అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -8. 8-మారిట్జ్ ధాంప్సన్

అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -8
8-మారిట్జ్ ధాంప్సన్
చలి దేశం లో పుట్టి కూటికి ,కోటుకుగతిలేని నిరుపేద ,కోటీశ్వరుడై వలచిన వనితను పెళ్లాడినవాడు మారిట్జ్ ధాంప్సన్.అనాసకాయలు తింటూ అసువులు నిల్పుకొన్న అభాగ్యుడు .తర్వాత అదృష్టం ఎక్కడో తేనే తుట్టెలాగా పట్టి ఏడాదికి 25లక్షల పౌన్ల విలువగల బిస్కెట్స్ అమ్మే ఫాక్టరీ యజమాని అయ్యాడు .ఓడప్రయాణం లో మూడు సార్లు సముద్రంలో పడిన నిర్భాగ్యుడు .తర్వాత తోజుకు పది వేల పౌన్లు ఖరీదు చేసే పీపాల పిండి తయారు చేస్తూ ,ఏడాదికి మూడు వేలపౌన్ల లాభం గడించే పిండి మర యజమాని అయ్యాడు .’’వేస్ట్ ఫెలో ‘’అని రోజూ తండ్రి చేత తిట్లు తినేవాడు మెక్సికో లో 500చదరపు మైళ్ళ భూమికి యజమాని అయ్యాడు .
అది క్రీ శ .1823.అప్పటికి మారిట్జ్ ధాంప్సన్ వయసు 13.అతడు కట్టుకొనే బట్టలు చింకి పాతలు .మొహం చూస్తె ఒక్కపూట కూడా కడుపు నిండా తిండి తిన్నట్లు అనిపించదు .అప్పుడు హాలండ్ లోని లీత్ హార్బర్ దగ్గర సింగపూర్ వెళ్ళే ఒక ఓడ ప్రక్కనిలబడి ఉన్నాడు .తనకేదైనా ఉద్యోగం ఇవ్వమని ఓడ అధికారుల్ని కాళ్ళూ గడ్డాలు పట్టుకొని బతిమిలాడుతున్నాడు .వయసు తక్కువే కానీ అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తాడు .అప్పుడు ష్కాట్ లాండ్ లో ఉన్నా ,ఆ దేశీయుడు కాదు .అప్పటికి ఏడాది క్రితమే డెన్మార్క్ లోని తన ఇంటిని ,తలిదండ్రుల్ని వదిలేసి చెప్పా పెట్టకుండా స్కాట్ లాండ్ చేరాడు .తలిదండ్రులు కటిక దరిద్రులు .ఒక్క పూట కూడా తిండి తినలేని నిర్భాగ్యులు .చలికి కోటు వేసుకొనే స్తోమతే లేనివారు అలాంటి కుటుంబం లోని ఈ పిల్లాడికి ఉన్నవి ఒక ఇజారు ,ఒక షర్ట్ మాత్రమె .ఆ చలి దేశాలలో ఎంత దరిద్రుడైనా కోటు లేకుండా గడపలేడు.ఇతడికి అది కూడా అందుబాటులో లేని విషయ౦.ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేటప్పుడు తనకున్నదేదో ఒక ఎర్ర జేబురుమాలలో మూటకట్టి తెచ్చుకొన్నాడు .
ధా౦ప్సన్ బ్రతిమాలగా బ్రతిమాలగా ఆ సింగపూర్ వెళ్ళే ఓడ పై పని ఇచ్చారు .కానీ కెప్టెన్ కు దయాదాక్షిణ్యాలు లేవు. నీచంగా చూసేవాడు .ఎందుకు చేరానా ఈపనిలో అనిపించింది .ఓడ లో పని వాళ్లకు ఇచ్చే మాంసం లేని ఎముకలు కుక్కలు కూడా ముట్టవు అంత కంపు కొట్టేది .ఇక్కడా ఆ దరిదృడికి కడుపు నిండా తిండే లేదు .దురదృస్టం వెంటాడు తూనే ఉంది అతడిని .ఓడ సింగపూర్ చెరి౦ది ఎలా బయట పడాలా అని అనేక రకాలుగా ఆలోచిస్తున్నాడు .మారిట్జ్ తో సహా పదకొండు మంది నావికులు ఓడను వదిలి సింగపూర్ దగ్గరున్న అడవిలోకి పారిపోయారు .ఓడ కంటే ఈ అడవి చాలా హాయి గా ఉందనిపించింది .ఆడవిలో దొరికే పైనాపిల్ కొబ్బరికాయలు కడుపు నిండా తింటూ ప్రాణాలు కాపాడుకొన్నారు ఆ పన్నిద్దరు ‘’శూరులు ‘’.వారం రోజులు అడవిలోనే కాపురం చేశారు .
తర్వాత హార్బర్ కు వెడితే హాంగ్ కాంగ్ కు వెళ్ళే ఒక చిన్న ఓడమాత్రం ఉంది .అందులో ఇతడికి పని దొరికింది .కానీదురదృష్టం వదలలేదు .రెండు రోజుల ప్రయాణం తర్వాత చైనా ఓడ దొంగలు ఓడను పట్టుకొని ,ఉన్నదంతా దోచుకు పోయారు .కసి తీరక ఓడను మున్చేశారుకూడా .మారిట్జ్ కు ఓడ కొయ్య ఒకటి దొరికి ,దానిపై సముద్రంలో తేలుతూ తిండీ మంచినీళ్ళు కూడా లేకుండా రెండు రోజులు గడిపాడు .అతాడిని చూసిన మేక్సికోకు వెళ్ళే బ్రిటిష్ ఓడ అతడిని కాపాడి౦ది .కానీ దురదృష్టంవదలక పీడించింది .ఆ ఓడ తుఫానుకు గురైంది .విపరీతమైన గాలులకు తెరచాపలన్నీ ముక్కలు ముక్కలయ్యాయి .సముద్ర జలాలలో ఓడ కొబ్బరి చిప్పలాగా ఉయ్యాలలూగింది .తెరచాపలున్న ఓడ కోయ్యల్ని దింపేస్తే తప్ప ఓడకు అపాయం తగ్గదు.అంతగాలిలో ఆపని చేయగల సాహసి ఎవరు ?మారిట్జ్ ముందుకొచ్చి ,ఓడ కోయ్యలపైకి ఎగబ్రాకి త్రాళ్ళు కోసి కొయ్యల్ని దింపాడు .ఓడ బాలన్స్ గా నీటిపై తేలింది హమ్మయ్య అనుకొన్నారు అందరూ .56రోజులు ఆతుఫాను భీభత్సం లో ఓడ కొట్టు మిట్టాడి ఎలాగో హానోలూలూ చేరింది .
అక్కడ తెర చాపలు తయారు చేసే వారిదగ్గర మారిట్జ్ పనిలో చేరాడు .ఇప్పుడిప్పుడే అదృష్టం తలుపు తడుతోంది .రోజుకు 20పెన్నీల జీతం జీవితం హాయిగా గడిచిపోతోంది .నలభై పౌన్లు నిలవచేసి తండ్రికి మనియార్డర్ లో పంపాడు .తర్వాత ఏడాది మళ్ళీ 40పౌన్లు పంపాడు .ఆకుటుంబం అంతటి డబ్బు వాళ్ళ జీవితకాలం లో ఎన్నడూ చూసి ఎరుగరు .
మళ్ళీ ఓడ మీదే పని చేయాలని పించి ప్రయత్నిస్తే ,ఒక ఓడకు కెప్టెన్ కు రెండవ సహాయకుడి ఉద్యోగం దొరికింది .’’గొప్ప పోటుకాడు ఉద్యోగం దొరికి నట్లు తాను చాలా అదృష్టవంతుడిని అని తెగ మురిసిపోయాడు .ఇన్నేళ్ళుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు .ఆమె పేరు మేరీ నిస్సేన్ .డెన్మార్క్ లోని టాండరన్ వాసి .రోడ్డుపక్క చిన్న కుటీరంలో ఉంటుంది .అతడు తన 13ఏట నుండీ ఆమెను ప్రేమిస్తున్నాడు వీరి ప్రేమకు బీదరికం అడ్డు రాలేదు .25ఏళ్ళ వయసులో అతడు మళ్ళీ డెన్మార్క్ చేరాడు .తాను వలచి వలపించుకొన్న మేరీని హాయిగా పెళ్లి చేసుకొన్నాడు .ఈసారి ప్రయాణం లో ఆమెను కూడా తన వెంట తీసుకు వెళ్ళాడు . ఒకసారి ఆమెతోకలిసి సముద్రం లోఒడపై ప్రయాణం చేస్తుంటే ,అనుకోకుండా అది మునిగిపోయింది .ఒక చిన్న పడవ దొరికితే ఈ దంపతులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు .భార్యతో న్యూయార్క్ పట్టణం లో కాపురంపెట్టాడు .న్యూయార్క్ హార్బర్ నుంచి అప్పుడే బయల్దేరుతున్న ఒక ఓడలో కెప్టెన్ కు సహాయకుడిగా పనిలో చేరాడు .జలగండాలకు భయపడ లేదు రాటు దేలాడు .ఉద్యోగం అతని ఆరోగ్యం రెండూ మంచివే .మళ్ళీ న్యూయార్క్ చేరి భార్యను చూడగా ఆమె చిక్కి శల్యమైంది .భర్త ఇక సముద్ర ప్రయాణాలు చేయటం ఆమెకు ఇష్టం లేదు ఆసంగతి నెమ్మదిగా చెప్పి ఒప్పించింది ఆ ఇల్లాలు .అమెరికాలోని పడమటి రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగం చేద్దామనుకొన్నాడు .చికాగో కు ఇద్దరూ వెళ్ళటానికి మాత్రమె సరిపోయే డబ్బు ఉంది .షికాగో చేరి రోజుకు 6పెన్నీల జీతంతో ఒక పశువుల శాలలో చేరాడు .చాలాకష్టపడి 60పౌన్లు కూడ బెట్టి ఒక పొలం కొన్నాడు .దాన్ని చదును చేసి సరిహద్దులు ఏర్పరచి కష్టపడి సాగు చేసి సుక్షేత్రంగా మార్చి మంచి ఫలసాయం తీశాడు .ఆరేళ్ళ తర్వాత ఆపోలాన్ని 2500పౌన్లకు అధికలాభంగా అమ్మాడు .
తర్వాత ఇనుపసామానుల దుకాణం కొని ,ఏడాదితర్వాత 3వేల పౌన్లకు అమ్మాడు .క్రమ౦గా అదృష్టం వెంటపడుతోంది .పట్టింది బంగారం అవుతోంది .ఇంకా పశ్చిమంగా ఉన్న ఒరిగాన్ స్టేట్ కు వెళ్లి ,ఒక పిండిమర పెట్టాడు .అదృష్టం తలుపు తట్టింది దానిపై ఏడాదికి 13వేల పౌన్లలాభం సాధించాడు .అమెరికా పడమటి రాష్ట్రాలలో పెద్ద పిండిమరలలో ఇతడి పిండిమర కూడా ఒకటి అయింది .రోజుకు 10వేల బారల్స్ పిండి తయారు చేసే సామర్ధ్యం దానికి ఉంది .దానిపై డివిడెండ్ లక్రింద అతడికి 12లక్షల పౌన్లు లభించింది .
నీటిమీద చేసిన ప్రతిపని అపాయం తెస్తే భూమి మీద చేసిన ప్రతిపనీ అధిక ధనం సంపాదించి ఇచ్చింది .జలం పై దురదృష్ట దేవత వెన్నాడితే ,భూమ్మీద అదృష్ట దేవత వెన్ను తట్టి నిలబడింది .మారిట్జ్ జపాన్ లో కూడా ఒక పిండిమర స్థాపించాడు .కెనడాలో రంపపు మిల్లు కట్టించాడు .ఒరిగాన్ లో ఇటుకలు తయారు చేసేసంస్థ పెట్టాడు .వేల్స్ నుంచి రాక్షసి బొగ్గు దిగుమతి చేసుకొని ఉపయోగించాడు .ఒక పెద్ద బిస్కెట్ ఫాక్టరీ పెట్టి సమర్ధంగా నడిపాడు 1929లో ఈ ఫాక్టరీ 23లక్షల పౌన్ల విలువగల బిస్కెట్స్ తయారు చేసింది .మెక్సికోలో 500చదరపు మైళ్ళ భూమి కొన్నాడు .అనేక వాణిజ్య వ్యాపార కంపెనీలలో అతడికి షేర్లు ఉన్నాయి .చాలాపెద్ద పెద్ద వ్యాపారాలు చేసే 14 ఫర౦ లకు అతడు అధ్యక్షుడయ్యాడు .
‘’నీ అభి వృద్ధి రహస్యం ఏమిటి ?’’అని బిసి ఫార్బిస్ అనే అతడు మారిట్జ్ ను అడిగితె ‘’నాకుచదువు రాకపోవటమే నా అభి వృద్ధికి కారణం కావచ్చు .నేను యవ్వనం లో కాలేజిలో చదివి ఉంటె పూర్తిగా చెడి పోయి ఉండే వాడిని .అప్పుడు ఒళ్ళు వంచి కష్టపడటం అలవాటు అయ్యేదికాదు .కా’’లేజీ ‘’చదువు లేక పోవటం నన్ను ఇంత వాడినిచేసింది ‘’అన్నాడు .కష్టపడే వ్యాపారులకు వెన్నంటి సహాయం చేసి వారిని నిలబెట్టేవాడు .అతని సలహాలు సూచనలు పాటించి ధనవంతులైనవారు చాలా మంది ఉన్నారు .
70ఏళ్ళు దాటినా మారిట్జ్ దంపతులు ఆరోగ్యంగా సుఖంగా ఉన్నారు .సియాటిల్ లో ఒక బ్రహ్మాండమైన భవనం కట్టి అందులో ఉన్నారు .అతని అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా అతడికి చాలా దగ్గరలోనే ఉంటారు .యువకుడుగా ఉన్నప్పుడు కష్టపడి పని చేయటమే అతడి అభివృద్ధి రహస్యం .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.