చిద్విలాస శతకం
ధర్మవరం కు చెందిన సురభి నాట్య కళా స్థాపనాచార్య,హరికథా ప్రవీణ శ్రీ రాప్తాడు సుబ్బదాసయోగి ‘’చిద్విలాస శతకం ‘’రాసి నిగమార్ధ చంద్రోదయ గ్రంథ మాల తరఫున,అనంత పురం విశ్వ నాథ్ ప్రెస్ లో 1948లో ముద్రించారు .తనను పుత్రునిలాగా సాకి పెంచిన ,అతిదులపాలిటి కల్ప వృక్షమై రాజ రాజేశ్వరీ భక్తురాలైన అలవేలు మంగకు శతకాన్ని కవి అంకితమిచ్చారు .ఉదయం పూట ,సాయంకాల సమయాలలో అందరూ చేయాల్సిన ప్రార్ధన పద్యాలు ముందు రాశారు కవి .ఇంతకు ముందే కవి అభిజ్ఞాన జయదేవ నాటకం ,పశు యజ్న ఖండన ,మానస గీతావళి ,స్త్రీలకోసం ఆత్మారామ గేయాలు ,స్త్రీలకు పరమేశ్వర శతకం ,విష్ణు నామావళి రాశారు .
పీఠిక లో ‘’ఉత్తమాశ్రయమైన కావ్యం ఉత్తమోత్తమం .భగవంతుని విభూతి చిద్విలాసాలను గురించి అనుభవైక వేద్యంగా కవి శతకం రాశారు .వారి వేదాంత విజ్ఞానమంతా కుప్పబోశారు .సమస్త అనుభవ సంమేలంనం గా శతకం ఉంది .సమస్త సృష్టిజాలం లో ఈశ్వరుని దర్శించి ఆఆనుభావాన్ని మనకు కవితా ప్రసాదంగా అందించారు కవి .స్వతః గాన విశారదుడైన కవి , శాంతరసం అద్వితీయంగా పోషించారు .అద్భుత ,కరుణలు అనుపానంగా ఉన్నాయి .చిన్న వాక్యం లో దొడ్డ భావాన్ని కల్పించారు .స్వభావోక్తి అలంకారం శతకానికి దివ్య శోభ కూర్చింది .సీసాలు శ్రీనాథుని సీసాలను తలపిస్తాయి ‘’అని రాశారు ధర్మవరం బోర్డ్ ఉన్నత పాఠశాల సంస్కృత పండితులు శిరోమణి ,విద్వాన్ కలచ వీడు శ్రీనివాసా చార్యులు PGL.
పండితాభిప్రాయాలు తెలిపినవారు -1-వేటపాలెం కు చెందిన శ్రీ ములుకుట్ల పున్నయ శాస్త్రి భాగవతార్ –‘’చెరుకు పానకం లో అద్దిన కలంతో పద్యాలు రాసినట్లు వినూత్న కళా విలాసంగా ఉన్నాయి .మోక్షగామికి ఎంతో ఉపయోగపడుతుంది .సుజ్ఞాన సాధనంగా ,ముక్తి కోరేవారికి అమందాన౦ దాన్ని ఇచ్చేదిగా ,భక్తియోగాత్మకం గా ఉంది ‘’అని రాశారు .2-కడప జిల్లా రాచ వీడు కు చెందిన శ్రీ బిరుదరాట్ రంగరాయకవి –‘’శ్రీ మృదుల కవిత్వ రసామృత లహరీ జనీ ప్రచంగ బ్రాహ్మి ధా-మా మానవ సార్ధక నామా అని కవిని ప్రశంసించి ,ప్రకృతి సౌందర్యం ,సత్య ధర్మ ఐక్యత దీనజనావన పోషణ ,జంతు సంతానైక్యం అన్నీ ఉన్న ‘’నిన్ను ఎన్నుట ఎట్లు ?’’శతక చిద్విలాసాన్ని చవులూరగా చదివాను .దీని సాటి శతకం లేదు ‘’ఎందాక ఇన సుధాకర ,ప్రపంచం ఉంటాయో అందాకా ఈ శతకం చిరంజీవిగా ఉంటుంది’’ .3-అనంతపురానికి చెందిన మహామహోపాధ్యాయ ,కళాప్రపూర్ణ డాక్టర్ చిలుకూరి నారాయణ రావు గారు –‘’కవి నాకు సుపరిచితులు పరోపకార పారీణులు అనటానికి వారి శంకర మఠమే ప్రత్యక్ష నిదర్శనం .ఇప్పటికే ఎన్నో కావ్య నాటకాలు రాసిన అనుభవజ్ఞులు .శతకం ఉన్నత వేదాంత శోభా ప్రకాశం .ధారాళమైన పద్య శైలి ‘’ 4-బెజవాడ కు చెందిన అవధాని శ్రీ దోమా వెంకట స్వామి గుప్తా –‘’మనోహరంగా భక్తీ నీతి వైరాగ్యాలను శతకం లో పొందుపరచారు .ధర్మవరం లోని వీరిఆశ్రమం దీన జనులపాలిటి కల్ప వృక్షం’’అన్నారు 5-పెద్ద బల్లాపురం కు చెందిన సిద్ధాంత విశారద,సూపరిం టే౦డెంట్ శ్రీ యం.ఆర్యమూర్తి –‘’భారత పతివ్రతామతల్లులమహాత్మ్యం భ్రాతృ వాత్సల్యం ,శమదమాదుల విశేషాలు మీ శతకం లో పొందుపరచి ఆబాల వృద్ధులకు మహోపకారం చేశారు .శతకం సరళ సుందరం ‘’అన్నారు .
మున్నుడి లో దాసయోగి కవి –‘’1925లో సుప్రకాశ శతకం రాసి ప్రచురిస్తే వెంటనే అమ్ముడుపోయాయి .అందులోని కొన్ని పద్యాలు కలిపి చిద్విలాస శతకం రాశాను .హరికథా విశారదుడు నా రెండవ అన్నగారు ,శ్రీ రాజరాజేశ్వరీ ప్రసాద లబ్ధ నా సోదరి ,నా ఇద్దరు భార్యలు వెంటవెంటనే మృత్యు వాత బడగా ,నిస్పృహతో వైరాగ్యం పొంది ,హఠ యోగాశ్రమం స్థాపించి ,1926లో తీర్ధ యాత్రలు చేస్తూ ,అక్కడి ఆశ్రమాలు సందర్శిస్తూ నేపాల్ కాశ్మీర్ లలోని ఆశ్రమ విశేషాలు గ్రహిస్తూ ,ప్రకృతి సౌందర్యానికి పులకితుడనై రాసిన పద్యాలు ఇందులో చేర్చాను .హిమవత్పర్వత ప్రాంత శోభను ఒక్క సారి అయినా చూసి అనుభవి౦చకపోతే జీవితం వ్యర్ధం అని తెలియ జేస్తున్నాను .తర్వాత వానప్రస్థాశ్రమం వదిలేసి సన్యాసాశ్రమం స్వీకరించి మళ్ళీ ఆయా ప్రదేశాలను సందర్శించాలను కొన్నాను .ఈ శతకానికి పీఠిక రాసినవారికి పండితాభిప్రాయాలు సెల విచ్చిన వారందరికీ కృతజ్ఞతలు ‘’అన్నారు వినయంగా .’’చిత్సుఖానంద సర్వేశ చిద్విలాస ‘’అనేది శతకం మకుటం .సీస ,గీత పద్య శతకం .ఎందఱో పండితకవులు విశ్లేషకులు కవి గారి గురించి శతకాన్ని గురించి చెప్పారు కనుక నాపని తేలికైంది .
మొదటి సీస పద్యం –‘’శ్రీ కరుణా రస సింధు వాత్సల్యైకపూర్ణు౦డ వైన నీ పూజ్య యశము –అణువణువాదిగా ,నా బ్రహ్మ పర్యంతమావరించిన నీదు నమితమహిమ –నిఖిల జగజ్జాల నిర్మాణ మున గడు ప్రకటిత౦ బైన నీ ప్రాభవంబు –నిఖిల లోకుల నిర్నిద్ర శక్తిని –గాను సన్న నడుపు నీ కౌశలంబు
తే.గీ .-గాంచి యుప్పొంగి ,నీ తత్వ మెంచి పొగడి –భక్తి తొలుకాడ మృదుల భావములు పొదల –శతక మర్పింతు-గ్రహియింపు హిత మనీష –చిత్సుఖానంద సర్వేశ చిద్విలాస ‘’అని శతకాన్ని అంకితం పుచ్చుకోమని సర్వేశుని కోరారుకవి .తర్వాత ‘’శ్రీదమై ,ఖేదాపనోదమై ,కలిత వినోదమై ,సంతతామోదమై ,భావ్యమై ,సుజ్ఞాన సేవ్యమై ,నిగమ వాస్తవ్యమై ,సజ్జన స్తవ్యమై అందమై సచ్చిదానంద మై రుచిమూలమై కళ్యాణ బృందమై ,లలితమై మాధురీ కలితమై ,ప్రాక్పుణ్య మిళితమై ,పీయూష తులితమై ,రుచిరమై ,సాధుజన సభా ప్రచురమై వెలిసేఈ శతకం లో అమృత వృష్టి కురిపించు’’అని అద్భుతావహమైన పద్యం రాశారు .
తర్వాత సంస్కృత ఆంధ్రాలు బోధించిన నల్లప గురువును ,లక్షణ గ్రంధాలు నేర్పించిన సుబ్బా గురు ని ,ఆయుర్వేదం నేర్పిన గొట్లూరు సుబ్బయార్యుని ,అద్వైతం బోధించిన సింహగురుని స్తుతించారు .ఆతర్వాత ఆసేతు హిమాలయ వర్ణన ,భగవత్ సృష్టి విచిత్రం ,మనిషి జన్మ సార్ధకం అన్నారు .భూమి ఇసుక మట్టి ,కొండ మలయమారుతం అన్నీ మందులే .నువ్వు భవ రోగ వైద్యుడివి .గడ్డిపోచను కూడా సృష్టి చేయలేని నిస్సహాయత మాది .పాండవుల కష్టాలు తీర్చి ,సేతువుకట్టి ,ఇంద్రుడు వృత్రాసురుని చంపటం అన్నీ నీ కరుణతోనే .అమల సుజ్ఞాని ఐన నిన్ను చూసి నీరరాశి నిశ్చలానంద సంపూర్ణం గా ఉంటుంది .
‘’తేనే సోనల జిల్కు తియ్యని కావ్యంబు వి రచింప తిక్కన ప్రగడ గాను –పూలచెండ్లెగ జల్లు లీల పద్యంబుల విరచింప పోతన రాజు గాను –ముద్దు పల్కులుగ నుల్మూత లలెత్తిన రీతి –పన్నంగ ముక్కు తిమ్మన్న గాను –స్వాదు ద్రాక్షారసా స్వాదనమైనట్లు నుడువంగ పెద్దనార్యుడను గాను –అమృత రస గుళికలవలె నలర జెప్ప – ఆంధ్ర వాల్మీకిసుబ్బరాయుండ గాను –శక్తి హీనుడ గైకొమ్ము –శన్త రూప –చిత్సుఖానంద సర్వేశ చిద్విలాస ‘’అంటూ మహా కవుల కవిత్వ సరళికి హారతులిస్తూఅలా రాయలేనని ,ఆశక్తుడనని చేతు లేత్తేసి శతకం స్వీకరించమని లౌక్యంగా చెప్పటమే కాదు తన శతకం లో వారి వారి బాణీలన్నీ ఉన్నాయని చెప్పకనే చెప్పారు కవి గడుసుగా .చివరిపద్యంగా –‘’నిగమాలే నిన్ను పొగడ లేవు ,ఇక నేను ఎలా పొగడనయ్యా సామీ .జల్లుమాటలు కొన్ని కూర్చి చేసిన శతకం .ప్రశస్తారూపంగా పద్య పుష్పాన్జలిగా భక్తితో అర్పిస్తున్నాను .’’దయ యుంచి భక్త బృందములోన కడవటి వానిగా నన్ను చూసి, నాకు చేత నైనంత రీతిగా రాసిన ఈ శతకాన్ని అంకితం పొంది నన్ను ధన్యుడను చేయి ‘’అని విన్నపాలు విన్నవించారు కవి .
ఈకవి కావ్యం మన వారికెవరికీ అందినట్లు లేదు ఎవరూ ఉదాహరించిన దాఖలాలు లేవు . భక్తి,జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మిక శతకాలలో శిరో భూషణ౦గా ఉంది .నా పంట పండి ఈశతకాన్ని కవిని పరిచయం చేసే మహద్భాగ్యం కలిగింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-23-ఉయ్యూరు