’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -6
8-నరకం లో స్వర్గం చూపించిన రెండవ భార్య
13వ ఏటనే ఫకీర్ కు లీలావతి తో పెళ్లి చేశారు .ఆమె అతని పెద్దమ్మతో మిలాఖత్ అయి నరకం చూపించింది .అతని 29వఏడు వరకు అతనితోనే ఉంది .హృదయం లేని మొండి మనిషి ఆమె .ఆయన చిన్ననాటి రోగాలకంటే దాంపత్య జీవితం మరింత కల్లోల పరచింది .అతడు ఒక సంస్కృత చాటువు –‘’ఇంట్లో మమతామయి మాతృమూర్తి లేనివాడు ,గంపగయ్యాళి ఇల్లాలు అయినవాడు –కారడవులకు పారిపోవటం మంచిది –వాడి ప్రాణానికి ఇల్లూ ,అడవి ఒక్కటే ‘’ను గుర్తు చేసుకొని ఊరట చెందేవాడు .ఆయనకు స్వా౦తత నిచ్చింది నాయనమ్మ మాత్రమె.లీలావతికి పెద్ద జబ్బు చేస్తే ఒక ఏడాది వైద్యం చేసినా తగ్గకపోతే ఆఖరి ప్రయత్నంగా ఆమె తలి దండ్రులు తీసుకోనిపోతే ,అక్కడే ఆమె చనిపోయింది అప్పుడు ఈయన పూరీ లో ఉన్నాడు .
వారసులు లేకపోతె పితృ దేవతలు సంతృప్తి చెందరని మిత్రులు ,బంధువులో చెవిలో ఇల్లుకట్టుకొని పోరుపెడితే ద్వితీయానికి ఒప్పుకొని ,12ఏళ్ళ వయసుగల పసిపిల్ల తన వయసులో సగం మాత్రమె ఉన్నకృష్ణ కుమారిని ద్వితీయం చేసుకొన్నాడు .ఈమె ఆ మేధావి జీవితాన్ని ఆనందమయం చేసింది .యమ నరకంగా ఉన్న ఇంటిని స్వర్గ ధామం చేసింది .ఆమె రాక వలన అతని అన్నిరకాల మేళ్ళు జరిగాయి. నీలగిరి దివాన్ అయ్యాడు .ఇది ఆయన జీవితం లో ఊహించని విశిష్టమైన మలుపు .వీరి దా౦పత్య౦ 25ఏళ్ళు వర్ధిల్లింది .మహా పురుషుడైన భర్త కన్నీటి ద్వారా మొత్తం జాతి వాజ్మయాన్ని తన పవిత్ర స్మృతులతో ఆర్ద్రం చేసింది .నాయనమ్మ జీవించి ఉండగానే మనవడు ఫకీర్ మోహన్ సేనాపతి ఆశించని ఔన్నత్యాలు అందుకొన్నాడు .ఆ వృద్ధురాలి అనురాగం త్యాగ ఫలితమే అతని అదృష్టానికి మెట్లు వేసింది .బామ్మకు ఒక కావ్యం అంకితం చేసి కొంత తృప్తి చెందాడు మనవడు .
9-ఘన త్రయం
గత శతాబ్దం అరవైలలో ఒరియా సాహిత్యం లో నూతన ప్రక్రియలు ప్రవేశపెట్టిన ముగ్గుఇలో ఫకీర్ మోహన్ ,రాధా నాథ డే,మధు సూదనరావు లు ఒరియా సాహిత్య ఘన త్రయం అయ్యారు ముగ్గురు మంచి మిత్రులూ అయ్యారు .ఉన్నతోద్యోగాలు సాధించి ప్రభుత్వ పెన్షన్ పొందారు ..ఒరియా సాహిత్యం లొ 1872 కు ప్రత్యెక స్థానం ఉంది ..ఆఏడు రాధా నాథ ,మధు సూదన్ లు బ్రిటిష్ వారి ఆధునిక పాఠశాలలోఒరియా వారికి పాఠ్య గ్రంథంగా ‘’కబిత్వా బాలి ‘’అంటే బాలలకోసం కవితలు అనే గేయ సంకలనం రాసి వెలువరించారు .దీనితో ఆసాహిత్యం లో ఒక నూతన యుగం ఆవిష్కారమయింది .ఫకీర్ కు 30 ఏళ్ళు వచ్చినా అప్పటికే కవితలు రాస్తున్నా అతడికి అవకాశం ఇవ్వలేదు ఆ ఇద్దరూ .
1872నుంచి ఒక దశాబ్దం వరకు ఫకీర్ మోహన్ రెండే రెండు పుస్తకాలు రాశాడు .1-ఈశ్వర చంద్ర విద్యాసాగర్ బెంగాలీ ‘’జీవన చరిత ‘’కు ఒరియా అనువాదం 2- మూడేళ్ళు శ్రమించి రాసిన’’ భారత దేశ చరిత్ర’’ .ఇది చాలా ఏళ్ళు పాఠ్య గ్రంథంగా ఉంది .
రామాయణ భారత ఉపనిషత్ అనువాదం
మరో పదేళ్ళ తర్వాతకానీ సేనాపతి రచయిత కాలేదు .అప్పటిదాకా రాసే తీరిక ఉద్యోగాల వలన కలగలేదు . ప్రాణప్రదమైన భార్య కృష్ణ కుమారి వలన కలిగిన ప్రథమ పుత్రుడు దేనే కనాల్ ఈయన కమొంజిహార్ రాష్ట్రానికి అసిస్టెంట్ మేనేజర్ గా ఉన్నప్పుడే చనిపోయాడు .మొదటి భార్యవలన ఒక కూతురు ఉంది .పుత్రశోకానికి దంపతులు విపరీతంగా తల్లడిల్లి పోయారు .ఆమె దుఖం ఉపశమింప జేయటానికి మోహన్ కవి గా మారాలనుకొన్నాడు .పుత్ర శోకం మానపటానికి రామాయణమే మార్గం అని బలరామ దాసు రాసిన ఒరియా రామాయణం ను ఒక బ్రాహ్మణ పూజారిచేత రోజూ ఆమెకు చదివి వినిపించే ఏర్పాటు చేశాడు .ఆయన సరిగ్గా చదవకుండా మంత్రాలు దొర్లించి నట్లు త్వరత్వరగా చదువుతుంటే అర్ధం కాక ఆమె మరింత క్షోభిస్తే మాన్పించేశాడు .తానె వాల్మీకి రామాయణాన్ని సులభ పద్ధతిలో ఒరియా పద్యాలుగా అనువదించటం ప్రారంభించాడు .ప్రతి రోజు సాయంత్రం ఆరోజు చేసిన అనువాదాపద్యాలను వినిపించేవాడు .ఆమె హాయిగా విని,అర్ధమై ఆనందించేది .అనువాద౦ అద్భుతంగా సాగింది .ఆధునిక హిందూ వాజ్మయం లో మొదటి సారిగా సామాన్యుని భావాలకు ప్రాతి నిధ్యం వహించిన సాహితీవేత్త మోహన్ కు ,చదువు సంధ్యలు లేని నిరాడంబరమైన ఇల్లాలే మొదటి శ్రోత ,విమర్శకురాలు కావటం సమంజసంగా ఉంది .
రామ వన వాస ఘట్టం లో ఆమె కన్నీరు వరదై పారేది .రామాయణం మొదటి భాగం అచ్చు అవగానే దాన్ని చేతిలో పట్టుకొని ఆమె ‘’మనం పోగొట్టుకొన్న కొడుకు కోసం ఇంకా ఎందుకు దుఖించాలి .తమజ్ఞాపకాలు సజీవంగా నిలుపుకోవటానికే కదా అందరూ సంతానం కోరుకొనేది. ఆజ్ఞాపకాలు కొద్దికాలానికే తుడిచి పెట్టుకు పోతాయి . కానీ మన’’ ఈ బిడ్డ రామాయణం ‘’మన పేరు చిరస్థాయిగా నిలుపుతుంది ‘’అని ఏంటో లోకజ్ఞత తో పరవశించి చెప్పింది .ఈ ప్రశంస అతనికి గొప్ప ఉత్ప్రేరకమై ,రామాయణం మొత్తం కొద్దికాలం లోనే అనువదించి ముద్రించాడు .తర్వాత తన భార్య సంతృప్తికోసం మహాభారతాను వాదమూ ప్రారంభింఛి గత శతాబ్దపు చివరి దశాబ్దం లో ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేసి ధన్యుడయ్యాడు .ఆయన రాసిన రామాయణ భారతాలకు ఒరిస్సా అంతా గొప్ప కీర్తి ప్రతిష్టలు ,ఆదరణ కలిగాయి .అంతకు ముందు ఒకటో రెండో అనువాదాలున్నా ,మూలానికి దగ్గరలో ఇంత సులభతరంగా ఉన్న అనువాదాలు లేవు .ఈ రెండు ఇతిహాసానువాదాలతో ఒక దుఖితురాలైన తన భార్యకే కాక మొత్తం జాతికి ఆత్మానందాన్ని చేకూర్చాడు ఫకీర్ మోహన్ సేనాపతి కవి వర్యుడు ..తర్వాత జాతి ఆధ్యాత్మికాభి వృద్ధికోసం ఉపనిషత్ లను అనువాదం చేసే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు.ఈరకమైన ప్రయత్నానికి అతడే ఆద్యుడు .వేదాంతాలలోని క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలు అతని అనువాదం లో సరళ సుందరంగా మారిపోయాయి .రామాయణ భారతాలు ఉపనిషత్తులు ఒకే వ్యక్తి అనువదించటం పరమాశ్చర్యకరమే .అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు సేనాపతి .ఉద్యోగం చేస్తూ శారీరక మానసిక ఒత్తిడులను తట్టుకొంటూ ఇంతటి బృహత్ సాహిత్యాన్ని సృష్టించటం దైవ ప్రేరణమే .తన భాషను అందలం ఎక్కి౦చా లన్న తపనకు ఇవి పరాకాష్టగా నిలిచాయి .ఒరియా భాషను ఇంతగా సుసంపన్నం చేసిన వారెవ్వరూ లేనే లేరు .
సృజనాత్మకత
ఫకీర్ మోహన్ స్వతంత్ర రచన ‘’ఉత్కల భ్రమణం ‘’అంటే –ట్రావెల్స్ ఇన్ ఒరిస్సా .అతని మేథోకల్పనకు అద్దంపట్టిన రచన .అతని అనువాదాలు ప్రచురి౦ప బడినప్పుడే ఇదీ ప్రచురితమైంది .కియో౦ఝార్ లో దివాన్ గా ఉన్నప్పడు అక్కడికి వచ్చిన బ్రిటిష్ అధికారులకు వీడ్కోలు చెప్పి ,ఆనందపూర్ లో తన అధికార నివాసానికి ఏనుగుపై వస్తుంటే అతనికి అకస్మాత్తుగా సమకాలీన ఒరిస్సా వైభవాన్ని పద్య కావ్యంగా రచించాలి అనే ఆలోచన వచ్చింది .ఏనుగు పై అటూ ఇటూ ఊగుతూనే జేబులోని పుస్తకం పెన్సిల్ తీసి రాయటం మొదలుపెట్టాడు .ఆనందపురం చేరే సరికి సగం పూర్తయింది .మూడవ రోజు మొత్తం పూర్తి చేశాడు .ఈ వ్యంగ్యకావ్యం ఒరియా సాహిత్యం లో సాటిలేని మేటి రచనగా మిగిలిపోయింది .ఎవరూ ఇంతటి సాహసం చేయలేదు అతడికే తట్టింది ..దీనితో సమానమైన బెంగాలీ , హిందీ రచన లేనేలేదు .అప్పటికీ, ఇప్పటికి ఉత్కళ భ్రమణం సాటి లేని స్వతంత్ర రచనగా వన్నె వాసి కి ఎక్కింది .రాష్టరమంతా ఆపుస్తకం గొప్ప సంచలనమే కల్గించింది .సమకాలీన వ్యక్తిత్వాల వర్ణాలతో ,సజీవ పలుకుబడులతో ,హాస్య వ్యంగ్యాలు ఒలకబోస్తూ సాగిన రచన .చెడిపోయిన ఇంగ్లీష్ వాడిగా ఉండాలనుకొనే పండాలను ,బ్రాహ్మణులైన ‘’బాబూ ‘’లను ఇందులో నిశితంగా విమర్శించాడు .మాతృభాష ను నిరసి౦చేవారిని ‘’చెత్తకుండీలలో ఎంగిలాకులు నాకి పొట్ట నింపుకొనే కుక్క కు సొంత ఇల్లు కావాలనే ఆరాటం ఎందుకు ఉంటుంది ?”’అని ఘాటుగా విమర్శించాడు .
ఉత్కల భ్రమణం ప్రచురించిన రెండేళ్లకే భార్య కృష్ణకుమారి భర్తను నిస్సహాయుని చేసి ఒంటరిగా వదిలి చనిపోయింది .ఈ వేదన వలన అనువాద వ్యంగ్య రచనలు చేసిన మోహన్ సృజనాత్మక కవి అవటానికి దారి తీసింది .’’కవిత్వం రాయటం నాకొక వరం .నాభార్య వినిసంతోషించేది .ఆమె చనిపోయాక అశాంతి తో ఉన్న నా హృదయం ప్రశాంతత పొందటానికి ,బాధలను అధిగమించటానికి పద్యాలు రాయటం మొదలు పెట్టాను ‘’అన్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-1-23-ఉయ్యూరు