అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -2
2-ఫ్రాంక్ హెచ్ .డేవిడ్
అలనాటిఎల్. ఐ .సి .కుబేరుడు ఫ్రాంక్ హెచ్ .డేవిడ్ .8 వేలమంది ఇన్సూరెన్స్ ఏజెంట్స్ పై మేనేజర్,కంపెనీ ఉపాధ్యక్షుడు .ఎలాంటి ఉద్యోగం సంపాదన లేని వాడు ఒకప్పుడు ఫ్రాంక్ .ముప్ఫై ఏళ్ళు వచ్చినా దేశందాటి ఎప్పుడూ బయటికి పోలేదు .అనేక చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు దేనిలోనూ మిలబడ లేదు .కూలీనుంచి కాన్వాసర్ దాకా అన్నీ వెలగబెట్టాడు .మనిషి ఆరడులవాడు. గుణాలు సామాన్యం .బట్ట తల పిల్లి కళ్ళు.అందరి కి ప్రేమపాత్రుడు .అప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది .తనకున్న వస్తు విక్రయ అభిలాష ,అందరు మనుషులపై గొప్ప శ్రద్ధ లనే పెట్టుబడి గా పెట్టి స్థిరపడాలని నిర్ణయించుకొన్నాడు .ఏ వ్యాపారం తనను తీర్చి దిద్దగలదు,తనను నమ్మినవారికి న్యాయం ఎలా కలిగించగలను అని తీవ్రంగా ఆలోచించి చివరికి ‘’బీమా వ్యాపారం ‘’శ్రేష్టం అని భావించాడు .
డేవిడ్ తండ్రి అకస్మాత్తుగా తుపాకీ ప్రమాదం లో చనిపోయాడు .తండ్రి 1500పౌన్లకు ఒక పాలసి తీసుకొన్నాడు .అదే ఆ కుటుంబాన్ని కాపాడింది .తండ్రికి ఆ పాలసీ ఇచ్చిన పుణ్యాత్ముడు తమకు జీవనోపాధి కల్పించాడని ధన్యవాదాలు చెప్పుకొన్నాడు మనసులో .వెంటనే ఇన్సూరెన్స్ కాన్వాసర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాడు .వెంటనే ఉద్యోగం వచ్చింది .అప్పటికి అతడికి దానిపైనా అసలు అవగాహనే లేదు .మూడు నెలలు దాటినా ఒక్కరికీ పాలసీ ఇప్పించలేక పోయాడు .నిరాశ పడక ఇన్సూరెన్స్ పుస్తకాలన్నీ దీక్షగా చదివాడు .పాలసీ తీసుకొనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పి మెప్పించాలో తెలుసుకొన్నాడు .అప్పటికి ఆ కంపెనీలో 200౦మంది ఏజెంట్స్ ఉన్నారు .ఒక్క నెలలో ఎక్కువ మంది పాలసీ దార్లను చేర్పించిన వారికి బహుమతి ఇస్తామని కంపెని ప్రకటించింది .ఇదే అదనుగా పగలు రాత్రి కష్టపడ్డాడు .పూర్వపు రికార్డ్ బద్దలుకొట్టి అత్యధికంగా పాలసీ దార్లను ఒప్పించి చేర్పించి కంపెనీ ఇచ్చిన బహుమతి పొందాడు .ఇదే కాక కంపెని 200పౌన్ల బోనస్ కూడాఅతడికి ఇచ్చింది.క్రమ౦గా ఒక్కొక్కమేట్టూ ఎక్కుతూ బీమా ప్రపంచ సౌధాన్ని ఎక్కాడు .
ఆ కంపెనీ కి రాజీనామా చేసి ,మరో పెద్ద కంపెనికి దరఖాస్తు పెట్టి ‘’ఏ ప్రదేశం కష్టంగా ఉంటుందో అక్కడ నాకు ఉద్యగం ఇచ్చిపూర్తీ స్వాతంత్రం ఇవ్వండి ‘’అని కోరాడు .పాలసీలను కట్టటానికి ఇష్టం చూపని చోట ఉద్యోగం లో చేరి తన సమర్ధత చూపాడు .అక్కడ ఒక్క ఏడాదిలో మూడు లక్షల నుంచి ఆరు లక్షల పౌన్లకు భీమా వ్యాపారం పెంచి కంపెనీ వారి దృష్టిలో పడ్డాడు .తర్వాత దాన్ని 10లక్షలకు పెంచాడు .ఇతని సమర్ధత గుర్తించి మరొక గడ్డు ప్రదేశానికి నియమిస్తే 12లక్షలనుంచి 60లక్షలకు అంటే అయిదు రెట్లు అయిదేళ్ళలో పెంచి రికార్డ్ సృష్టించాడు .అతని కార్యదక్షతకు ముచ్చటపడి మెయిన్ బ్రాంచ్ లో పని చేసే ఏర్పాటు చేసి ,కంపెనీ కి వైస్ ప్రెసిడెంట్ ను చేశారు .అంటే 8వేలమంది ఏజెంట్ లపై పెత్తనం .ఇదంతా కేవలం 9ఏళ్ళ స్వల్పకాలం లో సాధించాడు ఫ్రాంక్ డేవిడ్ .
సమ్మోహం పరచే వాక్చాతుర్యం ,ఒప్పించగల నేర్పు అతని కి పెట్టు బడులయ్యాయి .అతనికి ,కంపెనీకి ధనం తోపాతు యశోధనం కూడా పెరిగింది .చేసే పనిపై మనసు పెట్టి విశ్వాసంతో పని చేస్తే విజయమే మన వెంటపడు తుంది అంటాడు .ఒక్కోసారి మొండిగా వాదించేవారికి మొండిగానే సమాధానాలు చెప్పి ఒప్పించేవాడు .సౌమ్యులకు సౌమ్యంగా సమాధానం చెప్పేవాడు .ఒకాయన ‘’నాభార్యకు పెద్ద ఇన్సూరెన్స్ చెక్కు నేను ఎందుకు ఇవ్వాలి ?నేను చస్తే ఆవిడ ఒక పనికి రాని వాడిని పెళ్లి చేసుకోవచ్చు కదా ‘’అంటే ఫ్రాంక్ ‘’ నీ భార్యకు తగినంత డబ్బు ఇస్తే వేరొక అప్రయోజకుడిని పెళ్ళాడే గతి ఆమెకు పట్టదు కదా ‘’అని చెప్పి ఒప్పించి పాలసీ ఇచ్చాడు .ఏజెంట్ లకు ఉత్సాహం ,దూర దృష్టి సాహసం ఉండాలని బోధిస్తాడు .ఏజెంట్లకు ఎక్కువ స్వాతంత్ర్యం ఇస్తే ,ఎక్కువ బాధ్యతా,ఉత్సాహం తో పని చేసి ,కంపెనీకి పాలసీ దార్లకు ఎక్కువ మేలు చేయవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మి కోటికి పడగలెత్తిన ఇన్సూరెన్స్ కుబేరుడైనాడు ఫ్రాంక్ డేవిడ్ .
సశేషం
నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-1-2023-ఉయ్యూరు .