ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -8

ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -8

10-మహా సాహిత్య నిర్మాత

  యాభై ఏళ్ళు మీద పడే దాకా ఫకీర్ మోహన్ ఒరియా కల్పనా సాహిత్య నిర్మాత అని ఆయనే అనుకోలేక పోయాడు .బెంగాలీ పత్రికలూ కధలు బాగా ప్రోత్సహించాతంతో అరవై ఏళ్ళ వయసులో మొదటి ఒరియా కథ’’లచ్చ మన్య’’  రాసి  ‘’బోధ దాయిని ‘’అనే తన పత్రికలో ప్రచురించాడు .అది ఇప్పుడు అలభ్యం .1871నుంచి 1896వరకు పాతికేళ్ళు తీరిక లేని ప్రభుత్వ పనుఅలలో ,ఆర్ధిక స్తోమత లేని నిరుద్యోగిగా ,రోగిష్టిగా ఉన్నాడు .బాలాసోర్ లోని సేనాపతి ప్రెస్ మూసేశాడు .తను ప్రారంభించిన పత్రికలూ వేరొకరికి అప్పగించగా అవీ ఆగిపోయాయి .ఆయన బాలాసోర్ వదిలేసిన పాతికేళ్లలో ‘’లచ్చు మన్య’’వంటి కథ రానే లేదు .పద్యాలు చాలా రాశాడు .ఉద్యోగ విరమణ తర్వాత కటక్ లో కొత్తగాతరహాలో కట్టిన ‘’గార్డెన్ –హౌస్ ‘’లో స్థిర పడ్డాడు .రాథానాథ్ ,మధుసూదన్ ఫకీర్ లకు మిత్రుడు సంపాదకుడు  ,విశ్వనాథ కర్ కటక్ లో ‘’ఉత్కల సాహిత్య ‘’మాసపత్రిక పెట్టి నిర్వహించాడు  విశ్వనాథ్ అన్ని వైపులనుంచి కథలను ఆహ్వాని౦ చేవాడు.ఫకీర్ ను కూడా రాయమని కోరేవాడు . ఆ ప్రేరణతో 1918 లో ఫకీర్ ప్రారంభించిన కథా నవలా రచన మరణం దాకా కొనసాగింది .ఇంట్లో అశాంతి ని ఎదుర్కోవటానికి ఇది ఆలంబనం గా నిలిచింది .కొడుకు కోడలుకోసం తానూ ఎంతోఆప్యాయ౦గా  నిర్మించుకొన్న కటక్ లోని ఇంటిని వారి కిచ్చేసి ,మళ్ళీ బాలాసోర్ వెళ్లి పదేళ్ళు ఒంటరిగా గడపాల్సి వచ్చింది .అక్కడా తన అభిరుచులకు తగ్గట్టు ఇల్లు కట్టుకొన్నాడు .అతని రచనలన్నీ ఈ రెండు గృహాలలోనే సాగాయి .ఈరచనలు ‘’ఉత్కల సాహిత్య పత్రిక’’ ప్రోత్సాహం వల్లనే జరిగింది .

  ప్రజారచయిత

ఫకీర్ వచనం రాసే సమయానికి బెంగాలీలో గద్య రచన ఆగిపోయింది .పియరె చంద్ర మిత్ర ,అక్షయ కుమార్ దత్తా ,ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ,భూదేవ్ ముఖర్జీ ,బంకిం చంద్ర మొదలైన వారంతా మరణించారు .వీరెవ్వరి ప్రభావం ఫకీర్ రచనల పైలేదు .పాత తరహాకు స్వస్తి చెప్పి తనదైన ఆలోచన శైలి ధ్యేయంతో తన మౌలికతను నిలబెట్టుకొన్నాడు .రెండేళ్ళు మాత్రమె ప్రాధమిక విద్య నేర్చిన ఫకీర్ ,కలకత్తా విశ్వ విద్యాలయం లో ప్రాచ్య పాశ్చాత్య విద్యలన్నీ శాస్త్రీయంగా అభ్యసించిన బెంగాలీ మేధావులకు పోటీగా నిలబడాల్సి వచ్చింది.సంఘ బలహీనలతను ఎత్తి చూపుతూ ఆదర్శాలను పాటిస్తూ బోధిస్తూ ,స్త్రీజనాభ్యుదయాన్నికోరుతూ పవిత్ర మానవతా వాదిగా అర్ధ శతాబ్దికాలం భారత రాజకీయ ,సాహిత్య రంగాలలో ప్రజలకోసం అంటూ ఆత్మ వంచనతో కాకుండా ,ఒరిస్సా మేధావులకోసం ప్రజలభాషలో ప్రజలకోసమే రాశాడు .అతని పద్యాలు గేయాలు ఒరిస్సా అంతా మారుమూలలలోకూడా ప్రతిధ్వనించాయి .

  గ్రామ్య భాష

సమకాలీన బెంగాలీ శైలిని తలపి౦పజేస్తూ శిష్ట భాషను ఆధునికులకు అనువుగా సంస్కరించాడు .ఇది సాహిత్య సంస్కర్తలం అనుకొనే వారికి దారుణ ఘాతమే అయింది .అతని గ్రామీణ వాస్తవ చిత్రణ బాగా ఆకర్షించింది .చెడిపోయిన గొప్పింటి  బిడ్డ ,గమనిస్తున్న గుడ్ల గూబ వంటి బెంగాలీ  కధలు కొంత స్థాయి తగ్గి మాండలీకం లో వచ్చాయి .కానీ అవీ మరుగున పడిపోయాయి .ఫకీర్ మోహన్ ఒరియాలో సాధించిన దానికి బెంగాలీలో సాటి రచన శ్రీ రామ కృష్ణ  పరమహంస గారి ‘’కథామృతం’’ఒక్కటి మాత్రమె .ఇద్దరివీ ఆత్మల నిరహంకారానికి ప్రతీకలైన కథలే .ఫకీర్ వివిధ శైలీరీతులపై తన ఆధిపత్యం చాటుకొన్నాడు .అవసరాన్ని బట్టి అలంకారాలూ దట్టించాడు .కోట్లాది ప్రజల సామాన్య నుడికార సంపదను సద్వినియోగం చేశాడు .

 జాతీయ గద్యకావ్యం

అసంఖ్యాకంగా వచ్చిన సేనాపతి కథలు, నవలలో  ఒక మహత్తర ప్రణాళిక అద్భుత సమగ్రత  అనేక ఛాయలతో ఉన్న నేపధ్యం ,,సర్వ జనుల స్వరూపం మనకు కనిపిస్తాయి .రెండు శతాబ్దాల ఒరియా జాతీయ జీవనానికి ఇవి ప్రతిబింబాలు.లెనిన్ ,గాంధీ లకు  ముందే సామాన్యుని సాహిత్యరంగం లో ప్రవేశి౦ప జేశాడు ఫకీర్ .ఆయనకు సామాన్య మనిషి వర్గ మతాతీతమైన సంపూర్ణ మానవత్వం తో నిండిన మనిషి .రవీంద్రుని తర్వాత ఆధునిక యుగం లో క్రాంత దృష్టిగల సాహితీ వేత్త ఫకీర్ మోహన్ సేనాపతి .

  యదార్ధ జీవిత దర్పణం

ఫకీర్ సుప్రసిద్ధ కథానిక ‘’తిరిగి ఎలుకవై పో ‘’లో ఒక పట్టణం లోని ఉన్నత శ్రేణి గుమాస్తా ,ఆగ్రామం లోని ఒకమంగలికులానికి చెందినవాడిని సేవకుడిగా పెట్టుకొన్నాడు .అతడు తెలివైన ఆజానుబాహుడు .ఈస్ట్ ఇండియా కంపెని వచ్చిన కొత్తలో ఉప్పుశాఖలో స్థానికంగా ఒక కాపలా దారు కావాల్సి వస్తే ,ఆ మంగలి యజమానిని తనకు ఆఉద్యోగం ఇప్పించమని అడిగాడు .ఇప్పించాడు .యూనిఫాం వేసుకోగానే పల్లె ప్రజలకు అతడొక ప్రభుత్వ ఉద్యోగి అయిపోయి స్థాయి పెరిగింది .హడలగోట్టేజమాదార్ అయ్యాడు.ఇంట్లో   వంటకు పైపనులకు ఒక గొల్లకురాడిని పెట్టుకొన్నాడు .కులపోళ్ళ ఒత్తిడి వల్ల ఈ గొల్ల, యజమాని తిన్న కంచం కడగటం ఆతర్వాత అన్ని పనులు మానేశాడు .జమాదార్ క్షమించ లేకపోయాడు .దొంగతనంగా ఉప్పు తయారు చేస్తున్నాడని నేరం మోపి అరెస్ట్ చేయించి ,విచారణకు మెయిన్ ఆఫీస్ కు పంపాడు .అహంకారం పూర్తిగా తలకెక్కిన మంగలి జమాదార్ గ్రామ పూజారిని అవమానించే ప్రయత్నం చేయగా ,రోషం పట్టలేక ‘’మళ్ళీఎలుకవై పో ‘’ అని శపించటం కంటే ఏమీచెయ్యలేక పోయాడు .గొల్ల కేసు విచారించిన అధికారులు కేసుకోట్టేసి విడుదల చేశారు .కానీమళ్ళీఇలాంటి’’ పెట్టీకేసులు’’పెట్టి ఇబ్బంది పెడతాడేమో నని భయపడి గ్రామస్తులు ఆయనకు నెల ననెలా కొంత డబ్బు ముట్ట జెబుతూ,తమజోలికి రాకుండా  రాజీపడ్డారు .

 ఇలా కొంతకాలం జరిగాక ఉప్పును దొంగ విధానంలో చేస్తూ అమ్ముకొంటు తెగ సంపాదిస్తున్నారు ప్రభుత్వాధికారులు అని ప్రభుత్వం గమనించి ,ఒక కమీషన్ వేస్తె మొదట పట్టుబడింది మంగలి జమాదారే .ఉద్యోగంపోయి జైల్లో ఊచలు లెక్కపెట్టాడు . ఎలాగో జైలునుంచి విడుదలై జమాదార్ నిరుపేద మారి ఏ ఉద్యోగం దొరక్క మళ్ళీ కులవృత్తి కోసం ‘’పొది.’’పట్టుకొని పూజారి ‘’మళ్ళీ ఎలుకవైపో ‘’అని పెట్టిన శాపాన్ని నిజం చేశాడు .గత శతాబ్దపు 70వ దశకం లోనే ఉప్పు తయారు చేయటం ప్రజలహక్కు అనే విషయం రుజువైనట్లు గాంధీ కంటే ముందే ఆలోచించి చెప్పిన క్రాంతదర్శి సేనాపతి .

  లచ్చమ

మొగలుల ఒరిస్సా సుబా గంగానుంచి గోదావరి వరకు వ్యాపి౦చి ఉండేది  .మరాఠా దాడులు ఈ సుభా పడమటి ప్రాంతం నుంచి ఈశాన్యం వరకు వ్యాపించాయి .ఈ భాగమంతా ఆటవికులు దోపిడీదొంగలు అయిన’’ బార్గీలు’’ గ్రామాలను దోచుకోనేవారు .ప్రతిఘతిస్తే ఊళ్లు తగలబెట్టేవారు .కోట్లాది బార్గీరౌతులపైశాచిక కృత్యాలకు ప్రజలు అల్లకల్లోల మయ్యే వారు . 1744లో  బెంగాల్ , ఒరిస్సా బీహార్ లకు నవాబైన ‘’ఆలీ వర్దీ ‘’ సేనానులలో ఒకడు సుప్రసిద్ధ బార్గీనాయకుడైన ‘’భాస్కర పండిత్ ‘’ను మాయోపాయంతో చంపేశాడు .ఇది ప్రజలకు ప్రభుత్వానికి మరిన్ని కష్టాలు రతెచ్చిపెట్టింది .18వ శతాబ్ది ఉత్తరార్ధంలోనితన ప్రజల విషాద కథనాన్ని ఫకీర్ మోహన్ ‘’లచ్చమ’’లో ప్రతిఫలి౦పజేశాడు .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-23-ఉయ్యూరు  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.