కళా విశ్వ నాథ దర్శనం -3
విహంగ వీక్షణం లో విశ్వనాద్( నాదం)-1
‘’తోటి దర్శకులు వాణిజ్య పరమైనసినిమాలు తీస్తుంటే ,సాంఘిక దురాచారాలను విమర్శిస్తూ ,కళాత్మక విలువలతో చిత్రాలు తీసిన దర్శకుడు విశ్వనాథ్ .డ్రీం సాంగ్స్ ,ఫారిన్ లోకేషన్స్ లేకుండా అచ్చమైన నేటివిటి తో ,మనసును తాకే,ఆర్ద్రత కలిగించే సన్ని వేశాలు ,పరిపక్వ ఆలోచనలు ,అంతరంగాల అడుగున నీటి చలమలను సృష్టించే కరుణరసం ,కంటికి ఇంపుగా ,వినసొంపైన పాటలతో ఆయన సినిమాలు తీశాడు అదే ఆయన సిద్ధాంతం ..చిత్రాలను తపస్సుగా భావించి రూపొందించాడు .స౦దేశం అంటారా అంతర్ వాహినిగా ,కొండొకచో బహిరంగా చెప్పాడు .పాటల మాధుర్యం తో సినిమా స్థాయి పెంచాడు .పూర్వ వాగ్గేయకారుల కృతి ,కీర్తనలను విస్తృతంగా ఉపయోగించి ,వాటిని మరింత జనరంజకంగా ప్రజా బాహుళ్యం లోకి తెచ్చిన సినీ కృషీవలుడు .రాసింది అభినందించి అర్ధం చేసుకొనే లక్షణం ఉండటంతోనే ఆయన సినిమాలలో మాటా,పాటా పండాయి .ఫలాని భావం రావాలి ఈ నా పల్లవులు ఇవి .వీటితో పాట చెయ్యండి అని గీత రచయితలకు మార్గదర్శనం చేసి మంచి కాదు ఉత్తమోత్తమ సాహిత్యం పాటలో ఉండటానికి పాటుపడిన పాటలపల్లికి బోయీ .’స్వరాభిషేకం ‘’లో ‘’కుడి కన్ను అదిరెను ‘’పాట తానె రాసినా టైటిల్స్ లో తన పేరు వేసుకోని సంస్కారం ఆయనది .తనలోని నటుడు ను శుభ సంకల్పంతో బయట పడేసి ఆశ్చర్యపరచాడు .తీసే ప్రతి సన్నివేశాన్ని తాను నటించి చూపి ఇలా వచ్చేట్లు ఇంకా బాగా వచ్చేట్లు చెయ౦డి అని హుషారు గొల్పే తత్త్వం .తాను నటిస్తున్నప్పుడు తాను దర్శకుడు అనే భావాన్ని తీసి గట్టున పెట్టి దర్శకుడు చెప్పినట్లు నటించి మెప్పించాడు .దర్శకుడిగా ఆయన తీసుకొన్న పారితోషికం కంటే నటుడిగా తీసుకొన్నది చాలా ఎక్కువ .ఇందులోనూ విజయం సాధించాడు కరుణ శోక ,హాస్యలను సంగీత ,నృత్యాలతోపాటు సమర్ధంగా తీసి మెప్పించాడు .తన సినిమాల్లో ఫైట్ సీన్లు ఉంటె తాను బయట ఉండి, కే ఎస్ ఆర్ దాస్ లాంటి వారితో తీయి౦ చేవాడు .ప్రతి సినిమాలో ప్రతిఫ్రేం సుసంపన్నంగా ,పవిత్రంగా ఉండటం ఆయన ప్రత్యేకత .సంగీత ప్రధాన చిత్రాల్లోనూసాహిత్యం శిఖరాదిరోహణమే చేసే ప్రయత్నమే చేశాడు .ప్రతిపదం ఆచి తూచి పడేట్లు జాగ్రత్త పడేవాడు .ప్రతిపాత్ర అత్యంత సహజం గా స్వీయ వ్యక్తిత్వంతో విరాజమానంగా ఉంటుంది .వాటిని చూస్తూ ప్రేక్షకుడు దృశ్యంలో లీనమైపోతాడు .పాత్రలు సంప్రదాయ బద్ధంగా వేష ధారణలో ఉన్నా ,వాటిని తీర్చి దిద్దటంలో ఆధునికత కొట్టవచ్చినట్లు ఉంటుంది .కళాతపస్వి కనుమూయటంతో ఒక దర్శక దిగ్గజం మనకు దూరమైంది.నటరాజ పాదాన తలవాల్చాడు ‘’ ‘’అన్న జ్యోతి ఎడిటర్ రాసింది అక్షర సత్యం .
‘’ విషనాగు శంకరుడికి ఆభరణమైనట్లు ఒక దుర్మార్గుడి దుస్చేష్టకు బలై కన్నకుమారుడిని సంగీత సరస్వతి శంకర శాస్త్రి సన్నిధికి చేర్చి ,ఆశంకరునికి తన కొడుకును ఆభరణంగా సమర్పించేదే శంకరాభరణం . ‘’ఆత్మాభిమానం విలువలు వివరిస్తూ ,వరకట్న దురాచారం పై సంధించిన వ్యంగ్యాస్త్రం ‘శుభలేఖ .కులానికంటే గుణా నికే ప్రాధా న్యత ఉండాలని చాటి చెప్పింది –సప్తపది .గంగిరెద్దులు ఆడించే ఇంట పుట్టి ,కలెక్టర్ అయి ,ఊరి పెద్ద అవినీతిని తెలివిగా కట్టడి చేసింది –సూత్రధారులు .కష్టపడే తత్త్వం ,మంచి గుణం ముందు, ఏరకమైన సిరీ సంపదా సాటి రాదు అన్నది –స్వయంకృషి .మనో నేత్రంతో స్వచ్చమైన ప్రేమను గుర్తించిన అందుని ,అతని వేణు నాదంతో కురరిసింది సిరివెన్నెల .అహం చీకట్లనుంచి గురువు ను జ్ఞానం వెలుగులోకి తెచ్చిన బాల మేధావి ప్రాణత్యాగం స్వాతి కిరణం .తండ్రి ఆకాంక్షలు తన ఆశలమధ్య నలుగుతూ ,కలళాసక్తికల ఒక యువకుడి ప్రోత్సాహంతో నాట్యమయూరి గా వికసించే –స్వర్ణకమలం ,పాత పాట ను మరిచి ,పక్కదారిపట్టినతండ్రి ని కొడుకు ,తల్లి దారిలోకి మళ్ళించి పలికి౦చి నవే శ్రుతిలయలు ‘’’భరతమైన నాట్యం బ్రతుకు నిత్య సత్యం .కల గురించి కలళాకారు డిగురించి తీసిన ఎవర్గ్రీన్ సినిమా –అదే సాగర సంగమం .ప్రేమకు పెళ్ళికి అర్ధం తెలియదుకాని మనసుమాత్రం స్వాతిముత్యం అంత స్వచ్చం .కమల్ హసన్ సినీ కెరీర్ లో ఇంతటి అమాయక మనసున్న పాత్ర లేనేలేదు .కష్టమైనా బాగా ఇష్టపడి చేశాడు ’అందుకే ఆయన ‘’కళా తపస్వి ‘’అని నీరాజనం పట్టింది జ్యోతి .
‘’ఆయన ‘’ ఉచ్చ్వాసం కవనం ,ఆ నిశ్వాసం గానం ‘’ ఆయన శంకరాభరణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చిత్ర కళామతల్లి మెడలో నిత్య శంకరాభరణమే .మూస దొరణి,హీరోయిజ౦ మధ్య నలిగిపోతున్నతెలుగు సినిమా తల్లి ఆక్రోశం తో గొంతు చించుకొని ఏడుస్తుంటే బుజ్జగించి లాలిపాడటానికి వచ్చినవాడు కళతో లాలించిన వాడు ,పాలించినవాడు సినీకీర్తిని దశ దిశలా వ్యాపి౦ప జేసినా వాడు కళాతపస్వి .తెలుగు సినిమా అర్దాన్నిమార్చి ,కొత్త దారి రఅయినా కళాత్మక దారి పట్టించి సంగీత సాహిత్యాలకు అర్ధాలు అంతరార్ధాలు విలువల రుచి చూపించి కొడిగడుతున్న సంగీత నాట్యప్రభకు రెండు చేతులు అడ్డం పెట్టి దీపప్రభను పెంచి ఆకళలకు పునర్వైభవం కల్పించి కళల నాగలితో వెండితెరపై వినోదాల వ్యవసాయం చేసి పుష్కలమైన రాజనాల పంటలు పండించి సన్మార్గంలో పయని౦చేట్లు చేసి అభివృద్ధి సాధించినవాడు .ఆయన సినిమాల్లో నవరస రసాయనం ఉంటుంది ఆయన హీరో దీరుడుకాడు కళాకారుడు అంతే.హీరోకు కండలు ఉండవు కళమాత్రమె అతడి కండా,అండా దండా .ఆయన హీరో ఫైట్లు చేయదడు.అమృత ధార కురిసినట్లు పాటలుపాడి మనోరంజనం చేస్తాడు .హీరో రోమాన్స్ సున్నితంగా గిలిగి౦తలుపెట్టేదిగా మాత్రమె ఉంటుంది .కళాతపస్వి సినిమా కల లాగా ఉంటూ కళ తో కళకళ లాడుతుంది .60ఏళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్,నాటకాలలో పండిన సోమయాజులు ను వెండి తెరకు తెచ్చి ఉదాత్త పాత్ర శంకరశాస్త్రిగా మలిచి ,ఆపేరు ఇంటింటా మారు మొగెట్లు చేసి రెండేళ్లపాటు ఆ సినీ ఉత్సవాలు నభూతోగా జరిగాయంటే అదంతా న కళా ఇంద్రజాలకుడు విశ్వనాథ్ ప్రతిభా సర్వస్వమే .మాస్ హీరో చిరును చెప్పులు కుట్టేవాడిగా చూపించి మెప్పించిన సాహసికుడు .ఆయన సినిమా చూడటం అంటే సంగీత కచేరీలో కూర్చున్న అనుభూతే ,కళ్ళు పక్కకు త్రిప్పనీయని పవిత్ర నాట్య అనుభూతే .గుడికి వెళ్లి పవిత్రంగా దేవుడి దర్శనం చేసుకొన్న దివ్యానుభవమే .అగరు ధూపాల ఘుమఘుమల నడుమ భగవద్గీతను వీనుల విందుగా వినడమే ‘.
విశ్వనాథ్ అంటే కళల మాటున మానవ సంబంధాల విలువలనుచాటే స్రష్ట .కళామతల్లి కాలిగజ్జెల సిరిసిరిమువ్వ ఆయన .వ్యాపార చీకట్ల లో ఉన్న సినిమాపై ‘’సిరి వెన్నెల ‘’చిందించిన షోడశ కళా ప్రపూర్ణు డైన చందమామ .సాగర సంగమం లో పునీతుడైన స్వాతిముత్యం విశ్వం .ఆయన శిక్షణలో నటులైనవారు నంది పొందాల్సిందే .హీరోలను గోప్పనటులుగా మలిచిన కళా శిల్పి’’అంటూ జ్యోతి ఆయన గుణగణాలను కీర్తి శిఖరాలను మన ముందుంచింది .నేను మీ ముందుంచాను అంతే.ఆయన దృశ్యాలు అనంతాలు వేవేల రూపాలు .ఆ ‘’విశ్వ ‘’విద్యాలయంలో ఎందఱో విద్యార్ధులు స్నాతకోత్సవాలు జరుపుకొన్నారు .
కమల్ సాగర సంగమం లో తనకు వచ్చిన ఢిల్లీ ఇన్విటేషన్ చూసి ఆనందం తో ఏడుస్తుంటే .’’ఏడుపులో ఆనందాన్ని కూడా రంగరించు ‘’అని సూచించి నవ్వులో ఏడుపు, ఏడుపు లో నవ్వు మిళాయించి ఎవరూ ఊహించనంత గొప్పగా నటించి నటకమలం అనిపించాడు అవార్డ్ కూడా పొందాడు .తన నాట్యం లో కమల్ చూపిన భావాలు తప్పు అన్న కమల్ పై, కోపం తెచ్చుకొన్న జయప్రద కూతురు శైలజ చివరికి తల్లి మనోగతం అర్ధం చేసుకొని ,గురువుగా భావించి ‘’నటరాజు పాదాన తలవాల్చనా ,నయనాభి షేకాన తరియి౦చనా ‘’అంటూ అభినయించి అతడే నటరాజుగా భావించి నృత్యం చేస్తుంటే మెచ్చుకొని అకస్మాత్తుగా చనిపోయి నటరాజ పాదాల చెంతకు చేరతాడు .వీల్ చెయిర్ లో చనిపోయిన కమల్ ను స్నేహితుడు శరత్ బాబు విపరీతంగా వర్షం పడుతుంటే ,రెండుచేతులూ అడ్డం పెట్టగా జయప్రద వెనగ్గావచ్చి గొడుగుపడుతుంది .ఒక్క మాట కూడా లేని ఆసన్ని వేశం మనసులను రసార్డ్రీ భూతం చేస్తుంది .దీని వర్ణించటానికి మాటలు చాలవు అనుభవించి తరించాల్సిందే .
శంకరాభరణం చివరి సన్నివేశం కూడా ఆర్ద్రతకు పరాకాష్ట ‘.దొరకునా ఇటువంటి సేవ ‘’పాటపాడుతూమధ్యలో దగ్గుపొరవచ్చి ఆగితే ,చిన్నారి తులసి అందుకొని పూర్తి చేస్తే ,ఆయన సేవాభాగ్యం దొరుకుతుందా అని అర్ధం వచ్చేట్లు పాడి పాదాలపై వాలిపోతే ,ప్రేమగా ఆలింగనం చేసుకొని నుదుట బొట్టుపెట్టి కాలి గండ పెండేరం తీసి ఆబాలుడికి తొడిగితే ,వాడి రెండు చెంపల్నీ ఆర్ద్రంగా రెండు చేతులతో తడుముతూ ,తన సంగీతానికి వారసుడు దొరికాడని అజరామరమైంది సంగీతం అని తాను చెప్పిన మాట ఈ కుర్రాడు నిజం చేశాడని ఆన౦దాశ్రువులు రాలుస్తూ కన్నుమూస్తాడు శంకర శాస్త్రి .అప్పుడే దేఎని కంతటికీ కారణమై తెరపైన కనిపించకుండా వెనకనే నమస్కారాలు చేస్తూ పొంగిపోతున్న మంజు భార్గవి తనకొడుకు జీవితం ధన్యమైనదని భావించి తన గురువుపాదాలపై వాలి ప్రాణం విడుస్తుంది .సినిమా అయిపోయినా ,ఎవ్వరూ లేచి నిలబడక హృదయం నిండా ఆనందం ఆర్ద్రత పొంగి లేవలేక పోతాం.
శ్రుతిలయలు లోకూడా చివరి సన్నివేశమూ ఆర్ద్రతకు శిఖరమే .చెడుమార్గం పట్టి తల్లికి దూరమైన తండ్రిని, తనమాట పాట తల్లి శిక్షణతో మంచి దారిపట్టించి తాను పాడే పాటలో చివర్లో ‘’మమతానురాగాల కల్ప తరువై,మంచి చెడ్డల నేర్పించు మొదటి గురువై –ముక్కోటి వేల్పులను ఒక్క రూపున జూపు –మాతృ పద్మములకిదే వందన౦ ‘’అన్నప్పుడు తండ్రి రాజ శేఖర్ భార్య సుమలతకు రెండు చేతులు జోడించి నమస్కరించటం ఊహించని విషయం .ఆషాక్ తో మనసు చమ్మగిలుతుంది కళ్ళనుండి ధారాపాతంగా ఆనంద బాష్పాల వర్షం కురుస్తుంది ఇలా ఈ మూడు సినిమాల చివరి సన్నివేశాలలో ఆర్ద్రత కు పట్టాభి షేకం చేశాడు కళాతపస్వి .’’ అన్న ఆంధ్రజ్యోతి కధనం ఆపత్రికకు కళలపట్ల ఉన్న నిబద్ధతకు,ఆరాధనకు తార్కాణం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-7-2-23-ఉయ్యూరు