’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
14-అక్షర సేనాపతి ఫకీర్ మోహన్ మహా ప్రస్థానం
ఫకీర్ మోహన్ తన ఆత్మ కథలో చివరి మాటలుగా ‘’నా జాతికి నేను చేసిన కొద్ది సేవకు ,నా రచనలద్వారా చేసిన భాషాభి వృద్ధికి ,నా జీవితం చివరి దశలో నా దేశ ప్రజలు నన్ను ఘనంగానే సత్కరించారు .1916లో బమ్రా రాష్ట్రం నాకు ‘’సరస్వతి ‘’,బిరుదును ఇచ్చి గౌరవించారు .1917 శీతాకాలం లో కటక్ కాంగ్రెస్ సభలకు నన్ను అధ్యక్షుడి గా చేసి గౌరవించారు .ఇది నేను ఆశించని ఘన గౌరవం .ఈ జీవిత రంగం నుంచి నిష్క్రమించ బోయే ముందు ,నా దేశీయులకు ,నా పాఠకులకు ,అందరికీ వినయ పూర్వక వందనాలు అర్పించు కొంటున్నాను ‘’అని అతి వినమ్రంగా రాశాడు .14-6-1918 న ఈ వృద్ధ మేధావి బాలాసోర్ లోని తన ఏకాంత ఉద్యాన నిలయం లో ఈ రంగం నుండి నిష్క్రమించాడు .ఆయన వృద్ధాప్యం శారీరక మానసిక యాతనలతో గడవటం బాధాకరం . ఈ వివరాలనూ ఆయన గ్రంధస్తం చేశాడు .’’1915 చివర్లో ఒరిస్సా నిస్వార్ధ సేవకుడు గోపబందు దాస్ వచ్చి రెండు రోజులు గడిపి వెళ్ళాడు .అప్పుడు అతడు బీహార్ ,ఒరిస్సా ‘’గవర్నర్ కౌన్సిల్ ‘’లో సభ్యుడు .పాట్నా నుంచి తిరుగు ప్రయాణం లో నాదగ్గరకు వచ్చి ,జబ్బు పడి ఉన్న నా మంచం దగ్గర చలనం లేకుండా నిలిచి ,,నా వంక చూస్తూ ,చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కార్చటం నేను చూశాను .తన భావోద్రేకాన్ని నెమ్మదిగా తగ్గించుకొన్నాక, అతడు ‘’రెండు రోజులుగా చూస్తున్నాను .మీరు ఒంటరిగా మహా నీరసంగా నిస్సహాయంగా ,సేవకుల సపర్యలపై ఆధార పడి ఉండటం నన్ను కలచి వేసింది .మిమ్మల్ని చూసుకోవటానికి మీ దగ్గర వారు ఉండటం చాలా మంచిది ‘’అన్నాడు .
ఫకీర్ చివరి రోజులలో శారీరక మానసిక వ్యధ చెందాడు .నరాల వాపులతో భరించరాని బాధతో నెలలతరబడి మంచానికే అతుక్కు పోయాడు . ఒక సారి మంచి నీళ్ళు అనుకోని సల్ఫ్యూరిక్ యాసిడ్ తాగగా చచ్చినంత పనైంది .నోరంతాకాలి దుర్భర వేదన అనుభవించాడు. ఎలాగో బతికి బయటపడ్డాడు కానీ ,ఒక రాచపుండు ఏర్పడి నరకయాతన అనుభవించాడు .ఇన్ని బాధలు పడుతున్నా వీలైనప్పుడు ఉత్సాహం ప్రదర్శించి జీవితేచ్చను వెల్లడించేవాడు .పూరీకి ఉత్తరాన 11మైళ్ళ దూరం లో సాక్షి గోపాల్ వద్ద పండిట్ గోప బంధు నాయకత్వంలో ఒరియా విద్యా వంతుల సంఘం ‘’సిల్వన్ ఎకాడమి ‘’స్థాపించి ,జాతి పునర్నిర్మాణానికి కొద్ది పాటి జీతాలతో పని చేయటానికి సంకల్పించారు .ఈ సంస్థ పదేళ్ళు అద్భుతంగా పనిచేసి ఒరిస్సా సాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
తన మరణానికి ఏడాది ముందు 75ఏళ్ళ వృద్ధ ఫకీర్ ‘’సత్యబాడి’’పాశాలకు వచ్చి ,మూడురోజులు ఉపాధ్యాయులతో విద్యార్ధులతో ఉత్సాహంగా గడిపాడు .సిల్వన్ వాతావరణం అక్కడి యువకుల నిబద్ధత అంకిత భావం ఆయనకు బాగా నచ్చాయి .ఒకసారి ఉపాధ్యాయులతో సరదాగా ‘’నేను మూర్ఖుడనని మీకు తెలుసు .మీకిప్పుడు ఉపాధ్యాయుడిగా ఎబిసిడి లు నేర్పితే ఎలా ఉంటుంది ?అన్నాడు .వెళ్లి పోయేముందు వారితో’’మీరంతా ఇక్కడ అద్భుత స్వాతంత్ర్య వృక్షాన్ని నాటారు .అది త్వరలో పుష్పించి ఫలించటం చూసి నేను ఆన౦దిస్తున్నాను .గోపబందు నిస్వార్ధ దేశ భక్తుడు .జాతీయ కార్యక్రమాలలో అనుభవం బాగా ఉన్నవాడు .అందుకే మిమ్మల్ని జాతి పునర్నిర్మాణ కార్యక్రమం లో ప్రవేశ పెట్టాడు .మన దేశం స్వాతంత్రం పొందటం నేను చూడ లేక పొవచు .కానీ మీరంతా ఈలోకాన్ని వదలక ముందే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తారని నమ్ముతున్నాను ‘’అన్నాడు .
శాంతి కానన్ యోగి
రోగాలు బాధలూ అనుభవిస్తున్నా ,బాలాసోర్ లోని తన తోట అందులోని చెట్లూ చేమ చూస్తూ పుల్లకించి పోయేవాడు స౦యమన యోగి మోహన్ . .ఆయన చివరి రోజుల గురించి శ్రీమతి బెలాఘోష్ ఇలారాసింది –‘’బాలాసోర్ లోని ఒక పెద్దమనిషిని చూడటానికి మా అమ్మతో పాటు పదేళ్ళ నేనూ వెళ్లాను .ఆ ఇల్లు నిరాడంబరంగా ఉంది ..ఇంటి చుట్టూ తోట పరమాద్భుతంగా ఉంది .ఎన్నో రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి నాకు బాగా నచ్చింది .ఎన్ని రకాల పూలో లెక్కేలేదు .ఆ వాతావరణం సౌందర్యంతో మెరిసి పోతున్నట్లుంది .ఇంతలో ఒక అసాధారణ ఆజాను బాహుడైన వ్యక్తి వచ్చి మా ముందు నిలిచాడు .’’మొక్కల మధ్య మానవత్వం మహా వృక్షమై నిలిచిందేమో’’ అని పించింది నాకు ‘’.బాహ్య ప్రకృతితో సమతుల్యంగా ఉంది ఆయన వ్యక్తిత్వం .పొద్దు పొడిచిన భూమాతలా అయన ముఖం వెలిగి పోతోంది .ఆయన మాటలకు మర్యాదలకు మేము పొంగిపోయాం .మమ్మల్ని తోట అంతా తిప్పుతూ ప్రతిమొక్క పేరు దాని విశేషాలు ,ఎక్కడినుంచి ఎలా తెచ్చి పెంచి పోషించిందీ,దాని ప్రత్యేకతలు సుగుణాలు అన్నీ పూస గుచ్చినట్లు వివరించారాయన .తోటంతా తిరిగి చూశాక ఇంట్లోకి వెళ్లి ఒక మూల కూర్చున్నాము .ఆయన ఏదో మాట్లాడుతూ తూనే ఉన్నాడు .నాకు అదంతా గుర్తు లేదు . లేచి వెళ్ళబోతూ ఆయన పాదాల నంటినపుడు ఆయన అన్న మాటలు మాత్రం బాగా జ్ఞాపకమున్నాయి –‘’చిట్టితల్లీ !నీ మాతృదేశాన్నీ ,నీ మాతృ భాషను తెలుసుకోవటానికి ప్రయత్నించు ‘’అన్నారు అమ్మనడిగితే ఆయనే ‘’ఉత్కల వ్యాస ఫకీర్ మోహన్ సేనాపతి అని చెప్పగా ,నా ఆరాధనాభావం మరింత పెరిగింది ‘’అని రాసింది .
సేనాపతి మరణించిన ఈ శాంతి కానన్ ఆతర్వాత శిధిలమైంది .అయినా అది ఒరియన్ లకు పవిత్ర తీర్ధ యాత్రా స్థలమైంది .జాతీయ సమైక్యత కోరేవారంతా దీన్ని ఒకసారి దర్శించి స్పూర్తి పొందాలి .గొంగళి పురుడు రూప విక్రియ చెంది అందమైన సీతాకోక చిలుకగా మారినట్లు ,రెండవ తరగతి మాత్రమె చదివి ఓడరేవులో కూలీ పని చేసి ,స్వంత బంధువులచే అవమానిపబడి మొదటి భార్య చే తృణీకరింప బడి, తను చదివిన స్కూల్ లోనే ఉపాధ్యాయుడుగా సగౌరవంగా ఆహ్వాని౦ప బడి గణిత శాస్త్రాలు స్వయంగా నేర్చి పాఠ్యపుస్తకాలు రాసి తన ఒరియా భాష పరిరక్షణకై కృషి చేసి,రాజాస్థాన దివాన్ గా గౌరవం పొంది , భారత రామాయణాలు ఉపనిషత్తులు ఒరియాభాషలో ఒంటి చేత్తో సరళ సుందరంగా రాసి యాత్రా సాహిత్యం తోపాటు వ్యంగ్యరచనలు దేశ భక్తీ ప్రబోధక రచనలు ,సృజనాత్మక చారిత్రాత్మక నవలలు కథలు రాసి ,మట్టి మనిషి ‘’మహా మాన్య ఉత్కల వ్యాస కవి’’ గా ప్రసిద్ధి చెందాడు వ్రజ అనే ఫకీర్ మోహన్ సేనాపతి ఒరిస్సావారికే కాక యావద్భారత దేశానికీ చిర స్మరణీయుడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-23-ఉయ్యూరు