పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ఇస్లాం -4
పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -4
దౌలత్ పూర్ భంగపాటు తో నజ్రుల్ లో కవిత్వం వెల్లువై ప్రవహించింది .కొమిల్లాలో సేన్ గుప్త ఇంట్లో ఉన్న మూడు వారాలలో కవిత్వం పరవళ్ళు తొక్కింది .చిత్తరంజన్ దాస్ నాయకత్వం లో సహాయ నిరాకరణ ఉద్యమం బెంగాల్ అంతటా ముఖ్యం గా కొమిల్లాలో ఉద్ద్రుతమైంది .అప్పుడే ఆ ప్రేరణతో ‘’మరణ వరణ్’’-మృత్యువుకు ఆహ్వానం రాసి గొప్ప స్పూర్తి కల్గించాడు –అందులో మొదటి వాక్యం ’’మరణమా ఓ మరణమా రా రా ‘’జనాలను కుదిపేసింది .తర్వాత రాసిన ‘’పూర్వేర్ హవా ‘’-తూరుపుగాలి కవితా సంపుటి వెలువరించాడు .నాజూకుతో ఉన్న తియ్యని భావాలతో నిండిన కవిత్వం ఇది .సేన్ గుప్త కుటుంబం పిల్లల గురించి అద్భుత కవిత్వం రాశాడు –‘’ఎక్కడ నుంచి వచ్చారు మీరంతా –వజ్రహారం లా నా మెడను అల్లుకుపోయారు ‘’అంటాడు .’’స్నేహాతుర’’గేయ౦ కూడా ఆయన హృదయం ఎంత విచారం తో కుమిలిపోతోందో ,తనకు స్నేహం ఎలా కావాలో ఆ ఇంటిని నడిపే మాత్రు మూర్తి ని గురించి చక్కగా వర్ణించాడు .ఆమె తల్లిప్రేమ వాత్సల్యం తో శూన్యం అంతా తొలగిపోయి శక్తి వంతుడయ్యాడు .చనిపోయిన ఆమెచిన్న కూతురుపై హృదయం ద్రవించే కవిత రాశాడు .ఇవన్నీ బెంగాలీ పత్రికలో అచ్చు అయ్యాయి .
1921 జులై లో తన జీవితం మళ్ళీ ప్రారంభించటానికి ,సాహిత్యం లో తన లక్ష్యాన్ని సాధించటానికి మళ్ళీ కలకత్తా వెళ్లాడు .సాహిత్య సంగీత గోష్టులతో ,పాత కచేరీలతో నిరంతరం సాగే ‘’అడ్డా ‘’లతో తాదాత్మ్యం చెందాడు నజ్రుల్ ..సత్యేంద్ర నాధుని గురించి రెండు కవితలు రాశాడు .సత్యేంద్ర కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు ఆయన స్థితి, బాధ నజ్రుల్ ను కదిలించి ‘’దిల్ దర్దీ’’-ప్రేమించే హృదయం అనే గొప్ప కవిత రాశాడు. నిజాయితీకి పేరున్న సత్యేంద్ర ఈ కవితను చదివి విని ,ఆయనకు కృతజ్ఞత చెప్పటానికి నజ్రుల్ ఇంటికి వెడితే, ఆయన పని మీద బయటికి వెళ్ళటం తో కలుసుకోవటం కుదరలేదు .వారిద్దరూ మళ్ళీఎప్పుడూ కలుసుకోలేక పోయారు .నలభై ఏళ్లకే సత్యేంద్ర 24-6-1922 న చనిపోయాడు .ఈఇద్దరిలో అకుంఠిట దేశ భక్తి ,పురోభి వృద్ధికరమైన సాంఘిక భావాలు ఉన్నాయి .టాగూర్ కూడా సత్యేంద్ర మరణం పై మంచి కవిత రాశాడు –‘’చురుకైన వాడు ,దీటైన వాడు ,ఉల్లాస వంతుడు ,కళాధి దేవత గారాబు పుత్రుడు,దారి తప్పి ఈ గంగాతీరానికి వచ్చాడర్రా ‘’ …సత్యేంద్రుడు కవిగా, వ్యక్తిగా మహోన్నతుడు .
కరాచీ కుట్ర కేసులో జైలుకెళ్ళి కఠిన శిక్ష అనుభ వించి వచ్చినవారిలో మొదటి వారు ఆలీ సోదరులు .దీనిపై స్పందించి నజ్రుల్ కలం మహా గీతం రాశాడు ,ప్రజల్లో పెల్లుబికే క్రోధాన్ని వ్యక్తీకరించాడు .అది ‘’స్వరాజ్య సంవత్సరం ;;.ఒక్క ఏడాదిలో స్వతంత్రం తెస్తానని గాంధీ అభయమిచ్చాడు .కనుక ఉద్యమం మహా వెల్లువగా సాగిపోతోంది .బ్రతిష్ వారు తమ బలం క్షీణించి పోతున్నట్లు గ్రహించారు .దిగులు, కలత లతో ఎలాగైనా ఉద్యమాన్ని నీరు కార్చాలని విశ్వ ప్రయత్నం చేస్తూ అత్యంత దారుణంగా కఠినంగా వ్యవహరించారు .కాంగ్రెస్ స్వయం సేవక సంఘం పై నిషేధం విధించారు .దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరింత పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు శాంతియుతంగా చేశారు .వేలాది పురుషులు నిర్బంధానికి గురయ్యారు .మొదటి ముగ్గురు మహిళా సత్యాగ్రహ దళానికి చిత్తరంజన్ దాస్ భార్య శ్రీమతి పీఆర్ దాస్ నాయకత్వం వహించింది .అది ఆదర్శమై దేశం లో అనేక చోట్ల మహిళా కార్యకర్తలు రంగంలోకి దూకారు .సత్యాగ్రహులతో పోలీస్ వాహనాలు నిండి పోయాయి .ఎవరూ ఆత్మరక్షణకు విడుదలకు అస్సలు ప్రయత్నమే చెయ్యలేదు .స్వచ్చందంగా శిక్షలు అనుభవించారు. జైళ్ళు ఖాళీ లేవు కొత్త జైళ్ళు కట్టినా నిండి పోయాయి .పట్టుదలతో నిర్బంధించి వదిలేసేవారు ప్రభుత్వాధికారులు .నెహ్రు ,బోస్ లకు బాధల గురించిజ్ఞానోదయం మొదటిసారిగా ఇప్పుడే కలిగింది .స్వాతంత్ర్యం వచ్చే వరకు వీరు కారాగారానికి అనేక సార్లు వెళ్ళాల్సి వచ్చింది .బ్రిటీష జైళ్ళు అంటే భయమే పోయింది సత్యాగ్రహులందరికి .జైలు శిక్ష దేశ సేవకు చిహ్నంగా గౌరవంగా ,గర్వంగా భావించారు .నాయకులు సాహితీ వేత్తలు కవులు సామాన్యులు అందరికీ ఒకే రకమైన నైతిక ప్రభావం కలిగించింది .
1921 డిసెంబర్ లో అహమ్మదాబాద్ లో చిత్తరంజన్ దాస్ అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం జరిగింది .ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుల౦దర్నీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .యుక్తితో గాంధీని మాత్రం అరెస్ట్ చేయలేదు .ఆసభ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకొన్నారు .కానీ అక్కడే ఉద్విగ్న వాతావరణం లో ప్రతినిధులు కలుసుకొని ఒకరిక్కరు వీడ్కోలు చెప్పుకొన్నారు 1922జాతీయ పోరాట సంవత్సరం ఉదయమౌతుందని భావించారు .పన్నుల నిరాకరణ ,శాంతియుతం పోరాటం కోసం గాంధీ పిలుపు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .
1922జనవరిలో ఉత్తరప్రదేశ్ లోని చౌరీ చోరా లో తీవ్రమైన దౌర్జన్య కాండ జరిగింది .జనం అహింసా పాఠం ఇంకా నేర్చుకోలేదని కనుక ఉద్యమం ఆపండి ‘’అని గాంధీ సూచించటానికి మార్గం సుగమమైంది .ఫిబ్రవరిలో గుజరాత్ లోని బార్డోలి లో కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై ఉద్యమాన్ని ఆపేసి ,నూలు వదకటం ,నేయటం గ్రామోద్ధరణ ,అస్పృశ్యతా నివారణ ,హిందూ ముస్లిం సమైక్యత వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేబట్టాలని తీర్మానించారు .ఇది గాంధీ గారి పోరాటం లో మొదటి దశ .1930లో ఉప్పు సత్యాగ్రహ౦,శాసన ధిక్కారం కు పిలుపు నిచ్చారు ,ఇది రెండవ దశ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-23-ఉయ్యూరు