అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -16(చివరి భాగం )
16-లీవర్ హ్యూమ్
నిరుపేద లీవర్ హ్యూమ్ ‘’సన్ లైట్ సోప్ ‘’యజమాని అయ్యాడు .చదువులేదు బిరుదులూ రాలేదు .పోటీప్రపంచం లో యాడాదికి 50లక్షల పౌన్ల లాభం పొందిన సబ్బు కుబేరుడయ్యాడు .సరుకు నికార్సుగా తయారు చేసి అమ్మిన లాభమే ఇది ఇందులో షార్ట్ కట్స్ లేవు .ఇతని వ్యాపార రహస్యం ‘’స్పీడ్ ‘’.దివాలా లో ఉన్న కంపెనీలనుకొని లాభమార్గం లో పెట్టేవాడు .సరుకు అమ్మలేము అని భయపడే వాళ్ళంతా క్యూ కట్టి లీవర్ దగ్గరకు వచ్చి ఏదో అతితక్కువధరకే అతనికి తమ కంపెనీలు అంట గట్టేవారు .అవన్నీ అతడికి బంగారు గుడ్లు పెట్టె బాతులవటం అతడి అదృష్టం.సబ్బుల పరిశ్రమనే నమ్ముకొని ఎదిగి కుబెరుడైనవాడు లీవర్ .సబ్బులకు పనికి వచ్చే కొవ్వు ఎక్కడ నాణ్యంగా తక్కువ ధరకు వస్తుందో వెతికి తెలుసుకొని అక్కడి నుంచి తెప్పించేవాడు .కొవ్వుకోసం ఆఫ్రికాలో 80లక్షల పౌన్లు పెట్టుబడిపెట్టిన ధైర్యస్తుడు . తను తయారు చేసిన సబ్బు నాణ్యమైనదిగా శుచి శుభ్రత ఉన్నదానిగా చేసి కస్టమర్లకు గొప్ప నమ్మకం కలిగించాడు .
తన వర్కర్స్ ను కూడా కంపెనీ భాగస్వామ్యులను చేశాడు .లాభాలను వారికీ పంచిపెట్టాడు .ట్రేడ్ యోనియన్లమాట సోషలిస్ట్ లు చెప్పే మాటలకు విలువనిచ్చేవాడు .ఆతను చనిపోయే నాటికి లీవర్ కంపెనీలో 18వేల భాగస్వామ్యులు ,ఒక లక్ష అరవై వేలమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు .సబ్బుల కంపెనీ వలన తన ఇంటికేకాదు రెండు లక్షల గృహాలకు కూడా సుఖం ,రక్షణ కల్పించాడు .అతడి విజయానికి కారణాలు -1-15 షిల్లింగుల ఆర్జనకోసం పది షిల్లింగులు ప్రకటనలకోసం ఖర్చు చేసేవాడు 2-అతడి కంపెనీకి డైరెక్టర్ల బోర్డ్ కాని ,కమిటీలుకని లేకపోవటం..కాన్ఫరెన్స్ లకంటే కార్యాచరణం మీదనే అతనికి నమ్మకం ఎక్కువ .ఎవరిమీదా ఆధారపడకుండా స్వేచ్చగా స్వతంత్రంగా వ్యాపార చేసిన మొనగాడు లీవర్ 3.ఏపని అయినా లార్జ్ స్కేల్ లో చేసేవాడు .తగ్గించటం కుదించటం అతడి డిక్షనరీలో లేనే లేవు .తన వ్యాపార రహస్యాన్ని అతడు ఒకకవి చెప్పిన కవితా సూక్తి గా ‘’నవలగల దానికంటే ,ఎక్కువ ముక్క నమిలెయ్యి ‘’అని చెప్పేవాడు .
అతడిది ఎప్పుడూ ముందు చూపే .ఇతరులకు గరిక పోచగా కనిపించింది అతడికి అక్షయ వట వృక్షంగా కనిపించేది .
లీవర్స్ బ్రదర్స్ కంపెనీ వారి ‘’సనలైట్ సబ్బు ‘’బట్టలు ఉతకటానికి అద్భుతంగా పని చేసేది .దీన్నే డిటర్జెంట్ సోప్ అనేవారు .ఇండియాలో హిందూస్తాన్ లీవర్స్ వారు తయారు చేసేవారు .తర్వాత లిక్విడ్ రూపంగా కూడా వచ్చింది
17-శాండర్స్ నార్వేల్
అమెరికాలో జన్మించిన శాండర్స్ నార్వేల్ పేరు లండన్ ,పారిస్ వర్త క సంఘాల వారికి బాగా పరిచయం .1930లో అతడు రెమింగ్టన్ ఆరన్స్ కంపెనీ అధ్యక్షుడయ్యాడు .చిత్రకళపై ఉన్న అభిరుచితో పారిస్ వెళ్లి నేర్చి దాని అంతు చూద్దామనుకొన్నాడు కాని చేతిలో పైసా కూడా లేదు .పొట్ట పోసుకోవటానికి ఇనుప సామాను అమ్మే కంపెనీలో రవాణా గుమాస్తాగా చేరాడు .ప్రతిభ చూపి కొద్దికాలం లోనే సేల్స్ మాన్ అయ్యాడు .28వ ఏట సేల్స్ మేనేజర్ అయ్యాడు .ఏడాదికి 2లక్షల పౌన్ల చొప్పున పదేళ్ళు దిగ్విజయంగా అమ్మకాలు చేసి వృద్ధి చెందాడు .
వస్తువు అమ్మాలంటే –వినటం చూడటం గుర్తుపెట్టుకోవటం ముఖ్యం అని చెప్పేవాడు .అంటే కొనే వారు చెప్పేది బాగా జాగ్రత్తగా వినాలి ,అలాంటి వస్తువులు తనదగ్గరేవి ఉన్నాయో తెలుసుకోవాలి ,ఆ ఖాతాదార్ల పేర్లు గుర్తు పెట్టుకోవాలి .అతడు ట్రావెలింగ్ ఏజెంట్ గా ఉన్నప్పుడు 75వేల రకాల ఇనప వస్తువుల కేటలాగ్ నుంచి కావాల్సినవి ఎన్నుకొని ,కొని అమ్మాలి .ఆ కేటలాగ్ బరువే 40పౌండ్లు ఉండేది .అంత పెద్ద దాన్ని ఎవరు ఓపికగా చదివి ఆర్డర్ చేస్తారు?అందుకని మొదట్లో మధ్యలో చివర్లో ఉన్నవాటిని గుర్తు పెట్టుకొని ఆర్డర్ ఇచ్చేవాడు .
ఒక్కో నెలలో ఒక్కో వస్తువును అమ్మటం అతడి ప్రత్యేకత .అంటే ఏడాదికి 12రకాల వస్తువులను అమ్మేవాడు .వచ్చిన లాభాలలో 20శాతం వస్తు ఉత్పత్తి దారులకు ఇవ్వాలి అనేది అతడి నియం ..కొనాలని అనుకోన్నవారికే అమ్మటం అతడు చేసి అభివృద్ధిలోకి వచ్చాడు .పదేళ్ళు సంపాదించి ఇక డబ్బుపై వ్యామోహం చాలు అనుకొన్నాడు .తర్వాత తనకిష్టమైన చిత్రకళపై దృష్టిపెట్టాడు .కొద్దికాలానికే మొహం మొత్తింది .అమెరికాకు వెళ్లి మళ్ళీ వ్యాపారంలో బిజీ అయ్యాడు .
18.జే.ఎం డెంట్.
గ్రేట్ బ్రిటన్ కు పుస్తక ప్రచురణలో పేరు తెచ్చినవాడు .జె.ఎం డెంట్…1897లో ,తన 18వ ఏట లండన్ కు వచ్చాడు డెంట్.చేతిలో అప్పుడు ఎర్రని ఏగాని కూడా లేదు .పుట్టింది డార్లింగ్టన్లో..అతడి పదేళ్ళ వయసులో ఖాతాదార్లకు బాకీలు బాగా పెట్టి తండ్రి వ్యాపారం చితికి పోయింది .పది మంది సంతానం .ఇంతమందిని పోషించాలి కనుక డెంట్ పదవ యేటనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది .కుంటి వాడు .చదువులో వెనకబడ్డాడు .సాయం చేయటాని తండ్రి తరఫున తల్లి తరఫునా ఎవ్వరూ లేరు .అతనిలో ఉన్నది పుస్తకాభిలాష ఒక్కటే .
ఒక బుక్ బైండర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరి ,అక్కడే పని చేసి ,పరిచయాలు పెంచుకొన్నాడు .జార్జి గ్రాంట్ అనే మిత్రుడు .అతడు స్వయంగా బుక్ బైండింగ్ వ్యాపారం చేయటానికి 250పౌన్లు అప్పు ఇచ్చాడు .దానితో బుక్ బైండింగ్ షాప్ ,జె.ఎం.డెంట్ అండ్ సన్స్ పేరుతొ పుస్తక ప్రచురణ వ్యాపారం ప్రారంభించాడు .దురదృష్టం వలన ఆ షాప్ అగ్నికి ఆహుతైంది .ఇన్సూరెన్స్ వలన వచ్చిన డబ్బుతో తనకు అప్పు ఇచ్చిన మిత్రుడికి డబ్బు చెల్లిద్దామని వెడితే ,అతడు తీసుకోకుండా వ్యాపారం కొనసాగించమని సలహా ఇచ్చాడు .
కొద్దికాలం లోనే డెంట్ పబ్లిషింగ్ కంపెని లండన్ లోనే అతి ముఖ్యమైనది అయింది .ఉత్తమ గ్రంధాలనే ప్రచురించేవాడు .’’ఎవిరీమాన్స్ లైబ్రరి ‘’పేరిట అతడు ప్రచురించిన పుస్తకాలు విశ్వ విఖ్యాతాలయ్యాయి .క్రమగా డబ్బుతోపాటు కీర్తి కూడా పెరిగింది .ప్రముఖ రచయితలతో పరిచయం కలిగింది .ఎనిమిది మంది సంతానానికి తండ్రి అయ్యాడు .అతడికి ఇటలీ అన్నా అభిమానమే. మొదటి ప్రపంచ యుద్ధంలో అతడి ఇద్దరుకొడుకులు వీర మరణం పొందారు .అయినా మనసు స్థిరంగా ఉంచుకొన్నాడు పేదవారికి తక్కువధరలో పుస్తకాలు అందించేవాడు .జీవితమంతా సాహిత్య కవిత్వ గోష్టుల తో చరితార్దుదయ్యాడు
డెంట్ 30-8-1849లో పుట్టి ,9-5-1926న 77వ ఏట మరణించాడు .ఎవిరిమాన్స్ లైబ్రరి తో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు .అతని హాస్య చతురాలైన పరాక్సిజం కు అందరూ ఆకర్షితులయేవారు .పుస్తకాలను ప్రజల దగ్గరకు తెచ్చిన వాడు డెంట్ .మన యువభారతి ఇలాగే ‘’ఇంటింటా స్వంత గ్రంధాలయం ‘’పేరిటా చాలాసేవ చేసింది .ఏ పుస్తకమైనా వెయ్యి కాపీలు వేయటం అతడి ధైర్యం .లాభాలతో కోవెంట్ గార్డెన్ లో కొత్త ఫాక్టరీ, ఆఫీసు కట్టాడు .అతడు ప్రచురించిన వాటిలో –దిపిల్గ్రిమ్స్ రిగ్రేస్ ,అనే సి.ఎస్ లేవిస్ స్వీయ చరిత్ర ముఖ్యమైనది .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-23-ఉయ్యూరు