సోమేపల్లి వారి రెండో తరం కవి’’ వశిష్ట’’ విశిష్ట కవితా పత్రాలే ‘’ఆకురాలిన చప్పుళ్లు’’
శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్యగారు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు కవి విమర్శకులు వితరణ శీలి ,యువకవులకు వెన్నుదన్ను ,కథకులకు కొంగు బంగారం .వారి కుమారుడే ఈ వశిష్ట .అయిదేళ్లనుంచి కవితా వ్యవసాయం చేసి ఆపంటను ఇప్పుడు ‘’ఆకు రాలిన చప్పుడు ‘’కవితాసంపుటిగా వెలువరించాడు .తండ్రికి తగ్గ తనయుడనీ అనిపించుకొన్నాడు .ఈ కవితలు కొన్ని వెబ్ పత్రికలలో,వార్తా మొదలైన పత్రికలలో ప్రచురితాలు .ఇది 42కవితల దొంతర .అందులో ‘’స్వ ‘’లు రెండు .ఇంగువ కట్టిన గుడ్డ కనుక కవితా పరిమళం చక్కగా గుబాళించింది .
కవితలలో పదాల పోహలింపు పసందుగా ఉంది .అతనిది అసంబద్ధ అంతర్ముఖం ,సందర్భ బహిర్ముఖం అనిత్య వేదనం నిత్య సంఘర్శణ౦ .ఇప్పటికి మట్టి ముద్ద.కాలం జరిగాక తవ్వి చూస్తె –శిలగా మిగులుతానో –శిల్పమై ఎదురొస్తానో ,శిలాజంగా దొరుకుతానో ?’’అనుకొన్నాడు .అలాగే ‘’తూటాలకు అంటిన మరకల్లో –నాదంటూ ఓ నెత్తుటి చుక్క ఉంటుంది –పారే ఉప్పునదులలో నాదీ ఒక పాయ ఉంటుంది –నవ్వే పెదవులలో నాదంటూ ఒక కారణముంటుంది ‘’అని మమైక్యమై చెప్పాడు .’’వీధి దీపం వెలుతురుకు దారి చూపిస్తుంది ‘’అనటం అద్భుత ప్రయోగం .కన్నీళ్లు చావుకీ బతుక్కీ సాక్షులు అంటాడు ఆరితేరిన ఆత్రేయ లాగా .’’మనిషి గుండెల్లో క్రిమి జోరబడిదేశం గుండెకు పుండు పడింది’’ వ్యష్టి సమష్టి అన్యోన్యత కు నిదర్శనం ..పిట్టకథలవిన్న పిల్లి ,పక్షి అయిఎగిరిపోవాలని పించిందట. ప్రశ్న జ్ఞాపకం పాఠం ఆలోచనకు విప్లవం .కళల హంతకుల వలన తలో, గోడో పగలాల్సిందే అన్నాడు యువకవి .కలలో ఇటుక అవ్వాలనుకొంటే గోడకు ఓ పగులేర్పడాలి ట.
చెట్టుకు పూసిన ఎండు మొలకల్లాంటి పిట్ట గూట్లో –ఫ్రీ కానుకలు పెట్టక్కర్లేదు –కొమ్మను కొట్టకుండా ఉంటె చాలు ‘’అని నేటి సామాజిక స్థితిని ఎన్నికల వాగ్దానాల్ని ఎండకట్టాడు.మనువు వేర్లను కూడా తగల పెట్టేద్దాం అన్నాడు .’’గుండె తొలవటం అమ్మతనం ‘’అని కమకమ్మగా చెప్పాడు .అంతా శూన్యమయ్యే లోగా –కొంచెం కొంచెంగా నైనా బతుకు నింపుకోవాలి ‘’అని మంచి సలహా ఇస్తాడు ..అర్ధం చేసుకోవటానికి అమ్మనో నాన్ననో అవాలి అని తపిస్తాడు .ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగిన ప్రశ్నను అడిగిన మనస్సాక్షితో కలిపి సామూహికంగా ‘’ప్రతి నిత్యం హత్య చేయటం –ఇదంతా –తామరాకు పై రక్తపు బిందువు తీరు ‘’అని కొత్తగా ఊహించి చెప్పాడు .మరో సూక్తి ముక్తావళి –‘’మనల్ని మనం వెతుక్కోవాలంటే –మనల్ని మనం కోల్పోతూ౦డాలి ‘’.వెళ్ళే దారిని అడుగులకు చెప్పద్దు అన్నాడు ఎందుకుష ?తప్పించుకోలేని దృశ్యాల్ని తొక్కు తాయి కనుక –‘’
ఇలా నూతన భావాలతో పద బంధాలతో ఆలోచనాత్మకంగా ,విశ్లేషణాత్మకంగా ఈ ఆకులు నినదిస్తూ లోవెలుగులను ప్రసరిస్తున్నాయి .వర్దిష్ణు డైన యువకవి వశిష్ట తన స్వంత గొంతుక తో బాగా దూసుకు వస్తున్నాడు .అతడికి అన్నిటా విశిష్ట విజయం కలగాలని కోరుతున్నాను .
మాన్యులు సోమేపల్లి వారు నాకు ఈపుస్తకం పంపి నందుకు ధన్యవాదాలు .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -10-1-22-ఉయ్యూరు