13-టిమోతి ఈటన్
అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -13
13-టిమోతి ఈటన్
బ్రిటిష్ కామన్ వెల్త్ రాజధాని లండన్ .కెనడా కామన్ వెల్త్ దేశం .రాజధానిలో కాకుండా కెనడా లో ఉన్న కిరాణాషాప్ కామన్ వెల్త్ దేశాలలో ఉన్న అన్ని షాపులకంటే అతిపెద్దది దాని ఓనర్ టిమోతి ఈటన్..అతని హెడ్ ఆఫీసులు టోరెంటో,విన్నీ పెగ్ నగరాలలో 62 ఎకరాలలో ఉన్నాయి .అందులో పని చేసే ప్రతి మేనేజర్ డైరెక్టర్ అభిమానపూర్వకంగా నియమింపబడిన వారే .తెలివి తేటలతో ఎదిగి పైకొచ్చిన వారు .
ఈటన్ పుట్టిపెరిగింది అల్ష్టర్ లో .దాన్ని వదిలి టోరెంటో వెళ్లి 1869లో మొదటి దుకాణం పెట్టాడు .పెట్టిన వేళా విశేషం మంచిదవటం తో ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకపోయింది .వినియోగదారులకు వస్తువు నచ్చక పొతే డబ్బు వాపస్ ఇచ్చేవాడు .ఒకటే ధర .బేరం లేదు .కాష్ కే అమ్మేవాడు .అప్పు లేదు .కొనమనిని ఎవర్నీ బతిమిలాడటం లేదు .వస్తువు గుణాలను హైపర్ చేసి అమ్మకూడదు అనే నియమాలు పెట్టుకొని వ్యాపారం చేసి ఆకర్షించాడు .ఇవాళ సామ్స్,వాల్ మార్ట్, కే మార్ట్ ,జేసిపెన్నీ మొదలైనవి అనుసరిస్తున్న నియమాలు ఆనాడే ఈటన్ అమలు చేశాడు .మిగిలిన వర్తకులు అతడు స్వప్నాలలో విహరిస్తాడని ఎద్దేవా చేసేవారు .ప్రజ్ఞాశాలి అవటంతో ప్రతివారం ఏదోఒక కొత్త దనాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టేవాడు .
ఖాతాదారులను మాటలతో మోసం చేస్తే ఊరుకొనేవాడు కాదు .ఒకసారి .తన సేల్స్ మాన్ ఒక బట్టను గురించి ఖాతాదారుకి అది పూర్తిగా ఊలు తో నేసింది అని చెబుతుండగా విని వెంటనే ‘’కాదు అందులో సగమే ఊలు మిగిలింది కాటన్ ‘’అని నిజాయితీగా చెప్పాడు .ప్రకటనలు రాసేవాడు ఆవస్తువుల్ని నిశితంగా పరీక్షించి నిజాలు మాత్రమె రాయాలని సుగ్రీవాజ్న గా చెప్పేవాడు .ఏది ప్రకటించినా ఎక్కడా అతి ఉండరాదు అనే నియమం పాటించాడు .ఆ షాప్ లో ఒక రిసెర్చ్ సెల్ కూడా ఏర్పాటు చేశాడు .వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు చెప్పటం దాని పని .పరిశోధకశాఖ వారే కాక ఈటన్ కూడా అప్పుడప్పుడు పరిశోధించేవాడు .తప్పు చీటీ అంటిస్తే పీకేసి సరైనది అంటింవాడు .వస్తువు నిజస్వరూపమే ప్రదర్శించాలి,అందర్నీ న్యాయంగా సంతృప్తి పరచాలి అనేది అతడి వ్యాపార సిద్ధాంతం.
ఒక సారి ఒక బ్రాంచ్ షాప్ లోతప్పుడు వాల్ పోస్టర్లు అంటించ గా అతడు గమనించి వెంటనే పీకేయించి సరైనవి అంటించేట్లు చేశాడు .సూపర్ వైజింగ్ లో అతడివి డేగ కళ్ళు .ఇలాంటి తప్పులు సరి చేయటానికి ఎంతడబ్బు ఖర్చు అయినా వెనక్కి తగ్గేవాడుకాడు .నాణ్యత విషయం లో రాజీ లేనే లేదు .ఈ షాప్ కు అనుబంధంగా ఒక హోటల్ నడిపాడు ఈటన్.రోజుకు అయిదువందలమందికి పైనే అందులో భోజనం చేసేవారు.ఇక్కడా శుచి శుభ్రత నాణ్యత లేక్ ప్రాధాన్యం ..ప్రతి ఏడాది 600పేజీల కేటలాగ్ ముద్రించేవాడు .అనేక బట్టలమిల్లులకు అతడు యజమాని .రెడీమేడ్ వస్త్రాల ఫాక్టరీలు కుట్టుపని దారం ,ఎంబ్రాయిడరీ ,కకొయ్యసామాను ,వాసన ద్రవ్యాలు ,మందులు ,స్కూల్ బుక్స్ ,సబ్బుల తయారీ ఫాక్టరీలు కూడా అతనికి ఉన్నాయి .
నికార్సైన వస్తు ఉత్పత్తికోసమే ఫాక్టరీ పెట్టేవాడు .నాణ్యమైన సరుకు తయారు చేసి అమ్మాలి అనేదే అతడి ధ్యేయం .తృప్తి అనేది కొనేవాడికి, అమ్మేవాడికి ఉండాలని ఆరాట పడేవాడు .రొక్కానికి అమ్మటమేకాక అరువుకు కొనాలంటే ఖాతాదారు అతని షాపులో కొంత డబ్బు పెట్టుబడి పెట్టాలి .దానికి న్యాయమైన వడ్డీ ఇచ్చేవాడు .ఇన్ని రకాలైన వ్యాపారాలను 18మంది సభ్యులు కల సలహా సంఘం పర్యవేక్షిస్తుంది కంపెనీ మేనేజర్లు బాలట్ పద్ధతిలో ఈ సలహా సంఘ సభ్యులని ఎన్నుకొంటారు .ఈసంఘం నెలకు రెండు సార్లు సమావేశం జరుపుతుంది .సలహాలివ్వటమే దీనిపని. వాటిని డైరెక్టర్ తీసుకొని అమలయెట్లు చూస్తాడు .ఈటన్ 1907లో చనిపోయాడు .
ఈటన్ 1834మార్చి లో ఉత్తర ఐర్లాండ్ లో పుట్టి ,31-1-1907లో 73వ ఏటచనిపోయాడు .20వ ఏట అక్కడి నుండి కెనడాలోని ఒంటారియో కి వచ్చి స్థిరపడ్డాడు .మెయిల్ ఆర్డర్ ,కేటలాగ్ లను మొట్టమొదట ప్రవేశ పెట్టినవాడు ఇతడే .రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ఈటన్ కంపెని లిమిటెడ్ లో 70వేలకు పైగా ఉద్యోగులున్నారు .డిపార్ట్ మెంటల్ స్టోర్ కు ఆద్యుడు కాకపోయినా ,మొదటి రిటైలర్ కాకపోయినా కెనడాలో రిటైలింగ్ బిజినెస్ లో రివల్యూషన్ తెచ్చాడు .కెనడాలోని సర్కచేవాన్ నగరానికి అతని స్మృత్యర్ధం ఇటోనియా అని పేరు పెట్టారు .అలాగే టిమోతి ఈటన్ బిజినెస్ అండ్ టెక్నికల్ ఇన్ ష్టి ట్యూట్ వంటికి అతనిపేర వెలిశాయి .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
త్యాగరాజ ఆరాధనోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-23-ఉయ్యూరు