పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -5
‘’విద్రోహి ‘’కవి
1921డిసెంబర్ 10న చిత్తరంజన్ దాస్ ను జైల్లో పెట్టారు .విప్లవ వీరు లందర్నీ పట్టుకొన్నారు .’’దేశ బంధు ‘’వార పత్రిక’’బంగళార్ కధ’’ ఆయన భార్య వాసంతీదేవి ఆధ్వర్యం లోకి వచ్చింది .దాసు భార్యా బృందం వారు స్వదేశీ ఉద్యమకాలానికి రవీంద్రుడు కవి అయినట్లు ,నజ్రుల్ నవయుగ నవ కవి అన్నట్లు భావించేవారు .ఆపత్రికకు నజ్రుల్ ను రాయమని వాసంతీదేవి కోరగా ,వెంటనే ఒప్పుకోని దేశబంధు నిజాయితీ సేవ పై అపారమైన గౌరవంతో ‘’అమర గీతం –వినాశ గీతం రాశాడు –‘’బద్దలుకొట్టండి –కారాగారపు లోహ కవాటాన్ని –ముక్కలు ముక్కలు చేయండి –దాస్య శ్రుమ్ఖలాలను దేవతారాధనకై –రక్తపానం చేసే ఈ పాషాణ వేదికను బద్దలు చేయండి ‘’.ఇదే జాతీయోద్యమం లో మొట్టమొదటి పాట..మున్ముందు రాసే వాటికి నాంది .1947 వరకు వేలాది వేదికలపై ఈపాట మారుమోగింది. జనం లో ఉత్సాహం పరవళ్ళు తొక్కింది .వాసంతీ దేవి నజ్రుల్ ను తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ,ఆత్మీయ ఆతిధ్యమిచ్చి గౌరవించింది ,ఆశీస్సులదించింది .ఈ విషయం ‘’చిత్త నామా ‘’లో నజ్రుల్ పెర్కొన్నాడుకూడా .ఉవ్వెత్తుగా ఎగసి వస్తున్న ఉద్యమ౦ నజ్రుల్ భావజాలానికి గొప్ప ప్రేరణకలిగించి ,ఆ ఏడాది డిసెంబర్ చివరలో ఒక రోజు రాత్రి అంతా పెన్సిల్ తో గీతాలు రాస్తూనే ఉన్నాడు .మర్నాడు ఉదయమే లేచి తనమిత్రుడు ముజ ఫర్ అహమ్మద్ కు తానురాసిన ‘’విద్రోహి ‘’-తిరుగుబాటు దారు గీతాన్ని చదివి వినిపించాడు –‘’చెప్పరా వీరుడా –తలవంచనని చెప్పరా –ఎలుగెత్తి చాటి చెప్పరా –తలవంగదని చెప్పరా ‘’ అన్నదే ఆ గీతం .నజ్రుల్ కే కాదు యావద్ భారతానికి ఇది అద్భుత గీతం .ముస్లిం భారత్ కు న్యాయంగా దీన్ని పంపాలి కాని వాళ్ళు వేయటం ఆలస్స్యం అవుతుందని బరీన్ద్రకుమార్ ఘోష్ ‘’బిజిలీ ‘’వారపత్రికకు పంపగా వెంటనే అచ్చయి ప్రజలకు చేరింది .పాఠకుల కోరికపై రెండో సారీ ఆపత్రిక దాన్ని ముద్రించింది .నజ్రుల్ ఆ సంచికను తీసుకొని రవీంద్రుని దగ్గరకు వెళ్లి చూపించగా గురుదేవ్ ముగ్ధుడయ్యాడు .ఆశీర్వదించి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు .విద్రోహి కవిత తో నజ్రుల్ ఇస్లాం విశ్వ విఖ్యాత కవి అయ్యాడు .ఈ కవిత మోహిత్ లాల్ మజుందార్ రాసిన ‘’అమి ‘’అనే గద్య రచన ను గుర్తు చేస్తుంది .వస్తువు రచనా విధానం లో చాలా తేడా ఉంది.కానీ తన భావాన్ని వాడుకోన్నాడని నజ్రుల్ పై మజుందార్ కు కోపంగా ఉండేది .
విద్రోహి లాంటి కవితలకోసం జనం ఆతురతతో ఎదురు చూస్తున్నారు .బెంగాల్ ప్రజలకు తమ కవి లభించాడు . 24-2-1923న రవీంద్రుడు తన గీతం ‘’వసంత్’’ను నజ్రుల్ కు అంకితమిచ్చాడు .బెంగాల్ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .విద్రోహి కవిత మూలంగా ఆతర్వాత నుంచి నజ్రుల్ ను ‘’విద్రోహి కవి ‘’గా పిలిచారు .ఆయన కవితలో ఆత్మాభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది .భారత జాతీయ ఉద్యమాలు గాంధీ ఆలీ సోదరుల నిర్బంధం మొదలైన అనేక అంశాలపై నజ్రుల్ ప్రభావ శీలమైన కవితలు రాశాడు .గాంధీ ఆగమనాన్ని మనసారా ఆహ్వానిస్తూ –‘’ఎవరీ ఉన్మాద పథికుడు ?-వాకిటికి దూసుకు వచ్చాడు –ఆయన వెంట జనం అనుసరిస్తూ –ముప్పది కోట్ల సోదరులు –మృత్యువునే సవాలు చేస్తూ –గీతాలు ఆలాపిస్తూ ‘’.ఇలా మహా వేగంగా సాగిపోతు౦దికవిత .చరఖా పైనా గీతం అల్లాడు .ఇలాంటివి ఎన్నో నిండిన దేశభక్తి స్వాతంత్రంకోసం ఉవ్విల్లూరటం సహాయ నిరాకరణ లను పద్యాలలో భావావేశంతో తన్మయత తో రాశాడు .ఇవిమాత్రమేకాదు ఆన౦దోల్లాసం ఆయన సొత్తుకనుక జీవితంలోని బహుముఖీన అనుభవాలకు ఆయన నేత్రం చెవులు మెదడు హృదయం స్పందించేవి .సృజనాత్మకత వైవిధ్యం ఆయన ప్రత్యేకత .
స్త్రీ సహజ సొగసు ,పురుషోచిత స్వీకృతి తో రాసిన గీతాలను డోలన్ చంపా ,చాయానట్,పూర్వేర్ హవా సంపుటాలలో చేర్చాడు .నవయుగ్ లో వచ్చిన వ్యాసాలూ ‘’యుగ వాణి’’పేరుతొ వచ్చాయి .బెంగాల్ లో అగ్ని యుగానికి అంటే 1900-1908 కాలం అంటే విప్లవ కార్యక్రమాలు ప్రారంభమైన కాలం లో అగ్రగామి విప్లవ నాయకుడు అరవిందుని సోదరుడు బారీంద్ర కుమార్ ఘోష్ కు నజ్రుల్ ‘’అగ్ని వీణ ‘’అంకితం ఇచ్చి దానికి రవీన్ద్రునితో సమానమైన చిత్రకారుడు బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ,ఇండియన్ పెయింటింగ్ లను తీర్చి దిద్దిన ఆచార్య అవనీంద్రనాధ టాగూర్ తో ముఖ చిత్రం గీయించాడు .ఇది ఏ రచయితకూ లభించని అరుదైన అదృష్టం గౌరవం ఒక్క నజ్రుల్ కే దక్కింది .ఈ సంకలనికి జనం నీరాజనం పట్టారు .రెండవ ముద్రణకాపీలు మూడు నెలలకే అమ్ముడైపోయాయి .జోష్ మీద ఉన్న నజ్రుల్ దానిపై వచ్చిన డబ్బంతా విందులు వినోదాలకు ఖర్చు చేశాడు .బహుశా అదే ఆయన జీవితం లో సుఖం హాయి అనుభవించిన కాలం .
1922 ఉత్తర భాగం లో తన పుస్తకాలు బాగా వెలువడుతున్న కాలం లో,ఎంతోకాలంగా తనస్వంత పత్రిక పెట్టాలన్న కోరిక తీరి ‘’ధూమ కేతు ‘’వార పత్రిక మొదలుపెట్టాడు .జాతీయ వాది అనుభవజ్ఞుడు ఆతర్వాత బెంగాల్ ముస్లిం లీగ్ కు ‘’ప్రెస్ లార్డ్,విభజన తర్వాత ఢాకా వెళ్ళిన మౌలానా ఎం .అక్రం ఖాన్ – నజ్రుల్ ను తనకొత్త దినపత్రిక ‘’సేవక్’’లో పని చేయటానికి ఆహ్వానించగా,వెళ్లి రెండు నెలలు పనిచేసి ,ఒక మిత్రుడు అడ్వాన్స్ గా రెండు వందల రూపాయలిస్తే స్వంత పత్రిక పెట్టాలని ,వారానికి రెండు సంచికలు తేవాలని భావించి ‘’ధూమకేతు ‘’-తోక చుక్క పేరు పెట్టి,12-8-1922న మొదటి సంచిక శరత్ టాగూర్ బారీంద్ర మొదలైన ప్రసిద్దుల ఆశీస్సులతో వెలువరించాడు .ఇందులో రవీంద్రుడు –‘’మెరుపు మెరిసింది –మేల్కొనవోయీ మగత లో జాగే వారిని తట్టి లేప వోయ్ ‘’అనే స్వాగత గీతం రాసి ఆశీర్వదించాడు .సిద్ధాంత రీత్యా రాటు దేలకపోయినా నిబద్ధుడైన కవి నజ్రుల్ .ఆయన లక్షణాలైన ఉద్రేకం ,దుందుడుకు తనం నిర్లక్ష్యం పత్రికలో ప్రతిధ్వనించాయి .
అప్పటికి బెంగాల్ లో లెనిన్ మార్గం పూర్తిగా వ్యవస్థితం కాలేదు .తగిన సాహిత్యమూ లేదు .జాతీయ వాదుల్ని అంతర్జాతీయ వాదుల్ని ఆయన అంటరాని వారిగా చూడలేదు .ఆయన ఆరాధకులలో బారీంద్ర బృందం ,ఆర్య ప్రచురణ వారూఅయిన యువకులు అనేకమంది ఉన్నారు.ఆయనకున్న సెక్యులర్ దృక్పధం భగవంతునిపై సంప్రదాయ విరుద్ధ నమ్మకం కమ్యూనిజం పై ఆసక్తి జాతి వర్గ రహిత సమాజం పై అభిమానం ‘’ధూమ కేతు ‘’లో ప్రతిబింబింప జేశాడు .మా భై-అంటే భయపడవద్దు అనేమాటపైఆదారపడి విధ్వంసకర శక్తులు నశించాలి అనే నినాదం ఇస్తూ ‘’నేను కొత్త మార్గం లోనడుస్తున్నాను .ధూమ కేతు నా రధం .నేనే మార్గ దర్శకుడిని ,సత్యమే ఏ దిశగా వెళ్ళాలో సూచిస్తుంది ,సత్యాన్ని తనకు తానూ తెలుసుకోవటం ,తన గురువు తానె కావటం ,తన నియతికి తానె నిర్దేశ మార్గ దర్శకుడు అవటం .ఇందులో డాబూ దర్పం లేవు .తనను తాను తెలుసుకోవాలన్న ఉద్ఘోష మాత్రమె ‘’అని మొదటి సంచికలో చెప్పాడు .రెండవ దానిలో –మనకు పూర్ణ స్వరాజ్యం కావాలి అది కావాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి .తిరుగుబాటు అంటే దేన్నీ ఖాతరు చేయక పోవటం కాదు .నీకు అర్ధరహితంగా ఉన్నదాన్ని ఎదిరించటం ,దాన్ని అంగీకరించను అని ఎలుగెత్తి చెప్పటం .ఇదే తిరుగుబాటు .నీ హృదయం ఎలా నిర్దేశిస్తే అలానడువు .సత్యం తెలియాలంటే తిరుగుబాటే మార్గం .శివుడిలా ప్రళయాన్ని ఆవాహన చెయ్యాలి .విధ్వంసానికీ దయకూ దేవుడు మేల్కొంటాడు ‘’అని రాశాడు విస్పష్టంగా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-2-23-ఉయ్యూరు