కళా విశ్వ నాథ దర్శనం -4విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

కళా విశ్వ నాథ దర్శనం -4విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

విహంగ వీక్షణం లో విశ్వనా( దం)థ్-2

‘’ప్రతి ముగింపు సరి కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది .విశ్వ నాథుని పయనమూ అంతే .ఆయన ప్రతికథ మనల్ని మళ్ళీ తట్టి లేపుతుంది .ప్రతిపాటా ఆయన్ను మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తుంది .ఎన్ని సార్లు విన్నా మరో కొత్త అనుభూతి కలిగిస్తుంది .ప్రతిపాత్రా మనతోనే ఉండిపోతుంది .అందుకే కళ కే కాదు కళాకారుడికీ మరణం ఉండదు, రాదు .పదహారణాల తెలుగు దనాన్ని వెండి తెరకు పరిచయం చేసిన ఘనుడు .కళలను వర్షింప జేసిన ఘనుడు అంటే మేఘుడు కూడా .ఆయన శాశ్వత నిద్రలోకి 92ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 3 న జారుకొన్నప్పటినుంచి మన హృదయాలు బరువెక్కాయి .కళ్ళు కన్నీటి జలపాతాలయ్యాయి .మనసు ఆయన జ్ఞాపకాలలో ప్రయాణం చేసి కళా తృష్ణ ను మరోసారి గుర్తుచేసుకొని ,కొద్దిగా ఊరట పొందుతున్నాం ‘’

‘’విశ్వనాథ్ తో సినిమా చేయటానికి మద్రాస్ వెడతానంటే అంతటి క్రమ శిక్షణ గల దర్శకుని తో పని చేయటానికి వెడుతున్నందుకు తండ్రి ధర్మరాజు పంపారని కైమోడ్పు ఘటించాడు నిర్మాత చలసాని అశ్వినీ దత్ .’’మీ తెలుగు సినిమా గొప్పతనం ఏమిటి?’’అని ప్రపంచంలో ఎవరైనా నన్ను అడిగితె ‘’మాకు విశ్వనాథ్ ఉన్నారు’’ అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకొంటాం ‘’అన్నాడు రాజమౌళి .’’బాక్సాఫీస్ ,స్టార్స్ ,వ్యక్తులకన్నా సినీ పరిశ్రమ గొప్పది అని నేర్పిన మహానుభావుడు ‘’అన్నాడు నాని .’’ఆయన సినిమాల చివరలో కళ కొనసాగుతుంది ‘’అనే సందేశం ఉంటుంది .ఆయన మరణం కూడా అంతే ‘’అన్నాడు త్రివిక్రమ్ .’’ఆయన మరణ౦కూడా మహా  గొప్పది ‘’అంటాడు బ్రహ్మానందం .’’కళ అమరత్వాన్నిపూర్తిగా అర్ధం చేసుకొన్న మహానట ,దర్శకుడు ‘’అన్నాడు కమల్ .’’తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తికి పునాది వేసిన తొలి దర్శకుడు ‘’అన్నది రాధిక .’’ఆయనలో సంపూర్ణ నటుడు  ఉన్నాడు ‘’అంటాడు విక్రం .

  ఒక దశలో విశ్వనాథ్ కు అవార్డ్ లు రొటీన్ అయిపోయాయి .వీటికంటే ఒక టాక్సీ డ్రైవర్ శంకరాభరణం ను ఎనిమిది సార్లు చూశానని చెప్పినప్పుడు ,ఎందుకు నచ్చింది అని అడిగితె తనకు ఆసంగతి తెలీదని’’ సినిమా చూస్తుంటే గుడిలో కూర్చున్నట్లు ఉంటుంది సార్’’అన్న మాట తాను  అందుకొన్న అవార్డ్ లలో కెల్లా గొప్పది ‘’ఆన్నాడు విశ్వం..సాగర సంగమం కమల్ తో తీయాలనుకొన్నప్పుడు వయసుమించిన ముసలి పాత్ర కనుక చెయ్యను అంటే నిర్మాత ఏడిద’’ తీస్తే నీతోనే తీస్తాం లేకపోతె లేదు’’ అంటే అయిదు నెలలు త్రిప్పి అప్పుడు సరేఅని చేశాడు .నిర్మాత ఏడిద సీతాకోక సినిమాకు మొదట పెట్టిన పేరు సాగర సంగమం .ఆ పేరుతొ ఒకపాట కూడా చేశారు .కానీ తర్వాత సాగర సంగమం తీశామని ఆయన అన్నాడు .విలన్ అంటే విలనీ చూపక్కరలేదు .ఒక చిన్న పిల్లాడు తనకంటే బాగా పాడుతాడు అని తెలిసి ఈర్ష్య పొందటం విలనీ .తన భార్యను వదిలి మరో అమ్మాయితో తిరిగితే ,తన్ను పెంచిన సంగీతాన్ని నిర్లక్ష్యం చేస్తే అదీ విలనీయే ఆయన సినిమాల్లో .ఎంతగొప్ప మహానుభావులైనా జీవితాలలో చిన్న చిన్న తప్పులు చేస్తారు ,కొద్ది ఈర్షా ద్వేషాలు చూపిస్తాడు .వారే విలన్లు ఆయన సినిమాలలో .’’విలన్ క్రూరంగా ఉండక్కరలేదు.మనం చూపించేసద్గుణాలకు ఒక మెట్టు కింద ఉంటె చాలు ‘’అంటాడు కళాతపస్వి మంచివాళ్ల విలువల్నీ ,చెడ్డ వాళ్ళ విలువల్నీ కూడా కిందకు కాకుండా కాస్త ఎత్తుకు తీసుకు వెళ్ళిన మహా దర్శకుడు ఆయన.సిరి వెన్నెల లో వేశ్య మున్మున్ సేన్ ,తాను  సర్వదమన్ ను పూర్తిగా ప్రేమించినా ఆయనా తనను గుడ్డిగా ఆరాధించినా,కల్మషం లేని అతను తనను  పెళ్లి చేసుకోవటం అతనికి ద్రోహం చేయటమే అని అనేక ఉత్తుత్తి కారణాలు చెబుతూ నిరాకరిస్తుంది .అప్పుడు సీతారామ శాస్త్రి రాసిన పాట’’నా కన్నులు చూడని రూపం –గుడిలో దేవత ప్రతిరూపం ‘’అంటూ బెనర్జీ పాడతాడు .అందులో తానూ గుడ్డికనుక ఆమెను చూడలేను నువ్వు దేవతవి అని అర్ధం .అంతే అయితే గీత రచయిత, దర్శకుడు ఊరుకొంటారా?నీ చీకటి కోణం నేను చూడలేను . గుడిలో దేవతలకు వస్త్రాలు ఉండవు అలంకరణ చేస్తే తప్ప .కానీఅవి గొప్ప పవిత్రమైనవే కనుక ఆరాధిస్తాం .అనే మరోభావంకూడా ఉంటూ, ఆమెను ‘’స్విం సూట్’’ లో చూపించటం  దీనికి బలాన్నిస్తుంది .మహోన్నత ‘’సాహిత్యప్పాట ‘’రావటానికి కవిపాత్ర ఎంత ఉంటుందో, దర్శకుని పాత్రా అంతే ఉంటుంది’’ .

  ‘’వేదం అణువణువున నాదం ,నా పంచ ప్రాణాల నాట్య వినోదం ‘’పాట సాగర సంగమం లో వేటూరి రాస్తే,లయరాజా  ఇళయరాజా రెండుమూడు స్వరాలు కూరిస్తే తపస్వి అందులో వైరాగ్యం ,కళ రెండూ మేళవించి ఉన్న  ‘’హంసానంది ‘’రాగాన్నే ఎంపిక చేసి స్వరపరచి పాడించి రావాల్సిన ఎఫెక్ట్ తెప్పించుకొన్నాడు .సూత్రధారులు లో విజిగ శాంతి పల్లెటూరిపిల్ల –‘’అట్టా సూడమాకయ్యా’’అనే ఊతపదం ఆమెకు సహజం .ఆసహజత్వానికి మరింత సహజత్వం ఉట్టిపడాలని గడ్డం కింద పుట్టు మచ్చ పెట్టించాడు విశ్వం .గడ్డం కింద పుట్టు మచ్చ ఉంటె ఆస్త్రీకి సంతానం కలగదు అని సాముద్రిక శాస్త్రం లో ఉందట .ఈవిషయం తెలుసుకొన్న దర్శకుడు అలా నల్లమచ్చ పెట్టించి శాస్త్రానికి న్యాయం చేశాడు. నిజానికి ఆ సినిమాలో ఆమెకు సంతానం లేదు .ఇండియన్ డాన్స్ అనే డాన్స్ ను సృష్టించాలి అనే తపన ఉన్న యువ కుడి సినిమా తీయాలనుకొని హీరో కావటానికి ముందు కమల్ డాన్స్ అసిస్టెంట్ గా పని చేశాడని తెలిసి అతన్ని ఒప్పించి ఆపాత్ర చేయించాడు సాగరసంగమం లో .అది స్వరసాహిత్య నాట్య ,నటనా సంగమమే అయింది  .ఆయన సినిమాలలో రచయితలూ సంగీత కర్తలు గీతకర్తలు అత్యుత్తమ ప్రతిభను చూపారు .అది ఆయనేకాక వారికీ గర్వకారణం .ఇలా జరగాలంటే దర్శకుడికి తనకు ఏమి కావాలో తెలియాలి ,అన్ని రంగాల్లో ప్రవేశం ఉండాలి .తనకు కావాల్సింది స్పష్టంగా హృద్యంగా చెప్పే నేర్పు౦డాలి .తనకు కావాల్సింది వచ్చేదాకా వదలి పెట్టనంత ఓర్పూ నేర్పూ కూడా ఉండాలి .ఇవన్నీ కళాతపస్విలో ఉన్నాయి. కనుకనే ఆయన సినిమాలు కళాకావ్యాలయ్యాయి.దృశ్య ప్రబంధాలయ్యాయి .చరిత్రలో నిలచిపోయాయి .రామాయణ భాగవతాలను పారాయణం చేసినట్లు నిత్యం చూడాలనిపిస్తాయి పవిత్రత కలిగిస్తాయి మానసిక ఆనందాన్ని నింపేస్తాయి .’’అజరామర మైన సంగీతాన్ని మనలాంటి తుచ్ఛులు  బ్రతికి౦చక్కర్లేదు ‘’అని రాజ శేఖర్ శ్రుతిలయలు లో జయలలితతో అంటాడు. రచయిత ఆకెళ్ళ రాశాడు .రాజ శేఖర్ మనసులో తాను ఎంతపతనం చెందాడో తెలియజేసే ,తన మనో వేదన చెప్పే మాట ‘’మన లాంటి తుచ్ఛులు ‘’దీనికి దర్శకుడు బ్రీఫింగ్ ఇవ్వబట్టే ఆడైలాగ్ ,పురుడుపోసుకొని ,పండింది .

  గుంటూరు జిల్లా పెదపులివర్రులో –అంటే వ్యాఘ్రపురం లో పుట్టిన కాశీనాథుని విశ్వనాథ్ తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు అక్కడి శ్రీ రాజ రాజ నరేంద్రుని దేవాలయంలో అర్చకులు .1930ఫిబ్రవరి 3న పుట్టిన ఈ శివభక్తుడు శివారాధకుడు అక్కడే నాల్గవ తరగతి వరకు చదివాడు .ఎప్పుడుస్వగ్రామం వచ్చినా ఆస్వామిని దర్శించి స్వయంగా పూజ చేయటం అలవాటు .ఆగ్రామమన్నా గ్రామస్తులన్నా ఆయనకు అమితమైన ప్రేమ .గుంటూరు ఏసీ కాలేజిలో విశ్వనాథ్ నందమూరి కి సీనియర్ .సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగం చేస్తూ రోజూ బెజవాడనుంచి గుంటూరు వెళ్ళేవాడు ఎన్టిఆర్ .ఇద్దరూ ఒకే రైలు ఎక్కేవారు .ఈరైలు పరిచయం తర్వాత సినీ పరిచయం గా మారి  ఆయన నటుడు ఈయన వాహినీ స్టూడియో సౌండ్ ఇంజనీర్ అయ్యారు .పాతపరిచయాలు కొనసాగించారు .రావు నటించినసినిమాలకు  నాథ్ దర్శకత్వం చేశాడు  ‘’  ఈవిషయాలన్నీ ఆంధ్రజ్యోతి లోనివే ..నేను మీకోసం అందించాను తేనెటీగ పుష్పాలపై వ్రాలి మకరందం సేకరించి తేనె పట్టులో దాచినట్లు .

 సూత్ర దారులు చిత్రం లో నాగేశ్వర రావు ,సుజాతల నట నా చాతుర్యాన్ని సంగీత పరం గా ,పల్లె టూళ్ళ డోలు సన్నాయి  లకు పవిత్రతను కల్పించి ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన జనానికి కల్గించాడు .’’ఏలేలో ఏలేలో ‘’అంటూ లంగా ఓణీ తో రమ్యకృష్ణ ముక్కుకు బేసరి పెట్టుకొని చిలిపిగా చలాకీగా  బావ ను ఆరాధించే మరదలుగా అత్యద్భుత నటన కనపరచింది .ఆమె ఉన్న ప్రతి సన్ని వేశమూ.రక్తికట్టింది .సుజాత తన కొడుకు కలెక్టర్ అయ్యాడని తెలిసి భర్తను  చాటుగా పిలిచి ‘’ఎంత గొప్ప కొడుకునిచ్చావయ్యా ‘’అంటూ,బుజాలపైన వాలిపోవటం  ఆనందం ఆమేదీ అతనిదేకాడు మనకూకలిగి కనులు చమరిస్తాయి .తండ్రితో ,మేనమామ రంగదాసు  మురళీ మోహన్ తో కలిసి  భాను  చందర్ సన్నాయి అద్భుతంగా వాయిస్తుంటే ,ఆ మహత్తర సన్నీ వేశం లో పులకి౦చి పోతాం  హరికధకురాలుయశోదమ్మ  కే .ఆర్. విజయ కు ఆలయ ధర్మకర్త కైకాల చేసిన అన్యాయం ,ఆమె ఆ అవమానం భరించలేక ,మానం పోయిన తాను  పరమ భాగవతోత్తముడైన భర్త అశోక్ కుమార్  కు  దూరమై హనుమద్దాసు దేవమ్మ కొడుకు తిరుమలదాసు ను చదివించి కలెక్టర్ ను చేసి అతడు ఆ వూరికి వచ్చి నీలకంఠం బతుకు బట్టబయలు చేసి ,అతడు ఆక్రమించిన భూములు పేదలకు పంచేసి నీతి నిజాయితీ నిబద్ధత కల కలెక్టర్ గా పేరు పొందుతాడు .గ్రామస్తులు కోపం తో రగిలిపోయి కైకాలను చంపటానికి బయల్దేరితే హనుమద్దాసు అడ్డు పడి శాంతింపజేసి కైకాలలో మార్పు తెప్పించి ,మంచి వాడిని చేసి అహింసకు పట్టాభిషేకం చేయించాడు కళాతపస్వి .మామ సంగీతం లో ‘’జోలాజోలా జోలమ్మ జోల ,నీలాకన్నుల్లో నిత్యమల్లె పూజోలా ‘’వాణీ జయరాం ,కొలిచీ నందుకు నిన్ను కోదండరామా –బాలు పాటలు హైలైట్ .

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-2-23-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.