పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -6
ప్రతి సాయంత్రం నజ్రుల్ అతని మిత్రులు ఆరగాఆరగా టీ తాగుతూ ‘’దే గోరూర్ గాదుయియే ‘’అంటే ‘’ఆవుకి స్నానం చేయించు అంటూ ఒకర్ని ఒకరు పలకరించుకోనేవారు .ఈసమావేశాల్లో ఆనందోత్సాలతోపాటు ,తిరుగుబాటుతనం కూడా పెరిగింది .ఈ రెండు నజ్రుల్ ప్రత్యేకతలు .బెంగాల్ పోలీస్ రాజ్యం దీన్ని సహించ లేకపోయింది .దాని అస్తిత్వానికి సవాలుగా మారింది .దసరా పండగ లో పత్రికలన్నీ ప్రత్యెక సంచికలు తెచ్చేవి .నజ్రుల్ తన పత్రిక కోసం ప్రత్యెక కవిత ‘’ఆనంద మయీర ఆగమన్’’ –ఆనంద దేవత ఆగమనం రాశాడు. నలభై ఏళ్ళ క్రితమే బంకిం దుర్గా దేవిని మాతృభూమికి ప్రతీకగా పేర్కొన్నాడు .ఆమాతను విదేశీయుల కు విరుద్ధంగా పోరాడమని కోరాడు .దుర్గాదేవి ఆనందమయి మాత్రమేకాక దుష్ట సంహారం చేసే అపర కాళీ .నజ్రుల్ వ్యావహారిక శైలి లో ,ఆడంబరం లేకుండా ,సమకాలీన సంఘటనలు ,పోలీసుల దౌర్జన్యం అతి స్పష్టంగా వర్ణించాడు .వ్యంగ్యవైభవం పండింది .నిరంకుశత్వాన్ని లాగి చెంప దెబ్బ కొట్టింది .ఇంకేముంది పాలకులకు ఎక్కడో కాలి అరెస్ట్ వారంట్ తో వచ్చారు .పత్రిక సంచికలన్నీ జప్తు చేశారు .అప్పుడు నజ్రుల్ కలకత్తా లో లేడు.కొమిల్లాలో సేన్ గుప్త ఇంట్లో సురక్షణగా ఉన్నాడు.పత్రిక యధాప్రకారం కొనసాగుతోంది.
ధూమకేతు దీపావళి సంచికలో సంపాదకీయం టపాసులు పేల్చినట్లు మహా కటువుగా రాశాడు .అందులో ‘’నాకు ఆకలిగా ఉంది – ఆహుతికోరుతున్నా –రక్తాన్ని అర్పించు ‘’అని దుర్గామాత కోరినట్లు రాశాడు .రాజద్రోహ నేరం మోపి కొమిల్లాలో అరెస్ట్ చేసి కలకత్తా ప్రేసిడేన్సి కోర్టు లో విచారణ జరిగింది .16-1-1923 ననజ్రుల్ కు ఒక ఏడాది జైలు శిక్ష వేశారు .విచారణ సమయంలో కోర్టులో ప్రభావ వంతమైన’’రాజ బందీర జబాన్ బంది’’-ఒక రాజకీయ ఖైది ఇచ్చిన వాజ్మూలం ‘’పేరుతొ వాజ్మూలం ఇచ్చాడు .ఇది దేశం లో ప్రఖ్యాత వాజ్మూలంగా,అంతకు కొన్ని నెలల ముందు గాంధీ ఇచ్చిన వాజ్మూలంకు దీటుగా చరిత్రకెక్కింది .నజ్రుల్ ది నిర్భయ ప్రకటన .కవి కంఠం దేవుడు ఎంచుకొన్న క౦ఠం అని ,అది భారతదేశ స్థితి ,సత్యాన్నిమాత్రమే సమర్దిస్తుందని,న్యాయ ,దైవ పక్షాన్ని వహిస్తుందని ,హేయమైన వాటిని అన్నిటినీ సంహరించే సాధనం అనీ ఎలుగెత్తి చాటాడు నజ్రుల్ .-‘’నేను ప్రపంచ విప్లవ సైనికుడిని – దేవుని సైనికుడిని –ఆయన పంపగా భూమిమీదకు వచ్చాను –సత్యాన్ని న్యాయాన్నికాపాడతా-మాతృభూమి ఏదో వశీకరణ శక్తివలన నిద్రిస్తోంది-ఆయన నన్ను బెంగాల్ కు అగ్రదూతగా ,తూర్య నాదకుడిగా పంపాడు –నేను సామాన్య సైనికుడినిమాత్రమే –ఆయన ఆజ్ఞ పూర్తిగా అమలు చేయటానికే నన్ను పంపాడు ‘’ఇది ఈరోజుకీ గుర్తుంచుకోవలసిన దస్తా వేజు .
రెండువారాలు ధూమకేతు పత్రిక ఆగింది తర్వాత వీరేంద్రనాథ సేన్ గుప్తా సంపాదకత్వం లో పక్ష పత్రిక గా వెలువడింది.ఇందులో నజ్రుల్ వాజ్మూల౦ అచ్చయింది .ఎంతోకాలం సాగలేదు .మరో పదేళ్ళ తర్వాత 1931కొందరు మిత్రులు కలిసినజ్రుల్ పేరుమీదుగా ముద్రించే ప్రయత్నిస్తే ఆయన ఒప్పుకోలేదు .1923 జనవరి తర్వాత ధూమకేతు దర్శనం మళ్ళీ కలగలేదు .డిసెంబర్ లో జైలు నుంచి తిరిగిరాగా రవీంద్రుడు సాహిత్యానికిఎక్కువ ప్రాదాన్యమివ్వమని సలహా ఇచ్చాడు .కాని పూర్తిగా రాజకీయాలలో మునిగిపోవాలని ఈయనకు ఉంది.దీన్ని వ్యంగ్యంగా టాగూర్ ‘’కరవాలం తో క్షురకర్మ చేసినట్లుగా ఉంది ‘’అన్నాడు .నజ్రుల్ జైలు లో ఉన్నప్పుడు టాగూర్ ఈయన్ను బాహాటంగా బాగా సమర్ధించాడు .
నజ్రుల్ పగలూ రాత్రి ఆకలితో గడుపుతున్నాడు జైలులో .జైలు బయట జరిగే సంఘటనలకు ఆయనా ఆయన మిత్రులు కల్లోలపడుతున్నారు .టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేశారు జైలులో .బయటున్న వారికి నజ్రుల్ ఆరోగ్యం పై ఆందోళన ఎక్కువై ఆయనను దీక్ష మానమని ఒత్తిడి చేస్తున్నా ఆయన వినలేదు .రవీంద్రునికి తెలిసి ఒక టెలిగ్రాం పంపుతూ –‘’నిరాహారదీక్ష మానెయ్యండి .సాహిత్యానికి మీ మీద హక్కు ఉంది ‘’అని రాశాడు .ఈ టెలిగ్రాం ను జైలు అధికారులు నజ్రుల్ కి ఇవ్వకుండా ‘’చిరునామా దారుడి అడ్రస్ తెలియ లేదు ‘’అని తిప్పి పంపించారు .దేశ బంధు ,శరత్ మొదలైన అగ్రనాయకులు కలకత్తాలో పెద్ద ప్రదర్శన జరిపారు .బెంగాలీ ప్రజలు నజ్రుల్ ఆశయాలకోసం పోరాడుతారని దీక్ష వదిలేయమని కవి నజ్రుల్ ను ఆవేదికపై అభ్యర్ధించారు .రవీంద్రుడు కూడా ఇలాంటి హామీనే పంపాడు చివరికి నజ్రుల్ నిరాహార దీక్ష విరమించాడు .ఆయన్ను హుగ్లీ జైలునుంచి బర్హం పూర్ జైలుకు మార్ఛి ఆయన ఏ తరగతికోసం పోరాడాడో ఆతరగతి ఇచ్చారు .
జైలులో ఉన్న పదకొండు నెలలు ప్రశాంతంగా గడిచాయి .బెంగాలీ సాహిత్యం లో ఆనాటి స్మృతులన్నీ పాటలుగా గేయాలుగా అక్షర బద్ధమయ్యాయి .’’సూపర్ వందన ‘’-సూప రింటే౦డెంట్ కు వందనం ‘’గీతం పదునైన వ్యంగ్యగీతం .’’శికాల్ పోరేర్ గాన్’’-సంకెళ్ళలో పాట ప్రసిద్ధి చెంది .అందరినాలుకలపై నర్తించింది –‘’ఈ సంకెళ్ళు కపటం అండీ –మా కపట వ్యవహార మండీ-వాటిని ధరించి –దు౦ డగాలు చేసే వారిని ముప్పు తిప్పలు పెడతాం ‘’’’అని మొదలయ్యే పాటఅది .
సశేషం
మహా శివరాత్రి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-23-ఉయ్యూరు —