పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
గోపాల్ హాల్దార్ రాసిన దానికి శ్రీమతి చాగంటి తులసి అనువాదం చేసి రాసిన ‘’కాజీ నజ్రుల్ ఇస్లాం ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి -1991లో ప్రచురించింది వెల.లేదు
కాలానికి ప్రజలకు మధ్యసజీవ వారధి పద్మభూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం .బెంగాలీల ఉమ్మడి వారసత్వానికి ,వారి సాంస్కృతిక ఆధ్యాత్మిక అన్వేషణలకు నజ్రుల్ మూలం .
పుట్టుక –బాల్యం
బెంగాల్ విభజనకు పూర్వం బర్ద్వాన్ జిల్లా అసన్ సోల్ తహసీల్ లో చురిలియా లో 20-5-1897 న కాజినజ్రుల్ ఇస్లాం పేద ముస్లిం కుటుంబం లో పుట్టాడు .ఆయన పూర్వీకులు పాట్నానుంచి కాజీలుగా ఈ గ్రామానికి వచ్చారు .బిరుదు తప్ప జాగీర్లు హోదాలు అన్నీ పోయాయి .తండ్రి ఫకీర్ అహ్మద్ కటిక పేద .ఆయన కు ముగ్గురు కుమారులు ఒక కూతురు .నజ్రుల్ రెండవ వాడు .కొడుక్కి తండ్రి ముద్దుగా ‘’దుఃఖా ‘’ అంటే’’ ఏడుపు గొట్టు’’అని పేరు పెట్టుకొన్నాడు .అందరూ ఈ పేరుతోనే ఇంట్లో పిలిచేవారు .8వ ఏట తండ్రి చనిపోయాడు .పుట్టినప్పుడు ‘’తారా ఖ్యాపా ‘’అనే పేరు పెట్టారని అంటారు .తనకు తాంత్రిక సాధనకల కొడుకును ఇవ్వమని తల్లి అల్లా ను కోరిందట .ఉన్న ఒకే వీధి బడిలో పార్శీ ఆరబీ నేర్చి మౌల్వీ ఫజుల్ ఆదరణ పొందాడు .పదవ ఏట లోయర్ మిడిల్ పరీక్ష పాసై ,అక్కడే ఒక ఏడాది టీచర్ లాపని చేసి ,మతతత్పరత ఉన్న మంచి ముసల్మాన్ గా ఎదిగాడు .బెంగాలీ లోని రామాయణ మహాభారతాలు చదివి ఆనందించాడు .ఫకీర్లు దావూద్ పాటగాళ్ళు ,సూఫీ లతో మంచి పరిచయం పొందాడు .ప్రపంచ విషయాలపై నిర్లక్ష్యం ఉండేది .స్వతంత్ర వ్యక్తిత్వాన్ని రూపొందించు కొన్నాడు .విద్య ఆర్జించే సాధన సంపత్తి సమకూడని కారణంగా ఆ వయసులో ‘’లేతో దళాలు ‘’అంటే నాటక సమాజాలు బాండు మేళాలు ,పాటలు పాడే వారు తో ఎక్కువ సన్నిహితంగా మెలిగాడు .సమయస్పూర్తి అప్పటి కప్పుడు రాసే కవిత్వ శక్తీ అబ్బాయి .ఇలాంటి వారిని ‘’గోడా కవి ‘’అనేవారు .పోటీలలో సమయస్పూర్తిగా కవిత్వం చెప్పి గెలవటం ఆకవుల ప్రత్యేకత .ఆయన పినతండ్రి ఈ బృందంలో ఉండి,అన్నకొడుకు నజ్రుల్ ను వాటికి తీసుకు వెళ్లగా కొద్దికాలం లో బ్యాండ్ దళ నాయకుడయ్యాడు .జానపద సాహిత్యం లో మకుటం లేని మహారాజయ్యాడని వంగ సాహిత్య చరిత్రలో ఉంది .బెంగాలీ రాగ తాళాలపై గొప్ప ఆధిపత్యం సాధించాడు .
బొగ్గు గనుల కేంద్రం,పెద్ద రైల్వే జంక్షన్ అయిన అసన్ సోల్ కు నజ్రుల్ వెళ్ళాడు .రైల్వే గార్డ్ క్వార్టర్ లో ఇంటి పనులు చేశాడు .తర్వాత ఒక రొట్టెల యజమాని దగ్గర చేరి రొట్టెలు కాల్చటంలో ఎక్స్ పర్ట్ అయ్యాడు .ఖాళీ సమయంలో మురళి వాయించే వాడు .పోలీస్ ఇన్స్పెక్టర్ రఫీ జుల్లా ఇతని ప్రజ్ఞకు మురిసి ,తనతో మైమనసిమ్హ జిల్లా లోని ఆయన స్వగ్రామానికి తీసుకు వెళ్ళాడు .దగ్గరలో ఉన్న దరియా రామ పుర హై స్కూల్ లో జీతం కట్టకుండా -1912లో చదువుకొనే ఏర్పాటు చేశాడు .కానీ అక్కడ పొలం లో పని సేసే వారితో ఎక్కువ గడిపేవాడు .వాళ్ళతోకలిసి దమ్ము కొట్టటం అప్పటికప్పుడుపాటలు రాసి పాడి వారికి సంతోషం కలిగించటం చేసేవాడు .కానీ పరీక్షలో బెంగాలీ వ్యాసాన్ని కవిత్వం తో నింపేశాడు .పరీక్ష హుష్ కాకి కాగా మళ్ళీ అసన్ సోల్ చేరాడు .
కాసిం బజార్ జమీందార్ ,మహా రాజా మునీంద్ర చంద్ర నంది స్థాపించి నిర్వహిస్తున్న మాధరన్ స్కూల్ లో చేరి ,కవి హెడ్ మాస్టర్ అయిన కుముద రంజన్ మల్లిక్ గారు జీతం కట్టకుండా చదివే సౌకర్యం కలిగిస్తాడని ఆశపడగా ,నిరాశ చెంది రాణీ గంజ్ హై స్కూల్ లో చేరాడు .అక్కడ వసతి భోజన౦ ఫీజు ఫ్రీ .స్కాలర్ షిప్ కూడా ఇచ్చేవారు .ఎనిమిదవ తరగతిలో చేరి ,తెలివి తేటలతో ఫస్ట్ న పాసై ,డబుల్ ప్రమోషన్ తో పదవ క్లాస్ లో చేరాడు .గొప్ప కథారచయిత శైలజానంద ఉపాధ్యాయ ఈయన సమకాలికుడు .జీవితాంతం సాహితీ మిత్రులుగా ఉన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-23-ఉయ్యూరు