బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )

బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
తన అభిమాన రామాయణాన్ని ఎనిమిది సార్లు కనీసం చిత్రీకరించి బాపు తపస్సు సఫలీకృతం చేసుకొని అభినవ వాల్మీకి అనిపించుకొన్నాడు .1979లో లో శ్రీవారి ఆస్థాన చిత్రకారుడిని చేశాడు కలియుగ వెంకటేశ్వర బాలాజీ .అన్నమయ్య పదాలకు బాపు బొమ్మలు పారాణి అయ్యాయి . శంకర మంచి ‘’మాంఛి’’ కధలు శంకర మాన్యాలు పట్టకుండా బొమ్మలేసి ఆనందపు చిందు లేయించి ,అమరావతికి ఆధునిక చిత్ర ,కథా సౌభాగ్యాన్ని కూర్చాడు .అక్కడి కృష్ణానది అంత పవిత్రతను సంతరించి పెట్టాయి. సత్యంప్రమాణ౦గా ‘’సత్యా’’నికి .బాపు చేతిలో ప్రాణం పోసుకొన్నారు బుడుగు ,గిరీశం, బారిస్టర్ పార్వతీశాలు.వారి చిరయస్సుకు శ్రీకారం చుట్టారు చిత్రం గా చిత్రాలతో .75మంది తెలుగు ప్రముఖులను ‘’తెలుగు వెలుగులు ‘’చేసి చిరస్మరణీయుల్ని చేశాడు . వారి వ్యక్తిత్వం ఆ పోర్త్రేయిట్ లో ప్రతి ఫలించి వ్యక్తిత్వ వికాసమే అయింది . బ్లాక్ అండ్ వైట్ ఇలష్ట్రేషన్స్ లో బాపుకు మించిన మగాడు మొనగాడు లేడనిపించాడు .మినీ కవితలకు బొమ్మలతో ప్రాణ ప్రతిష్ట చేసి ‘’విధాత తలపు బాపు ‘’అయ్యాడు .కొత్తకలాలకు బాపు గీతలు అనితర సాధ్యాలు ,ప్రేరణలు, ప్రేరకాలు ,ఉత్ప్రేరకాలు అయ్యాయి .సీతారాముల తలం’’బ్రాలు’’, వినాయకుడి బొమ్మలతో లక్షలాది శుభలేఖలు అచ్చయ్యాయి. తెలుగునేల నాలుగు వైపులా పెళ్ళిళ్ళ తోరణాలు కట్టించి కళ్యాణ ఘంటికలు మోగించి అక్షరాలా సువర్ణాక్షరాలై వారి దీవెనలను అందించాయి .నూతన వధూవరులకు .అందుకే మల్లాది రామ కృష్ణ శాస్త్రిగారు ‘’బాపు రేఖ పండింది ‘’అని దీవించారు పరమ మనోహరంగా . ఇంత మందికి కల్యాణం చేసిన మహద్భాగ్యం పొందింది బాపు రేఖ .శుభోదయ జాబిలి రేఖ అయింది .పింగాణి కప్పులు ,ప్లేట్లు ,వెండి షీల్డ్ లు స్వర్ణ , తామ్రపతకాలు బాపు బొమ్మలు ఎక్కి నిక్కినిక్కి చూశాయి .పతకాలు షీల్డ్ లకే మహా వైభవాన్ని సంతరించి పెట్టాయి .విజిటింగ్ కార్డ్ ,బుక్ మార్క్ లలో బాపు మార్క్ అందగించింది .లేడీస్ ను పరమ దారుణంగా దోపిడీ చేసి వశ పరచుకొని ముగ్ధలుగా ,ప్రౌఢలు గా ముద్దుగుమ్మల్ని చెక్కాడు .ఇంటింటి వంటింటి పడకటింటి దాంపత్య హాస్యమూ పేలుస్తూ మగాడిని అప్పడాలకర్రతో వాయిస్తుంటే భరించలేంక ఒకాయన ‘’తెగ ఇదైపొతే ‘’మార్చి, సైకిల్ చైన్ రుచి చూపించి మరకలు కూడా అంటించాడు నెత్తిమీద ఉన్న అప్పడాలకర్ర దెబ్బల బుడిపెలతో బాటు .ఇంటి సత్యభామను చేశాడు బాపు కొంటెగా ఈ వ్యంగ్యహాస్య జనక కార్టూన్ల ‘’జనక బాపు ‘’.
ఇంటింటా స్వంత గ్రంథాలయ వాంఛ తీర్చిన ఎమెస్కో నవలలకు,రచనలకు ,కావ్యాలకు బాపు గీసిన నవలామణులు ,రసిక శిఖా మణులు ఎత్తున్నర టైటిల్ ,ఇన్నర్ టైటిల్ చూసి వెంట పడేట్లు చేసి గ్రంథాలయ యజ్ఞానికి గొప్ప అవబృధ స్నానం చేయించాయి .ఫోర్డ్ ఈజేన్ బర్గ్ బాపు రేఖకు ఫిదా అయి స్నేహం చేసి , బాపును దేశమంతా తిప్పి,నచ్చిన ‘’పోట్టిగ్రాపులు ‘’తీసుకు రమ్మని పురమాయిస్తే ,ఆయనతో కూడా ఓసారి వెళ్లి ,ఆయన డ్రైవింగ్ మెచ్చి ఆయన దర్శక ప్రతిభ నచ్చి,తీసిన అరుదైన ఫోటోలు మెచ్చి ‘’యు ఆర్ జీనియస్ ‘’అన్నాడు ఈజేన్ బర్గ్ .ఇలాంటి వారు తనను ఎంతో ప్రోత్సహించారని నవ్వుతూ వినయంగా చెప్పుకొన్నాడు చల్లని వేళ స్మరిస్తూ బాపు. ‘’.సినెమా ,బొమ్మలు ,చదూకోట౦,సంగీతం ,వెంకట్రావ్ అనే రమణ ‘’ బాపు పంచ ప్రాణాలు .బాపు 60ఏళ్ళ వయసుకి ఒక లక్షా యాభై వేల బొమ్మలు గీశాడని ,తరవాతవి కూడా కలిపితే రెండు లక్షలకు తక్కువ ఉండవని ఒక అధికారిక ,అనధికారిక అంచనా .
తన సినిమాలకు కూడా బాపు’’ స్టోరి బోర్డ్ ‘’వేసుకొంటాడు .ఇదేం చాదస్తం అనే వాళ్లకు ‘’నా వీలుకోసమే ఇది. కాస్తో కూస్తో గీతలు గీస్తా కనుక ‘’అన్నాడు .ఆయన ఓపికకూ శ్రద్ధకూ ఎవరైనా నమస్కారం చేయాల్సిందే .ఇన్నేళ్ళు ఇన్ని గీశారు కదా మీకు నచ్చిన చిత్రం ఏది అంటే ముసిముసి నవ్వుల బాపు తన ప్రక్కనే భద్రంగా అపురూపంగా ఉంచుకొన్న బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రి గారి ‘’జానకితో జనాంతికం’’ వాక్ చిత్రం అంటాడు . ‘’ఏందీ సామీ దీని ఇసయమూ’’? అంటే ‘’ఒక భక్తుడు సీతమ్మవారి సన్నిధికి వచ్చి ,ఆమెను పొగుడుతూ రాములవారిపై విమర్శలు చేస్తూ చెప్పుకొనే పితూరీ .అయ్యవారి నిలువెత్తు పాదాలు ,దగ్గరలో భక్తుని సోది వింటున్న అమ్మవారు ,దూరంగా భక్తుడు ఇదీ దృశ్యం .ఇందులో అమ్మవారి ముఖ కవళికలు ,అయ్యవారి భావ ప్రభావాలు కనుల ముందు నిలిపాడు . ఈ జనాంతికం రేడియోలో ఎన్నో సార్లు ప్రసారమైంది అప్పటికీ ఇప్పటికీ దానిపై అందరికీ అదే క్రేజు మోజు ఏమాత్రం తగ్గలా .శాస్త్రి గారి స్వీయ జీవిత చరిత్ర ,తెలుగువారికి కలకండ పాకమే .అక్షర అమృతమే. దీనికీ చిత్ర జనకుడు బాపూయే . సెంట్ వాసన చూసి సెంట్ బాటిల్ కొన్నట్లు ,బాపు ముఖ చిత్రం చొసి పుస్తకాలు కొన్న అభిమానం తెలుగు వారిది .పుస్తకానికి పట్టాభి షేకం చేశారు ఆంద్ర చదువరులు .బాపు బొమ్మ కీర్తి కిరీటమే అయింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ .
ఆత్మ సంతృప్తిగా ‘’బొమ్మ బాగా వేశాను ‘’అని అన్నమాట ఎప్పుడూ రమణ కూడా విని ఉండడు.అంటే అలా ఎప్పుడూ అనలేదు అని అర్ధం .’’లకీగా బొమ్మ బాగా కుదిరింది ‘’అనటం ఆయన నైజం .ఇది ముమ్మారు నిజం .ఇది వృత్తి పట్ల గౌరవం ,రాముడిపట్ల భక్తీ గౌరవం .’’నా తొలి గురువు రాముడు ‘’అంటూ చొక్కా గుండీలు పీకేసి గుండెలు చీల్చుకొని రామభక్త హనుమాన్ లా చెప్పడు. ఆ ఆరాధన అనితర సాధ్యం .సీతమ్మ తల్లి పాదాలకు పారాణి దిద్దే రాముడిని ,బంటులా రంగుల నందిస్తున్న బాపు ను ఎవరు వేయగలరు ?ఒక్క బాపు తప్ప ?రాముడు అంటే మైకం బాపుకు .రామాయణం పేర్లు చెప్పి ఆయన్ను యేమార్చవచ్చు .అలానే ఒకాయన ఏమార్చాడన్నదీ నిజమే అంటారు లౌక్యం తెలిసిన జనులు .
అక్కినేని బాపు బుద్ధిమంతుడు లో ద్విపాత్రాభినయం చేయటమే కాక బాపు –రమణ జంటకు అండా దండ గా మూడో పాత్రా పోషించి త్రిపాత్రాభినయ నటుడు అనిపించుకొన్నాడు .ముత్యాలముగ్గు అరుదైన కేరక్టర్లతో ట్రెండ్ సెట్టర్ అయితే ,సంపూర్ణ రామాయణం సంపూర్ణ పేరు ప్రఖ్యాతులు తెచ్చింది .కమలాకర కామేశ్వర రావు గారు పౌరాణిక బ్రహ్మగా సుప్రసిద్ధుడు బాపుకూడా మరో పౌరాణిక విధాత గా గుర్తింపు పొందాడు .తీస్తే బాపు నే తియ్యాలి పౌరాణికాలు అనే ప్రఖ్యాతి పొంది ప్రేక్షకుల ఆశ అయ్యాడు .సీతాకల్యాణం ఖండాంతర ప్రఖ్యాతి చెంది చికాగో లండన్ ,బెర్లిన్ ,షాన్ రేమో ,డెన్వర్ ఫిలిం ఫెస్టివల్స్ కు వెళ్లి ఇంటింటి రామాయణం విశ్వ రామాయణ స్థాయి పొందింది .లండన్ ఫిలిం ఇన్ష్టి ట్యూట్ పాఠ్య గ్రంధమే అవటం బాపు మార్క్ సినిమాకు దక్కిన విశేష గౌరవం.అంతర్జాతీయ ఫిలిం క్రిటిక్స్ దాన్ని ‘’దృశ్యకావ్యం ‘’అని బాపు తో అంటే ఈ ‘’వినయ విధేయత రామబంటు ‘’మాత్రం ‘’అది ఎక్స్ పోర్ట్ క్వాలిటి లెండి ‘’అంటూ హాయిగా పైపులోంచి పోగవదులుతూ నవ్వాడు బాపు.ఇదే బాపుకు శ్రీరామ రక్ష ట శ్రీరమణ ఉవాచ .
ముఖ్యమంత్రి రామారావు కోరికపై ప్రాథమిక విద్యను వీడియో పాఠాలు గా రూపొందించారు బాపు రమణ జంట .అవి పూర్తిగా పిల్లలకు చేరకపోవటం దురదృష్టం .చేరిన చోట సత్ఫలితాలిచ్చాయి.మనవూరి పాండవులు ను హిందీలో తనమొదటి చిత్రం ‘’హం పాంచ్ ‘’గా తీసి బాంబే లోనూ బాపు టాప్ లేపాడు , సక్సెస్ బాంబులు పేల్చాడు .తొమ్మిది సినిమాలు హిందీలో డైరెక్ట్ చేసి తెలుగోడి సత్తా చూపాడు .ఈయన దర్శకత్వంలో నటించాలని అమితాబ్ లాంటి బాంబే తారలు ఉవ్విళ్ళూరే వారట .
తర్వాత వచ్చిన పెళ్ళిపుస్తకం మిస్టర్ పెళ్ళాం ,రాధా గోపాలం లు రమణ బాపు ల పరిపక్వతకు నిలువు టద్దాలు .ప్రతి సన్నివేశ సౌభాగ్యాలు .నటీ నటులలోని నటనను సంపూర్ణంగా బయట పడేసిన చిత్ర రాజాలు .హాస్యం అనుపానంగా ,సందేశం అంతర్వాహినిగా ,మాధుర్యం పొంగి పోయిన చిత్ర కళా ఖండాలు .శ్రీరామ రాజ్యం లో బాపు ప్రతిభ ప్రతిఫలించలేదని నాకు అనిపి౦చి౦ది.అసలు ఆయన తీసినదేనా అని అనుమానం కూడా .అందుకే నేను దాన్ని చూసి ‘’శ్రీరామ రాజ్యం సర్వంపూజ్యం ‘’అని బ్లాగ్ లో రాశాను బాపు రామణలకు క్షమించమనికోరుతూ .
చాలామంది నటీనటులను వెండి తెరకు పరిచయం చేసి ,ఎందఱో గోప్పవారితో కలిసి పని చేశాడు .ఇషాన్ ఆర్య ఆయన ఆస్థాన కెమెరా మాన్.బాబా ఆజ్మీ చీఫ్ కెమెరా మాన్ .ఎడిటింగ్ ,సౌండ్ రికార్డింగ్ లలోకూడా శ్రద్ధ పెట్టి స్వయంగా చూసుకొనే వాడు. గొప్ప క్వాలిటి కోసం. భోజనం ఎంత క్వాలిటీగా ఉండాలని అనుకొనే వాడో సినిమాకూడా అంతే క్వాలిటి లో ఉండాలని అభిలషించారు ఆద్వయం .సినిమాలు తీయడమేకాడు రోజుకు కనీసం పది సినిమాలు చూసే సామర్ధ్యం ఉండేది .ఇందులో ఆయన టెక్నిక్ ‘’ఫాస్ట్ ఫార్వార్డ్ ‘’లో అరగంటలోనే సినిమా చూడటం .హిందూ స్తానిగాయకుల సంగీతం ఎప్పుడూ బాపు స్టుడియోలో వినిపిస్తూనే ఉంటుంది .బడే గులాం ,మెహదీ హసన్ వంటి మహా విద్వాంసుల గజల్స్ ,పాటలు వేలకొద్దీ సేకరి౦చు కొన్నాడు .అపురూప ఆర్ట్ పుస్తకాలు ,ప్రపంచ సినిమాల వివరాలు తెలియజేసే పుస్తకాలు ,తెలుగు ఇంగ్లీష్ సాహిత్యం బాపు లైబ్రరీ ని కళకళ లాడిస్తాయి .చూస్తె చాలు ధన్యమనిపిస్తాయి .వీటిని వింటూ చదూతూ పనిలో విశ్రా౦తి పొందే పద్మశ్రీ బాపు నిజంగా ‘’విధాత తలపు ‘’తెలుగు వారికి మేలుకొలుపు .
సంగీత ప్రియుడేకాడు సంగీతజ్ఞుడు కూడా బాపు . మౌత్ ఆర్గాన్ ఎక్పర్ట్. ఆ వైదుష్యం ఆర్కేష్ట్రాతో వాయి౦ చేంత కూడా .రసాలూరు రాజేశ్వర రావు అంటే బాపు జంటకు అధిక గౌరవం .ఆయన మాటలన్నా ప్రాణమే .కానీ ఈ జంట సంగీత దర్శకుడు మాత్రం ఇంటి ఎదురుగా ఉండే రాజేశ్వరుడు కాదు మామ మహదేవన్ .ఒక సారి రాజేశ్వరావు గారు బాపును ఎవరికో పరిచయం చేస్తూ ‘’ఈయన గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ .గొప్ప టెస్ట్ .అయితే ఎప్పుడూ మనతో సంగీతం చేయి౦చు కోరు .తమిళియన్స్ చేతనే చేయించు కొంటారు ‘’అన్నారట తనదైన బాణీ లో.దీన్ని బాపు చాలా సార్లు చాలా మందికి నవ్వుతూ చెప్పేవాడట .అందుకే ‘’నౌషధం(నౌషద్) పరమౌషధం అని ఎవరన్నారు ?మీరెల విన్నారు ?మీలోని సప్తస్వరా విద్వ దౌషధం కావాలి మాకు మాష్టారు ‘’అన్నాడు .
నడయాడే దైవం అనిపించుకొన్న ఒక పీఠాది పతి ఒక బృహత్తర మైన 35లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న గాలిగోపురం నిర్మాణ బాధ్యతలను తలకెత్తుకొన్నాడు సంగీత దర్శకుడు ఇలయ రాజా .రాజా అంటే బాపుకు పరమ ఆదరం గౌరవం అభిమానం కూడా .ఆ స్వామి వచ్చి ‘’నువ్వొక అంతస్తు భారం మోస్తున్నావు ‘’అంటే పులకించి ‘’స్వామీ అది నా భాగ్యం ‘’అన్నాడు ఇలై .గాలిగోపురం తయారై కలశ స్థాపన చేసే సమయం లో ,ఇంతఖర్చూ మోసిన ఇలయ రాజా అక్కడికి వెడితే ‘’నువ్వు హరిజనుడివా.ఇప్పుడే తెలిసింది .ఇంతకు ముందు చెప్పలేదే ?’’అని దూరంగా ఆ మహా సంగీత విద్వాంశుని అత్య౦త భక్తితాత్పర్యాలు వితరణ ఉన్న సంగీత రాజాను దూరం పెట్టారట స్వామీజీ .ఇలయ రాజా ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు మనసులోనే దాచుకున్నాడు .బాపుకు తెలిసింది .బాగా లోతుగా గుచ్చుకొంది .అస్వామిపై ఒకాయన పుస్తకం రాసి బాపును ముఖ చిత్రం గీయమని కోరితే బాపు ‘’ఆర్యా క్షమించాలి మీరు అడిగే నడయాడే దేముడు బొమ్మ వేయటానికి నా మనసు ఒప్పుకోటం లేదు .ఆత్మ వంచన చేసి ఒప్పుకోలేను .వేదోపనిషత్తులు వెలసిన దేశం మనది .శంకరాచార్యునికే చందడాలునితో తత్వ బోధ చేయించిన పుణ్య భూమి .అందరికీ అన్నీ చెందాలని గుడి గోపురం ఎక్కి మంత్రాలు ఘోషించిన సంస్కృతీ మనది .అలాంటి గడ్డపై పై ఏ వెలుగులకీ ప్రస్థానం ?ఒక మహా మనిషిని ‘’నువ్వు ఫలానా ట కదా ‘’?అని వెలివేసిన మీ ‘’నడ యాడె దేముణ్ణి’’ ఒక మామూలు మనిషిగా అంగీకరించటానికి సైతం నా మనసు అంగీకరించటం లేదు .నా రాతలు మిమ్మల్ని నొప్పిస్తే ,మీ సంస్కారం నన్ను మన్నించ గలదని ఆశిస్తున్నాను ‘’ఇట్లు –బాపు ‘’అని రాశాడు మహామానవతా వాది బాపు .ఈ విషయం అప్పుడే ప్రముఖ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిందట . ఈ ఉత్తరం ఒక్క బాపు కు మాత్రమె తెలుసు .మరెవ్వరికి తెలీదు ఇదేప్పుడో పాతికేళ్ళ నాటి సంగతి .మరి బయటికి ఎలా వచ్చింది ?ఆ ఉత్తరం లో బాపు కొన్ని సంస్కృత శ్లోకాలు ఉదాహరించాడు .వాటిలో అక్షర దోషాలున్నాయేమో చూడమని మరొకరికి చూపితే ,ఆ మరొకరిద్వారా ఇప్పుడు లీకై ,బయటికి వచ్చిందని ఈ పుస్తకరచయిత శ్రీరమణ రాశారు .వ్యక్తిగతమైన ఈ విషయాన్ని బయట పెట్టినందుకు తనను మన్నించమని మనల్ని కోరాడు శ్రీరమణ వినయంగా .
బాలు యడల బాపు రమణ లకు అత్య౦త ఆదరం ,అభిమానం .బాలు సమకాలికులమైన౦దుకు మాకు గర్వంగా ఉంది అని నిగర్వ౦గా ఈ జంట చెప్పుకొన్నారు. తూర్పు వెళ్ళే రైలుకు బాపు దర్శకత్వం చేస్తూ బాలును సంగీత దర్శకుని చేశారు. ఆరుద్ర పాటలు రాశాడు ‘’చుట్టూ చెంగావి చీర చుట్టావే చిలకమ్మా ‘’పాటకు బాలు బాణీ సంగీతం అమోఘం. ఆపాట సూపర్ డూపర్ హిట్ .బాపు హార్మోనియం ను వెలకట్టి బాలు కొనుక్కున్నాడు. రమణ రాసిన ‘’శ్రీకృష్ణ లీలలు ‘’పుస్తకాన్ని బాలుకు అంకితం చేశారు బాపు బొమ్మలు గీసిన ‘’లీలా జనార్దనం ‘’ను బాలు ఖర్చులు భరించి ముద్రించాడు .కందుకూరి రుద్రకవి అష్టకాలకు బాపు చిత్రాలు అతిశయంగా ఉన్నాయి .చాటున కూడా బాపు బాలుని ‘’చాలా మంచి వారు .మహానుభావులు .ఏది అడిగినా కాదనరు .ఎవరు అడిగినా’’ నో ‘’అనరు .పోన్లెండి అంతటి మొహమాటస్తులు మగాడిగా పుట్టారు .అదే పెద్ద అదృష్టం.’’అని ‘’చెణికే ‘’వాడు బాపు .
రమణ బాపు విషయం చెబుతూ ‘’పని లేక పోయినా ఉన్నా బాపు బొమ్మలు వేస్తాడు వేస్తూ ఆలోచిస్తాడు ,ఆలోచిస్తూ వేస్తాడు .రాధ కృష్ణన్ సలై లో ఒకే ఇంట్లో పైన బాపు పైన రమణ కింద ఉండేవారు .రమణ రాసింది అచ్చయ్యాక ఒక సారి బాపు ‘’వెంకట్రావ్ !ఎప్పుడు మెట్లమీద చప్పుడైనా నువ్వే వస్తున్నావని అట్టా ఆర్ట్ పేపర్ ముందేసుకొని బ్రస్షో, పెన్నో పట్టుకొని బొమ్మలేస్తున్నట్లు పోజు పెట్టలేక చస్తున్నా..అలికిడైతే బొమ్మలు ,కాకపొతే బొమ్మలు ‘’అని సరదాగా ఆక్షేపించేవాడు బాపు .నవ్వే వాడు రమణ .నవ్వడం నవ్వించడం తెలిసిన నవ్యనవ్వు యోగులు వారిద్దరూ .
మొదటి ఎపిసోడ్ లోనే చెప్పినట్లు ఇదంతా శ్రీరమణ రచన .నేను మధ్యమధ్య ‘’కాళిదాసు కవిత్వం కొంత నాపైత్యం కొంత ‘’జోడించాను మీ కోసం .ఇదంతా బాపు పై ఉన్న అభిమానం రమణ పై ఉన్న ఆదరణ మాత్రమె .లోపాలుంటే నావి పొగడ్తలన్నీ బాపురమణ జంటవి శ్రీరమణ అక్షరాలవీ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.