిలి బిగించి ఎదిరించాలని ,సాహిత్య పరిధిలోకి రాని సంచార జాతుల అభ్యున్నతి ,వికాసం కోసం రచనలు చేయాలని సాంఘిక లైంగిక ఆర్ధిక సమానత్వం కోసం రచనలు రావాలని ,మానవ సంబంధాలు వైవాహిక సంబంధాలు అత్యంత దారుణంగా పతనం చెందాయని వీటిని నిలబెట్టే రచనలూ రావాలని సాంకేతికంగా పిల్లల ఉత్పత్తి అనర్ధాలకు దారి తీస్తుందని ఆపే ప్రయత్నాలు జరగాలని ,విమర్శ ప్రగతికి మెట్టు అని ,సామాజికమార్పులతో కవిత్వం వెనకబడి పోతోందని మారే సమాజానికి అనుగుణంగా రచనలు చేయాలని ప్రముఖ రచయితలూ కవులు విమర్శకులు వివిధ వేదికలపై నినదించారు .
గ్రామ చరిత్రలను తయారు చేయాలని మొవ్వ శ్రీనివాసరెడ్డి కోరగా ,వచనకవిత్వం లోఅవదానాలు రావాలనిసబ్బిని లక్ష్మీ నారాయణ కోరారు. రానికవిత్వాన్ని రుద్దకండి అని కవి ఎం విజే అంటే ,సైన్స్ ఫలాలు ప్రజలకు దక్కాలని కొండామోహన్ కోరారు .మోడీ కోరే ఒకే దేశం ఒకే భాష సిద్ధాంతం మంచిదికాదన్నారు కమ్యూనిస్ట్ నాయకుడు మధు .సాహిత్యం ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుంది అన్నారు జెడి లక్ష్మీనారాయణ .రాజకీయాలలోకి భాష వస్తే నలిగి పిప్పి అవుతుందని ఆంద్ర ప్రదేశ్ కు తెలుగు తప్పితే మరో అస్తిత్వం లేదు అని నొక్కి వక్కాణించారు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఎబి వెంక టేశ్వరరావు .తెలుగు రచనలలో సృజనాత్మక తగ్గిపోయిందని ఆయన బాధ పడ్డారు .
చివరగా ఇది వరకు చేసిన తీర్మానాలనే మార్చి మళ్ళీ తీర్మానాలు చేశారు .
పదనిసలు -500రూపాయలు ప్రతినిధి రుసుము చెల్లించి స్వంతఖర్చులతో వచ్చి స్వయంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని రెండు రోజులు సాహిత్య పండగ లో పాల్గొన్నారు దాదాపు1500మంది .అందరికి జేజేలు ఉదయం రెండు రకాల టిఫిన్లు ,కాఫీ టీ,మధ్యాహ్నం రాత్రి కమ్మని భోజనాలు ,సాయంత్రం స్నాక్స్ తో సేద దీరారు హాయిగా .ముసలి వారే ఎక్కువ. యువకుల విద్యార్దులజాడ తక్కువ .వారికి తగిన వేదికలు లేవు వారిఎనర్జిని ఉపయోగించుకోలేదు .నన్నయ లో ప్రారంభమైన ప్రారంభ సభ ఉపరాష్ట్రపతి, మాజీ సిజె ఉండటం వలన సైడ్ లో పెద్దగా చూపించేఎర్పాటు చేశారు. వాళ్ళు వెళ్ళాక అసలు సమాజానికి ప్రతినిధులకు ఆ గౌరవం దక్కలేదు .సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా ఆ సంకేతికత్వాన్ని వేదికలపై ఉపయోగించు కోలేక పోయాం .
చాలామంది శత జయంతి సంవత్సరం ఇది .అందులో ముఖ్యంగా ఘంటసాల కు వేదిక కల్పించకపోవటం అందరికి బాధ కలిగించింది. ఎన్ని సార్లు పిలుస్తారు సంగీత స్వర పాణి ని ?ఘంటసాల స్వరామృతం నిర్వహిస్తున్న టి .శరత్ చంద్ర కనిపించలేదా ?నిలయ విద్వాంసులు అన్నవరపు ,మోదుమూడి ,గజల్ శ్రీనివాస్ ,కాక వేరెవ్వరూ లేరా ?ప్రపంచ రచయితల సంఘం కు ఎవరు ఏమి రాస్తున్నారో పట్టదా ?99 ఏళ్ళ వయసులోనూ కవిత్వం రాస్తూ ఆంగ్లకవులకవిత్వాన్ని అనువదించి పుస్తకాలు గా వెలువరిస్తున్న విశాఖకు చెందిన రావి శాస్త్రిగారి తమ్ముడు డా రాచకొండశార్మగారు ఆనలేదా .?
సుమారు 30 సమావేశాలు మూడు వేదికలపై జరిగాయి .సమయం తక్కువ .ఆత్మీయ అతిధులు అంటూ పిల్చి వాళ్ళను ఏమీ కట్టడి చేయలేక అసలు మాట్లాడే వారికి అవకాశం తగ్గించడం బాధాకరం వెంకయ్యనాయుడు గారు 2014లో పార్లమెంట్ సభ్యుడైన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ఎన్ని సమావేశాలో మాట్లాడినా అవే చిలక పలుకులు .సమయ పాలనం అంటూ హితవు చెప్పి చివరికి తానూ పాటించకుండా రాసి తెచ్చుకొన్న కాగితాలు చదివి మరీ ఇబ్బంది పెట్టారు .అయ్యో అనిపించింది .భువన చంద్ర పోడిచేసిన్దేమీ లేదు .ఇనాక్ గారి వాక్ కూడా సందర్భానికి తగినట్లు లేదు .అవధానం ప్రారంభించటానికి పొడిమాటలతో అరగంట కాలక్షేపం చేసి సహనాన్ని పరీక్షించారు చురుగ్గా పద్యం ఎత్తుకుంటే అటేన్షన్ లోకి వస్తారు .విశేషంగా ఉండేది, నీరసంగా సాగింది .నాట్యంలో ఏలూరాయన సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరూ దొరకలేదా ?కొత్తవారిని ప్రోత్సహించరా ?
ప్రతి ప్రపంచ సభ లో సాంకేతిక సభ ఉత్కృష్టంగా ,దిశా నిర్దేశంగా ఉండేది .ఈ సారి ఆరంగంలో దిగ్దంతులు గారపాటి, రేహ్మనుద్దీన్ మొదలిన వారు లేకపోవటం వలన ఆకార్యక్రమం పండ లేదు .నాకు తెలిసి నంతవరకు శ్రీమతి తేళ్ళ అరుణ కున్న ధైర్యసాహసాలు ఎవరూ ప్రదర్శించ లేకపోయారు .ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అందులో ఒక్కస్త్రీ పేరు మీద కూడా జిల్లా లేకపోవటం ఆమె గమనించి ఉద్యమం చేశానని చెప్పింది .అన్యాయాన్ని మౌనంగా భరించమనే సందేశమే ఈ ప్రపంచ సభల ఉదేశ్యమా అని పిస్తుంది జొన్న విత్తుల ఉంటె ఆ పౌరుషం చూపేవాడు . ఆ వెలితి కొట్టవచ్చినట్లు కనిపించింది .నాలుగు సభల అనుభవం ఈసభల్లో కనిపించలేదు .
2023 నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-22-ఉయ్యూరు