12- ఫ్రాంక్ మెక్ విల్లీ
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -12
12- ఫ్రాంక్ మెక్ విల్లీ
చిల్లరగా చెప్పులు అమ్మి లక్షలు సంపాదించిన వాడు ఫ్రాంక్ మెక్ విల్లీ .అమెరికాలో 250 చెప్పుల దుకాణాలకు యజమాని .స్కాట్ లాండ్ దేశస్తుడు గట్టి శరీరం .పొడుగ్గా ఉంటాడు 1930లో 70ఏళ్ళు నిండినా ఇ౦కా ఆరొగ్య౦గా బలంగా దృఢంగా ఉన్నాడు .అత్యంత దరిద్ర కుటుంబం లో పుట్టాడు. అతడికి ఎవ్వరూ సహాయం చేయలేదు .జీవితం లో మూడో వంతు దరిద్రుడుగానే బతికాడు .12ఏళ్ళ వయసులో ఒక లాయర్ ఆఫీస్ లో వారానికి 12 షిల్లింగుల జీతం తో గుమాస్తాగా చేరాడు .పొట్టగడవటానికి అది చాలక ,ఒక టోపీల షాప్ లో కూడా పని చేశాడు .వారం జీతం అ౦టేఅసహ్య౦ పుట్టి ,పనికి ఇంత అయితే బాగుంటుంది (కాంట్రాక్ట్ పధ్ధతి )అనిపించి కష్టపడి పని చేసి వారానికి 8పౌన్లు సంపాదించాడు .
కొంత డబ్బు సమకూడ గానే స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడు .మొదట గుడ్ల వ్యాపారం, తర్వాత పడమరకు వెళ్లి పశువుల వ్యాపారం చేశాడు .కానీ మనసులో ఎప్పుడూ చెప్పుల జోళ్ళే మెదిలేవి .అతని కోరిక తీరి ఒక చెప్పుల కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది .అప్పుడు చెప్పులు తయారు చెయటానికి ఎంతఖర్చవుతుందీ,అమ్మితే వచ్చే లాభం ఎంత అని బాగా గ్రహించాడు .తర్వాత జొళ్ళ కంపెనీ ఏజెంట్ అయి ఊరూరూ తిరిగి అమ్మేవాడు .ఈ వ్యాపారం లో రహస్యాలు గుట్టు మట్టులు అన్నీ గరహించాడు .
స్వంతంగా జోళ్ళ షాపు పెట్టాలని నిర్ణయించి 34వ ఏట యజమాని వద్ద రెండు వేల పౌన్లు అప్పుచేసి చెప్పుల షాప్ పెట్టాడు .అదే అతని 250దుకాణాలకు నాంది అయింది .మొదటి షాప్ ను అందంగా అమరికగా డాబు గా ఏర్పాటు చేసి కష్టమర్లను విశేషంగా ఆకర్షించాడు .షాప్ ముందు భాగం లో పెద్ద పెద్దఅద్దాలు,ఐమూలలుగా ఏర్పరచి ,ఏమూల నుంచి చూసినా షూస్ స్పష్టంగా కనిపించేట్లు చేశాడు .ఈ షాప్ బాగా క్లిక్ అవగా మరో నాలుగు షాపులు తెరిచాడు .తర్వాత 250షాపులు స్థాపించాడు అన్ని షాపులలో మగవారి చెప్పులు బూట్లు మాత్రమె అమ్మటం మరో విశేషం .
అతడి షాపులు మూడు రకాలు .మొదటిరకం లో చాలా విలువగల వాటిని అమ్మేవాడు .రెండవరకం లో మధ్యరకం రేట్ల జోళ్ళు అమ్మేవాడు .మూడవ రకం షాపులలో పేదలకు అందుబాటులో ఉండే రేటు 16 షిల్లింగుల జోళ్ళు అమ్మేవాడు .1928నాటికి అన్ని దుకాణాల లో మొత్తమ 40లక్షల పౌన్ల జోళ్ళు అమ్మి రికార్డ్ సృష్టించాడు .అతడి చెప్పుల రిపేర్ షాప్ ప్రపంచం లోని అన్ని రిపేర్ షాపులకంటే అతి పెద్దది .ఒక రకంగా అదొక ఫాక్టరీ అనచ్చు .రిపేర్ లకు పెద్దగా డబ్బు తీసుకొనే వాడు కాదు.కష్టమర్ శాటిస్ఫాక్షన్ అనేదే ముఖ్యం .
మేనేజర్లకు మెక్ విల్లీయే స్వయం గా ట్రెయినింగ్ ఇచ్చేవాడు .వాళ్ళతో కలిసి పని చేస్తూ ఉత్సాహపరచేవాడు .చెప్పులు కుట్టటం లో తన నైపుణ్యాన్ని వారికి కుట్టి చూపి తెలియజేసేవాడు .షూ బాక్స్ లను అతడు తెరవ గలిగినంతతేలికగా ఎవరూ తెరవ గలిగే వారు కాదు. అతడి లాఘవం అంత గొప్పది .ప్రతి శనివారం పని వారితో భేటీ అయి సలహాలిస్తూ వారిని కంపెనీలో భాగస్వాములే అనే భావాన్ని హృదయాలలో నాటే వాడు .మేనేజర్లకు తరచుగా విందులు ఇచ్చేవాడు .హెన్రి షాపు లోని జోడు అంటే ఇక వెనక్కి తెరిగి చూసుకోనక్కర్లేదు అనే నమ్మకం కలిగించాడు నాణ్యత కు ప్రాదాన్యమిచ్చాడు .’’నమ్మకమే వ్యాపారానికి మూలం .షాప్ యజమాని మంచితనమే వ్యాపార విజయానికి మూల సూత్రం ‘’అని బోధించేవాడు ‘ప్రపంచ చిల్లర జోళ్ళ వర్తకులలో హెన్రి మాక్ విల్లి అద్వితీయుడు .ఎంత డబ్బు సంపాదించాడో లెక్కే లేదు .అందులో ప్రతి షిల్లింగ్ న్యాయంగా సంపాది౦చిందే .నిజంగా అతడు ‘’షూ కింగ్ ‘’
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-1-23-ఉయ్యూరు