సర్వేశ్వర శతకం -2(చివరిభాగం )
యథా వాక్కుల అన్నమయ్య శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ‘’సర్వేశ్వర శతకం ‘’మకుటం –‘’సర్వేశ్వరా .మొదటిపద్యం –శ్రీ క౦ఠుం బరమేశు నవ్యయు నిజశ్రీ పాద దివ్యప్రభా –నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షర ద్వాతుజి-త్ప్రాకామ్యంబు నపా౦గమాత్ర రచిత బ్రహ్మాండ సంఘాతుజం –ద్రాకల్పున్ బ్రణుతింతు నిన్ను ,మది నాహ్లాదింతు సర్వేశ్వరా ‘’ .నీ నిజరూపం ఇది అని ఎవరూ చెప్పలేరు.’’ఇన విఘ్నేశ్వర మాతృకా ద్రుహిణ బ్రాహ్మీ స్కంద దుర్గా రమా వనితాదీశ్వర భైరవులు ‘’నీ భ్రుత్య పరివారం .పవన హిమదామ ,అనలపానీయ ,ఆత్మ రవి అంబరం ,మహీతలం అష్టమూర్తులు .పుష్పాలు పద్యాలు గీత నృత్యాలు అమృతాహారం నీకు సమర్పించినా,నువ్వుకోరేది ‘’చిత్తము సద్భక్తి మాత్రమే. ‘’ ఉన్మాద ఇంద్రియ ధ్వంత దుస్తర సంసార మద ప్రమత్తుడు –మహా సౌఖ్యోత్సవంబైన మీ చరణారాధనపై బుద్ధి నిల్పడు .
ఒక పుష్పాన్ని నీ పాద ద్వయంపై భక్తితో సమర్పిస్తే ,పునర్జన్మ లేకుండా చేస్తావు .’’తరులం బిందెలు పువ్వులై యొదవి తత్తజ్జాతి బండ్లగున్ –హర మీ పాద పయోజ పూజితములై యత్యద్భుతంబవ్విరుల్ –కరులౌ నశ్వములౌ ,ననర్ఘ మణులౌ గర్పూరమౌ ,హారమౌ –దరుణీ రత్నములౌ,బటీర తరులౌ దధ్యంబు సర్వేశ్వరా ‘’ఈ పద్యమే కవి దగ్గరకు తిరిగిరాకుండా ప్రవాహం లో కొట్టుకుపోయి ,శివుడికి నచ్చి దాన్ని సంస్కరించి పశుకాపరి రూపంగా వచ్చి అన్నమయ్యకు అందజేసింది. అంతటి ధన్యత పొందిన పద్యం కవి శివభక్తి పారమ్యానికి గొప్ప ఉదాహరణ .నా చిత్తం పంచేంద్రియ మాయాజాలం లో పడి. ఈగకు కస్తూరి వాసనకంటే దుర్గంధం ఇష్టమైనట్లు ‘’నీ పాదాబ్జ ధ్యానం చేయదు ‘’అన్నాడు .యోగ సాధనలో ఈదులాడితే కొంత నిశ్చలత పొందుతుంది .లేకపోతె దానిష్టం వచ్చినట్లు తిరిగి, నన్ను అధోగతి పాలు చేస్తుంది .
‘’నీ అర్చనలో మొదటిపుష్పం సత్యం ,రెండవపువ్వు దయాగుణం ,నిష్టా సమోత్సవ సంపత్తి మూడవ పుష్పం ,ఇవిలేకుండా నిన్ను పూజిస్తే ‘’గైకోవు నీవు సర్వేశ్వరా ‘’అని యదార్ధం చెప్పాడు యథావాక్కులకవి .నేను బక వేషిని కనుక దానిలాగా మనసు ఒక చోట నిలవదు .కులశైలాలు పెకలించినా ,దిక్కులు కూలినా ,సముద్రాలు చెలియలికట్ట దాటినా ,సూర్య చంద్రులు గతితప్పినా ‘’తలకండు ఉబ్బడు ,చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వరా ‘’అని నిజమైన భక్తుని స్థిరభక్తి ప్రకటించాడు .సకలాదీశ్వర పట్టభద్రుడవు ,భిక్షాగామివి ,అత్యంత శాంత కళాత్ముడవు ,రౌద్రమూర్తివి ,సౌన్దర్యామ్బికా సంగామాధిక లోలుడవు ,దివ్యయోగివి .శుద్ధ మనస్కులకు తప్ప నీ స్వరూప స్వభావాలు తెలియవు .తన చరిత్రాన్ని తత్వవేత్తలైన భక్తులు వర్ణించగా ,తన చిత్తం నీ పద స్మరణతో నిన్ను మెప్పిమ్పగా ,’’అనుకూల స్ఫుట నిష్కలంక బహిరంగాభ్యంతర౦గ స్థితి పొందిన తజ్ఞుడు ఈ జగత్తులో నీ మెచ్చు ‘’.వేదాలు ఆగమాలు,మంత్రతంత్రాలు అనంతాలు .ఇవన్నీ నాకెందుకు స్వామీ .’’నీవు మెరయ౦ గా ,నిన్ను సద్భక్తి యోగం తో కొల్చి జయింప జేయించు .ఏయే వేళలలో ఏయే వయస్సుల్లో మానవుడు ఏభూమిలో ,ఏ ఊరిలో ,ఏయే కర్మలు చేస్తాడో ,ఆయావేలల్లో వయస్సులో ఆఊరిలో కర్మ ఫలం అనుభవిస్తాడు ..’’నీవైన మహాత్ముడు అన్యాలకు లోనుకాడు .’’
పిల్లవాడు మాట్లాడిన మాటల లో ఎన్ని దోషాలున్నా తలిదండ్రులు సంతోషంగా తీసుకొంటారు .అలాగే ‘’అజ్ఞాన భావంతో నేను రాసిన ఈశతకాన్ని ‘’నీకుం మహాలాలిత్య స్తుతికంటే గైకోనుగదా శ్లాఘ్య౦బు సర్వేశ్వరా ‘’అన్నాడు గడుసుగా చమత్కారంగా .’’సంకీర్నాకలితాక్షర త్రయము ,భాస్వన్నాద బిందు క్రమాలంకార ద్వితయంబు తో గలిసి –లీలన్ దివ్య యోగీంద్ర హ్రుత్పంకో ద్భూతములందు గూఢమగుచున్ బంచాక్షరీ మంత్రము ఓంకారాత్మక మునిగణ౦ బూహింప సర్వేశ్వరా ‘’అని శైవతత్వాన్ని చెప్పాడు .చివరి 142వ పద్యం – ‘’జయశక్తి రవి చంద్ర తారకముగా జల్పెన్ ,యథావాక్కులా –న్వయ సంజాతుడు ,నన్నమార్యు డవని న్వర్నించి నీ సత్కథా –క్రియ సంబోధన ,నీదు భక్తిని మహా నిర్ణీత విశ్రాంతిగా –భయ విభ్రాంతులు లేక ఈశతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా ‘’అని ముగించాడు యథావాక్కుల అన్నమయ్య కవి సర్వేశ్వర శతకాన్ని .ఈ శతకం ఆతర్వాతికాలం లో ఎందఱో శైవకవులకు ప్రేరణగా నిలిచి ఉంటుంది .లోకజ్ఞానం అనన్య శివ భక్తీ ప్రపత్తి ,అంకితభావం లతో శతకం దేదీప్యమానంగా వెలిగింది ఈశతకం చదువుకొంటే చాలు మోక్షం కరతలామలకమే .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-23-ఉయ్యూరు