అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -6
6-బెరన్ హార్డ్ బారన్
సిగరెట్ వర్తక చక్రవర్తి బెరన్ హార్డ్ బారన్ స్వయం కృషి వలన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వాడు .యంత్రాలమీద సిగరెట్స్ తయారు చేసి కుబేరుడయ్యాడు ఎందరికో మార్గదర్శి అయ్యాడు .ఉత్పత్తిలో శుచిత్వం పాటించటం అతడి విజయానికి ముఖ్య కారణమైంది .మొదట్లో సిగరెట్ వర్తకులు ఇతడిని ‘’లైట్ తీసుకొన్నారు ‘’అదే వారి కొంప కొల్లేరు చేసింది .ప్రజలు యంత్రాలపై తయారైన సిగరెట్ లకు అలవాటై నాటు సిగరెట్లు మోటు అని వదిలేశారు .ఎంతగా డబ్బు సంపాదించాడో అంతగా దాన ధర్మాలు చేసి జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు .చనిపోయేముందు కూడా 20లక్షల పౌండ్లు దానధర్మాలు చేసిన వితరణ శీలి .ఇంతగా అతడికి డబ్బు సంపాదించి పెట్టిన సంస్థ పేరు1788లో స్థాపించిన ‘’కార్రి రాస్ లిమిటెడ్ ‘’.
జోస్ జోక్వెన్ కార్రిరాస్ అనే స్పానిష్ విదేశీయుడు లండన్ లో రీజెంట్ స్ట్రీట్ లో మూడవ జార్జి పరిపాలనా కాలం లో ఒక చిన్న దుకాణం పెట్టాడు .అది బాగా కిక్ అయి అందరి అభిమానం పొంది కాతాదారుల్ని విపరీతంగా ఆకర్షించింది .గొట్టాలు అంటే పైపులలో పొగపీల్చే వారికోసం తయారు చేసిన పొగాకు పొడిని ఆ కంపెని వారు 1567 నుంచి తయారు చేసి అమ్ముతున్నారు .దీన్ని కమ్మగా తయారు చేసినవాడు ‘’ఎరల్ ఆఫ్ క్రేవన్ ‘.ఇతర వస్తువులతో పాటు ఈ పొగాకు పొడిన కార్రిరాస్ తన దుకాణం లో అమ్మేవాడు .1903లో ఈ వ్యాపారం బెరన్ హార్డ్ బారన్ చేతికి వచ్చింది .దాని చాలా గొప్పగా అతడు వ్యాప్తి చేశాడు తన స్వీయ ప్రతిభా సామర్ధ్యాలతో .
యంత్రాలమీద సిగరెట్ లను అత్యంత నాణ్యంగా శుచిగా తయారు చేయటం ప్రారంభించి పొగ పీల్చేవారికి స్వర్గం చూపించి కొద్ది కాలం లోనే విశ్వవ్యాప్త సిగరెట్ వ్యాపారం చేశాడు .దీన్ని సాధించటానికి ముఖ్యకారణం లండన్ ఉత్తర భాగం లో ఒక కొత్త సిగరెట్ ఫాక్టరీ స్థాపించటమే .భవిష్యత్ వ్యాపారానికి ఇది ఒక కొలమానం –యార్డ్ స్టిక్ అయింది .యూరప్ ,అమెరికాలోని ఉత్పత్తి దారులంతా చూసి అబ్బురపడే అద్భుత యంత్రాగారం ఇది .ఆ ఫాక్టరీ ని దేవాలయంగా కట్టి ,ఇంటిలాగా నిర్వహి౦పబడటం గొప్ప విశేషం .అదే ఒక టంక శాల అంటే మింట్ లాగా డబ్బును ఉత్పత్తి చేస్తోంది .ఫాక్టరీ ధనాన్ని నూటికి యాభై శాతం లాభాలు పంచటం మరొక విశేషం. దీనిపై పన్నుకూడా లేకపోవటం మరో విశేషం .
ఈ ఫాక్టరీ నిర్మాణానికి బెరయన్ హార్డ్ బారన్ 10లక్షల పౌడ్లు ఖర్చు చేశాడు లండన్ మహా నగరం లో నాలుగు వీధులమధ్య ఒక చతురస్రాకార ప్రదేశం లో దీన్ని నిర్మించి ఆకర్షణీయం గా చేశాడు .అందం లోనే కాదు వెరైటీ లోనూ ప్రాముఖ్యత చూపాడు .ఇందులో అనేక రకాల బ్రాండ్ ల సిగరెట్లు ఉత్పత్తి అవుతున్నాయి .అందులో ‘’బ్లాక్ కాట్ ‘’మార్క్ సిగరెట్ ముఖ్యమైంది .ఫాక్టరీ మెయిన్ గెట్ పై రెండు వైపులా రెండు నల్లపిల్లి విగ్రహాలు ఏర్పాటు చేశాడు .ఫాక్టరీ లోపల బయట నలుపు ఎరుపు ఆకు పచ్చ రంగు చారలతో అలంకారం చేశాడు .మందిరానికి ఎదుట 12పెద్ద స్తంభాలు ఏర్పాటు చేశాడు. రాత్రిపూట ఆఫాక్టరి ,ఆవరణ భాగమంతా విద్యుత్ దీపాలకాంతి తో మెరిసి పోతుంది .సహస్ర చంద్ర మాసోత్సవం నిత్యం అక్కడ జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ దీపకా౦తుల ముందు వీధి దీపాలు బలాదూర్ అనిపిస్తాయి .గ్రేట్ బ్రిటన్ లో రీ ఇంఫోర్సేడ్ కాంక్రీట్ తో కట్టిన భవనాలలో ఈ ఫాక్టరీ పెద్దది .ఆరు అంతస్తుల భవనం. ఇది 65లక్షల క్యూబిక్ అడుగుల వైశాల్యం కల ఆవరణ .
ఫాక్టరీ లోపల 8 బ్రహ్మాండమైన మెషిన్స్ ఉన్నాయి .అవి నిమిషానికి వెయ్యి సిగరెట్స్ ఉత్పత్తి చేస్తాయి .అప్సరసలు లాంటి అనేకమంది సుందర కన్యలు వివిధ భాగాలలో పని చేస్తూ కస్టమర్ శాటిస్ఫాక్షన్ కల్గిస్తారు .మొత్తం మీద 3వేల మంది పని వాళ్ళు ఉంటారు .కంపెని డైరెక్టర్ సమావేశమందిరం దేవేంద్రుని సభలా ఉంటుంది .తప్పక చూడ తగింది .ఇంతటి సుందర మందిరం బ్రిటిష్ దీవులలో మరెక్కడా లేనే లేదు .ఆవాతావరణం అంతా ఒక సుందర చిత్రంలాగా పరమ మనోహరంగా ఉంటుంది .గోడలపై అనేక చిత్రాలు కనులకు విందు చేస్తాయి .నేల అద్దం లాగా నున్నగామెరుస్తూ ఉంటుంది .
ఆ ఫాక్టరీ లో పనులన్నీ యంత్రాలే చేస్తాయి .ట్రేలలో సిగరెట్స్ తీసుకొని వెళ్ళేవి ,పార్సిల్స్ కట్టేవి, పొగాకును చిన్న చిన్న ముక్కలుగా కత్తి రించేవి ,సిగరెట్ డబ్బాలకు రేపర్లు అతికించేవి ,అసలైన సిగరెట్ లను తయారు చేసే ముఖ్యమైనవి అన్నీ యంత్రాలే . యంత్ర మాయాజాలం అంతా అక్కడ చూసి అవాక్కై పోతాం .యంత్రాలనుంచి తయారైన సిగరెట్స్ పడే చోట్లు లెక్కపెట్టి టిన్స్ లో వేసేవి అన్నీ యంత్రపు పనులే .ఫాక్టరీ కి రెండే ద్వారాలు .ఒకటి బయటి సరుకులోపలికి తీసుకు రావటానికి, రెండోది లోపలి సరుకు బయటకు రవాణా చేయటానికి .అన్నిపనులు ఠంచన్ గా నిర్ణీత సమయం లో జరిగి పోతూ ఉంటాయి .కంగారు హడావిడి ఉండవు .ఇంతపెద్ద ఫాక్టరీ లో ఎక్కడ వెతికినా దుమ్ము అనేది కనిపించనే కనిపించదు .’’డస్ట్ ఎక్ష్ట్రాక్టర్లు ‘’ఎప్పటికప్పుడు దుమ్ము తీసేసి ప్రాంగణాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచుతాయి .ఆరోగ్యానికి గొప్పవిలువ ఇచ్చేఫాక్టరి ఇది .వాయు దేవుడు కూడా ఫాక్టరీ మాట వినాల్సిందే ఎప్పుడు ఎక్కడ ఎంత శీతోష్ణస్తితికావాలో అలానే ఏర్పాటు చేస్తాయి అక్కడి ఏసిలు .పొగాకుకు కావాల్సిన క్లైమేట్ కూడా ఆ ఫాక్టరీ ఏ ఏర్పాటు చేస్తుంది .ఇక్కడ ఉన్న ఏసిలు యూరప్ లో ఇంకెక్కడా ఏ ఫాక్టరీలోనూ లేవు .ఆరు వేల పౌన్ల ఖర్చుతో వాటిని ఏర్పాటు చేశారు .లోపలి వచ్చేగాని క్షణాలమీద క్షాళనం చేసి వేడి చేస్తారు .తర్వాత చల్లబడేట్లు చేస్తారు .అన్ని సీజన్ లలోనూ ఫాక్టరీ లోపల ఒకే రకంగా ఉండటం ఇక్కడి ఇంకో ప్రత్యేకత .నడి శీతాకాలం లోకూడా ఆడ కూలీలు చేతులకు గ్లౌజులు తొడుక్కొనే అవసరం ఉండదు .ఫాక్టరీలో గాలి స్వచ్చం శుచిగా ఉంటుంది .మహామహా కాజిల్స్ లో ఉండే ఐశ్వర్యవంతులకు కూడా ఇంతటి స్వచ్చమైన గాలి లభించదు ‘
1927లో ఈ ఫాక్టరీ 12 ,58,847పౌన్ల లాభాన్ని ఆర్జి౦చి పెట్టింది .ఈలాభం కంపెనీ యజమానికి మాత్రమె కాదు అక్కడ పని చేసేవారందరికి చెందుతుంది అదీ ఈ ఫాక్టరీ విశేషం .కేర్రాస్ కంపెనీ వారికి మేధస్సుతోపాటు హృదయం కూడా ఉంది. అది అరుదైన విషయం .పని వారి ఆరోగ్యం కోసం డాక్టర్లు నర్సులు సదా హాజరుగా ఉంటారు .వ్యాదితగ్గి మళ్ళీ ఆరోగ్యం పొందేదాకా విశ్రాంతి వినోదాలు కల్పించే ఏర్పాట్లున్నాయి .విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది అన్నిరకాల ఆటలు ఆడుకోవచ్చు.రోగ సమయంలోజీతాలు ఇవ్వటానికి ,పని విరమణలో ఉపకార వేతనాలు పొందటానికి ప్రత్యెక ఏర్పాట్లున్నాయి .ప్రతి కిస్మస్ కు ఒక వారం కూలి అదనంగాప్రతివారికీ ఇస్తారు .పెద్ద సభ జరుపుతారు .బారన్ బ్రతికి ఉన్నంతకాలం ఆయనే ఆసభకు అధ్యక్షుడుగా ఉండేవాడు .ఆఏడు వర్క్ ప్రోగ్రెస్ అంతా వివరించి చెప్పేవాడు .పన్ను లేకుండా నూటికి 50శాతం లాభాలు పంచి పని చేసేవారి పాలిటి కల్ప వృక్షంగా వ్యవహరించాడు ఆసిగరేట్ కుబేరుడు బారన్ .గౌరవాలు బిరుదులకోసం ఎన్నడూ ఆశించలేదు .అతడుచనిపోయాక అతడికుమారుడికి 1930లో ప్రభుత్వం గౌరవ సూచకంగా ‘’బార్ నెట్సి ‘’ అవార్డ్ అందజేసింది .
బెరన్ హార్డ్ బారన్ 5-12-1850న పుట్టి 1-8-1929 న 80ఏళ్ళ వయసులో మరణించాడు .అమెరికాలో సిగరెట్ తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టి 1890-నుంచి 95దాకా ..’’నేషనల్ సిగరెట్ టుబాకో కంపెని ‘’ కి మేనేగింగ్ డైరెక్టర గా ఉన్నాడు .పేటెంట్ రైట్స్ కోసం 1895లో ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే లండన్ లో స్థిరపడ్డాడు .లండన్ లోని ఆల్డ్ గేట్ వద్ద ‘’బారన్ సిగరెట్ మెషీన్ కంపెని లిమిటెడ్ ‘’స్థాపించాడు .తన పేటెంట్ ను 1,20,౦౦౦ పౌండ్లకు అమ్మేశాడు .తర్వాత కేరిరాస్ టొబాకో కంపెని బోర్డ్ లో చేరి 1904లో మేనేగింగ్ డైరెక్టర్,1905లో చైర్మన్ అయ్యాడు .అతడు చనిపోయేనాటికి అతని ఆస్తివిలువ 5మిలియన్ పౌండ్స్ గా ఉంది.
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-1-23-ఉయ్యూరు