నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-

నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-

 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని గునుపూడి లో 30-9-1860 న వేలూరి లక్ష్మీ నారాయణ ,వెంకమ్మ దంపతులకు 14వ చివరి  సంతానంగా కనక మహాలక్ష్మమ్మ పుట్టింది .తండ్రి సంస్కృత,ఆంధ్రాలలో  మహా పండితుడైన శ్రోత్రియుడు ,పరమ చా౦దసుడు .యజ్ఞం చేసి సోమయాజి అయినవాడు .ఆయిదవ ఏటనే కూతుర్ని40ఏళ్ళ కోటమర్తి సూర్యనారాయణకు ఇచ్చి వివాహం చేశాడు .లోకజ్ఞానం లేని ఆ అమాయక పిల్ల పెళ్ళిలో పేచీలు పెడితే మొగుడే ఎత్తుకొని ఆడించి లాలించాడు .అగ్రహారీకుడు సిరి సంపదలతో తులతూగుతున్న భర్త, మామగార్ని మించిన పరమ ఛాందసుడు .కానీ మహా పండితుడు. ఆఇంట నిత్యం పురాణపఠనాలు,సత్కాలక్షేపాలు జరిగేవి .ఇవన్నీ వింటూ ఆమెకు రామాయణ భాగవత భారతాలు కొట్టిన పిండి అయ్యాయి. అన్నీ వాచో విధేయాలయ్యాయి .ధారణా శక్తి అమోఘం కనుక ఆమెకు రానిశ్లోకం పద్యం ఉండేవికావు .పుట్టింటి లోని సంగీతం వంటబట్టిపద్యాలు శ్లోకాలు రాగయుక్తంగా ,ఇంపుగా ,అనర్గళంగా పాడుతూ వినే వారిని మైమరపించేది .స్వయం గా పద్యాలు ,పాటలూ రాసి౦ది కూడా ..తనకు తెలిసిన విషయాలను సులభంగా అర్ధమయేట్లు కధలు గా చెబుతూ తగినట్లు పద్య శ్లోకాలుభావ గర్భితంగా పాడుతూ శ్రోతలను రంజింపజేసేది .30ఏళ్ళ వయసులో అయిదుగురు బిడ్డల తల్లి అయింది ,ఆరవ బిడ్డ పుట్టటానికి నెల రోజుల ముందే భర్త మరణించటం వలన వైధవ్యం ప్రాప్తించింది . పుట్టింటికి భీమవరం చేరింది .కాని పుట్టింట్లో ఆదరణ లభించకపోవటం వలన ఆమె అహం దెబ్బతిని ,తనమనసులోని అభ్యుదయభావాల వ్యాప్తికోసం  భీమవరంలో దూరంగా ఒక కుటీరం నిర్మించుకొని అక్కడే నివాసమున్నది .పరమ ఛా౦దసులైన తన అత్తగారింట తన పిల్లలు పెరిగితే, వారికి అభి వృద్ధి ఉండదు అని గ్రహించి పిల్లలతో సహా కుటీరంలోనే ఉన్నది .ఆమెకున్న వివేచనా శక్తి ,పాండిత్య ప్రకర్ష ,పురాణ ఇతిహాసాలపై ఉన్న అద్భుతమైన పట్టు ,ధర్మ బోధనా పటిమ ,ధైర్యం నిస్సంకోచంగా చెప్పి ఒప్పించగల నేర్పు గమనించిన ఆవూరి క్షత్రియ స్త్రీలు ఆమెకు పరమ ఆత్మీయులయ్యారు .ఆమెను గురుభావంతో అత్య౦త గౌరవంగా చూస్తూ అన్నిట్లోనూ సహాయ సహకారాలు అందించి ఆదరించారు .కనకమ్మ గారికి అక్కడ ఏ లోటూ లేదు .

  సంఘ సంస్కరణ పట్ల ,రాజకీయాలపట్ల ఆసక్తి చూపి అంకితభావంతో పని  చేసింది .క్షణం తీరికలేకుండా మాట్లాడుతున్నా ,నడుస్తున్నా తకిలీతో  నూలు తీస్తూనే ఉండేది.తాను  ఖద్దరు ధరించి అందరి చేతాధరి౦పజేస్తూ ,ఇంటింటికీ తిరిగి ఖద్దరు వస్త్రాలు అమ్మి ఖద్దరు వ్యాప్తికి విశేష కృషి చేసింది .స్వదేశీయ వస్తువులనే వాడింది .పిల్లలకూ అవే అలవాట్లు నేర్పించి ,జాతీయభావాలతో పెంచి ఉత్తమ పౌరులుగా  బాధ్యతగల వ్యక్తులుగా తీర్చి దిద్దింది .తన తండ్రి యజ్ఞం చేసిన భీమవరం లోనే ఆమె కాంగ్రెస్ పెద్దలను ,హరిజనులను ఆహ్వానించి కొడుకు ,కోడలు చేత సత్యనారాయణ వ్రతం జరిపించి౦ది.హరిజన వాడలకు వెళ్లి అక్కడిపిల్లలకు స్నానాలు చేయించి , వాళ్ళ ఇళ్ళను  శుభ్రపరచి ఆరోగ్యానికి శుభ్రత ఎంత అవసరమో నేర్పించేది .ఒకసారి ఆమెరైలులో ప్రయాణం చేస్తుంటే ఒక నిండు చూలాలైన హరిజన స్త్రీకి పురుటి నొప్పులు రావటం చూసి ,పక్క స్టేషన్ లో ఆమెను దింపి ,తాను  కట్టుకొన్న బట్టనే ఆవరణగా చేసి ఆమెకు పురుడు పోసింది .నిజమైన సాంఘిక సేవకు ఇంతకంటే ఉత్తమ ఆచరణ ఎక్కడ ఉంది ?.

  కనకమహాలక్ష్మి సేవానిరతి ,నిర్మాణ కార్యక్రమాలపట్ల ఆపేక్ష ,స్వాతంత్రేచ్చ ,నిరర్గళ అమోఘ వాగ్దోరణి గమనించిన కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఉద్యమ ,ప్రచార బాధ్యతలను  ఆమెకు అప్పగించారు .ముఖ్య ప్రబోధకురాలిగా ప్రచారకురాలిగా చేశారు .ప్రచార కార్యక్రమం లో ఆమె రాత్రనక పగలనక తిరిగింది తాను  స్త్రీ అనే విషయమే మర్చిపోయింది .ఆమె ప్రసంగాలకు ప్రజలు ఉత్తేజితులయే వారు.’’రెండవ బార్డోలి ‘’గా ప్రసిద్ధి చెందిన భీమవరం లో ,వేలాది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొనటానికి ,కాంగ్రెస్ కు ఆర్ధిక బలం చేకూరటానికి  ఆమె ప్రచార ప్రబోదాలే ముఖ్యకారణం .అందుకే పోలీసు వ్యవస్థ ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు .కానీ వాళ్ళు అనుకొన్న సమయం లో వారికి కనిపించేదికాదు అవాక్కయ్యేవారు .కనిపించినట్లే కనిపింఛి  మాయమయ్యేది. ఒక సారి నిండు చూలాలైన తన కూతుర్ని పురిటికి మేనాలో అక్కగారింటికి తీసుకు వెడుతుంటే పోలీసులు ఆమెను అటకాయించారు .అప్పుడు ఆమె తాను కనకమ్మ కాదని ,కూతురు పురిటికి కనకమ్మ తప్పక వస్తుందని చెప్పగా  ,పోలీసులు నమ్మి ఇంటిముందు కాపలా కాశారు .లోపల పురుడురావటం బిడ్డపుట్టటం జరిగిపోయాయి కాని కనకమ్మ వాళ్లకు కనిపించనే లేదు .ఆమె తమ చెవిలో పెద్ద కాబేజీ పువ్వే పెట్టిందని ఆలస్యంగా గ్రహించారు .ఎన్నో సార్లు ఇలా పోలీసుల కళ్ళు కప్పి తిరిగింది .కాంగ్రెస్ నాయకులే ఆమె ప్రతిభకు ఆశ్చర్య పోయేవారు ..1930జూన్ 10న ,1931 ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి రాయవెల్లూరు రెండవసారి జైలుకు పంపారు .రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో ప్రజలు ఐచ్చికంగా నిరసన ప్రదర్శనలు,సత్యాగ్రహాలు  చేశారు .అప్పుడు మూడవ సారి ఆమెను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు .నాల్గవసారి 1941వ్యక్తి సత్యాగ్రహం లో పాల్గొని జైలుపాలయ్యారు .సుమారు అయిదేళ్ళు ఆమె రాయవెల్లూరు, బళ్ళారి కర్నూలు జిల్లాలో కారాగార వాస శిక్ష అనుభవించిన వీర ,ధీర  దేశ భక్తురాలు .అపక్వ ఆహారమే తినేది .నానబోసిన పెసలు సెనగలు ,ఇంటినుంచి వచ్చిన పళ్ళుమాత్రమే ఆహారం .గోవి౦దనామాలు హుషారుగా పాడుతూ పాడిస్తూ జైలు అంతాతిరిగేది .పురాణకాలక్షేపలు హరికథలతో అందర్నీ అలరించి హాయి కూర్చేది .కరడుగట్టిన పగ ద్వేషం కోపం తాపం ,అసూయ ఉన్న జైలును నవ్వులతో చతురోక్తులతో భక్తిభావ ,ఆధ్యాత్మిక బోధనలతో చిరునవ్వుల పందిరిగా చేసి ఖైదీలలో నిస్తేజం నిరాశా నిస్పృహ లను పోగొట్టేది .జైలు అధికారులకూ ఆమె అంటే మహా పవిత్రభావం ఉండేది .వారితో మాట్లాడుతూ చకచకా పచారులు చేస్తూ తకిలీపై నూలు వడుకుతూ ఒక్క క్షణం కూడా వృధా చేసేదికాదు.

  1928నుంచి 1942వరకు కనకమ్మ ఉద్ధృతంగా రాజకీయంలో పాల్గొన్నది .ఒకసారి 1930 జూన్ 10న సాయంత్రం 7 గం.లకు భీమవరం తాలూకా శృంగ వృక్షం లో కలిదిండి వెంకటరామరాజు గారింటి ముందున్న పెద్ద ఖాళీ స్థలం లో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు  .స్థానికులేకాక చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలూ కనకమ్మ గారి ఉపన్యాసం వినటానికి తండోప తండాలుగా వచ్చేశారు .అప్పటికి ఆమె వయస్సు .50.వితంతువు .తెల్లని ఖాదీ  వస్త్రం ధరించి  బోడిగుండుపై ముసుగుకప్పుకొని ఉపన్యాసం ఇవ్వటానికి వేదిక ఎక్కింది .ఆమె మాట్లాడుతున్నా పాటలు పాడుతున్నా శ్లోకాలు ,పద్యాలు పాడుతున్నా ఒక సంగీత కచేరీ లా ఉండేది .శ్రోతలుమైమరచి తన్మయులై వింటున్నారు   .అక్కడ చేరిన అసంఖ్యాక జనాన్ని చూసి ఉత్తేజితురాలై పొంగిపోయింది .పోలీసులు జీపు లతో వచ్చి మోహరించారు .ఇద్దరుముగ్గురు పోలీసు జవాన్లతో,ఒక  పోలీసు అధికారి  ,వేదిక దగ్గరకు రాగా ,అక్కడే ముందు వరుసలో కూర్చున్న సుప్రసిద్ధ జాతీయవాదీ  ,ప్రముఖ లాయరు శ్రీ ముష్టి లక్ష్మీ నారాయణ గౌరవంగా లేచినిలబడి ‘’అయ్యా నమస్కారం కనకమ్మ గారి ఉపన్యాసంమహా రసవత్తరంగా సాగుతోంది .ఇలాసభలు ఏర్పాటు చేసుకొని భావాలు వెలిలిబుచ్చుకొనే ఒక్కటేఇప్పుదు ఈప్రభుత్వం లో ఉన్న ప్రజా స్వేచ్చ .మీరు ఆస్వేచ్ఛ ను అరికట్టకండి .ఉపన్యాసమవగానే మీ విధి నిర్వహణ మీరు చేయండి ‘’అని చెప్పి ఒక కుర్చీ తెప్పించి ఆఫీసర్ ను కూర్చోబెట్టారు .కనకమహాలక్ష్మి స్వరాన్ని మరింతపె౦చి ‘’అయ్యా !మీరంతా భారత మాతను  దాస్యం నుంచి తప్పించటానికి కంకణం కట్టుకొన్న భారత వీరులు .ఈ పోలీసుల్ని చూసి బెదిరి పోకండి .వాళ్ళూ మన సోదరులే .పొట్టకూటికోసం పిరికిగా పరులకు దాస్యం చేస్తున్నారు .అలాంటి వారి పిస్తోలు గుండ్లకు పిసరంతకూడా పస ఉండదు .ఏమయ్యా  ఇన్స్పెక్టర్  బాబూ !  నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో చూస్తావా “’అని సవాలు విసిరి ,నెత్తిమీది ముసుగు తీసి, తలకాయ వంచి నిలబడింది .క్షణాలలో జనం భారత మాతాకు జై  గాంధీ మహాత్మునికీ జై ,కోటమర్తి కనకమ్మ గారికీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లెట్లుగా  అంటూ  మైదానం అంతా మారుమోగేట్లు స్పందించారు  .ఉపన్యాసం అవగానే ఆమెను అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు  ఇలాంటి సంఘటనలు ఆమె జీవితకాలం లో చాలా జరిగాయి .

  ఎట్టకేలకు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది .స్వాతంత్ర సమరభావనానికి రాళ్ళు ఎత్తిన కూలీలను కాంగ్రెస్ పాలకులు మర్చిపోయారు .అలాగే కనకమ్మగారినీ పక్కన పెట్టేశారు .అయినా ఆమె ఊరుకోలేదు ఆంధ్రరాష్ట్ర ఉ ద్యమం లో చురుకుగా పాల్గొన్నది .స్వామి సీతారాం 1952లో భీమవరం లో 7రోజులు సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే ,పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఏడు రోజులు కఠిన ఉపవాసం చేసింది .ఆంధ్రరాష్ట్రం విషయం అధిష్టాన వర్గం నాయకులతో మాట్లాడటానికి ఆ వృద్ధ నారి ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపింది .

 జీవితాన్ని పరమ శాంతంగా తన కుటీరంలోనే  సాధారణంగా గడిపింది ఆ అసాధారణ దేశ భక్తురాలు .12-1-1962న ఆ ధీరోదాత్త దేశభక్తురాలు శ్రీమతి కోటమర్తి కనకమహా లక్ష్మమ్మశతాధిక ఆయుస్సుతో జీవించి 102 ఏట పరమ పదించింది . .

 గబ్బిట దుర్గా ప్రసాద్-7-1-23-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.