’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -7
అత్యుత్తమ విశ్వ జనీనత
పద్యాలే ఫకీర్ మోహన్ వ్యక్తిత్వాన్నీ నిండుదనం ,ఔన్నత్యాన్నీ ఆవిష్కరించాయి ఉన్నత ఉదాత్త భావాలతో విశ్వకవి అనిపించాడు .దీనికి ఉదాహరణ ‘’స్వర్గ ద్వారం ముందున్న ఆత్మలు ‘’కవిత .ఈలోకం వదిలిన ప్రతి ఆత్మ స్వర్గ౦ లో ప్రవేశించటానికి ముందు ద్వారం వద్ద ,అక్కడున్న చతురుడైన ద్వార పాలకుడిని ఒక ప్రత్యెక మతానికి చెందిన మూఢా చారాలను గుడ్డిగా అనుకరించటం కాదని ,మొత్తం మానవ జాతికి సంబంధించినదని సమ్మతింప జేయాలి .మొదట స్వర్గాపాలకుడు ఒక ముస్లిం ఆత్మను కలుసుకొన్నాడు .అతడు తాను నియమ నిష్టలతో సమయం ప్రకారం నమాజు చేసే వాడినని గొప్పలు చెప్పుకోగా ‘’ఇతర దేవదూతలైన జీసెస్ ,బుద్ధుడు మోజెస్ ల ఆశీస్సులు పొందే ప్రయత్నం చేశావా ?అని అడిగాడు .’’వాళ్ళు కాఫిర్లు అనగా ‘’నీకు స్వర్గం లో ప్రవేశం లేదని తోసేశాడు ద్వారపాలకుడు .ఒక వైష్ణవుడు వచ్చి తన నిరంతర విష్ణు భక్తి ప్రకటించగా ,అతడూ ఇతర మతాల గురించి తెలుసుకోక పోవటం వల్ల నో ఎంట్రన్స్ అన్నాడు .అక్కడికి వచ్చిన వారెవ్వరికి స్వర్గం లోకి ఎంట్రీ దొరకలేదు .అప్పుడు ఆయన ‘’బాహ్య ఆచారాలు పరస్పర ద్వేషాలు ఆత్మకు ముక్తినివ్వవు .తోటి వాడిని తనతో సమానంగా చూడని వాడికి స్వర్గం లో చోటు ఉండదు ‘’అని హితవు చెప్పాడు .
సమకాలీన జీవితం నుంచి ఏదో ఒక సందేశాన్ని కవితద్వారా సమాజానికి అందించేవాడు .సత్యధర్మన్యాయాలను నిర్భయంగా చెప్పే ధీరత్వం ఆయనది .గయ్యాళి కవి పత్ని ,పతి పరిత్యక్త ,జోసేఫిన్ కన్నీటి వరకు ,రైతుల కష్టాలనుంచి బాల వితంతువుల వ్యధ వరకు ఇతి వృత్తాలలో వైవిధ్యం చూపాడు .జపాన్ సాధించిన విజయాలను ప్రశంసించాడు .జపాన్ నుంచి తెచ్చిపెంచిన ‘’హస్న హేన’’పుష్ప సుకుమార సౌరభాలను కవితలో ఎలుగెత్తి చాటాడు .జపాన్ సంస్కృతీ క్రమశిక్షణ తాత్వికత అతడిని ముగ్దుడిని చేశాయి. పండు ముసలి వయసులో ‘’సూర్యుడు ఉదయించే భూమి ‘’జపాన్ కు వెళ్ళాలనుకొన్నాడు .భారత దేశమే పతివ్రతలకు నిలయం అనే అహంకారం తొలగించటానికి రోమన్ సతి ‘’లుక్రేషియా’’పాతి వ్రత్యాన్ని ‘’ వర్ణిస్తూ కావ్యం రాశాడు .క్లియోపాత్రా పై కావ్యం అల్లాడు .తమ అంద చందాలతో ,కడగంటి చూపులతో కట్టిపడేసే క్లియో మూలం గా సర్వ శక్తి సంపన్నులైన టాలమీలు,టార్క్విన్లు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయారన్న సత్యాన్ని వీరి ద్వారా చాటాడు .శ్రీ కృష్ణ ,జీసెస్ ,తుకారాం లపై కావ్యాలు రాశాడు .ఎండిన పలాస వృక్షం ,జంటపావురాలు రాలిపోయే ఎండుటాకు వంటి కవితలు రాశాడు .
స్మృతి కావ్యం
తన భార్య కృష్ణకుమారి జ్ఞాపకాల వర్ణనే ‘’పుష్పమాల ‘’అనే స్మృతికావ్యం .రసార్ద్రులను చేస్తాయి ప్రతిపద్యం ‘’నా జీర్ణ కుటీరానికి రాణి –నా తోడూ నీడ నా కంటి వెలుగు –నీ సకల సద్గుణాలు –నా అనువు అణువులో లీనమయ్యాయి –దివ్యులలో కలిసిన నీ కనులు వర్షించే కన్నీటి ముందు మంచు ముత్యాలు వెలవెల బోతాయి –‘’అని పలవరిస్తాడు .
బౌద్ధ పురాణ గాధలు
సర్వమత సమన్వయ భావాలున్న ఫకీర్ మోహన్ ఒరియాలో బౌద్ధమతానికి చెందిన మొదటి పుస్తకం రాశాడు .అందులో తధాగతుని జీవితం ఉదార విషయాలు వర్ణించాడు .వివరాలతో సుదీర్ఘ పీఠిక కూర్చాడు .వివిధ ఛందస్సులు ప్రయోగించాడు .గయ్యాళి భార్య లో తనను ఇంటిని పట్టించుకోకుండా ఎప్పుడూ సభలు సమావేశాలు అంటూ తిరుగుతూ పిచ్ పిచ్చి కవిత్వాలు రాసి లోకం మీద వదిలేస్తునావని ఒకకవి భార్య చూపే ఆక్రోశం వర్ణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-23-ఉయ్యూరు