అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
‘’నా అక్షరాలు శ్రమజీవుల చెమట బిందువులు ‘’,’’నా అక్షరాలు శ్రమజీవుల పాదరక్షలు ‘’ అని చెప్పుకొన్న కవి అక్షరం ప్రభాకర్ కొత్తగా ‘’అక్షర స్వరం ‘’కూర్చాడు . ఆస్వరం లో సప్త స్వరాలేకాదు అనంత భావాలకు ఊపిరిపోశాడు .ముందుగా ఘంటసాల మాస్టారు గారిపై ‘’పాటల పాఠశాల ఘంటసాల ‘’శీర్షికలో ఆయనను ‘’ఆదికవి వాల్మీకి అనంత శోకానికి –అచ్చ తెలుగు స్వరార్చన,నువ్వే ‘’అంటూ ‘’అనాది అక్షర యజ్ఞానికి –స్వచ్ఛమైన స్వరాన్ని –ఆయువుగా పోసిన –గాన నేత్రం నీదే నయ్యా ,అక్షర వాచస్పతి –వేద వ్యాస మహర్ష శోకానికి –గాన గాంధర్వ స్వరామృతం నీదేనయ్యా ,వనమాలి గీతోపదేశానికి –స్వేచ్ఛారాధన స్వర సంగీత సామ్రాట్ నీవే నయ్యా –మోక్షానికి రక్షాబంధనం కట్టిందీ,నీ మేని వేణునాదాలే –మేళకర్త రాగాలనీ ,అన్నమయ్య ఆర్తి, క్షేత్రయ్య కీర్తి నీదే నని ,త్యాగయ్య భక్తి దాహం ,రామదాసుస్పూర్తినీ పలికి౦చావని ,మానవ వికాస మార్గదర్శివి ,కులాస ,విలాస కైతలకు ఉయ్యాలలూపి ,ప్రణయ పంటల మధుశాలవైన నీకు ‘’ఈ అక్షర స్వరం ‘’అ౦కితమిస్తున్నానని వినమ్రంగా అక్షరాంజలి సమర్పించాడు.
మొదటి కవిత శీర్షిక ‘’ఓ!మనసా ‘’లో ‘’అజ్ఞానం పురుగు అలుముకొంటే –అహం పీఠం ఎక్కుతుంది .చిత్రసీమే శయ్యననెక్కే –శాస్త్రమేమో అంపశయ్య నెక్కే ‘’అని చింతించాడు .నిజం తెలిసి మాట్లాడకుండా ఉండద్దని ,ఐకమత్యమే అసలు కరువై ,నిత్యసత్యమేపలుకు బరువై పోయిందని వ్యధ చెందాడు .ఆదిలోనే వేసే తప్పటడుగుల ‘’తాట’’ తీసేయ్యమన్నాడు .అవినీతి నీడలో మేడలు కట్టద్దు ,అమ్మకడుపు గురించి ఆలోచించని పిల్లలు జీవ చ్ఛవాలు .క్రమశిక్షణ రక్షణ ఎక్కడున్నా చేతులెత్తి నమస్కరించు ‘’అంటూ మనసుకు ప్రబోధ స్వరాలు వినిపించాడు .
జీవితం ప్రమాదం అంచున జీతం కోసం జాగారం చేస్తోందని కొత్తగా చెప్పాడు .మనసులోని లోపాలు తొలగిస్తేనే దీపావళి అంటాడు .పతనం ప్రారంభమైనప్పుడే ‘’పథక రచన ఉండాలి .సాగుబడి దిగుబడి రాబడి పుట్టుబడి పెట్టు బడి ,కాడి, మేడి అన్నీ చంకనాకిపోయి, బతుకు జట్కాబండి అయింది.’’సంశయమే అ౦కు శమై ,అజ్ఞానమే ఆయుధమై –మిడిసిపడకు’’అని ప్రబోధిస్తాడు ప్రభాకర్ .కష్టించే ప్రతివాడికి ఫలితం ఉంటుంది ‘’అని అక్షర సత్యం చెప్పాడు ప్రభాకరన్న .అక్షరాలను మ్యూజియం లోపెట్టి ప్రత్యక్ష ప్రదర్శనకు రమ్మని వేడుతున్నాం . అక్షరాలకు చెదలు పట్టిస్తున్నాం అజ్ఞానంతో అంటాడు అక్షర సాధకుడు ,రక్షకుడు ప్రభాకర్ .
ప్లాస్టిక్ తెల్లదయ్యం నివురు గప్పిన నిప్పులా సర్వం దహిస్తోంది .అక్షర యోధులకు లాల్ సలాం చేస్తూ ,సర్కారు బడులు బాగుపడాలని చేసే వారి పాదయాత్రలు ,విద్యా పరిశ్రమ చేస్తున్న అక్షర యోధులైన ఖమ్మం కన్న బిడ్డలకు లాల్ సలాం చేస్తూ అక్షరాంజలి ఘటించాడు.
తన తండ్రి జబ్బుతో ఉన్న తన’’ తల్లి మంచం చుట్టూ –కంటి చూపును కంచె గావేసి పహరా కాశాడని ‘’కన్నీటి అక్షర తర్పణమిచ్చాడు ,నాన్న నడిచిన నేల విడిచిన జ్ఞాపకాలు మధురాతిమధురం అని పొంగిపోయి ఆనందాక్షర బాష్పాలు రాల్చాడు .మొక్కల విరించి వెంకటయ్యకు అక్షరమొక్కులు తీర్చాడు .పసిపాప లేత పలుకులు –ఆనందపు మొలకలు అంటాడు .గరీబోల్ల తిండి గి౦జల గాసం పై -మెత్తని బెత్తంతో మొత్తింది జీ.ఎస్. టి .అన్నాడు చీదరిస్తూ .’’ఉత్తరాలు –రేపటికి పునాది రాళ్ళు –భావి తరాలకు ఆనవాళ్ళు ‘’అని ఉత్తరాలు రాయటం తగ్గి అక్షర సేవ కనుమరుగై పోతుందని బాధపడ్డాడు అక్షర ప్రేమికుడు కవి .కొన్నిమాటలు పెనిసిలిన్ కన్నా పవర్ ఫుల్ గా పని చేస్తే ,కొన్ని ఆటం బాంబుల్లా పేలి ఛిద్రం చేస్తాయి .ప్రభాకర్ కు ఇవాళ మాట’’ మోడు బారిన వృక్షం లా ,బీడుబారిన ఊసర క్షేత్రంగా ,క్షతగాత్రుల రోదనగా ,సగం ఫిలమెంట్ రాలిన కరెంట్ బల్బ్ లా ,అదును ,పదును తగ్గి ఆత్మ న్యూనతలో ‘’కనిపించింది.కానీ ఆ మాట ‘’ఆది అనాదులకు ఆధునికతకు వారధి సారధి అవుతుందని ఆశతో అక్షర పుష్పమాల అల్లి అలంకరించాడు .
ఈ కవితాక్షరాలలో ప్రభాకర్ చిలికించిన ప్రతి అక్షరం సార్ధకమైంది .సాక్షరస్వరాలు ఊది, ఆనందపు హరివిల్లు పూయించాడు .అతడు నిత్యాక్షర సేవకుడు అక్షర కృషీవలుడు అక్షరజ్ఞాని ,అక్షర హృదయవేది ,అక్షర శిల్పి .ఎందుకో నామీద గురు భావం కలిగి ఈ స్వరాలకు ముందుమాట వేణువు నూదమని కోరాడు . రాగస్వరాలు తెలియకపోయినా అతనికోరిక తీర్చాను .వేణువు మోహన వంశీ అయిందో లేదో నాకు తెలీదు .మీరూ చదివి ఆనందించండి .
గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-23-ఉయ్యూరు