సుప్రకాశ శతకం
అనంతపురం పినాకిని ప్రెస్ లో 1925లో బళ్ళారి హైకోర్ట్ వకీల్ శ్రీ ఎస్.ఆంజనేయులు గారి ద్రవ్య సాయంతో శ్రీ రాప్తాటి సుబ్బదాసు రచించిన ‘’సుప్రకాశ శతకం ముద్రితం వెల-పావలా .విజ్ఞప్తిలో కవి తాను 12,13ఏళ్ళ వయసులోనే నాటక సమాజాలకు నాటకాలు రాసి అందించానని ,వాటిని ప్రదర్శించిన సమాజాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పటం చేత ,తన ఇరవై వ ఏట కడప మండలం లో శ్రీ సురభి శ్రీ శారదా మనోవినోదినీ నాటక సమాజాన్ని శ్రీ సురభి చెన్నా రెడ్డి గారి ప్రోత్సాహంతో స్థాపించి ,అభినవ చిత్రాంగి ,విలాసం ,సత్య హరిశ్చంద్ర ,పా౦డువాజ్ఞాత వాసం ,శాకుంతలం ,స్త్రీ సాహసం ఏకాదశీ మహాత్మ్యం ,ధ్రువ చరిత్ర ,జయ దేవ చరిత్ర నాటకాలు ధరించి ముఖ్య పాత్రలు ధరించి ,ఆసమాజానికి అధ్యక్షుడు గా ఉంటూ ,వాటిని ముద్రిస్తే తమ రాబడి తగ్గి పోతుందని పై సమాజం వారు వేడుకోగా ముద్రించలేదని చెప్పారు .క్రమంగా నాటకాభి రుచి తగ్గి ఇహ పర సాధకమైన హరికథనేర్చి కథాగానాలు చేస్తూ కవిత్వాన్ని కొంతకాలం ప్రక్కన పెట్టి ,రెండవ భార్య రోగం తో బాధ పడుతూ ఒక శతకం రాయమని కోరితే , ‘’పరమేశ్వర ,శతకం’’ పూర్తి చేశానని ,అప్పటి నుంచి కవిత్వం పై పట్టుపెరిగి ‘’సుప్రకాశశతకం ‘’రాశానని ,వెంట వెంటనేతన కుటుంబం లో మరణాలు సంభ వించటం కొత్త రోగాలు పెరగటం వలన ,ప్రకృతి చికిత్స అమూల్యం అని గ్రహించి ‘’హఠ యోగాశ్రమం ‘’స్థాపించి ప్రకృతి చికిత్సా విధానం ప్రారంభించా ననీ , శతకొంతకాలం వ్యాపారమూ చేసినప్పుడు తనపై ఒకాయన బళ్ళారి కోర్టులో వ్యాజ్యం వేయగా తాను హాజరై తనతో ఆ శతకం తీసుకు వెళ్ళాననీ ,అక్కడ తనకు ఆప్తుడు ఆస్తిక సేవా సక్తుడు శ్రీ శృంగిమల ఆంజనేయులు అనే ప్లీడర్ గారింట బస చేశాననీ ,,ప్రసంగ వశాత్తు పై శతక ప్రస్తావన రాగా ఆయన ధర్మ పత్ని శ్రీమతి రంగనాయకమ్మ గారు కొన్ని పద్యాలు చదివి ,సంతోషించి శతకముద్రణకు తామే ధన సాయం చేస్తామని చెప్పి ,ముద్రించటమేకాక తనపై వచ్చిన వ్యాజ్యాన్ని కొట్టి పారేసేట్లు లాయర్ గారు చేశారని కృతజ్ఞత తెలుపుకొన్నారు .కళ్యాణ దుర్గం బోర్డ్ మాధ్యమిక పాఠశాల ఆంద్ర పండితుడు బ్రహ్మశ్రీ నాగసముద్రం టి.రంగా చార్యులుగారు ,,తన స్నేహితుడు ,రైల్వే కోడూరు క్రైస్తవ పాఠశాల ఆంధ్ర పండితుడు బ్రహ్మశ్రీ కృష్ణ శర్మ ,శతకంలోని తప్పొప్పులు సవరించగ ,మతాలకు అతీతంగా ఉండటానికి ‘’సుప్రకాశ ‘’శతకం అని పేరు పెట్టి ముద్రించి ,పండితులకంటే పామరులకు అందు బాటులో ఉండేట్లు సరళంగా రాశానని చెప్పారు ‘’రాప్తాది సుబ్బదాసు –దేశ దాసు సుకవి .
పండితాభిప్రాయాలు -1-ఆంద్ర వాల్మీకి వాసు దాసు –‘’శతకం గజేంద్ర మోక్షం లాగా నిరాకార పరబ్రహ్మను గూర్చి చెప్పబడింది ‘’అనగా 2-పుల్లం పేట సబ్ రిజిష్ట్రార్ శ్రీ ఎం .వెంకటస్వామి నాయుడు –‘’అసమానమైన నీతులను అతి సులభంగా రాశారు .దైవ ,మానవులకు అందని చూపు ను మహా నేర్పుగాఅం దించారు ‘’అన్నారు 3-బడకాయ పల్లి వాస్తవ్యులు అభినవ భారత శిఖా మణి శ్రీ మాడ భూషణం వేంకట నృసింహా చార్య పద్యాలతో ఆశీరభి నందన తెలియజేస్తూ-‘’వర కవితా వితాన,వాగ్విభవ ప్రతిభా ప్రభావం తో సత్కవీన్ద్రులకు తోడ్పడే శుభ వాణి వాణి మనోహరంగా సుబ్బదాస కవికి తోడ్పదిందనీ ,చక్కని శైలితో పదహారు వన్నెల దీప్తితో కవిత్వం ఉందని ‘’నిర్మల జ్ఞాన వైరాగ్య నిష్ఠ భక్తి ‘’ఇందులో పొంగి ప్రవహించాయని ,మరిన్ని రచనలు చేయమని ఆశీర్వదించారు .4- రైల్వే కోడూరుకు చెందిన శ్రీ వేదం వెంకట కృష్ణ శర్మ గారు కూడా పద్యాలలో –‘’నీ వంటి అఖండ భక్తుడు ,భారత పుత్రుడు లేడు.దేశ దురాచార నాశనం సదుపదేశం,వేదాన్తభావం ,సువిచారం,పరమేశు సద్భక్తి ,ప్రజలకు భద్రతా కలిగించావు ‘’అన్నారు .5-శ్రీ సోమ పాళ్యం గారు కూడా పద్యాలలో –‘’తత్వసారం అంతా దట్టించావు,భక్తీ ముక్తి దారి చూపావు , ఆయుర్వేదం ,ప్రకృతి స్నానం నాటకాలు రాసి ,దీనిలో వేదం వేదాన్తార్ధాలు సుప్రకాశం చేశావు .పద లాలిత్యం వాక్చతురత ,హేలాగతిగా తత్వ శాస్త్రం చొప్పించావు ‘’అన్నారు 6-నిజాం లోని వనపర్తి సంస్థానం రాజానగరం వాసి శ్రీ కెవి నరసింహా చార్య –‘’పరమైన వస్తువు ఇందులో వర్ణి తమైంది .కవిత్వం సార్ధకత చెందింది ‘’అన్నారు పద్యాలలో .
ఇది సీస పద్య శతకం .’’సుగుణ సంభావ్య సర్వేశ సుప్రకాశ ‘’అనేది శతక మకుటం .
మొదటి పద్యం లో –‘’శ్రీ కరుణా రస సింధు వాత్సల్యైక-పూర్ణు౦డ వై న నీ పూజ్యయశము – అణువణు వాదిగా , నా బ్రహ్మ పర్యంతమావరించిన నీదు నమిత మహిమ –నిఖిల జగజ్జాల నిర్మాణమున గడు-ప్రకటితం బైన నీ ప్రాభవంబు –నిఖిల లోకముల నిర్నిద్ర శక్తిని –గను సన్న నడుపు నీ కౌశలంబు –తే.గీ –గాంచి యుప్పొంగి నీ తత్వ మెంచి పొగడి –భక్తితొలుకాడ మృదుల భావములు పొంగ –శతకమర్పింతు గ్రహియింపు హితమనీష – ’’సుగుణ సంభావ్య సర్వేశ సుప్రకాశ’’అంటూ సీసం లో భక్తి బంగారాన్ని కరిగించి పోతపోశారు దాసుకవి .తర్వాత గురువులను ఆదికవులు మొదలైన వారిని స్తుతించి ,శతక రచన ఎలా ఉండాలో ఇలా –‘’మాటిమాటికి భక్తీ ఉప్పొంగాలి వినేవారికి వీనుల విందు చేయాలి అర్ధం వాక్కులలో దూరిఉండాలి .భావం ఇంగితాన్ని బయట పెట్టాలి .రసం స్రవించి మానసిక జాడ్యం పోగొట్టాలి .ఒక్కోసారి హరికథలా ఉండాలి ‘’అని గొప్ప పద్యమే చెప్పారు .
ఘోరాటవిలో దమయంతి తన్ను కామించిన బోయకు ఏ నీతి బోధించిందో ,రక్కసిమూకల మధ్య బాధ పడే సీతమ్మ రావణుడికి ఏ నీతి విశదం చేసిందో ,కీచకుని మొహాగ్ని చల్లార్చటానికి ద్రౌపది ఏమి బోధించిందో ,పేరాశతో తన్నుకోరిన నహుషుడికి శచీ దేవి ఎలా బుద్ధి చెప్పిందో అలాంటి నీతుల విహారం భారత దేశం అన్నారు కవి .సురభినాటక కళా గురుడని దేశ సంచారం చేయటం ,హరికథలతో మెప్పించటం ,భైషదవృత్తితో పరమ పేదలకు సేవ చేయటం ,అఖిల తత్వాలు తెలుసుకోవటానికి గురు సేవ చేయటం –‘’నీ ఆజ్ఞ..ఈ జన్మలోనే కాక ,పూర్వ జన్మలలో కూడా ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉంటాను .కృపామయా నీ చెంత చేర్చుకో ‘’అని శరణాగతి కోరారు
క్షమకంటే వేరే సౌఖ్యం లేదు .ఓర్పున్నవాడు ఆత్మా విదుడు ఔతాడు .నీ ధ్యాన నిర్మలదృష్టి ఉన్నవాడే ధన్యుడు కానీ శాస్త్ర పార౦గతుడు ముక్తి పొందలేడు .షడ్వి కారాలతో ఉన్నది స్థూలం ‘’పదియు నేడు ఇంద్రియ ప్రాపకమై లింగ దేహంబు సూక్షం దేహం .అజ్ఞానం ఈ రెండిటికి ఆధారం .మూడు అవస్తల చేత మూడు దేహాలు ముడి వేసుకొని ఉంటాయి .శుద్ధం ఏకం అద్వితీయం చిన్మాత్రమైన ఈశుని తెలియటం మోక్షం .ఆరు చక్రాలను చర్చించి పంచ ముద్రల భావం తెలిసి తారక శుద్ధితో ఆలోచన పరిశుద్ధం చేసుకొని శాస్త్రార్దా సారం తెలిసి, పతంజలి సూత్రాలు ,దండకాన్వయం ఎరిగి ,అజప గాయత్రి రహస్యం అవగాహనం చేసుకొని ,లంబికా యోగ లక్ష్యం గ్రహించి దివ్య మనస్కత ఉంటె సిద్ధికలిగి మోక్షం లభిస్తుంది .రాజయోగం అనే నదడి వీధిలో రధాన్ని వదిలేసి ,సంసారం అగడ్తలో పడకుండా నిన్ను పొందటమే యోగి లక్ష్యం.
దేహాన్ని నాటక శాల చేసి ,హృదయాన్ని రంగస్థలం చేసి వృత్తి,బుద్ధి లను పెద్ద నటులుగా జేసి ,సంకల్పం ను తెరగా మార్చి ,కూటస్తుని దీపం చేసి ,కామాదులను మేళ తాల భాజంత్రీలుగా చేసి ,ఇంద్రియాలను’’ వారి ‘’గ చేసి , కదథ ను దేవి మహిమగా చేసి ,స్వప్నం లో ఆట చూపిస్తావు సూత్రదారిగాసాక్షిగా ఉంటూ .నువ్వు ఆడించినట్లు నేను ఆడుతూ ఉంటాను .’’పగటిని , రేయిని కుంచె బట్టక చిత్రాలు గీసేవాడు బహురంగుల పుష్పాల తోటమాలి అయిన సృజనుడు ఎవరు ,నిర్జర అడవులలో నీటి ధారలను కూర్చి దాహార్తి తీర్చే దాత ఎవరు ,కొండ చిలువకు పుష్కల ఆహారాన్ని నోటికి అందించే వాడెవడు ,నా హృదయంలో మృదు నాదంతో సుస్థితుడు ఎవడు .అలాంటి ప్రభువుచిత్ప్రకాశాన్ని ఆశ్రయిస్తాను అనే మరో అసాధారణ పద్యరాజం రచించారు .’’బుద్ధి దీపం వెలిగించి మొనసి నాను –చిత్తమను పాన్పు నీకు సిద్ధమయ్యే –‘’వచ్చి విశ్రమించు అని నిండు మనసుతో కోరారు .కరుణశ్రీ గారి పద్యాలు కూడా ఈ ప్రేరణతో రాసినవే అనిపిస్తాయి .అందం ఆనందకరం ,వంద్యం మోక్షకారకం దివ్యం జ్ఞానప్రకాశకం మునిజన సేవ్యం,సజ్జన స్తవ్యం ,సారం ,బుధులకు ఆధారం ,,చిద చిదాకారం నిత్యం ,సంసారదూరం బ్రహ్మాండ కృత్యం ,యోగీంద్ర నృత్యం ,ఆధార సత్యం ,పలుకులకు ఊహలకు అందని నిష్కళంక నిర్వికారం అయిన నీ రూపు మాకు ప్రాపు .నిగమాలే నిన్ను పొగడ లేక ఆగమాగమైతే నేనేమి పొగడగలను. ఏవో కొన్ని మాటలు కూర్చి శతక మాల తయారు చేసి నీకు అర్పిస్తున్నా .స్వీకరించి నన్ను నీ వాడిని చేసుకో అంటూ 106 వ సీసం తో శతకం పూర్తి చేశారు . .
ప్రతిపద శుద్ధి, కమ్మని జాతీయాలు దివ్య ప్రవచనాలు ,గహన వేదాంత విషయాలు కరతలామలకం చేసిన వైనం ,భక్తిజ్ఞాన వైరాగ్య త్రివేణీ సంగమం తో సుబ్బదాసు కవి సుప్రకాశమానంగా ఈ సుప్రకాశ శతకం కూర్చి ఆస్తికజన వంద్యులయ్యారు .నాకు వారిని ,శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం కల్పించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-23-ఉయ్యూరు —