పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -11(చివరిభాగం )
మొదట్లో మానవ హక్కుల కోసం నిర్భయంగా పోరాడే యోధుడు ,క్రమంగా కవిగా సంగీత స్రష్టగా ,రచయితగా ఎదిగాడు నజ్రుల్ ఇస్లాం .ప్రజాకవిగా జన హృదయాలలో నిలిచిపోయాడు .స్వతస్సిద్ధ సౌందర్యం భావ స్వచ్చత ఆయన ప్రత్యేకతలు .హిందూ ముస్లిం ఐక్యత అభిలషించిన ఉత్తమ వ్యక్తీ .ఆయన సత్య సౌందర్యాలకు ,విశ్వ మానవత్వానికి ,మానవ హక్కులకు పాటు పడిన మనీషి .తిఉగుబాటుతనం ఆయన రక్తంలోనే ఉంది .ఆయన జీవిత అన్వేషణ సహజ దీప్తి తో ప్రస్ఫుటమయ్యేది .’’సింధు –హిందోళ ‘’లోఆయన సంకలిత కవితలను ‘’ఆమార్ సుందర్ ‘’-ఓ నా సౌందర్యమా లో ప్రకటించిన చివరి ఉద్ఘాటనగా చెప్పచ్చు.ఇందులో ఆయన ప్రసిద్ధ కవితలన్నీ చోటు చేసుకొన్నాయి .ఇందులో అనామిక ,దారిద్ర్యం కవితలు .తన మిత్రుడు ముజఫర్ అహమ్మద్ జైలు లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి నవ్ ద్వీప్ కు స్టీమర్ లో వెళ్ళినప్పుడు ‘’సింధు –హిందోళ ‘’కవిత ఆవిర్భవించి ఉండచ్చు . సముద్రాన్ని ఆహ్వానించటం సౌందర్యం ఆనందంపై ఉత్సాహం ,వాటినిపొందాలనే తపనా తనలో ఉన్నట్లు చెప్పాడు .’’నువ్వూ అంతేనా ‘’అని సముద్రుడిని ప్రశ్నిస్తాడు ..సముద్రుడిని ఉదాత్త ప్రేమికుడుగా ఆవిష్కరిస్తాడు .తాను ఏమీ ఆశించకుండా సముద్రుడు తన సర్వ సంపదను ప్రపంచానికి ఇచ్చే సే ప్రియమిత్రుడు కనిపిస్తాడు నజ్రుల్ కు .-‘’ఓ సౌందర్యమా ప్రణామం –నువ్వూ రోదిస్తున్నావ్ –నేనూరోదిస్తున్నాను –అహోరాత్రాలూ –నా ప్రియసఖికూడా రోదిస్తోంది .ఇందులో సాఫల్యం లభించని అన్వేషణ ,చిత్రణ ,జీవితం పట్ల గ్రాహ్యతా నిస్సహాయత కనిపిస్తాయి .
అనామిక కవితలో శాశ్వతమైన సమస్య అయిన ప్రేమకు అర్ధాన్ని అన్వేషించటం కనిపిస్తుంది .ప్రేమికులు అనంతం అయినా ప్రేమ మాత్రం ఒక్కటే అన్న సత్యం చెప్పాడు .ప్రేమ అంటే కామ వాంఛ.అంటే లిబిడో.జీవన దీప్తికాదు. స్వతంత్రంతో కూడిన భావోద్రేకం .ప్రపంచంలోని వస్త్వాశ్రయ ఆత్మాశ్రయాలను జోడించి చెప్పిన ఉత్తమకవిత ‘’దారిద్ర్యం ‘’..దరిద్రం తనని ,తనదారినీ మార్చలేదు అనీ ,సౌందర్యం పరాజయం పొందలేదని ఉద్ఘోషించాడు నజ్రుల్.దారిద్ర్యం విప్లవానికి నేతృత్వం వహించి ,అసత్యాన్ని కురూపకతను నిర్మూలిస్తుందని చెప్పాడు –‘’అంచేత అనుమానం అన్నది రారాదు –యవ్వనపు విజయాన్ని,దిశ దిశలా –సౌన్దర్యకన్యలు గానం చేయాలి-కురూపాలూ అసత్యాలు –శాపానికి గురికావాలి –ఇంకాఆలస్యం ఎందుకు ?రావే నా పరమానందమా సౌందర్యమా –రావే రావే ప్రకాశమా ‘’.సౌందర్యం పరమానందం ప్రకాశంతోకూడిన ప్రపంచ మహత్తర యుగం వస్తుందని ఆశించాడు .
నవ యుగ పత్రికలో ఫజులుల్ హక్ పని చేయటానికి మళ్ళీ నజ్రుల్ ను ఆహ్వానించినపుడు 1945 మే లో ‘’అమార్ సుందర్’’ను ఆసంచికలో రాశాడు నజ్రుల్.అది విశ్వాస ప్రకటన –APOLOGIA PRO VITA SUE’’.అందులో తన జీవిత అన్వేషణ వివరణ ,జీవన దేవత ఆవిష్కరణ రెండూ ఉన్నాయి .టాగూర్ అంతటి చిక్కని కవిత్వం లేకపోయినా అసాధారణ కళాకృతి ఉంది.నజ్రుల్ ను అర్ధం చేసుకొనే కీలకభావాలు కనిపిస్తాయి .ప్రళయ సౌన్దర్యంకోసం అయన రోదించాడు .సౌందర్యం ఒక మిత్రుడులా ఆయన్ను చేరింది ‘’నేను స్వర్గ లోకపు సౌందర్యాన్ని చూశాను ‘’అని స్పష్టంగా చెప్పాడు .అప్పుడు మాతృదేశం తన ఋణం తీర్చుకోకుండా ఎక్కడికి వెడతావని నిలదీసింది –‘’అప్పుడు నేను నేలమీదకు వచ్చాను ‘’అని చెప్పుకొన్నాడు .కవి ఎప్పుడెప్పుడు తప్పించుకు పారిపోదామన్నా అదిమాత్రం పట్టుకొని వదిలి పెట్టలేదు .ఒక అపరిచిత వ్యక్తిద్వారా పొందిన అంతర్ దృష్టి తో నజ్రుల్ విచారం పటా పంచలైంది.-‘’నేను తల్లి ధరిత్రిని –అమిత ప్రేమతో స్వీకరించాను-ఆతల్లి ప్రేమ కౌగిలిలో దేశంలో, బెంగాల్ లో ఉన్న బీదల ,దళితుల దీన స్థితి అర్ధం చేసుకొన్నాను ‘’అని చెప్పుకొన్నాడు .మాతృభూమిని దాస్య శ్రుమ్ఖ లాలనుంచి తప్పించే వరకు తనకు దేవుడు ముక్తీ అక్కర్లేదు అన్నాడు .
వికసించి వాడిపోయే పువ్వుల్లో ఆయన ‘’సౌందర్యాన్ని దర్శించాడు .నది,గాలి, నీలి సముద్రం తనకు తోడబుట్టినవని భావించాడు .అవీ ఆయనకు జేజేలు పలికాయి .తర్వాత కారు చీకట్లతో తుఫాన్ వచ్చి మీదపడి ‘’నేను వినాశన సౌందర్యాన్ని ‘’అని చెప్పింది .మళ్ళీ భావనా పూర్వ అంతర దృష్టిపొందాడు.సృజన సౌందర్య౦ అర్ధం చేసుకొన్నాడు అది సంపూర్ణ పూర్ణత్వాన్ని ఇస్తానని చెప్పింది అయితే ఆయన తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ,మానవ జగత్తులో ఉన్న ఆదిమ సౌందర్యాన్ని ,పరిశుద్ధతను నెలకొల్పాలి అని షరతులు విధించింది .ఈరచన ను ‘’తధాస్తు ‘’తో ముగించాడు నజ్రుల్.స్వదేశ సేవకు ,మానవ సేవకు అ౦కితంకావాలని కోరగా అలానే నడిచాడు .నజ్రుల్ రాసిన ఈ వీలునామా సౌందర్యం విశ్వాసాల వీలునామా మాత్రమె కాదు .అది ఒక మానవతావాది రాసిన వీలునామా .
సంపూర్ణం
ఆధారం –మొదటి భాగంలోనే చెప్పినట్లు –గోపాల్ హాల్దార్ రాసిన దానికి శ్రీమతి చాగంటి తులసి చేసిన అనువాద పుస్తకం –కాజీ నజ్రుల్ ఇస్లాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-23-ఉయ్యూరు