పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
1917లో హైస్కూల్ ఆఖరి సంవత్సరం చదువుకు స్వస్తి చెప్పి నజ్రుల్ ‘’డబుల్ కంపెని ‘’లో పేరు నమోదు చేసుకోగా ,వాయవ్య సరిహద్దు ‘’నాసిరా’’ కు పంపారు .ఆ రెజిమెంట్ రద్దు అయ్యేవరకు అక్కడే రెండేళ్ళు న్నాడు .భారత దేశపు కమీషన్ పొందిన హవల్దార్ రాంక్ పొందాడు .కరాచీ బారక్స్ లో అందరితో కలుపు గొలుగ ఉండేవాడు . సైనిక దళానికి చెందినపంజాబీ మౌల్వి సాయంతో పార్శీ భాషా ,కావ్య జ్ఞానాన్ని సాధించాడు .గద్య రచనలు చేసేవాడు .కవిత్వం రాసేవాడు గీతాలు కూర్చే వాడు . హఫీజ్ రూబాయిలను అనువాదం జేసేవాడు .అది 1930వరకు అది అచ్చు కాలేదు .
ఆ రోజుల్లోనే ఒక దేశ ద్రిమ్మరి అనే మొదటి కథ రాశాడు .మౌల్వీ నజీరుద్దీన్ సంపాదకత్వం లో వస్తున్నప్రసిద్ధ సాహిత్య పత్రిక ‘’సౌగాత్ ‘’లో 1919అచ్చయింది.తర్వాత కథా కావ్యం ‘’ముక్తి ‘’రాయగా అదీ, ముద్రణ పొందింది .’’వంగీయ ముసల్మాన్ సాహిత్య సమితి’’ వారి త్రైమాసిక పత్రికలో అదే ఏడాది అచ్చయింది .అచ్చు అయిన నజ్రుల్ మొదటి కవిత ఇదే .ఇందులోని ది నిజంగా జరిగిన కథ .రాణీ గంజ్ లోని ఒక భాగం సజీవంగా దర్శన మిస్తుంది .ఒక ఫకీరు చావుపుట్టుకలు ఆయన కృపతో ఒక ఎండిన చెట్టు చిగురించటం ఉన్నాయి .లయబద్ధకవిత్వంతో హృదయాన్ని ఆకర్షించాడు .మిస్టిక్ శక్తులపై ఆయనకున్న విశ్వాసమిందులో కనిపిస్తుంది .ఈ కవిత వల్లనే ముజఫర్ అహ్మద్ తో పరిచయమేర్పడింది .ఈయన ఆపత్రిక ఎడిటర్ కాకపోయినా చోదక శక్తి .నజ్రుల్ ను మరిన్ని కవితలు రాసి పంపమన్నాడు. బెంగాల్ కు కమ్యూనిస్ట్ ప్రేరణతో కవిత్వం రాసిన మొదటి కవిగా నజ్రుల్ గుర్తింపు పొందాడు .వంగీయ ముసల్మాన్ సాహిత్య సమితి ఆతనికి ఒక గొప్ప వేదిక అయింది .గొప్ప కథ ‘’వ్యదార్ దాన్’’ మరోటి హేన’’ లు ఇందులో వచ్చాయి .మంచి పేరు సాధించాడు .మౌల్వీ అబ్దుల్ బదూద్ ,అబ్దుల్ కలాం షంషుద్దీన్ ల స్నేహం పొందాడు .సాహిత్య రంగం లోని వారంతా నజ్రుల్ మిత్రులయ్యారు .హఫీజు రుబాయి బెంగాల్ సాహిత్య పత్రిక’’ ప్రవాసి ‘’లో 1919 డిసెంబర్ లో అచ్చయింది .నజ్రుల్ –గంగూలీ ల మధ్య శాశ్వత మైత్రీ బంధ మేర్పడింది
తన రెజిమెంట్ రద్దు అవటానికి ముందే నజ్రుల్ ఒక వారం సెలవు పెట్టి కలకత్తాకు , స్వగ్రామం చురులియా వచ్చాడు .మొదటిసారి ముజఫర్ అహమ్మద్ ను కలకత్తాలో కలిశాడు .సివిల్ జీవితం లో సాహిత్యం పై కృషి చేయమని ఆయన ఉద్బోధించాడు నజ్రుల్ కు .తల్లిని చూసి మళ్ళీ కలకత్తా వెళ్లి ,శైలజానంద నుకలిసి ,ముజఫర్ తో కలిసి 32కాలేజి స్ట్రీట్ లో ముసల్మాన్ సాహిత్య సమితి కార్యాలయం లోనే ఉండేవాడు .అప్పుడు ఈ మేడ సాహిత్యకారుల కేంద్రమైంది .అందరికి ఆంతరంగిక మిత్రు డయ్యాడు .మాజీ సైనికుడు కనుక ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి .రెవెన్యు సబ్ రిష్ట్రార్ పోస్ట్ కు ఇంటర్వ్యు వచ్చింది .దేశభక్తి ఇతన్ని ముందుకు పోనివ్వలేని సందిగ్ధత ఏర్పడింది .రౌలట్ చట్టం అందరి ఆగ్రహ ఆవేశాలకు కారణమైంది .గాంధీ సత్యాగ్రహ బోధ సాగుతోంది .జలియన్ వాలా హత్యాకాండ జాతీయ విప్లవాన్ని వేగవంతం చేసింది .ఆ విప్లవాగ్ని నజ్రుల్ గుండెల్లోనూ తీవ్రంగా జ్వలించింది .బెంగాల్ లో ,మరీ కలకత్తా లో ఈప్రభావం విపరీతంగా ఉంది .చివరికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అనే నిర్ణయానికి వచ్చాడు .ఉద్యోగ ఆహ్వానం తిరస్కరించి21 వ యేట ఉద్యమ బాట పట్టాడు .
యోధుడు రచయిత
యవ్వనం లో ఉన్న నజ్రుల్ స్వాతంత్ర్య యోదులపక్షాననిలవాలను కొన్నాడు ..ముస్లిం భారత్ పత్రిక వీటికి ముఖ్య వేదికగా ఉండేది .శాంతిపూర్ కు చెందిన ప్రసిద్ధ ముస్లిం కవి ముజమ్మల్ హక్ దాని సంపాదకుడైనా ,కొడుకు అఫ్జల్ హక్ కే దాని నిర్వహణ బాద్యత ఉండేది .ఈపత్రిక మొదటి సంచిక నజ్రుల్ నవల బంధన హారా-బంధ విముక్తి తో ప్రారంభమైంది .ఇందులో లేఖా సాహిత్యం ఉంది . ఈపత్రిక లోనే శక్తివంతమైన కవితలు కూడా రాశాడు .కుర్బానీ –ఆహుతి ,బాదల్ బరిషన్ –రోకళ్ల వానలు ,బాదల్ ప్రతేర్ సోహరాబ్ –వర్షాకాల ఉదయ ప్రార్ధన ,బోధన –ప్రారంభోత్సవం ,మొహర్రం,షత్-ఇల్-ఆరబ్-మెసపొటేమియా లోని యూఫ్రటిస్ కు అరబ్బీ పేరు ,పాటలు,గజల్స్ ,ఫతవా-ఇ-దో జదం-ప్రవక్త పుట్టిన రోజు ,బిరహ బీదుర –విరహ వేదన ,మరామీ –స్పందించే హృదయం ,స్నేహ –భీతు –స్నేహం లో భయ భీతుడు వగైరాలన్నీ అచ్చు అయ్యాయి .ఇందులో అప్పటికి ఇప్పటికి చాలాఉత్క్రుష్ట మైనవి ఉన్నాయి .నవలకూ మంచి పేరే వచ్చింది .కాని ఆయన శక్తి కవిత్వంలోనే బాగా గుబాలించింది .తన కరాచీ అనుభవాలతో కథ రాశాడు .ఇందులోకవిత్వం రోమాన్స్ భావావేశాలు పొంగి పొర్లి చిత్తరంజన్ దాస్ స్థాపించిన ,బరీంద్ర కుమార్ ఘోష్ సంపాదకుడుగా ఉన్న ‘’నారాయణ ‘’అనే ప్రముఖ సాహిత్య పత్రికలో మంచి పొగడ్త లభించి గొప్ప గుర్తింపు వచ్చి౦ది.బెంగాలీ సైనికుడు ఇరాక్ దేశాన్ని సంబోధిస్తూ తన దేశమూ ,ఇరాక్ రెండూ బానిసత్వంలో మగ్గిపోతున్నాయని విచారిస్తూ రాసిన కవిత –‘’షత్-అల్-ఆరబ్’’నజ్రుల్ ఇస్లాం విలక్షణ మైన ముద్రవున్న ఉత్తమ కవిత .ఇందులో దేశభక్తి పొంగి ప్రవహించింది .అరబ్బీ శ్రావ్యత ,బెంగాలీ శబ్ద ఝరి ముగ్ధుల్ని చేస్తుంది .ఇవన్నీ ఉత్తమోత్తమ కవితా కల్హారాలే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-23-ఉయ్యూరు .