తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం
కేశవశతక ,మార్కండేయ ,గోపీచ౦దు ,సత్య హరిశ్చంద్ర ,అభిజ్ఞాన శాకుంతల ,కోటీశ్వర తారావలీ,దుర్గా స్తోత్ర దండకం మొదలైనవి రచించిన శ్రీ గోపాలుని పురుషోత్తమ పాకయాజి కవి ‘’తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం’’ రచించారు .కవిగారు బెజవాడ లో సత్యనారాయణపురవాసి .ఈ శతకముపై బాలసరస్వతి ,ఆశుకవీంద్ర సింహ ,ఆశుకవి చక్రవర్తి ,కుండిన కవిహంస ,కవి రత్న ,అవధాని పంచానన ,కవి కేసరి ,కల్పిత కథారచనా ధురీణ ,,కవి భూషణ ,ప్రౌఢ భారతి ,ఆశుకవి సమ్రాట్ బిరుదాంకితులు శతావధానులు శ్రీ కొప్పరపు సోదర కవులు తమ అభిప్రాయాన్ని పద్యాలలో చెప్పారు .’’శ్రీరామ చంద్ర శతక మె-వారుం బఠియి౦ప ,విన్న –శ్రీ రమ్య కీర్తి యుతులై –మీరెద రిష్టార్ధ సిద్ధి మేకొన నెపుడున్ ‘’- నీతియో భక్తియో తెల్పి –రాతల సువ్యాప్తి శతక రాజములొప్పున్- నేతకవి –ఖ్యాతిని మరి రెండొసగగా జాలవుగా ‘’ అని రెండు కందాలలోనూ ,’’కనుపర్త్యన్వయుడౌనృసింహ గుణికా౦క్ష౦దీర్పగన్ భక్తి-పెంపెనయన్ దిర్మల పూర్ణి కేతనునిపై ,నిక్ష్వాకు సద్వంశ పా –వనుపై ,భక్త జనావన వ్రతునిపై వ్రాసెన్ ,బుధే౦ద్రుల్ హి-తాత్మను వీనిం బురుషోత్తమార్యుని,గళోత్సాహుం బ్రశంసిం పరే’’అని శార్దూలం లోనూ –‘’ఉత్పలమాలలో –‘’భక్తి ప్రధాన మీకృతికి భక్తు డితండు రచించె దీనినా –సక్తిని ,దుర్విమర్శము సల్పక,నేర్పున నాలకి౦చినం-రక్తి ఘటిల్లు గాదని రాటల వారికి గాక ,గల్గదీ –వ్యక్తికి సు౦త యేని భక్తుడు భగవంతుని పాల ను౦డడే’’ –‘’కందనిభైక మూర్తివని కందములన్ శతకంబు జేసి మున్నుం దనియించె వేంకయ యనూనమతిం దన దండ్రి యం-చు నీవెందు సువృత్త భూషి వగుటెంచి ,సువృత్తములన్ –భజి౦చె బెంపొందెడు భక్తి జూపి ,పురుషోత్తమ యజ్వ యితండు రాఘవా ‘’అంటూ రాఘవుడికి సిఫార్సు చేశారు సోదరకవులు .సాధారణ౦గా కొప్పరపు వారిపద్యాలు లభించటం అరుదు .అందుకే వారు రాసిన అన్నిపద్యాలు పేర్కొన్నాను .కవిగారి శతకం శార్దూల మత్తేభ విక్రీడితం .’’రామ చంద్ర ప్రభూ ‘’అనేది శతక మకుటం .శతకం 1936లో బెజవాడ కన్యకా ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెలతెలుపలేదు .ఈ సీతారామ పురం ఏలూరులో ఉంది .
మొదటిపద్యం శార్దూలం –‘’శ్రీ వైకు౦ఠ మయోధ్య గాగ సిరియే సీతామహదేవి-గా గైవల్య ప్రభు డీవ రాఘవుడు గాగన్ ,శంఖు చక్రం-బులే సేవాసక్తులు కైక సూనులుగ దచ్చేషుండు సౌ-మిత్రి గా నావిర్భూతులు గారె తిర్మలపురీ౦ద్రా రామ చంద్ర ప్రభూ ‘’అంటూ మొదటిపద్యంలోనే శ్రీరామాదుల జన్మ రహస్యం చెప్పారు .తర్వాత మీన వేషంతో సోమకాసుర వధ మత్తేభంలో పాల సముద్ర మధనం ,కూర్మావతార విశేషం వేదాలనపహరించిన హేమాక్షుడిని వరాహ రూపంతో చంపి వేదోద్ధరణ చేయటం ,మిగిలిన అవతా ల పరమార్ధం వరుసగా వర్ణించారు .రామావతారం తాటకి వధ మునియాగ సంరక్షణం ,బలరామ రామా కృష్ణావతారం ,ద్రౌపదీ మాన సంరక్షణం ,చెప్పారు ‘’శిబి ఏమిచ్చాడు ?అహల్య ఏమిచ్చింది ,గజేంద్రుడు ,పాంచాలీ ఏమిచ్చారు ?ఏమీ ఇవ్వకపోయినా నీవారిని కాపుకాస్తావు ప్రబల ప్రేమతో ‘’అని కీర్తించారు రాముని . , ,
శుక శ౦తన,ప్రభవ ,పారాశర్య ,కౌంతేయ ,శౌనక దాల్భ్య ,అమ్బుజగర్భ మహా భక్తులను కీర్తించి ,ఒకే సూర్యుడు అనేక భా౦డాలలో కనిపించినట్లు ,నువ్వు ఒక్కడివి అనేక రూపాలు పొంది కార్య విధులు తీరుస్తావు .ఒకటే మన్ను కుండలుగా బొమ్మలుగా మారినట్లు ఒకే బంగారం అనేక నగల రూపం పొందినట్లు ,శరీరాలు ఎన్నైనా అందులో పరమాత్మ ఒక్కడే వెలుగొందుతాడు .రఘురామా ఇనవంశ సోమా ,విలస ద్రాజకంఠీరవా ,మఘ సంరక్షక ,దుష్ట శిక్షణ ,మునీంద్ర సంపోషణా,మఘవాద్యర్చిత పాద పద్మ యుగళా ‘’అంటూ రామగుణగానం చేశారు .లోకారాధ్యుడవైనా ,యాదవ బాలుడుగా పేరుపొంది లోక కంటకుడైన మేనమామను సంహరించి ,నీ తలిదండ్రుల చర విడిపించావు.లేదు లేదు అన్న దైతునికి కొడుకు ప్రార్ధనతో స్తంభం లో కనిపించి ప్రహ్లాద వరదుడవయ్యావు. తులసి దళాలు యెంత పుణ్యం చేసుకోన్నాయో ‘’నీ మెడలో పవిత్ర తోమాలగా విరాజిల్లుతున్నాయి ..కురువంశం నిర్మూలనం అపాండవం చేస్తానని అన్నం పెట్టిన రాజుకు వాగ్దానం చేసి .బ్రహ్మాస్త్రం గురుపుత్రుడు ప్రయోగిస్తే ‘’ఉత్తరాతనయున్ గర్భస్తుడౌ వాని నేర్పరివై కాచిన వాడివి .107 వ చివరి పద్యంగా మత్తేభం పై విజ్రుమ్భించి -‘’త్రిదశాధీశ్వర మౌని రాజహిత వర్తీ ,ఘోర దైతేయ భీ –ప్రదశౌర్యోజ్వల మూర్తి ,సర్వ జగతీ రాజ్యే౦దిరా సమ్మదా –స్పద సర్వేశ్వర లాంఛనాయుతయుతా ద్వంద్వైక సత్కీర్తి పూ-ర్ణ దయా విశ్రుతమూర్తి ,తిరమల పురీ౦ద్రా ,రామ చంద్ర ప్రభూ ‘’అని శతకం ముగించారు .
తర్వాత శ్రీరామ చంద్ర స్తుతి ఋతుమాల రాశారు .అందులో రామాయణం ఆరుకాండలు వాటిలోని రామ చరిత్ర ‘’సీసా’’లలో నింపారు .సుందరం లో –‘’త్వన్నామ మంత్రంబు ధ్యానించి పవనుజుడబ్ధి’’దాటాడని చెప్పారు .తర్వాత శ్రీ మదాన్జనేయ స్తుతి పద్య పంచ రత్నాలు సమర్పించారు హనుమకు .అందులో తన ను గురించి –కనుపర్తి వంశం లో పుట్టానని ,లక్ష్మీ నరసింహుని కోర్కెన్ పంచరత్నాలు రాశానని ,తనపేరు గోపాలుని పురుషోత్తమయజ్వ అని చెప్పుకొన్నారు .ఫలశ్రుతి కూడా కూర్చారు .శాలివాహన శకం దాత నామ సంవత్సర జ్యేష్ట కృష్ణ ఏకాదశి నాడు రామచంద్రశతకం పూర్తి చేశానని చెప్పారు .కనుపర్తి నర్సయ్య ,లక్ష్మీ నర్సు దంపతులకు సుబ్బరాయ గుర్రాజులు కుమారులు .మహామతి వీరార్యుకుమారుడు నరసింహం గారు కోరగా ఈశతకం రాశారు .’’షట్సహస్రాన్వయ జలజాత వన సూర్యుడు అయిన కనుపర్తి లక్ష్మీ నరసింహంగారు ఆంగీరస ఫాల్గుణ శుద్ధ నవమి ఆదివారం మృగా శీర్ష నక్షత్ర యుక్త మీనరాశి పుష్కరాంశం లో పగోజి ఏలూరులోని తిరుమలాపురం లో ‘’అవనిజ ,సౌమిత్రి ,ఆంజనేయ ,భోగ సుందర నామ విస్ఫురిత నాము డైన శ్రీ రామ చంద్రుని ప్రతిష్టించి ఆలయం గోపురాదులు నిర్మించి ,ధ్వజస్తంభం రధం ,ప్రాకారాలు మండపం మొదలైన వాటితో సీతారామ పురం ఏర్పరచారు .ఈ ఊరు జంగారెడ్డి గూడెం కొవ్వూరు ,బయ్యన గూడెం వెళ్ళే దారిలో సీతమ్మ పేట దగ్గర ఉంది.అని కవిగారు చెప్పారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-2-23-ఉయ్యూరు .