11- యదార్ధ జీవిత దర్పణం -2
ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -9
11- యదార్ధ జీవిత దర్పణం -2
ఛామానా –ఆరా గుంఠా
1803లో మరాఠాలను ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు ఒరిస్సాను ఆక్రమించారు .వారితో అనేకమంది బెంగాలీ అధికారులూ వచ్చారు .1804లో ,1817-18 లో బ్రిటిష్ రాజ్యం పై తిరుగు బాటు చేసిన ‘’పైక్ విప్లవ కారులు ‘’ భూస్వాములైన ఖాన్దాయత్ సేనలను వదిలేశారు .స్వాతంత్ర్య పోరాటం మొదలైన తర్వాత బ్రిటిష్ వారు తీసుకొన్న నిర్దాక్షిణ్య చర్యల ఫలితంగా ,శతాబ్దాల తరబడి వారి ఆధీనం లో ఉన్న భూములు సంపత్తు సర్వం పోగొట్టుకొన్నారు .ఒక్క రాత్రిలో వేలాది భూ ఖామందులు సర్వం కోల్పోయి బిచ్చ గాళ్ళయ్యారు .ఒరిస్సా లో అప్పటిదాకా ఉకున్న ‘’కౌరి’’నాణాలను నిషేధించారు .తక్కువ సంఖ్య లో ముద్రించిన కొత్త కరెన్సీ తో పన్నులు కట్టలేక వేలాది సామాన్య రైతులు పిత్రార్జిత పొలాలను అమ్మేసుకోవాల్సి వచ్చింది .దీనికంటే ఘోరం మెలికలతో కూడిన భూమి శిస్తు పధ్ధతి ‘’సన్ సెట్ లా ‘’వలన కలకత్తా బాబులు ఒరిస్సా సంస్థానాలను స్వాధీనం చేసుకోగలిగారు .దీనితో భూస్వామ్యమే లేని ఒక విపరీత వింత పరిస్థితి యేర్పడింది .కొత్త చట్టాలవలన భూ యాజమాన్యం చకచకా మారిపోయాయి .బ్రిటిష్ న్యాయస్థానాలలో అప్పుడప్పుడే పైకొస్తున్న లాయర్లను గుప్పిట్లో పెట్టుకొని అమాయక గ్రామప్రజలను రైతుల్ని దోచుకొన్నారు .అప్పటికే ఒరిస్సావారు యాభై ఏళ్ళుగా మరాఠా బార్గీ ల చేతుల్లో ఆస్తిపాస్తులు కోల్పోయి అష్టకష్టాలు పడ్డారు .ఆతర్వాత వచ్చిన బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో చిక్కుకొన్నారు .ఈ విషాద చరిత్రనే ఫకీర్ మోహన్ రచన ‘’ ఛామానా –ఆరా గుంఠానవల.. నీచు లైన స్త్రీ పురుషులు అవినీతితో ఐశ్వర్య ,అధికారాలను సంపాదించే పైశాచిక ప్రపంచాన్ని కళ్ళకు కట్టించాడు .
మాము (మేనమామ )
గత శతాబ్దపు అరవై వ దశకం లో ఒరిస్సా లో జిల్లా ప్రధాన కార్యాలయాలలోని కొన్ని ఇంగ్లీష్ స్కూళ్ళలో ఆధునిక విద్యా విధానం ఆరంభమైంది .అంతకు మించిన విద్యాభి వృద్ధి జరగలేదు .బ్రిటిష్ అధికారులు కొందరుఒరియన్ ల దుస్థితి గ్రహించటం వలన ఉన్నత పాఠశాల పట్టాలు పొందిన కొందరు ఉత్కలులకు ప్రభుత్వంలో కింది శాఖలలో ఉద్యోగాలు వచ్చాయి .పట్టణాలలో ఉన్న ఈ ఉద్యోగాలకోసం గ్రామనుంచి కుటుంబాలతో పట్టణాలు చేరారు .రెవిన్యు లాంటి ఆఫీసులలో పని చేయటం వలన ,తమ వంశాల గత వైభవాన్ని పునరుద్ధరించటానికి పాటు పడే ప్రయత్నాలు చేశారు .ఈ పరిస్థితులన్నీ ఫకీర్ ‘’మాము లో చిత్రించాడు .
ప్రాయశ్చిత్త
1978లో ఫకీర్ మరణించే నాటికి ఒరిస్సా అనేక రకాలుగా అధునాతనం అయింది .జంటకవులైన రాథా నాథ రాయ్ ,మధుసూదన రావు ల ‘’కవితా బాలి ‘’ప్రచురణతో 1872నుంచి ఒరియా సాహిత్యం లోఆధునిక యుగం ఆరంభమైంది .తమ జాతి గౌరవాన్ని వారు గ్రహించారు .గతవైభవ పునరుద్ధరణకు ఏమి చేయాలోస్పష్ట మైంది .ఒరిస్సాను బ్రిటిష్ వారు ఆక్రమించిన వందేళ్ళకు ఒరియా విద్యావంతులు ‘’ఉత్కల సామిలాని ‘’ ఆధ్వర్యంలో ఒరియా మాట్లాడే ప్రాంతాల సమైక్యతకు ఉద్యమం చేబట్టారు .యం.ఎన్.దాస్ ,పండిత గోప బంధు దాస్ వంటి ఒరియా ప్రముఖులు ,రాష్ట్ర కేంద్ర సభలలో ఒరిస్సా న్యాయబద్ధమైన రాజ్యాంగ హక్కులకోసం ఎలుగెత్తి చాటారు .కటక్ లో ఒరియాసాహిత్యానికి ‘’ఉత్కల సాహిత్య సమాజ ‘’అనే ఎకాడమి స్థాపించ బడింది .పత్రికలన్నీ ఒరిస్సా పూర్వ పు ఔన్నత్యం కోసం విస్తృతంగా ప్రచారం చేసి , వెంట నిలిచాయి .
కటక్ ,కలకత్తాలలో ఒరియా యువతరం అభ్యసిస్తున్న పాశ్చాత్య విద్య ఫలితంగా సాంఘిక విభేదాలు అప్పటికే మొదలయ్యాయి .యూని వర్సిటీలనుంచి బయటికి వచ్చిన విద్యా వంతులలో కులాల పట్టింపులు రూపు మాశాయి .తమ కు కావాల్సిన వధువును వారే ఎంపిక చేసుకొనే స్థాయికి యువకులు వచ్చారు .నాస్తికత, తాగుడు కూడా పెరిగాయి .1915లో సేనాపతి రాసిన ప్రాయశ్చిత్త లో ఇవన్నీ ప్రతిఫలింప జేశాడు .సాంఘిక పురోభి వృద్ధి చూపాడు .గాంధీ ప్రభావం ఏర్పడటానికి ముందు వరకు ఉన్న సామాజిక పురోగతి ఇందులో ప్రదర్శించాడు .75ఏళ్ళ ముసలితనంలో ఫకీర్ మద్రాస్ కాంగ్రెస్ సభలలో పాల్గొని లోకమాన్య తిలక్ ను దర్శించి మాట్లాడాడు .అయినా 1918 కే ప్రసిద్ధుడైన మహాత్ముని గురించి ఫకీర్ రచనలలో ఎక్కడా కనిపించకపోవటం ఆశ్చర్యమే .ఆతరం భారతీయులలాగానే ఫకీర్ కు కూడా ‘’పాక్స్ బ్రిటానికా ‘’పై విశ్వాసం బాగా ఉండటం కారణం కావచ్చు .అయినా కట్టెలు కొట్టుకొంటూ ,నీళ్ళు మోసుకొంటూ బతికే భారతీయులు ,సప్తసముద్రాలు దాటి వచ్చి మన సంపదను అనుభవిస్తూ ఉండటం పై వ్యంగ్య విమర్శలు చేస్తూనే ఉన్నాడు మేధావి మోహన్ .
చామనా ‘’లో ఊరి చెరువును వ్యంగ్యంగా వర్ణిస్తూ ‘’అనేక తెల్లకొంగలు చెరువుగట్టు దగ్గర ఉన్న నీటిలో పట్టి పెళ్ళలను కాళ్ళతో పెకలిస్తూ ఒక చిన్న పురుగుతో పొట్ట నింపుకోవటంకోసం రాత్రీ పగలు కష్టపడేవి .కానీ ఎక్కడి నుంచో ఎగిరివచ్చిన సముద్ర పక్షుల జంట కొన్ని సార్లు మాత్రమె చెరువులో మునిగి పెద్ద పెద్ద చేపల్ని కడుపు నిండా తిని పొట్టబరువుతో ఎగిరిపోతున్నాయి .సాయంత్రాలలో విందు గౌనులతో ఉన్న దొరసానుల్లాగా ,ఇప్పటికీ సముద్ర పక్షులు చెరువు గట్టుపైసూర్య కాంతిలో హాయిగా రెక్క లల్లాడిస్తూ కనిపిస్తాయి .చెట్టు కొమ్మ మీద ఉన్న మీరు రోజంతా కష్టపడినా కొన్ని చిన్నపురుగులతో మాత్రమె కడుపు నింపు కొంటుంటే ,దూర దేశాలనుంచి ఎగిరి వచ్చిన ఇంగ్లీష్ సముద్ర పక్షులు మాత్రం ,వాటి ఖాళీ జేబుల్ని అద్భుతమైన చేపలతో నింపుకొని హాయిగా విలాసంగా ఎగిరి పోతున్నాయి .ఇప్పుడు జరుగుతున్నది మనుగడకోసం పోరాటం .త్వరలో మరిన్ని సముద్ర పక్షులు రావచ్చు .అవి చెరువు చేపలన్నీ మింగేయ వచ్చు .బ్రతకాలనే కోరిక ఉంటె ఆసముద్ర పక్షుల్లాగా ప్రవర్తించండి .సముద్రాలు ఎలాఈదాలో నేర్చుకోండి .లేకపోతె ఎలా బతుకుతారో నాకు అర్ధం కావటం లేదు ‘’.అన్నాడు గొప్ప పరిశీలకుడూ దేశ భక్తుడు అయిన రచయిత ఫకీర్ మోహన్ .
సజీవ స్త్రీ పురుషులు
రెండోక్లాసు మాత్రమె చదివి జీవితం బడిలో పుష్కలంగాజ్ఞాన ప్రపూర్ణుడైన ఫకీర్ మోహన్ సేనాపతి ,ఆనాటి సమాజం లో విద్యా విహీనులైన సామాన్యజనుల వాడుకభాషను ఒరియా సాహిత్యం లోప్రవేశ బెట్టి మార్గదర్శి అయ్యాడు .అంతకు ముందు ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదు .ఆయన రచనలలో స్త్రీ పురుషులు సజీవంగా దర్శనమిస్తారు కృత్రిమత ఏకోశాన కనిపించదు .’’చామానా ఆర గుంఠ ‘’ఆయన కల్పనా సాహిత్యం లో అసంకల్పిత ఔన్నత్యానికి గొప్ప ప్రతీక .కథలోకి వెడితే రామ చంద్ర మంగరాజు ఒరిస్సా మారుమూల గ్రామం లో బిచ్చమెత్తుకొంటూ బటికె వాడు .అక్కడే గొప్ప సంపన్నుడుగా మారాలనుకొని చిన్న వ్యాపారాలు చేస్తూ డబ్బు అప్పులిస్తూ బాగానే సంపాదించి పేరుపొందాడు .అది ముస్లిం జమీన్ లో భాగమైన గ్రామం .జమీందార్ బెంగాల్ లో ఉంటూ ,మిడ్నపూర్ తాలూకా ఒక విలాస మందిరం దుబారా ఖర్చులకోసం కౌలుదార్లను రోజూ పీడించేవాడు .మంగరాజు అవన్నీ గమనిస్తూ ఉన్నాడు. రైతులు యజమానికి చెల్లించాల్సినవి చెల్లించలేని నిస్సహాయ స్థితిలో పడిపోయారు .మంగరాజు జమీ౦దారును మచ్చిక చేసుకొని శిస్తులు వసూలు చేసే ఉద్యోగం సంపాదించి ,జమీన్ అంతా వేలం వేయించి తన స్వాధీనం చేసుకొన్నాడు .
బలిసిన జమీన్దారై ఇంకా ఆస్తికోసం వెర్రి వేషాలు వేశాడు .చతురోపయాలు ప్రదర్శించి అన్నీ కబళించాడు .బిచ్చగాడు ఇవాళ లక్షాధికారి, బ్యాంకర్ కూడా అయ్యాడు .ఆ వూరి దగ్గరే సాని వాడ ఉంది .తమ సమస్యల్ని తామే పరిష్కరించుకొంటారు వారి లీడర్ భాగియా అనే విద్యలేని అమాయక చక్రవర్తి .భార్య సారియా కూడా అలాంటిదే ..సంతానం లేదు .సారియా తన మాత్రుత్వపు మమకారాన్ని తానూ పెంచే ఆవుపై చూపిస్తుంది .ఆ వూళ్ళో భాగియాకు ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్ల సారవంతమైన భూమి ఉంది .మంగరాజు ఆస్తి దాహం ఈ పొలం వరకూ వచ్చింది .ఆని భార్య సాధ్వి .ఆమె పుణ్యమే వాడి అదృష్టం .ఆమె అంటే అందరికి గౌరవం మర్యాద .ఈ పవిత్ర మూర్తిని నిర్లక్ష్యం చేసి మంగరాజు కామదాహంతో చంప అనే వేశ్యకు దాసుడయ్యాడు .భాగియా పొలం పై కన్నుపద్దాడని చంప గ్రహించి , సంతానం లేని సారియా వద్దకు వచ్చి భర్త తో గ్రామ దేవతకు గుడి కట్టించితే సంతానం కలుగుతుందని నమ్మకంగా చెప్పగా నమ్మి౦ది. భాగియా తన పొలాన్ని మంగరాజుకు తాకట్టుపెట్టి డబ్బు తెచ్చాడు .తనఖా పత్రం పై వేలి ముద్ర వేయం తప్ప అందులో ఏమి రాసి ఉందొ అతడికి తెలీదు .భాగియాకు ఇవ్వాల్సిన డబ్బు బదులు కొన్ని రాళ్ళను తోలించాడు మంగ ..గడువు పూర్తికాగా దావా వేసి అతడి ఆరు ఎకరాల 32 సెంట్ల భూమినీ ఇంటినీస్వాదీనం చేసుకొన్నాడు మంగరాజు .కట్టుబట్టలతో మిగిలిన భాగియా బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .తర్వాత చంప కళ్ళు సారియాపెంచుకొనే ఆరవ ప్రాణమైన సీత అనే ఆవుమీద పడ్డాయి .దాన్నికూడా స్వాధీనం చేసుకొని లాక్కు పోతుంటే భరించలేక ,ఏడుస్తూ మంగరాజు ఇంటిదాకా వెళ్లగా మంగరాజు గూండాలతో ఆమెను కొట్టించాడు .ఆ బాధలు తట్టుకోలేక అక్కడే ప్రాణాలు వదిలింది అమాయక సారియా .అప్పుడే పవిత్రురాలైన మంగరాజు భార్య కూడా చనిపోయింది .
సారియా మరణం భర్తను పిచ్చి వాడిని చేయ్యటమే కాక ,కోర్టు కేసులు కూడా మీద పడి,అరెస్ట్ చేసి విచారణ జరిగింది .మంగరాజు అన్ని మేనేజ్ చేసుకొన్నాడు కానీ ఆవును బలాత్కారంగా లాక్కెళ్ళి నందుకు కఠిన జైలు శిక్ష పడింది . మంగరాజు ,భాగియా కటక్ జైలులో ఉన్నారు .ఆజైలులో ఉన్నవాళ్ళంతా మంగరాజు బాధితులే. వారిలో ప్రతీకారం రగిలిపోతోంది .ఒకరోజు రాత్రి అతడిని చంపే ప్రయత్నం చేయగా డాక్టర్ గాయాలకు వైద్యం చేస్తుంటే పిచ్చి భాగియా వాడి ముక్కు కోసేయ్యటానికి ప్రయత్నించగా ,వాడి పరిస్థితి మరీ అధ్వాన్నమై గడువుకు ముందే వదిలేశారు .పాడు బడ్డ తన ఇంటి సావడిలో స్పృహహలేకుండా పడి ఉన్న అతడు ‘’ఆరెకరాలు 32సెంట్లు ‘’అంటూ పలవరిస్తూ ,పవిత్రమైన తనభార్య జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ప్రాణాలు వదిలాడు భాగియా .
మంగరాజు జైల్లో ఉండగా చంప వాడి డబ్బు నగలు హరించి మంగరాజు మంగలి గోవిందుడి ని తోడుతీసుకొని కటక్ లో వేశ్యా గృహం నిర్వహించాలని పారిపోయింది .గోవిందు పెళ్లి అయి ఒక బిడ్డకు తండ్రికూడా .తాతలనాటి వృత్తిమానేసి ఒక దుకాణం పెట్టుకోవాలనుకొంటున్నాడు .దారిలో ఒకపాడు బడిన సత్రంలో బసచేసి ,అభిప్రాయ భేదాలోచ్చి ,బయటి వరండాలో భోజనం చేయటానికి వాడికి అభిమానం అడ్డం వచ్చింది అదిమాత్రం సుష్టుగా భోం చేసి నగదు నగలు మూట తలకింద పెట్టుకొని నిద్ర పోగా ,వాడు ‘’పొది’’లోని పదునైన కత్తి తీసి చంపను చంపేసి దగ్గరలో ఉన్న పడవ రేవు చేరి అర్ధరాత్రి పడవ కట్టను అంటే ఎక్కువ డబ్బు ఆశ చూపి ,పడవ ఎక్కి తెలవారుతుండగా నది మధ్యలో ఉన్న పడవ లో రక్తపు మరకలతో ఉన్న మంగల్ని చూసి పడవవాడు ప్రశ్నిస్తుంటే అవతలి గట్టుపైన ఉన్న పోస్ట్ బంట్రోతు కనిపిస్తే బంధిస్తారని భయపడి ,నదిలోదూకి మునిగిపోయాడు .అన్యాయంగా ఆర్జించింది అంతా ఇలా ఆవిరైపోయి ప్రాణాలు కూడా పోతాయిఅని మంచి నీతిని బోధించే నవల ఇది .గ్రామీణ జీవితాన్ని స్త్రీపురుషుల మనస్తత్వాన్ని అద్భుతంగా ఇందులో చిత్రించాడు ఫకీర్ మోహన్ .
సశేషం
రేపు రిపబ్లిక్ డే శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-23-ఉయ్యూరు