పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -10
విరిగిన రెక్కలపై
ఆర్ధికంగా ఉన్నతం లో ఉన్న నజ్రుల్ కు ఇద్దరు కుమారులతర్వాత మూడవ సంతానం కలుగ బోతోంది .ఇంటి వ్యవహారాలన్నీ అత్తగారు గిరిబాలా దేవి శ్రద్ధగా చూసుకొంటున్నది .హెచ్ ఎం వి తోపాటు సోనీలా ,మెగాఫోన్ మొదలైన గ్రామ ఫోన్ కంపెనీలన్నీ ఆయన పాటల కోసం ఎదురు చూస్తున్నాయి .కలకత్తా సినీ పరిశ్రమకూడా ఆయన సంగీత సాహిత్యాలకోసం అర్రులు చాస్తోంది .ఫజలీ బ్రదర్స్ తమ చోరంగి సినిమాలో ఆయన తో పాటలు రాయిచారుకాని పారితోషికం పూర్తిగా నజ్రుల్ కి లభించలేదు .నజ్రుల్ తాను రాసిన నాటకాలకు పాటలు కూడా రాశాడు .ధ్రువ సినిమాలో నజ్రుల్ నటించాడు అంటారు .మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్పినట్లు నజ్రుల్ బహుముఖ ప్రజ్ఞాశీలి .మొదటి కొడుకు బుల్ బుల్ ను అత్య౦త గారాబంగా ప్రేమగా పెంచాడు కాని మసూచితో అతడు మరణించటం తట్టుకోలేక పోయాడు. అతని మంచం పైనే కూర్చుని అతని చెయ్యి తన చేతితోపట్టుకొని నిద్ర పోయేవాడు కాదు .అతని మరణం బాగా కుంగ దీసింది .క్రమంగా తట్టుకొని నిలబడ్డాడు .మళ్ళీ పాటలు రాయటం మొదలుపెట్టి ‘’చంద్ర బిందు ‘’పుస్తకం ప్రూఫ్ లను కూడా దిద్దాడు .తన వ్యక్తిత్వం రచనలతో ఒకకొత్త గాంభీర్యాన్ని ,లోతు ను సంపాదించాడు .’’చలోమా అనంత ధాం’’లాంటి అద్భుత భక్తిగీతాలు,’’అమిక సుఖేగో గృహో రభో ‘’వంటి కీర్తనలు ,శ్యామ సంగీతాన్ని ,ఇస్లాం గీతాల్నీ రాశాడు..ముస్లిం అయినా కలకత్తా కాళీ మాత అంటే విపరీతమైన ఆరాధన . ఆన౦దమయి మాతా అంటే గౌరవం భక్తీ .’’ఇస్లాం ఎర్ర దివిటి అన్ని చోట్లా వెలుగుతోంది ‘’అని గీతం రాశాడు .ఇందులో దివిటి సర్వమతాలకు చెందింది .
పెద్ద కొడుకు చనిపోయాక నజ్రుల్ కాళీమాత గీతాలలో ‘’సహజియా ‘’ల దేహతత్వం మొదలైన నిగూఢ విషయాలు చోటు చేసుకొన్నాయి .ఇంట్లో కూడా గుహ్య విద్య ,అతీంద్రియ విద్య పై నిమగ్నంయ్యేవాడు .ఇది మిష్టిక్ వాదానికి భిన్నమైనది .హిందూ-ముస్లిం మతాల సాధారణ పద్ధతులకు అది భిన్నంగా ఉంటుంది .మళ్ళీ ఇస్లాం వైపు మళ్లినట్లు పాపాలను ఒప్పుకోన్నట్లు కనిపిస్తుంది .కాళీ మాతను ఇస్లాం ను అంతరాంతరాలలో ఆరాధించటం ఆయన ప్రత్యేకత .ఆయనలో చివరదాకా హిందూ శ్యామ సంగీతం ,ముస్లిం ఉపాసనా విధానం చెట్ట పట్టాలు వేసుకొనే నడిచాయి .సత్యం ఒక్కటే. పరమేశ్వరుడు ఒక్కడే అన్నదే ఆయన విశ్వాసం .
ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది .దానిప్రభావం సృజనాత్మకత పైకూడా పడింది .1936-42 మధ్య ఆయన గడిపిన జీవితం అత్యంత బాధాకరం .బాధలు మర్చిపోవటానికి హఠయోగం వైపు మళ్ళాడు .దారుణ దుఖం వలన తర్కరాహిత్యానికి ,అవివేకానికి లొంగిపోయాడు .ఆ రోజుల్లో లాల్ గోడా హైస్కూల్ హెడ్ మాస్టర్ వరదా చరణ్ మజుందార్ నజ్రుల్ అరవిందులు లాగా ఆధ్యాత్మిక శక్తులు సాధిస్తే కొడుకు ను ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడ వచ్చు అని చెప్పగా వెళ్లి ఆయన వద్దదీక్షపొంది ,కాషాయాలుకట్టి ఆయన మార్గ దర్శకత్వం లో యోగ సాధన ప్రారంభించాడు.అప్పుడుకూడా ఉన్నత సృజనాత్మక రచనలు చేశాడు .
తర్వాత జబ్బు పట్టుకొని క్రమక్రమ౦గా శరీరమంతా వ్యాపించింది .మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు తర్వాత మానసిక రుగ్మత అని గ్రహించారు .వైద్యం చేయించారు .దెబ్బమీద దీబ్బ అన్నట్లు భార్య ప్రమీల జబ్బుపడి మంచం పట్టింది .శరీరం కిందిభాగం కదల్చ లేకపోతోంది .అయినా చేయగల ఇంటిపనులు చేస్తూనే ఉంది.ఆమెను చూసి మానసికంగా మరీ కుంగిపోయాడు నజ్రుల్.దంపతులిద్దరికీ వైద్యం సుశ్రూష అవసరమయ్యాయి .ఖర్చు విపరీతంగా పెరిగింది .దీనికి తోడూ ఆయన ఆర్ధికం కూడా బాగా విషమించింది .ఆయన ఖర్చులు భార్య, అత్తగారి చేతులు దాటిపోయాయి .ఎప్పుడూ డబ్బు కుప్పలు వచ్చి మీద పడతాయి అనుకున్నాడుకాని వేసవికాలపు నదిలా ఎండి పోతుంది అని ఆభావుకకవి భావించని దాని దుష్ఫలం ఇది .ఇప్పుడు గత్యంతరం లేక తన హెచ్ ఎం వి కంపెనీ రాయల్టీ ని 1939లో ,1937 తర్వాత రాసిన సాహిత్య ప్తరులను సొలిసిటర్ అసీం దత్త దగ్గర నాలుగు వేల రూపాయలకు తాకట్టు పెట్టాడు .చిన్న చిన్న బాకీలు తీర్చాడు .కాని కుటుంబ ఖర్చులకు చాలలేదు .వైద్యం కోసం చేసిన బాకీలు తీర్చలేక పోయాడు .భార్యకు ట్రెయినింగ్ పొందిన నర్సు సేవలు కావాల్సి వచ్చింది .రెండవ ప్రపంచ యుద్ధం మొదలై వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి .
నజ్రుల్ కవి పక్షి రెక్కలు ఆడటం లేదు.ఉద్యోగం చెయ్యలేడు .కవిత్వం రాయలేక పోతున్నాడు .అవసరాలు పెరిగిపోతున్నాయి .కష్టపడి ధైర్యం కూడా దీసుకొంటున్నాడు .కాంగ్రెస్ –ముస్లిం సంఘర్షణ కలకత్తాలో పెరిగిపోయింది .ఇంతటి అనారోగ్య పరిస్థితులలోకూడా నజ్రుల్ ఆ రెండు సిద్ధాంతాలను ఖండించాలనుకొని ప్రబోధాత్మక గీతాలు రాయగా అవన్నీ 1945 తర్వాత విడుదలయిన ‘’నవీన్ చాంద్ ‘’ సంకలనం గా వచ్చాయి .నజ్రుల్ స్థితి నానాటికీ క్షీణించింది .చివరిదాకా ఆయన్ను అంటి పెట్టుకోన్నవారు శ్రీ కాళీ పద గుహరాయ్ ,మహాయోగి శ్రీ అమలే౦దు దాస గుప్త ,మహా ఆలోచనాపరుడు నృపేంద్ర కృష్ణ చటర్జీ ,ప్రసిద్ధ వ్యాసకర్త జుల్ఫికర్ అహ్మద్ .వీరంతా నజ్రుల్ భారాన్ని శక్తివంచన లేకుండా తగ్గించే ప్రయత్నం చేశారు .నజ్రుల్ ధైర్యం కోల్పోలేదు .అధిక యోగ సాధనలో మునిగిపోయాడు .
1941 ఏప్రిల్ లో ముస్లిం సమావేశంలో మాట్లాడుతూ ‘’నా మురళి మూగాబోతే –నేను కవిగా మాట్లాడటానికి రాలేదు .మీప్రేమాభిమానాలు పొందినవాడిగా వచ్చాను .హక్కుతో మాట్లాడుతున్నా .నన్ను క్షమించండి .దయచేసి నన్ను మర్చిపోండి .నేను కవి నాయకుడు అవటానికి పుట్టలేదు .ణా ప్రేమ పంచటానికికే పుట్టాను..ఆప్రేమను ఎక్కువగా కోరినా అది నాకు లభించలేదు .మౌన ఆశాభంగంతో శుష్కం, ప్రేమ రహితమైన ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకొంటున్నాను ‘’అని ఆవేదనతో మాట్లాడాడు .అప్పటికి ఇంకా ఆయన మానసిక స్థితి పూర్తిగా దెబ్బతినలేదు .రవీంద్రునికి శోకతప్త హృదయంతో కవితా శ్రద్ధాంజలి ఘటించాడు .1942 చైనా నాయకుడు చాంగ్ కై షేక్ ఇండియావస్తే ,ఒకకవితతలో స్వాగతం పలికాడు నజ్రుల్.
ఒక రోజు శ్యాం బజార నుంచి నజ్రుల్ మాయమయ్యాడు .మర్నాడు సాయంత్రం వరకు జాడ తెలియలేదు .దక్షిణేశ్వర్ లోని రామకృష్ణ మఠం వద్ద ఉన్న కాళీ దేవాలయం పరిసరాల్లో ఆయన జనసమ్మర్డం లో ,అతి వేగంగా వస్తున్న మిలిటరి ట్రాక్ ను ఏమాత్రం పట్టించుకోకుండా నజ్రుల్ నడుస్తూ కనిపించాడు .కానీ సురక్షితంగా ఉన్నాడు .1942 జులై 9 సాయంత్రం కలకత్తా రేడియో నుంచి ఒక ప్రసంగం ప్రసారం చేస్తున్నాడు .ప్రసారం మొదలైంది .కానీ అకస్మాత్తుగా ఆయన నోటి మాటపడిపోయింది .ఇంటికి తీసుకు వచ్చే సమయానికి ఆయన మానసిక యోగ్యతలన్నీ పోయాయి .రెండేళ్ళ క్రితం ఆయన తలాతోకా లేని రెండు వాక్యాలు ‘’నేను ఢాకా వెడతా గాంధీని కలుస్తా ‘’అనే మాటలు అన్నట్లు చెబుతారు .
1942లో పూర్తిగా ఆస్వస్తుడు అయ్యాక డా .బిసి రాయ్ ఆయనకు వెంటనే వైద్యం చేయటానికి అంగీకరింఛి వచ్చి చూసి లాభం లేదని మానసిక రోగుల లుంబిని ఆస్పత్రిలో చేర్పించారు .డా.జి ఎస్ బోస్ వైద్యం చేశాడు .యుద్ధ సమయం కనుక విదేశాలకు తీసుకు వెళ్ళే అవకాశం లేదు .డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆయన కుటుంబానికి సాయం చేయటానికి ఒక రిలీఫ్ కమిటీ ఏర్పాటు చేసి కొంతకాలం నడిపాడు .ఈ కమిటీ ఆయన పోగొట్టుకొన్న వాటిని తిరిగి పొందటానికి విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు .1946లో యుద్ధం పూర్తయ్యాక ,కూతురు అల్లుడు ఆరకంగా ఉండటం చూసి తట్టుకోలేక అత్తగారు గిరిబాల ఇంటినుంచి మాయమయింది. ఆవిడ వివరాలు తర్వాత తెలియలేదు .భారత్ స్వాతంత్ర్యం సాధించాక బెంగాల్ ప్రభుత్వం నజ్రుల్ కు నేలకు 200 రూపాయల గౌరవ వేతనం ఇవ్వటం ప్రారంభించి ,30-6-1962 వరకు అంటే ఆయన మరణించేదాకా ఇచ్చింది భార్య ప్రమీల జబ్బు మనిషే అయినా ఆడబ్బుతో నజ్రుల్ ఇద్దరుకోడుకులు తానూ ఉన్న ఆ కుటుంబ పోషణ చేసింది .23ఏళ్లుగా తాను రోగంతో బాధపడుతున్నా ,భర్త నజ్రుల్ కు కడ దాకా సేవ చేస్తూనే ఉంది.సమకాలీన బెంగాలీ సాహిత్యం లో నజ్రుల్ భార్య ప్రమీలకు విశిష్టస్థానం పొందటానికి అన్ని అర్హతలు ఉన్నాయి .
1952లో వైద్య సహాయక కమిటీ ఏర్పడి నజ్రుల్ కు విదేశాలలో వైద్యం చేయించటానికి మిత్రులు కొంత ధనం పోగు చేశారు .1953 మే నెలలలో నజ్రుల్ భార్య ప్రమీలతోకలిసి యూరప్ బయల్దేరాడు.లండన్ , వియన్నాల లో ఎక్స్పర్ట్ డాక్టర్ల అభిప్రాయం తీసుకొన్నారు .సోవియట్ నిపుణులతో కూడా సంప్రదించారు .అప్పటికే చాలాఆలస్యం జరిగిపోయిందని ,చెయ్యి జారిపోయిందని అందరుఏకాభిప్రాయం చెప్పారు .కనుక కొన్ని నెలలకే యూరప్ నుంచి తిరిగి వచ్చేశారు .1962లో నజ్రుల్ అర్ధాంగి ప్రమీల ఆయన్ను వంటరి వాడిని చేసి చనిపోయింది .ఇప్పుడు ఒంటరి పక్షి నజ్రుల్.పిల్లల పెళ్ళిళ్ళు అయి సంతాన వ౦తులయ్యారు. తండ్రి నజ్రుల్ కవిత్వాన్ని కొడుకు కాజీ సవ్యసాచి అత్యద్భుతంగా గానం చేయటంలో సుప్రసిద్దుడయ్యాడు .నజ్రుల్ పుట్టిన రోజు జాతీయ పర్వదినం అయింది .ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం .పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన గ్రాంట్ ను 300లకు పెంచి ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పించింది .తూర్పు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతినెలా 350 రూపాయల అదనపు గ్రాంట్ ఇచ్చింది .1971తూర్పు బెంగాల్ విప్లవ సందర్భంగా గ్రాంట్ ఆగిపోయింది .బంగ్లా దేశ్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత రాష్ట్రపతి కాజీ నజ్రుల్ ఇస్లాం కు పద్మభూషణ్ పురస్కారం అందజేశారు కలకత్తా యూని వర్సిటి ఆయనకు బాగా ఇష్టమైన ‘’జగత్తారిణి’’ స్వర్ణ పతకమిచ్చి సన్మానించింది .1967,1969 సంవత్సరాలలో ఉన్న పశ్చిమ బెంగాల్ సంయుక్త ప్రభుత్వాలు కవి నజ్రుల్ కు నివాసంగా ,ఆయన అధ్యయన కేంద్రంగా ఉండే భవన నిర్మాణం స్థాపించటానికి నిర్ణయించాయి .1969లో కలకత్తాలోని ‘’డండం’’విమానాశ్రయ మార్గానికి నజ్రుల్ ఇస్లాం పేరు పెట్టి గౌరవించాలనుకొన్నా అనేక కారణాలవలన అది రూపు దాల్చలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-2-23-ఉయ్యూరు