శ్రీ విశ్వ పతి గారి ‘’శ్రీమద్ యుగదర్శనం ‘’
ఆధ్యాత్మిక క్షేత్రం లో విశ్వ పతి గా లబ్ధ ప్రతిష్టులైన శ్రీ పెమ్మరాజు విశ్వపతి రామ కృష్ణ మూర్తి గారు ఇటీవలే రాసి వెలువరించిన ‘’శ్రీమద్ యుగదర్శనం ‘’పంపగా నాకు నిన్ననే చేరింది .ఇవాళే చదివాను .వారితో నాకు ముఖ పరిచయం లేదు బహుశా ముఖ పుస్తకమో వాట్సాప్ లోనో నన్ను చూసి పుస్తకం పంపి ఉంటారు .అందులో ‘’సభక్తికంగా ‘’అందిస్తున్నాను అనే మాట నన్ను వారికి ఆత్మీయుల్ని చేసింది .పుస్తకం నిన్న అందగానే ఫోన్ చేసి ధన్యవాదాలు తెలియజేశాను .
పుస్తకం మొదట ఒక విన్నపం చేస్తూ పుస్తకం లో రచయిత రాసిన ముందు మాట చదవాలని దానివలన రచయితచెప్పదలచుకొన్న పరమార్ధం ఏమిటో తెలుస్తుందని చక్కని సూచన చేశారు .నివేదన లో ఎలాంటి అనుమానాలు లేకుండా పుస్తకం చదవమని చెప్పారు .ఈ పుస్తకం రాస్తున్నప్పుడు జరిగిపోయిన 27మహాయుగాలను తాను హృదయం లో దర్శించాననీ ,అది మాటలలో అక్షరాలలో వర్ణించ జాలని అనుభూతి అనీ ,అనుభవం అనీ అన్నారు .మనో నేత్రం తో చూస్తుంటే కొన్ని కోట్ల సంవత్సరాలక్రితం అనేక యుగాలలో జరిగిన సంఘటనలు అప్పటి జీవన విధానాలు సంస్కృతీ ,ప్రకృతి ,అప్పుడు భగవంతుడు దాల్చిన అనేక అవతారాలు తనకంటి ముందు ప్రత్యక్షమయ్యాయని గొప్ప అనుభవంతో .ఎన్నో లక్షల సంఘటనలు దృశ్యకావ్యంగా మనో నేత్రం లోకదలాడి నాయట.అందులో అతి కొన్ని సంఘటనలే ఈ పుస్తకం లో పొందు పరచానని చెప్పారు. మహర్షులు మహా కావ్యాలు రాస్తున్నప్పుడు ప్రకృతిఎలాఉన్ది ?మనం ఎంత విజ్ఞానాన్ని నష్టపోయాం ?దేవతలు మహర్షులకు ఎలా సహకరించారు ?.అవి ఒక్కొక్కయుగం లో ఎలా ప్రజా బాహుళ్యం లోకి వచ్చాయి ,గురువులు శిష్యులకు ఎలా అందించారు .తర్వాత వారికి ఆగురువులు ఎందుకు అందించ లేకపోయారు అనేవి అన్నీ తనకు కనిపించాయని చెప్పారు రచయిత ..
పుస్తకం చదివే వారికి ఇవన్నీ ఆశ్చర్యంగా ,’’నమ్మబుల్’’ గా ఉండవని,కానీ తనకు మాత్రం ప్రతిదీ స్పష్టంగా కనిపించిందనీ చెప్పారు .ఈ కాలం వారికి తెలీనిఎన్నొ విషయాలు తాను దర్శించినట్లు చెప్పారు .ఈ పుస్తకం రాస్తున్నప్పుడు తాను ‘’వేరే ప్లేన్ ‘’లోకి వెళ్లాలని ,ఈ ఆధునికకాలం లో ఉంటూ ఆయుగాల దర్శనం పొందటం అత్యంత మధురానుభూతి అన్నారు .చదువుతుంటే మనమూ ఆదర్శన భాగ్యం పొందగలం అన్నారు .
ఈ పుస్తకం చదివితే కొన్ని కోట్ల జన్మలలో ఈ మన జన్మఎంత చిన్నదో అర్ధమవుతుంది .మనం జీవిస్తున్న ప్రస్తుత జన్మలో ప్రతి క్షణం మంచి ఆలోచనలతో ఉంటూ ,చుట్టూ ఉన్న వారికి వీలైనంత సాయం చేస్తూ జీవిస్తే భగవత్ సాన్నిధ్యం తేలికగా పొందగలమని నమ్మకంగా ఋషులు చెప్పినట్లు చెప్పారు .కనుక మనమూ చదివి ఆదివ్యానుభూతులను అనుభవాన్నీ పొందుదాం .ఆసక్తి ఉన్నవారికి రచయిత ఉచితంగానే పుస్తకాలు అంద జేస్తారు .
ఎవరీ విశ్వపతి ?
తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారి తలిదండ్రులు లక్ష్మీ నరసింహారావు ,నాగరత్నాంబ దంపతులు. 1956లో జన్మించి ,1978లో బియి పాసై ,1983లో ఎం టెక్ చేసి ,1984నుంచి 1988దాకా ఆల్విన్ కంపెనీలో పని చేసి ,తర్వాత ఎం వి ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో చేరారు .ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కార్టూన్లు వేసేవారు .అవి అనేక మేగజైన్స్ లో ప్రచురితాలు
1998నుంచి వేదిక్ లోగో డిజైన్ రంగం లో ఉన్నారు .వేదాలు శాస్త్రాలు ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 6,000 కు పైగా సంస్థలకు పేర్లు నిర్ణయించి లోగోలు డిజైన్ చేశారు .ఈ సంస్థలన్నీ చాలా వేగవంతమైన అభి వృద్ధి సాధించి ముందుకు దూసుకుపోతున్నాయి .
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులైన విశ్వ పతి గారు 28 ఆధ్యాత్మిక పుస్తకాలు రాసి ,ఉచితంగా పంపిణీ చేశారు .ఇందులో 18శ్రీ శ్రీనివాసునిపైనే ఉండటం విశేషం ..ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతూ ప్రేరణ పొందుతున్నారు .ప్రపంచ ప్రసిద్ధ లైబ్రరీలలో ఈ పుస్తకాలు చోటు చేసుకోవటం మరో విశేషం .పూర్వ జన్మల బంధాల విశేషాలతో వీరు రాసిన ‘’MET AGAIN’’పుస్తకం ఎందరి జీవితాలనో ప్రభావితం చేసింది .
శ్రీమద్ యుగ దర్శనం పుస్తకం ముఖ చిత్రాలు చాలా అర్ధవంతంగా ఉన్నాయి .లోపలివర్ణ చిత్రాలు కనుల విందు చేస్తూ విషయ వివరణకు తోడ్పడతాయి .స్ఖాలిత్యం లేని ముద్రణ పాలనురుగు వంటి కాగితాలు పుస్తక శోభను ఎన్నో రెట్లు పెంచాయి .రచయిత ‘’విశ్వ పతి ‘’కనుక ఆయన మాట వేదవాక్యమే ,,శిరో దార్యమే .ఇది అనుభూతుల దొంతర .మీ చేతిలో పుస్తకం ఉంటె పరమాత్మ దివ్య దర్శనానుభవం పొందినట్లే .
ప్రతులకు –విశ్వపతి –ఫ్లాట్ న౦ -903-ఎఫ్ బ్లాక్ , వెర్టేక్స్ సద్గురు కృప అపార్ట్ మెంట్స్ ,సంఘమిత్ర స్కూల్ దగ్గర –నిజాంపేట రోడ్ –హైదరాబాద్ -85
సెల్-9849443752
ఇమెయిల్-viswapathi @yahoo.com
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-1-23-ఉయ్యూరు