రామస్వామి శతకం
నరసింగు పాలెం వాస్తవ్యులు శ్రీ భల్లం పాలన్ రాజు కవి రామస్వామి శతకం రచించి ,ఆగిరిపల్లి వాస్తవ్యులు శ్రీ పొన్నం చలమయ్య ధన సహాయం చేత బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షరశాలలో 1929లో ముద్రించారు .వెల-తెలుపలేదు .’ఆగిరిపల్లి ధామ వర ’రామా ,తారక బ్రహ్మమా ‘’అనేది శతకం మకుటం .ఆగిరిపల్లి లోని సీతారామ స్వామి పై రచించిన భక్తి శతకం ఇది .
సూటిగా ఉత్పలమాలలో చలంయ్యగారిని కీర్తించాడు కవి .చలమయ్య గారు స్వామి దయతో ఆగిరిపల్లిలో గుడికట్టి అందులో సీతా రామస్వామిని ప్రతిష్టించాను .ఆయనపై ఒక కృతి రాయమని కవిని కోరితే ఈశతకం రాశానని చెప్పాడు.తర్వాత చలమయ్య వంశ చరిత్ర 18పద్యాలలో రాశాడు .
మొదటి శార్దూల పద్యం లో –‘’శ్రీ రమ్యంబగు రూప సద్గుణములన్ చెల్వొందు భూజాత శృ౦ –గారానంద మనప్రియుండ,బుధ సత్కారుణ్య సంధాన ,బల్-ధీర స్వాంత,త్రిలోకపాలక మమున్ దేవా కృపన్ బ్రోవు వి-స్తారం బాగిరిపల్లి వాస వర సీతారామ సద్బ్రహ్మమా ‘’. .తర్వాత శ్రీరామ జన్మకారణం,కౌశికు యాగ రక్షణం , ధరణీ జాత తో కల్యాణం ,రావణ సంహారం ,వాలి వధ చేసి సుగ్రీవునికి రాజ్యం ఇప్పించటం ,గుహుడి అనన్య రామభక్తి ,’’స్వాంతోచ్ఛిష్టములైన పండ్లునిడిన ‘’శబరికి మోక్షమివ్వటం ,,కాననం లో నారాయణ పుణ్య వార్తన కథలు వినటం ,శూర్పణఖ చుప్పనాతి తనం ,పొందిన పరాభవం ,మారీచ మద గర్వం అణచటం ,దుష్ట రావణుడు సీతాదేవిని అపహరించటం వాడితో యుద్ధం చేసి ‘’మర్మ స్థానములన్ చలింప పుడమి పై చేర్చటం ,రామునిపై సద్భక్తి తో ‘’సమీరానందనుడు విద్వాద్విశ్వ రూపం చూపగా ,శక్తినిచ్చి బంటుగా చేసుకోవటం ,’’వారాసిన్ గడు బాణ కోణ శిఖి చే వంచించి బిందోప మాకారం బందగ’’చూపిన భుజపరాక్రమం ,వారధి కట్టినప్పుడు ‘’’’ఉడుత విధ్యుక్త సత్కారమున్ కృపతో గన్గొని ,మోక్షమిచ్చిన దయా గుణం ,అన్నరావణుడికి నీతి చెప్పిన విభీషణుని చేరదీయటం ,’’ముని సంఘంబు సురల్ ,నరుల్ మనముననన్ మోదంబు సంధిల్లుచున్ ‘’రావణ వధ చేయటం ,సీతను గౌరవంగా చేర్చుకొని అయోధ్యకు వచ్చి పట్టాభి షేకం జరుపు కోవటం అనే రామకథను వర్ణించాడు కవి .
‘’సుగ్రీవా౦గదజాంబవంత హనుమచ్ఛూరుల్ ,సుశేషణాది శౌర్యాగ్రులను ‘’మోదం చెందగా బ్రోచాడు రాముడు .’’నీలాభ్రోపమ,సుందరాంగవిభవా ,నీరేజ పత్రా౦బకా –లాలిత్యంబగు పూర్ణ చంద్ర ముఖ దుర్వారాఘ విధ్వంసకా –భూలోకోన్నతిశౌర్యవర్తన మహాపుణ్య ప్రజానీక స-త్పాతాలాత్మాగిరి పల్లి ధామ వర సీతారామ సద్బ్రహ్మమా ‘’అంటూ చక్కని ధారతో పద్యాలు రాశాడు కవి .’’దుర్మానుష్య మదాంధకార రిపులున్ ,దోషాచరుల్ , దుర్గుణుల్-మర్మాత్ముల్ ,దురిత ప్రవర్తన జడుల్ ,మాయాసుర ద్వేష దు- ష్కరుల’’ను నాశనం చేసి ప్రజలనుకాపాడినవాడు రామప్రభువు.రామ పదాబ్జాలు మనసులో నిలుపుకొని ‘’రామారామా ‘’అంటూ నామోచ్చారం చేస్తే మోక్షమిస్తాడు .’’శ్రీరామా యను మంత్ర రాజము మదిన్ శీతాద్రి సత్పుత్రి హ్రుత్సారంబొప్ప జపించి శాశ్వత మహా సౌఖ్యాలు ‘’పొందింది .వాల్మీకి ధ్యాని౦చి జపించి’’ రామాయణం రాసి సౌఖ్యపదం పొందాడు .’’శ్రీరామార్పణమంటటంచు మది సంశీలంబు సద్భక్తి నింపార ‘’గాదాన ధర్మాలు చేస్తే బ్రోచే టి సకల సద్గుణాభిరాముడు రాముడు .లోకోక్తిని చక్కగా పద్యంలో ఇమిడ్చి చెప్పాడు కవి .
దానధర్మాలు చేసిన౦త మాత్రాన మోక్షం రాదు రామనామ స్మరణ వల్లనే ముక్తి .’’రామా రాఘవ ,దాస పోషణ గుణా,రాజీవ నేత్రా ,సురా-భీమ ప్రౌఢిధనుర్ధురీణ,భుజ భూభ్రుద్వర్గ సంసేవ్య స-త్కౌమారాశ్రిత కల్ప భూజ వరదా కారుణ్య మౌనీ మనోద్ధామా ‘’అంటూ కండగల పద్యాలు చెప్పగల నేర్పున్నకవి ఎక్కడా ధార కుంటు పడదు .రామబాణ౦ లాగా సాగిపోతుంది మహావేగంగా పద్యం . ‘’మీ బోటి బల్ సత్తామాత్రు నకంకిత౦బు నిడినన్ సారూప్య సాయుజ్య సంపత్తుల్ గూర్చి ,యఖండ సౌఖ్య పదమున్ సత్కారం ‘’చేస్తావు రామభద్రా అని మహాదానందంగా చెప్పాడు .
చివరి శార్దూలం లో కూడా తనగురించి కవి ఏమీ చెప్పుకోకుండా –
‘’నీవే తల్లివి దండ్రివిన్ ,గురుడవున్ ,నీవే సబంధుండవున్ -నీవే దాతవు,నీతిబోధకుడవున్ ,నీవే మహా దైవమున్ –నీవే తప్ప నితః పరుల్ గలరె నే నిన్నున్ మదిన్ నమ్మితిన్ –దైవాగ్రాగిరిపల్లి ధామవర ,సీతారామ సద్బ్రహ్మమా ‘’
లోకం లోని భక్తీ శతకాలతో సరితూగేశతకం అనిపిస్తుంది ఈ శతకం .భక్తీ తాత్పర్యం రామనామ సంకీర్తనా మాధుర్యం అది అందించే మోక్షం ,సద్గుణ లక్షణాలు కలిగి ఉండమనే ఉద్బోధ ,దుర్మార్గం లో నడిచి పరందాముడికోపానికి లోని సద్గతి చేజార్చుకోవద్దనే హితవు అన్నీ గుది గుచ్చి రాసిన శతకం .కవి కృష్ణా జిల్లా వాడు కావటం ఆనందదాయకం .అందునా శ్రీ శోభనాచలేశ్వరస్వామి వెలసిన ఆగిరిపల్లిలోని సేతారామ స్వామిపై శతకం రాయటం మరీ సంతోషంగా ఉంది ఈ శతకాన్నీ కవినీ పరిచయం చేసిన అదృష్టం నాకు దక్కింది .భక్తీ శతకాలలో అగ్రశ్రేణి శతకాలలో ఒకటిగా నిలిచే శతకం ఇది .
కనుమ పండుగ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-23-ఉయ్యూ