సర్వేశ్వర శతకం
యథా వాక్కుల అన్నమయ్య రచించిన ‘’సర్వేశ్వర శతకం ‘’ను తెనాలి సాధన గ్రంధ మండలి వారు మండలి వ్యవస్థాపకులు శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారిచేవిపుల పీఠిక ,లఘు టీకా వ్రాయించి ,వట్టి చెరుకూరు వాస్తవ్యులు ,వదాన్యులు శ్రీ రావి వెంకట సుబ్బయ్య శ్రీమతి సీతారామమ్మ పుణ్య దంపతుల ఆర్ధికసాయం తో తెనాలి వాణీ ఆర్ట్స్ ప్రింటర్స్ లో ముద్రించి ,1992 శ్రీ ఆంగీరస నామ సంవత్సర శ్రీ శంకర జయంతి నాడు ఆవిష్కరించి శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామికి అంకితమిచ్చారు . వెల-నాలుగు రూపాయలు .’’మండలి మాట’’లో శ్రీ బులుసువారు –‘’హేతవే సర్వ సిద్ధీ నం కలికల్మష హేతవే –భవాబ్ధి సేతవే తుభ్య౦ నమోస్తు వృష కేతవే ‘’-శివుడు ఆశుతోషుడు అంటే –ఆశు తుష్యతీతి –ఆశుతోషః’’-త్వరగా ప్రసన్నుడయ్యే దేవుడు ‘’ .ఉత్తర భారతం లో శివుడిని ‘’భోలే బాబా ‘’అంటే అమాయక దేవుడు అనిపిలుస్తారు .ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ ‘’శివారాధన వల్లనే ఐశ్వర్యం కలుగుతుంది .రావణాదుల మహదైశ్వర్యం కు మూలం శివారాధానమే .అన్ని గ్రహదోషాలను శ్రీ రుద్ర పారాయణ పోగొడుతుంది .వైష్ణవులు కూడా శివారాధన చేస్తారు .అందుకే ‘’శివం మహా భాగవతం స్మరామి ‘’అని వారే చెప్పినమాట .’’నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్ ‘’అని రుక్మిణి ప్రార్ధించి ఉమామహేశ్వర ఆరాధనం వలన శ్రీ కృష్ణుని భర్త గా పొందింది అని భాగవతం .శ్రీ కృష్ణుడు ఉపమన్యు శిష్యుడై ‘’పాశుపత దీక్ష ‘’పొంది శివారాధన చేసి ప్రద్యుమ్నుని పుత్రుడుగా పొందాడు అని భారతం ఆనుశాసన పర్వం లో ఉంది .శివ సహస్రనామం ను ఉపమన్యు కృష్ణుడికి అనుగ్రహిస్తే ,ఆయన ధర్మరాజుకు తెలిపాడు .ఇలా అనాదిగా సర్వార్ధ సాధకమైన శివారాధనపై యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం వేన వేల వెలుగులు ప్రసాదిస్తోంది .ప్రౌఢ గంభీరంగా ఉన్న ఈ శతకానికి విపులపీఠిక ,లఘు టీకా రాసి సులభతరం చేశాం ‘’అని చెప్పారు .
పీఠిక లో –‘’త్రైలోక్య సంపదాలేఖ్య ,సముల్లెఖేన భిత్తయే –సచ్చిదానంద రూపాయ ,శివాయ బ్రహ్మనే నమః ‘’-గోడపై బొమ్మలు చిత్రిన్చినట్లు .ఈ ముల్లోకాలు ఎవని చె చిత్రింప బడినాయో, ఆ సచ్చిదాన౦ద రూప శివ పరబ్రహ్మానికి నమస్కారం. .ఈశతకకర్త అన్నమయ్య ఆత్రేయస గోత్రీకుడు ,ఆరాధ్య బ్రాహ్మణుడు వీర శైవుడు .గురువు దూది కొండ సోమేశ్వరారాధ్యుడు .13 వ శతాబ్దిలో లో ఈ శతకం రాశాడు .పోలవరం దగ్గర శ్రీ వీరభద్రస్వామి వెలసిన పట్టిస గ్రామ౦ లో పుట్టాడు .వీరభద్రుడు ఆరాధ్య దైవం .పట్టిసలోనే శివారాధన చేసి పరిణత స్థిత ప్రజ్నుడయ్యాడు.ఒక రోజు శ్రీ శైల మల్లికార్జున దర్శనం కోసం నడిచి అరణ్యమార్గాన చేరి ,పాతాళగంగలో స్నానించి భ్రమరాంబా మల్లికార్జున దర్శనం చేసి ,కొన్నాళ్ళు అక్కడే ఉంటూ నిత్య దర్శన పూజాదులతో పులకిన్చిపోయి ,మళ్ళీ పట్టిస బయల్దేరాడు .శివనామ జపిస్తూ ప్రయాణం సాగిస్తూ ‘’సత్ర సాల ‘’గ్రామం చేరాడు .అక్కడి వాతావరణం కృష్ణానది , శ్రీ మల్లికేశ్వరస్వామి ఆయన్ను బాగా ఆకర్షించాయి .తపోభూమి అనిపించి నిత్య కృష్ణా స్నానం చేస్తూ ,స్వామిని ఆరాధిస్తూ కొంతకాలం ఉన్నాడు .అప్పుడే సర్వేశ్వర శతకం రాయాలనిపించి మనసులో ‘’తాటాకుపై పద్యం రాసి కృష్ణలో వేస్తా .శివుడికి నచ్చితే అది ప్రవాహం లో కొట్టుకు పోకుండా మళ్ళీ నా దగ్గరకే వస్తుంది ఏ పద్యమైనా తిరిగి నా దగ్గరకు రాకపోతే నా తల నరుక్కొని చనిపోతాను ‘’ ‘’ అనే నియమం పెట్టుకొని ,కృష్ణా తీరంలో మెడకు గండ కత్తెర తగిలించుకొని ,తాటాకులు ,గంటం దగ్గర పెట్టుకొని ,పరమ శివుని మనసారా ప్రార్ధించి శతక రచన ప్రారంభించాడు .రాసి నీటిలో వేసిన ఏ పద్యమూ కొట్టుకు పోకుండా ఆయన దగ్గరకే వచ్చి చేరేది .’’తలిరుం బువ్వుల ‘’అనే పద్యం రాసి పడేస్తే ,అది తిరిగిరాకుండా ,ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది .శివధ్యానం చేసి తల నరుక్కొనే ప్రయత్నం చేస్తుండగా ఒక పశులకాపరి వచ్చి ‘’కృష్ణ నీటిలో ఒక తాటాకు కొట్టుకొని వచ్చి నాదగ్గరకు చేరింది దానిపై యేవో అక్షరాలున్నాయి ‘’అని చేతికిచ్చాడు .దాన్ని పరిశీలించి చూడగా అది తాను రాసిన పద్యమే సర్వేశ్వరా అనే మకుటం కూడా ఉంది కాని తాను రాసిన పద్య౦ కంటే మహత్తర అర్ధ గాంభీర్యంగా ఉంది .శివుడు సంస్కరించి పంపాడన్నమాట .తలయెత్తి పైకి చూస్తె తెచ్చినవాడు కనిపించలేదు ఇది శివ లీల గా భావించి శతకం పూర్తీ చేశాడు .142 పద్యాల ఈశతకం శివ పారమ్యాన్ని బోధిస్తూ ,పరమ గంభీరంగా ఉంది .
అయన ఇంటిపేరు యథా వాక్కుల –‘’యథా వాచోస్య తదా సర్వం భవతి ‘’ఎవరినోటి నుంచి వచ్చిన వాక్కు సత్యం అవుతుందో అని అర్ధం సామాన్యుల వాక్కు అర్ధాన్ని అనుసరించి వస్తే ,మహాత్ముల వాక్కులను అర్ధం అనుసరిస్తుంది –‘’ఋషీణా౦ పునరార్యా ణా౦ వాచ మర్దోను ధావతి ‘’(భవభూతి ).కనుక కవి అన్నమయ్య మాటలు వాడిగా రాజ శాసనం లాగా ఉంటాయి .’’భయ విభ్రాంతులు లేక ఈశతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా ‘’అన్నాడు అందుకే .శివుడు సర్వ దేవతలకంటే అధికుడు అని అనేక మార్లు శతకం లో చెప్పాడు .జగడుత్పత్తి స్థితి లయాలు దేనిలో జరుగుతుందో అదే శివస్వరూపం .బ్రహ్మాండ భాండాలు దేని గర్భం లొబుడగాలాగా కనిపించి అణగారుతుందో అదే శివ లింగం.పరబ్రహ్మానికి అభిన్నమైన మాయాశక్తినే ‘’ఆజ్ఞా శక్తి ‘’అన్నాడు .శివభక్తులు జంగమ రూప శివులే .బ్రహ్మాదులకంటే శివభక్తుడు గొప్ప .శివుడు శాశ్వతుడు కనుక శివసామీప్యం సాలోక్యం పొందిన భక్తుడు అల్పాయుష్కుడు అయినా బ్రహ్మదులకంటే గొప్ప వాడే కదా అంటాడు .శివ భక్తులనే కాదు శివ భక్తి నికూడా గొప్పగా కీర్తించాడు .శివ భక్తీ నైష్కర్మ్య సిద్ధి కలిగిస్తుంది .అన్నమయ్య కవితా శైలిని తర్వాత కవులు ఎందఱో అనుసరించారు .సాధకులకు ఈశతకం చేయూతా కరదీపిక ‘’అన్నారు బులుసు వారు .శతకం లోకి రేపు ప్రవేశిద్దాం .
సశేషం
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -28-2-23-ఉయ్యూరు