‘’క్రాఫ్ట్ ‘’కే కాదు ‘’డిసిప్లిన్’’ కి కూడా ‘’మాస్టర్’’- రామమోహనరావు
ఉయ్యూరు జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఖచ్చితంగా ఉదయం 9-30గం .లకు చేతిలో బెత్తం పట్టుకొని ,పాంటూ షర్ట్ తో పైన నాప్కిన్ తో లేదా ధగధగలాడే తెల్ల మల్లు లేక సిల్క్ పంచే ,పైన తెలుపు లేక కొంచెం గోధుమరంగు ఫుల్ హాండ్స్ షర్ట్ తో కనిపించాడు అంటే ఆయన క్రాఫ్ట్ మాస్టర్ శ్రీ కోడె రామ మోహనరావు అయి ఉంటాడు .పిల్లలను అదుపులో పెట్టటం అసెంబ్లీ అయ్యేదాకా పకడ్బందీగా కార్యక్రమాల నిర్వహణలోతోడ్పడటం పిల్లలు ఎవరిక్లాసులకు వాళ్ళు వెళ్ళే దాకా చూడటం అతని పనికాకపోయినా,డ్రిల్ మాస్టర్ల పని అయినా ఆపనిలో ఉండేవాడు రాం మోహన్ .అతడిని నేను’’ రాం మోహన్’’ అనే ఏక వచనం లో పిలిచేవాడిని .మంచి స్నేహితుడు అతనిలో కనిపిస్తాడు .నవ్వుతూ ఉంటూ చురకలేస్తాడు .స్టాఫ్ అందర్నీ కాచి వడ పోసినవాడు. ఎవరు ఎలాంటి వారో తెలిసిన వాడు .హెడ్ మాస్టర్ కు తలలో నాలుక .టీచర్లందరికి ప్రియతముడు ఎవరిలోనైనా లోపంకనిపిస్తే మెత్తగా చీవాట్లు పెట్టేస్తాడు .
రాం మోహన్ వీరమ్మ తల్లి గుడికి అవతల స్వంత స్థలం లో డాబా కట్టుకొని ,ఒక రేకుల షెడ్ లో ఒకటి రెండు గేదెలను పెంచుతూ మేత తానె కోసుకొని వచ్చి మేపుతూ గొడ్ల చాకిరి చేస్తూ ఆపాలను విక్రయిస్తూ ఉండేవాడు. స్కూల్ కు రాకముందు ,స్కూలయ్యాకా అదేఅతని డ్యూటీ .ఆదివారాలలో ముదునూరుకు దగ్గర ఎక్కడో ఉన్న రెండెకరాల మాగాణి కి వెళ్లిస్వంత వ్యవసాయపు పంట లను పర్యవేక్షించేవాడు .అలుపు విశ్రాంతి ఎరుగనివాడు .అతని నవ్వు ముఖం నాకు ఆమహా ఇష్టం .సుమారు అయిదున్నర అడుగుల మనిషి బలిష్టమైన దేహం .తీరైనముక్కు .నల్లని తలవెంట్రుకలు .ఒకరకంగా అందగాడే .అయితే ఏరకమైన వ్యామోహం లేనివాడు. సిగరెట్, మందు అసలు తెలియనివాడు .మంచి వాలీబాల్ ,బాడ్ మింటన్ ,కబాడీ సాఫ్ట్ బాల్ ప్లేయర్ .ఆరోగ్యమైన శరీరం .ఒకరకంగా స్టీల్ బాడీ .నేను ఒకసారి పామర్రులో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆతను ఉయ్యూరునుంచి ట్రాన్స్ ఫర్ అయి రెండు నెలలు నాతొ పాటు పని చేశాడు. దాదాపు ఉయ్యూరునుంచి కలిసి వెళ్లి కలిసి వచ్చేవాళ్ళం .దానితో మా ఇద్దరి స్నేహం బాగా పెరిగింది .ప్రసాద్ గారూ అని అతనూ రాం మోహన్ అని నేను పలకరించుకొనే వాళ్ళం . ఈ రెండు మూడు నెలల కాలం తప్ప ఆతను ఎప్పుడూ ఉయ్యూరు దాటి ఎక్కడా పని చేసినట్లు లేదు .బంధుత్వం రాజకీయ అండ దండలు బాగా ఉన్నవాడు .
అతని కొడుకు ఉయ్యూరు హైస్కూల్ లో చదివినప్పుడు మాతో పని చేసే లెక్కల మాస్టారు శ్రీ పసుమర్తి ఆంజనేయ శాస్త్రి గారి దగ్గర ట్యూషన్ చదివాడు .అందువల్ల రాం మోహన్ తో నాకంటే శాస్స్త్రిగారికి ఎక్కువ పరిచయం ఉండేది .కొడుకు ఎ౦ .బి . బి .ఎస్ .చదివి పాసై రాజమండ్రిలో డాక్టరీ చేస్తున్నాడు .భార్య కూడా డాక్టర్ అని తెలుసు .ఆతను హార్ట్ స్పెషలిస్ట్ అనుకొంటా .అందుకే శాస్త్రిగారు రాజమండ్రివెళ్లి అతని దగ్గరే చెకప్ చేయించుకొనేవాడు .రాం మోహన్ మరదలి కూతుర్నో లేక బావమరది కూతుర్నో తన వద్దే ఉంచి హై స్కూల్ లో చదివిన్చినట్లు గుర్తు .రాం మోహన్ ఎప్పుడూ సైకిల్ మీదనే స్కూల్ కు పొలానికి రాకపోకలు చేసేవాడు .ఎప్పటికప్పుడు సైకిల్ ను నీట్ గా ఉంచేవాడు .
ఉయ్యూరు స్కూల్ లో తాగుబోతు సుబ్బారావు తాగి వచ్చి హడా విడి చేస్తే అతడిని బయటికి పంపటం ఎవరి వల్లా సాధ్యమయ్యేది కాదు .రాం మోహన్ నయానా భయానా బూతులతో బెదరగొట్టి పంపేవాడు అలాగే హిందూ ముస్లిం విద్యార్ధుల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే యిట్టె పసిగట్టి ఆప్రమాదం జరగకుండా కాపాడేవాడు .ఇలాంటి వాటిలో ముందుండే మాకు అంటే నాకు శాస్త్రిగారిని కాంతారావు రామకృష్ణారావు పిచ్చిబాబు మొదలలైవారికి అండగా ఉండేవాడు .హార్మని ఆఫ్ ది స్కూల్ కాపాడటం లో శక్తి యుక్తుల్ని ధార. పోసేవాడు .క్రాఫ్ట్ క్లాస్ బోధించే టప్పుడు పాంటు చేతుల్లేని బనీన్ తో విద్యార్ధులకు పాఠాలు చెప్పేవాడు .విరిగిన బెంచీలు కుర్చీలు డ్రాయర్లు బ్లాక్ బోర్డ్ లు అన్నీ తానూ పిల్లలే బాగు చేసి స్కూల్ కు డబ్బు ఖర్చుకాకుండా చూసేవాడు .
అతడు ఎప్పుడు రిటైర్ అయ్యాడో నాకు తెలియదు .కానీ నేను రిటైర్ అయ్యాక మా ‘’ముసలి ముఠా ‘’అంతా సాయ౦ వేళ,తాండవ లక్ష్మి థియేటర్ అవతల ,అతని ఇంటికి దగ్గరగా ,ఒక ముస్లిం టైర్ల మెకానిక్ షాప్ దగ్గర పంచాయితీ బెంచీలపై చేరి ముచ్చ టి౦చు కోనేవాళ్ళ౦. నాతోపాటు విజయ సారధి, సాయి అనే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో రిటైర్ అయిన ఆయన ,రాధాకృష్ణమూర్తి అనేరిటైర్డ్ డ్రిల్ మాస్టర్ ,శ్రీకాకుళం లో శంకర మఠం కట్టించిన సంపూరయ్య అనే రెండు చింతల సంపూర్ణ చంద్ర మౌళి గార్లు సమావేశమయ్యేవాళ్ళం .ఆతర్వాత రామమోహన్ కూడా వచ్చేవాడు .సాయంత్రం 7దాకా ఉండేవాళ్ళం .లు౦గి కట్టి వచ్చేవాడు రామ మోహన్ .అలాగే మరో రిటైర్డ్ క్రాఫ్ట్ మాస్టర్ భద్రాచలం గారు కూడా వచ్చేవాడు .మంచికాలక్షేపం .ఎన్నో రాజకీయాలు మాట్లాడుకొనే వాళ్ళం .
మేము రెండు మూడు సార్లు అమెరికా వెళ్లి రావటం తో విషయాలు తెలిసేవికావు సుమారు ఏడెనిమిదేళ్ళ క్రితం రాం మోహన్ కు హార్ట్ అటాక్ వచ్చి కొద్దిగా పక్ష వాతం వచ్చిందని రాజమండ్రిలో కొడుకు దగ్గర ఉంటున్నాడని తెలిసింది. నయమై వచ్చి మాతో కలిసేవాడు .రాం మోహన్ కు పెరాలిసిస్ అంటే ఉక్కుకు చెదలు పట్టటమే అనిపించింది .గండి గుంట లో ఉన్న అతని బావ మరది కూడా వచ్చి కూర్చునేవాడు .నేను 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అక్కడికి వెళ్ళటం మానేశాను .ఒకసారి శాస్త్రి గారు వచ్చి రాం మోహన్ ని చూద్దామంటే వెళ్లాం భార్య ఇడ్లీలు పెట్టి కాఫీ ఇచ్చింది .అతనూ బాగానే ఉన్నాడు. తరచుగా ఫోన్ పై మాట్లాడుకొనే వాళ్ళం .శాస్త్రిగారు ఎక్కడున్నానెలకో సారి ఫోన్ చేసి మా క్షేమ౦ సమాచారాలే కాక రామమోహన్ వై వెంకటేశ్వరరావు,సౌదామిని దంపతులు ,డ్రిల్ మాస్టర్ సుబ్బారావు ,అన్నే పిచ్చిబాబు మొదలైన వారి యోగ క్షేమాలు అడగటం నేను చెప్పటం జరిగేది .ఇలా కాలం గడిచిపోతోంది .
వారం క్రితం శాస్త్రిగారు ఫోన్ చేసి క్రాఫ్ట్ మాస్టర్ రామమోహన రావు డిసెంబర్ 3 న రాజమండ్రిలో కొడుకు దగ్గర చనిపోయినట్లు చెప్పారు .ఒక మంచి మిత్రుని సమర్ధుడైన టీచర్ ను స్కూల్ క్రమశిక్షణకు అంకితమైన వ్యక్తిని కోల్పోయినందుకు విచారిస్తున్నాను .అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-23-ఉయ్యూరు