’నానీ’’లతో నాగలికి నమస్కారం చేసిన సోమేపల్లి
ప్రముఖ కవి విమర్శకులు గ్రంథ కర్త , వితరణ శీలి ,సాహిత్య పోషకులు ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ అధ్యక్షులు రిటైర్ద్ డిప్యూటి కలెక్టర్ మాన్యులు శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్యగారు క్రితం ఏడాది జూన్ లో వెలువరించిన ‘’నాగలికి నా నమస్కారం ‘’లోని కవితలన్నీ నానీలే అవటం బాగుంది . ఈ సంపుటిని వారు నాకు ఆత్మీయంగా పంపగా ఈ నెల ఒకటిన అంది ,ఇవాళే చదవటం కుదిరి స్పందిస్తున్నాను .నేనుపైన ఉన్ శీర్షిక పెట్టి , తర్వాత లోపలి ప్రవేశించి చదువుతుంటే శ్రీమతి చిల్లర భవానీ దేవి రాసిన ముందుమాట ‘’నానీలతో నాగలికి వందనం ‘’కనిపించి బోల్డు ఆశ్చర్యపోయాను. ఆమె వందనం అంటే నేను నమస్కారం అని సుబ్బయ్య గారి మాటనే వాడాను .ఆమె ఏమి రాశారో చదవను కూడా లేదు .ఇది యాదృచ్చికం అనుకొంటా .నేను దర్శించిన నాగలి ని మీకు పరిచయం చేస్తున్నాను .
ఇవాళ లోకమంతా కోడై’’ప్రపంచం కుగ్రామం ‘’అంటుంటే కవికి ఆయన పల్లె మాత్రం ‘’విశాల ప్రపంచం ‘’గా దర్శన మిచ్చింది .ఇది కవిగారి విశాల దృక్పధానికి తార్కాణ .జీవన గమనం లో తత్త్వం ‘’రైలు ముందుకు చెట్లు వెనక్కు పరి గెత్తినట్లు ఉండటం నిజం . కర్షకకవికనుక ఆయన ప్రయాణం ఎప్పుడూ గణగణ లాడే గంటలతో ఉన్న జోడేద్దులతోకనుక ఒంటరి తనం అసలే అనిపించదు .వరద ఆగినా ‘’కన్నీరు వెల్లువగా ప్రవహిస్తూనే ఉంది. ఆకలి డొక్కకు ముద్దకరువే కాని విలాసాల విస్తరికి దుబారా మోత లోక సహజం .నీడనైనా కావాలనుకొన్న దురదృష్టవంతుడితో మబ్బు కూడా దోబూచులాడింది .ఇల్లు పేర్లు విశాలం మను షుల మనసులు లు మాత్రం మహా ఇరుకు ఇది ఈనాటి లోకం .చవుడు నేల పండదు అని అమ్మేస్తే అందులో ‘’ప్లాట్లు పండిస్తున్నారు’’అనటం చమత్కారం .సేవకు సరికొత్త భాష్యం స్థానిక పన్నులు అని వాయించటం నేటి ఏలికల మనస్తత్వాన్ని ఆవిష్కరించారు .మర్రి చెట్టు ఇప్పటికీ’’ ఉమ్మడి కుటుంబమే ‘’ అది స్పూర్తి కూడా .
పొలం పనిలో శ్రమ సౌందర్యం సూర్య చంద్రులు శ్రామికులకు చలువ పందిళ్ళు .బుల్లితెర చెత్తనుంచి కూడా సంపద పిండితే బతికి పోతాం అని వ్యంగ్యాస్త్రం .బండ రాయిని చీల్చుకొచ్చిన మొక్క దమ్ము ,ధైర్యానికి ప్రతీక .అదే అందరికి ఆడర్శమవ్వాలని ఆకాంక్ష .పదవి పోయాక రక్షణ వలయమే నేర పంజరం .సంసార సాగరంలో దంపతులు జీవిత ఖైదీలే .ఎన్నికల వర్షానికి సంకేతం కాలుష్య మేఘం .ఊర చెరువు క్రికెట్ ఆటస్థలం అవటం లో మతలబ్ ఏమిటని ప్రశ్న .రాలిన పూలే ననేల చీరకు కొత్త డిజైన్లు అనటం స్వాభావికంగా ఉంది.చెప్పులజోడు లా మనుషులు ఎందుకు కలిసి ఉండరు అని థౌజండ్ డాలర్ క్వస్చిన్ .చెమట చుక్కకు చేతులు జోడిస్తే మట్టి మరింత పరిమళ భరితం అని స్వానుభవం చెప్పారు .అవయవ దానం చేసిన దాత ను చూసి,నోట్లో పచ్చి వెలక్కాయ పడి నిస్సహాయంగా యమదూత అనటం గొప్ప సెటైర్ .అన్నదాతకు అజీర్తే –అధికంగా పెడుతోంది నీటి బువ్వ ‘’అనటం చూస్తె కవిలో మంచి భిషగ్వరుడు న్నాడనిపిస్తుంది. గాలికి ఊగేచెట్ల కొమ్మలు సమైక్యరాగానికి చిహ్నాలు .
‘’ఇంటి శిగపై జలభాండం – మనిషి ఒంటికి తలప్రాణం ‘’భాండం బద్దలైతే ప్రాణం హుష్ కాకీ అనే సూచన ఉందేమో ?చేతిరాత లాగా ,మతిపోకడా వ౦కరా టి౦కరే’’.’’ఇవాళ భూమి జీవన వ్యోమ నౌక ‘’ అని సరికొత్త భాష్యం చేశారు .’’పంట పరిమళం పెంచెందుకూ మ౦చె కావాలి’’అనటం కూడా స్వానుభవం .గూగుల్ దగ్గర చుట్టమైన నాడు బంధువులంతా దూరం దూరం అనేది చేదు నిజం ,వాస్తవం .ముసలితనం లో చెట్టుకొమ్మ ఊత అయి,అయిన వారికంటే ఆప్తురాలౌతుంది .పూర్వం పది మంది ఒకే ఇంట్లో –ఇప్పుడు పది గూళ్ళల్లో ఒక్కొక్కరు ‘’అంటూ సైబర్ ఉద్యోగాలపై అపార్ట్మెంట్ కల్చర్ పై చెణికారు .’’చెలిమే –జీవన శాశ్వత వీలునామా ‘’ అని దస్తావేజు రాసేశారు కవి .కనిపించని మూడో బానిస –పాలేరు –నిశిత పరిశీలలో వెలువడిన కఠోర సత్యం .రోడ్డు వెడల్పులో –పూటకోగూడు సమాధి ‘’.భూమిలోని నెర్రెలు –పుడమి తల్లి కడుపు ఎండటానికి గుర్తు ‘’
ఇలా తమ కర్ష కానుభవం , జీవితసత్యాలు , లోకంపోకడ కలగలిపి అల్లిన అయిదవ 105 నానీల కదంబ మాలికను అందరికి అన్నం పెట్టె నాగలి మాతకు అలంకరించి నమస్కరించారు సోమేపల్లి వారు . నాగలికి ఇలా మొక్కిన వారు అరుదు అని నాకనిపించింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-23-ఉయ్యూరు