తెలుగు భాషకు ఆద్యులు ‘’తెనుగోళ్ళు’’
అంటూ అనేక ప్రాచీన శిలాశాసనాల అధ్యయనం ద్వారా –తెలుగు మూలాల అధ్యన సంఘం ‘’తెలుగు దివ్వె ‘’సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎల్ ఎం రాజు ,అధ్యక్షురాలు శ్రీమతి పిల్లి లక్ష్మీ తులసి పుస్తకం రాసి డిసెంబర్ 22న ప్రచురించారు .ఈ పుస్తకాన్ని నాకు కిందటి డిసెంబర్ లో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల సంఘం సమావేశాల్లో ఎవరో ఇచ్చారు .అందులోని ముఖ్య విషయాలు మీకు అందిస్తున్నాను .
తొలి తెలుగు శాసనాన్ని కలమళ్ళ లో ప్రతిష్టించిన వాడు ‘’రేనాటి చోళ ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు ‘’ఆయనకే ఈ పుస్తక౦ అంకితమిచ్చారు .తెలుగు అక్షర శిల్పి ముత్తురాజు అని డాక్టర్ వెలగా జోషి అన్నారు .ముత్తురాజు జీవిత చరిత్ర తెలుగు పాఠ్యాంశ౦ గా చేరింది .ముత్తురాజుల నాటి చారిత్రిక అంశాలపై ,ఆనాటి తెలుగు భాషా స్వరూపం పై అధ్యయన ,పరిశోధనలు జరగాలి . కలమళ్ళ శాసనం ప్రస్తుతం ప్రొద్దుటూరు శ్రీ చెన్న కేశవ స్వామి దేవాలయం లో ఉన్న ఆరు శాసనాలలో ఒకటిగా గుర్తించారు .కందిమళ్ళ ,ఎర్రగుడిపాడు లలో తెలుగులో రాజశాసనాలు వేయించిన తొలి తెలుగు శాసనకర్త రేనాటి చోళమహారాజు నందివర్మ మూడవ కుమారుడు ‘’ఎరికల్ ‘’ముత్తురాజు ధనుంజయుడు .క్రీ.శ 575లో పై రెండు శాసనాలవలన నిజమైన తెలుగు భాషాయుగం మొదలైంది .మొదటి శాసనం కలమళ్ళ,రెండోది ఎర్రగుడిపాడు శాసనం .
ఎరికల్ అంటే పిడుగు .రేనాటి రాజులకు ఇలాంటివి బిరుదులూ ఉండేవి .ముత్తురాజు అసలు పేరు .ధనుంజయుడు, ఎరికల్ అనేవి బిరుదులూ .రేనాటి చోళుల రాజ్యాన్ని ‘’చు –లి –యే’’అన్నాడు హుయాన్ సాంగ్ .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో 5వ తరగతి తెలుగు వాచకం ‘’తెలుగు తోట ‘’లో ‘’చదువు దా౦ –కలమళ్ళ శాసనం ‘’శీర్షికతో పాఠ్యాంశ౦ గా చేర్చారు .
తమిళనాడు లో తంజావూర్ రాజ ధానిగా పాలించినవాడు ధనంజయ ముత్తరాయర్ .ఆంధ్రలో ధనంజయ ముత్తురాజు మనవడు ఎరికల్ ముత్తురాజు పుణ్య కుమారుడు ‘’కనిపిస్తాడు తమిళనాడు పుదుక్కొట జిల్లా తిరుమేయం వద్ద ఉన్న భైరవన్ ఆలయం లోని శాసనం లో కువహన్ ముత్తురాయర్ తమ్ముడు యువరాజు పుణ్య కుమార్ ముత్తురాయర్ గా పేర్కొనబడినాడు .వారిద్దరి విగ్రహాలు శివాలయం లో ద్వారపాలకులుగా రాతి శిల్పాలు చెక్కబడ్డాయి .తమిళ ముత్తరాయర్ల పేర్లు, బిరుదులూ తెలుగువే .తెలుగు ప్రాంతం నుంచి తమిళప్రాంతానికి వలస వెళ్లి ఉంటారు .
ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం –‘’తెనుగు దేశమున బుట్టి ,తెనుగు దేశమున బెరిగి ,తెనుగు ముత్తురాజులై వెలసి ,తేనే మనస్కులై ,నేడు తెనుగు లంబాయే ‘’అన్నారు కవిత్వం లో .తెనుగు అనే పేరు ఎలా వచ్చింది ?తేన్+అగు =తెనుగు .తేన్ అంటే దక్షిణం .అంటే దక్షిణాది వారు త్రినగాలమధ్యది తెనుగు దేశం .
మార్కండేయ పురాణం పైఅదారిటి ఉన్న ‘’పర్గీటర్’’-అందులోని ‘’తిలింగా కుంజరీ కచ్చా వాసాశ్చయేజనా-తామ్రపర్ణీత తధాకక్షిరితి కూర్మస్వ దక్షిణ’’లోని తిలింగా అంటే తెలుగు దేశాన్ని సూచిస్తుందని చెప్పాడు .తెలుగు దేశానికి త్రిలింగ దేశం ,వజ్రభూమి ,నాగభూమి ,అంజీర దేశం,వేంగి దేశం మొదలైన పేర్లున్నాయి .
ప్రాచీన చోళులు ,ముత్తరాయర్ రాజులు ,కోలీలు ఒకే వంశానికి చెందినవారు .ముత్తరాచలే కోలీలు .ముత్తదాఅంటే గ్రామ రక్షకుడు లేక గ్రామాధికారి .వీరే ముదిరాజులు ,ముత్రాసులు అయ్యారు .శ్రీరంగం లోని వేయి స్తంభాల మంటపాన్ని ‘’ముత్తరాసన్ కోరాడు ‘’అంటారు .పళని లో పెద్దమంటపాన్నికూడా ఈ వంశపు రాజులే కట్టించారు .కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయం శాశ్వత అర్చకులు ముదిరాజులే .తిరుమలలో శ్రీవారికి నిత్యం అభిషేక జలం అందిస్తున్న ‘’పాపనాశిని ‘’యొక్క ప్రతిరూపం కృష్ణాజిల్లాలో ముదిరాజ్ వంశం లో ‘’పాపమాంబ ‘’గా పుట్టి తిరుపతంబకు సేవలు చేసింది .తిరుపతమ్మ యోగాగ్నిలో దాహి౦ప బడినప్పుడు తనకు సేవలు చేసిన పాపమా౦బతో ‘’నీ సేవలు చిరస్మరణీయం ఆచంద్ర తారార్కం మీ వంశం వృద్ధి చెందుతూ తరతరాలుగా నన్ను అర్చిస్తారు అని చెప్పినమాటలను ‘’అమృత వాణి ‘’అంటారు .
తిరుపతి గ్రామదేవత ముదిరాజుల కులదేవత ‘’అంకాళమ్మ తల్లి ‘’.
ముదిరాజ పట్టణం మదిరస్సా ,మద్దరాస అనే అపభ్రంశాలు పొంది , చివరికి మదరాసు అయింది .
ఇలాంటి మ౦చి ఉపయుక్త సమాచార౦ తో ఈపుస్తకం కలర్ పేజీలతో అవసరైన శాసనాలు ,విగ్రహాలతో కను విందు చేస్తుంది .చాలా వ్యయప్రయాసలకు శ్రమకు ఓర్చి విషయ సేకరణ చేసి ఆధారాలతో ఈ పుస్తకం రాసిన రచయితలకు అభినందనలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-1-23-ఉయ్యూరు–