‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2
ఆరుద్ర రాసిన ‘’వెన్నెల వేసవి ‘’కి తమిళ గోపులుతో బొమ్మలు వేయించారు బాపు .గోపులు స్థాపించిన ‘’యాడ్ వేవ్ ‘’కు బాపు ప్రోద్బలమే కారణం .’’చామ కూర’’ దగ్గర అంటించు కొన్నాడు బాపు’’ అంటారు. అంటే చామకూర సత్యనారాయణ బాపు గారి బాపు ఫ్రెండ్ దగ్గర గీత నేర్చాడని భావం .పోర్ట్రైట్ పెయింటర్ గా చామకూర ప్రసిద్ధుడు .ఆయనతో బొమ్మలు అంటించు కోవటం’’ విశ్వదాత’’ లాంటి వారికి వైభవం గా ఉండేది .రమణ గారి లెక్కప్రకారంచామకూరను బాపు అస్సలు టచ్ చేసి ఉండడు.’’బాగా బొమ్మలేసే వారంతా నా గురువులే ‘’అనేవాడు బాపు పెద్దరికం ఇచ్చి. బాపు ఎజెంసిలో పని చేసే ఉమేష్ రావు ‘’ఎయిర్ ఇండియా మహారాజ ‘’రూప శిల్పి .ఈయనా తనగురువే అంటాడు అతి వినయంగా కాదంటాడు రమణయ్య ..ఉబ్బెయ్యటానికి బాపును ఎక్కడా ఎవరి దగ్గరా నేర్చుకోకపోవటం మీ’’ ఇది ‘’అండీ ‘’అంటే, చిర్రెత్తుకొచ్చి ‘’ఎక్కడా నేర్చుకపోవటం లో ఉన్న ఇబ్బంది నాకు తెల్సు .న చేతకాని తనం నాకు తెల్సు .సాంబ్రాణి పొగతో ,ముత్యాలముగ్గు మద్దెలలతో నన్ను ఊదర పెట్టకండి ప్లీజ్ ‘’అనేవాడు .బాపుకు ఆరాధ్యులైన మొక్కపాటి ,పిలకా నరసింహ శాస్త్రి గార్ల రంగు రేఖల స్థాయీ భేదాలు వారి ప్రత్యేకతలు వివరంగా వివరింఛి ‘’బాపురే ‘’అని పించేవాడు .నిరంతర కళా సాధనలో కళా ప్రపూర్ణు డయ్యాడు బాపు .
శ్రీశ్రీ మహా ప్రస్థానం ‘’ఫాక్స్ మిల్ ఎడిషన్ ‘’ను లండన్ నుంచి శ్రీ గూటాల కృష్ణమూర్తి వెలువరిస్తున్నప్పుడు ఎప్పుడూ మూగనోము తో ఉండేబాపు నోరువిప్పి ‘’ఆర్ధర్ రాఖాం ,రేజినాల్ద్ క్లీవర్ ,గిల్బర్ట్ విల్కిన్సన్ ,ఇ.హెచ్ .షెఫర్డ్ ఇల్లింగ్ వర్త్ ‘’ వంటి గీతోపనిషత్ అధార్టీలు ,పసి బిడ్డలకోసం ఫెయిరీ టేల్స్ నుంచి బ్రహ్మాండం దాకా అద్భుత గీత రచనలు చేసి సిద్దులై ,జగత్ ప్రసిద్దులై ,చిత్ర కళ కు పెద్ద బాల శిక్షలై వేదాలై ,చిరంజీవులై గురువులై విలసిల్లిన వెలసిన దేశం లో అచ్చయే ఇంకో పుస్తకానికి నేను బొమ్మలు గీయటం నా అదృష్టం ‘’అంటూ అదృష్ట దీపుడి లా వినయ విధేయతలు ఒలకబోసి ,ప్రపంచ ప్రసిద్ధ మనకు తెలీని గీతాకారులకు నివాళి ఘటించాడు బాపు .దటీజ్ బాపు అనిపించాడు .ఎదిగిన వాడు ఒదిగే ఉంటాడు అన్నదానికి బాపు ను మించిన నిదర్శనం లేదు .
అరవై దశకం లో రమణ సినీ అరంగేట్రం చేస్తే ,బాపు సరదాగా పబ్లిసిటి చిత్రాతి విచిత్రంగా చేసేవాడు .అందులోని నిఖార్సు సరుకు బైటేసేవాడు .’’బాపు ఫ్రీ స్టైల్ ‘’అక్షరాలూ అన౦తంగా వచ్చేశాయి ‘’గుండ్రం గా రాయటానికి మనం ఎందుకు .పోత అక్షరాలున్నాయి గా .’’అని తన స్టైల్ ను ఎలివేట్ చేసుకొని అక్షర జ్ఞానం కల్పించి ఔరా బాప్ రే బాప్ అవి బీప్ లువినిపించాడు . అత్యాధునిక అక్షర శిల్పి అనిపించాడు .దీన్ని స్వాగతి౦చే సరికి అతని రాతలు, తలరాతలే పుస్తకాలనిండా సైన్ బోర్డ్ లనిండా వెలిగిపోయాయి దివ్య కాంతులతో మనసుకు హత్తుకొనే చేమంతుల్లా .ఈ గిరాకీ ని చక్కగా వాడుకొని తన అక్షరాల్ని పోతపోయించి ‘’మరో పోతన ‘’అయ్యాడు .తర్వాత రకరకాల సాఫ్ట్ వేర్ లు వచ్చేశాయి .బాపు అక్షర విశ్వరూపం అనంతంగా లోకం లో దర్శన మిచ్చి పులకా౦కితుల్ని చేసింది .క్రేజీ బాపు ‘’బాపు బ్రష్ ,బాపు నిబ్’’లకు పేటెంట్ అయ్యాడు .అలా నూతన అక్షరాభ్యాసం చేయించి పుణ్యం కట్టుకొన్నది ఆంధ్ర లోకాన్ని బాపు ‘’అ- క్షరం ‘’. బెజవాడ నుండి వెలువడే ‘’జ్యోతి ‘’బాపు రణలతో అఖండ జ్యోతి అయి చాలాకాలం వెలిగింది .ఆజ్యోతి దర్శనానికి వేలాది మంది ‘’మకర జ్యోతి ‘’కై ఎదురు చూసినట్లు చూసేవారు .పుస్తకప్రియులకు జ్యోతి వరం ,ఆశా జ్యోతి ,ఆనంద అనుభవ జ్యోతి అయి బాపు ను బెజవాడలో కాపురమూ పెట్టించింది .
చూసిన సినిమాను హాలు బైటికొచ్చి రమణతో ‘’నేనైతే ఇలా తీసేవాడిని ఇలా ఫినిషింగ్ ఇచ్చేవాణ్ణి’’ అంటూ ఉంటుంటే ఇంకోడైతే’’పానగల్ పయ్యా’’అని చీదరించుకొనే వాడు కానీ బాపు సంకల్ప సిద్ధి అభిరుచి తెలిసిన మిత్రుడు కనుక ‘’గో ఎహేడ్ ‘’అని పచ్చ జెండా ఊపేశాడు .ఆ జంట చిత్ర కాపురతొలి ఫలితమే ‘’సాక్షి ‘’కావ్యం .బాపులో మొదటిసారిగా దర్శకుడు బయట పడి మహా దర్శక స్థాయి సాధించాడు .రెండున్నర ‘’లకారాల’’తో తీసిన సాక్షి ,హిట్ అయి సూపర్ అనిపించి తాష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై తెలుగుల అభిరుచికి నిలు వెత్తు దర్పణమై నిలిచింది .ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఈ అంట కాపురంలో ఫలించి ఊరించి ఉవ్విళ్ళూరించి , మెప్పించి, నొప్పించి ప్రబోధించి ,ప్రభావితం చేశాయి అన్నీ క్లాసిక్స్ అనిపించాయి .చాలా ‘’సినేమాలు ‘’కావ్యాలనిపించి అనుభూతిని పంచాయి, పెంచాయి .’’ఆయన రాత’’ ,’’ఈయన గీతా ,తీతా ‘’ లతో తెలుగు సినిమాలకు ఆధునిక వ్యాకరణం రాసిన ‘’చెన్నై సూరి ‘’లు అనిపించారు .పన్నిద్దరు అక్కర్లేదు మేమిద్దరం ‘’పన్+ ఇద్దరం ‘’పన్నిద్దరం చాలు అని పించారు వ్యంగ్య విభాగానికి పట్టాభి షేకం చేశారు .దృశ్యకావ్య నిర్మాతలని పించారు .
బాపు అంటే ‘’పైపు ‘’ల బాపు .ఆయనదగ్గర కనీసం వెయ్యి పైపులున్నాయని ఆనోటా ఈ నోటా పైపు వీరులద్వారా పాకింది .ఆయనకు బొమ్మలేయటం సంగీతం వినటం ,పైపు కైపు అనుభవించటం మాత్రమె హాబీ .చిన్నా చితకా అలవాట్లున్నా సకాలం లో వర్జిన్చేసి వర్జిన్ అయ్యాడు .’’వర్జించేది కనుక వర్జీనియా పొగాకు ‘’అని భాష్యం చెప్పి దీన్నీ వర్జించాడు .తాగుడు సిగరెట్ పీల్పుడు సినిమాలలో చూపించటం ఇష్టం ఉండేదికాదు కానీ’’ బుడ్డి మంటుడు’’లో చూపక ఆయనకూ తప్పిందికాదు .బాపు ‘’క్వాలిటీ భోజన’’ ప్రియుడు .సినీ బిజీ లో ఉన్నా , గీతలు గీయటం మానలేదు .బాపు బొమ్మకు షష్టి పూర్తి కూడా జరిగింది.ఫస్ట్ ప్లేస్ మాత్రమె కాదు సెకండ్ ,ధర్డ్ లూ సాధించాడు అందులో . స్నేహ షష్టి పూర్తీ చేశాడు చిట్టెన్ రాజు హైదరాబాద్ లో .సాధనే బాపు గారి మెట్లు .అడ్డదారి తొక్కలేదు .
దాదాపు మూడున్నర దశాబ్దాలు ఏ తెలుగు బుక్కు బాపు లుక్ , గీతా లేకుండా బయట పడలేదు .బుక్ షాప్ బాపు చిత్ర ప్రదర్శన తలపించేది .తెలుగు పత్రికల సీరియల్స్ కూ, ఆయనే గీత గీయాలి .అప్పుడే దానికి గిరాకీ .ఒకప్పుడు రమణ ఒక కథ రాసి బాపుతో బొమ్మ వేయించి విద్వాన్ విశ్వం పని చేస్తున్న పత్రిక లో ప్రచురణార్ధం ఇస్తే, ఒక సారి చూసి ‘’ఇడ్లీ కంటే చట్నీ చాలా బాగుందబ్బాయ్ తప్పకుండా వేస్తాను ‘’అన్నారట అంటే కథకంటే, బాపు బొమ్మ బాగుందని పిండితార్ధం .’’మేం పది పేజీల్లో చెప్పినదాన్ని ఈయన నాలుగ్గీతల్లో చెప్పి ,పైగా సంగతులు కూడా వేస్తాడు ?’’అని బోల్డు ఆశ్చర్యపోయేవారట రచయితలు .
తెలుగింటి’’ బా-మ్మ’’ అంటే మహా ఇష్టం అందరికీ .అంటే బాపు బొమ్మ అని అర్ధం .తెలుగింటి ఆడపడుచు అందాలన్నీ ఒలకబోస్తుంది ఆపిల్ల .అన్నిరకాల హావభావాలకు ఆలవాలం .తెలుగుదనం మూర్తీభవిస్తుంది .ముచ్చటేస్తుంది ఆ’’సీ గాన ప్రసూనాంబ’’ ను ,రాధ ను చూస్తె .దేవుళ్ళు ఆయన కోసం క్యూ కడతారు .ఆయన టచ్ లేక పొతే ఏ దేవుడూ పూజలకు ఇష్టపడడు.ఏ మహాకావ్యం శోభించదు .రాముడు ,కృష్ణుడు ఆయన మనసు మందిరం లో ,కొలువై పిలిస్తే పలుకుతూ తమల్ని ఫలానా రకంగా చిత్రించమని తెగ పోరుపెట్టి బులపాటం తీర్చుకొంటారేమో ? ఆఖరికి దేవేరులు కూడా .శివుడు మరీని .తాండవం చేయాలంటే ఆయనకు బాపు బొమ్మే స్పూర్తి అనేలా చేస్తుంది .సంక్రాంతి ఉగాది నవరాత్రి వగైరా పండగలకు బాపు గ్రీటింగ్ కార్డ్స్ ప్రత్యేకం .తెలుగు సంస్కృతిని ప్రతిబి౦బిస్తాయి అవన్నీ .అందరినీ అలరిస్తాయి సందేశం ఇస్తాయి. మురిపిస్తాయి మెనూ మరపిస్తాయి .ఎన్నెన్నో పత్రికలకు లోగోలు బాపువే .ఈగో రాదా ఇతరులకు అలాంటప్పుడు ?
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-1-23-ఉయ్యూరు