విద్వాన్ రెండు చింతలవారి ‘’రాజతరంగిణి ‘’పద్యకావ్యం
విద్వాన్ రెండు చింతల లక్ష్మీ నరసింహశాస్త్రి ఎం .ఎ .గారు కాశ్మీర కవి పండితుడు కల్హణుడి ‘’రాజతరంగిణి ‘’ని పద్యకావ్యంగా మలిచారు .వీరి కుమారుడు శ్రీ రఘుప్రసాద్ డిసెంబర్ 17న హైదరాబాద్ లో జరిగిన మా మనవడు సంకల్ప్ వివాహానికి వచ్చి తమ తండ్రి గారు 1956లోనే రాసిన ‘’సప్తమ తరంగ ఉత్తరార్ధం’’పుస్తకాన్ని నాకు అందించి ,అభిప్రాయం తెలియజేయమని కోరారు .ఇవాళ వీలుకుదిరి చదివి రాస్తున్నాను .
శాస్త్రిగారితో పరిచయం సుమారు 40 సంవత్సరాల పూర్వం నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మేస్టార్ గా ఉన్నప్పుడు జరిగింది .అప్పుడు మా సైన్స్ రూమ్ మాకు సాహితీ క్షేత్రం .నెలకు ఒకటి రెండు సాహితీ కార్యక్రమాలు నా అధ్వర్యంలో జరిగేవి .అప్పుడు శాస్త్రిగారు ఆకునూరు జూనియర్ కాలేజిలో తెలుగు పండితులు వారితోపారు శ్రీ సుబ్బరాయశాస్త్రి గారు కూడా అక్కడే తెలుగు పండిట్ గా ఉండేవారు .మేము ఈ ఇద్దరు కవిపండితులను ఆహ్వానించి విశ్వనాథ వారి కల్పవృక్షం పై ప్రసంగం ఏర్పాటు చేశాం .ఇద్దరూ అద్భుతంగా ప్రసంగించి మమ్మల్ని అలరించారు .ఉగాది కవి సమ్మేలనాలలోకూడా పాల్గొని కమ్మని కవిత్వం వినిపించేవారు .రెండు చింతలవారు ఉయ్యూరులోనే మా బజార్లోనే కాపురం ఉండేవారని గుర్తు . తరచూ కలుసుకోనేవారం. తమ రచనలు నాకు ఇచ్చారు కూడా .అవి ఇప్పుడు ఎక్కడున్నాయో చెప్పలేను .ఇప్పుడు వారికుమారుడు ఈ పుస్తకం ఇవ్వటం తో పాత జ్ఞాపకాలు అన్నీ సుళ్ళు తిరిగాయి . శాస్త్రిగారు ప్రధమ తరంగం ను 1969లో ,ద్వితీయం 1972లో అనువదించారు .ముద్రణ వ్యయం పెరగటంతో అచ్చు వేయకపోయినా మిగిలిన భాగాలు అనువదిస్తూనే ఉన్నారు .ఆంద్ర ప్రదేశ సాహిత్య అకాడెమి వారి ఆర్దికసాయంతో సప్తమతరంగ పూర్వార్ధం19977లో ప్రచురించారు .ఉద్యోగ విరమణ తర్వాత తృతీయ చతుర్ధ తరంగాలు కూడా అనువదించి సాహిత్య అకాడేమి వారిచ్చిన పాక్షిక ఆర్ధికంతో తృతీయాన్ని ,తిరుమల దేవస్థానం వారి ఆర్ధికం తో నాల్గవ,అయిదవ తరంగాలను ప్రచురించారు .ఈలోపు ఉత్తరభాగ ప్రతులన్నీ అయిపోగా పునర్ముద్రణకు నడుం కట్టాల్సి వచ్చింది .ఈ తరంగానికి ముందుమాట ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు రాశారు .ఈకవి తమకు ఆప్త మిత్రులని ,రసభరితంగా ఈ కావ్యం రాశారని ,శైలి సరళ సుందరమని ,మూలభాగం పూర్తిగా రావటానికి పంచపదులు షట్ప దులు రాశారని ,చక్కని ధారాశుద్ధి ఉందని ,ప్రారంభం లో హర స్తుతి కవి భక్తికి నిదర్శనమని ,కల్హణ కవిపై రాసిన పద్యాలు శ్లాఘ్యాలని ,ఆరు 8తరంగాలను కూడా తెలిగించి ముద్రించాలని,వచనకవిత్వం విచ్చలవిడిగా సాగే ఈ రోజుల్లో ఛందస్సహిత మాహాకావ్యాన్ని ఇంత ప్రౌఢ సుందరంగా రచించి శాస్త్రిగారు ప్రజలకే కాక ప్రభుత్వానికీ మాన్యులయ్యారని కీర్తించారు
ఇందులోని కధ-కలశుని పాలనలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారు అయినా ఆయనమనసుకు శాంతిలేదు కొడుకు శ్రీహర్షుడి తో కలహం మొదలైంది .అతడిని దారిలోకి తేవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు .చివరికి కారాగారం లో బంధించాడు కూడా .విషాన్నం పెట్టి చంపే ప్రయత్నమూ చేశాడు తండ్రి .ఎలాగో తప్పించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాడు కొడుకు .తండ్రీ కొడుకుల దుస్థితి చూసి తల్లి తట్టుకోలేక చనిపోయింది .తండ్రికూడా మనో వ్యాధితో మరణించాడు .
హర్షుడిని కాశ్మీరం రాజుకాకుండా చేయాలని అతని సోదరులు ప్రయత్నించారు అందులో ఉత్కర్షుడు లోహార దేశ రాజు కలశుని సామంతుడు .తండ్రి చావువార్తవిని కాశ్మీరాన్ని ఆక్రమించటానికి రాజధానికి వచ్చాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు .కలశుడికి పద్మ శ్రీ అనే రాణి వలన పుట్టిన విజయుడు హర్షుని వైపు చేరాడు.శ్రీనగర్ నుంచి శత్రువులను పారద్రోలి హర్షుడిని రాజు చేయాలనుకొన్నాడు .అలా జరగాలంటే హర్షుడిని చెరనుంచి తప్పించాలి కనుక శ్రీనగర్ ను కాల్చేస్తానని బెదిరించాడు .ప్రజలు వాడు అన్నంత పనీ చేస్తాడేమో అని భయపడి హర్షుడిని వదిలేశారు .ప్రజలు అతనిపై భక్తీ విశ్వాసాలు ప్రకటించి రాజును చేశారు .
రాజుగా హర్షుడు ఎన్నో మార్పులు తేవాలని ప్రయత్నించాడు .కాని అవి వ్యతిరేక ఫలితాలిచ్చాయి అలజడి హత్యాకాండ పెరిగాయి .వాటిని అణచ లేకపోయాడు హర్షుడు .జనులలో ,పరిజనం లో అసంతృప్తి పెరిగింది. నమ్మిన వారే అతన్ని మోసం చేశారు .జ్ఞాతి ,పినతండ్రి అయిన మల్లునితో వివాదం వచ్చి,అతడు చనిపోతే అతడికోడుకులు ఉచ్చలుడు సుస్సలుడు హర్షుని పై పగ పెంచుకొని చంపటానికి, రాజ్యాన్ని కాజేయటానికి ప్రయత్నాలు చేశారు .కొందరు వారికి అండగా నిలిచారు .వారందర్నీ ఓడించటానికి హర్షుడు సర్వ శక్తులు ధారపోశాడు .కానీ విధి ప్రతికూలంగా ఉండటం తో భార్యాపిల్లలు మరణించి ఆత్మ రక్షణ కోసం ప్రయాగుడుఅనే అనుచరుడి సహాయంతో ఒక సన్యాసి ఆశ్రమం చేరి నా, శత్రువులు వెతుక్కొంటూ వచ్చి నిర్దాక్షిణ్యంగా హర్షుని చంపేశారు .గుణవంతుడైనా నిరాశాపూరిత జీవితం గడిపి చనిపోయిన హర్షుని కరుణామయ వృత్తాంతమే ఈ ఉత్తరభాగం లోని కథ.
కవిగారు మొదట సిద్దేశ్వర దేవుని-‘’శ్రీ సిద్దేశ్వర దేవు గొల్తు వరడున్ జిత్తాన మోదంబుతో –వాసిం గాంచిన దైవమున్ విమల దీవ్యత్క్రుష్ణ వేణీ,నిరా-యాస ప్రాప్త జలాభి షిక్తము ,జటా న్యాస్తేందుఖండంబు, కై –లాసా హార్య నివాసమున్ పరమమౌ బ్రహ్మంబు మమ్మేలుతన్ ‘’అని
ప్రార్ధించి ,తర్వాత కామాక్షీదేవిని స్తుతించి పిమ్మట కల్హణ పండితుని శ్లాఘించారు –
‘’గీర్వాణ భాషలో సర్వం సహా నేత్రు –చారిత్రమే కవీశ్వరుడు వ్రాసే –పాన్దిత్యగారిమలో బాణిని ముఖ మహా –సూరి వర్యుల కీడు .జోడేవండు-మధురార్ధ శబ్ద గు౦భనమున కెవ్వాని-సూక్తి వైచిత్రి తానూతగోమ్మ –వ్యంగ్య వైఖరియు ,సత్యాలాప నియమంబు –సమత బాతిమ్చేనే సజ్జనుండు –ఆ మహానీతి నిధికి గుశాగ్ర బుద్ధి –కావని సురవంశ జలధి శశా౦కునకు -చంపక ప్రభు కుమార సంతతికి ని –ప్రమాదమున జేయుచున్నాడ బ్రణతి శతము’’
కళ్యాణ శబ్దాన్ని ‘’కల్హణ అనే ప్రాక్రుటంగా మార్చి నవాడు ఆయన .బాణ బిల్హన ముఖ్య పూర్వకవి వరుల దండి భామః ముఖ్య విద్వాద్వారులను గురుస్థానం లో నిల్పి నూతనమైన కృతికి నిర్మాత అయ్యాడు కల్హణుడు అన్నారు కవి .348పద్యాల కావ్యం ఇది 347వ పద్యం లో హర్షుని మరణం దయనీయంగా వర్ణించారు-
‘’జనపతి ఈక్రియన్ సకల సంపదలున్ వేలివోవ ,ప్రాణముల్ –తనువును వీడిపోవ వసుదాస్తలిపై మిగిలేన్ తదీయ మౌ –గునమది యొక్కటే ,పరులకున్ సయితమ్ము వచింప దగ్గదా ,-తని యశమొక్కటే ,చిరత దాల్చు తదీయ చరిత్ర మొక్కటే .
చివరి చంపకమాల పద్యం లో కవిగారు –‘’ఇది రఘురామ భక్తీ మది నేర్పాడ శ్రీ నరసింహ శాస్త్రి చే ,-ముదమున నాంధ్ర భాష జనముద్దుగ వ్రాయ బడ్డ కావ్యమున్ –మొదలిటి నుండి ఏడవది ,పూర్వము కల్హణ పండి తే౦ద్రు చే –త్రిదశ సరస్వతిన్ వెలసి దీప్తి వహించిన రాట్తరంగిణిన్’’.
శాస్త్రి గారి కుమారులు తామూ పట్టువదలని విక్రమార్కులు లాగా తండ్రి గారి కవితా కీర్తిని దశ దిశలా వ్యాపించే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు ముఖ్యమ్గాఏ పుస్తకాన్ని నాకు ఇచ్చిన రఘు ప్రసాద్ బహుశా నా శిష్యుడుకూడానేమో .ఆశీస్సులు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -9-1-23-ఉయ్యూరు