మంచిమనసు ,మహా నిజాయితీ ,గొప్ప ఆత్మీయత ,చక్కని హాస్యప్రియత్వం ఉన్న అల్లుడు శ్రీ వేలూరి రామకృష్ణ అనాయాస మరణం
మా అన్నయ్య గారి అల్లుడు శ్రీ వేలూరి రామకృష్ణ ఈమార్చి 2గురువారం ఫాల్గుణ శుద్ధ దశమి ఉదయం హైదరాబాద్ లో పెద్దబ్బాయి రవి కిరణ్ ఇంట్లో ఉదయం 6-30 గం లకు కాఫీ తాగి కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే ,భార్య అంటే మా అన్నయ్యగారి కుమార్తె శ్రీమతి వేదవల్లి చేతులలో ముఖం లో ముఖం పెట్టి చూస్తూ ,మనవడు,రేయా౦శ్, కొడుకు ,కోడలుశ్రీమతి గాయత్రీ లను చూస్తూ అనాయాసంగా మరణించాడు .ఆ భార్యా భర్తల సంభాషణలలో ఎప్పుడూ ఆతను ‘’నీకంటే ముందే నేను పోతాను ‘’అంటే ‘’కాదుకాదు ‘’మీ కంటే నేనే ముందు –‘’అనుకోనేవారట .ఆయన మాత్రం ‘’నువ్వు ముందు వెళ్ళిపోతే నేను ఏమీ లేని అశక్తుడిని అవుతాను నేను తట్టుకోలేను .కనుక నీకంటేముందే నేను పోతాను ‘’అను కోనేవారట .ఆయన మాటే నెగ్గి ముందు వెళ్ళిపోయాడు అందరికి హృదయభారం మిగిల్చి .చిన్నకొడుకు హరికిరణ్ అమెరికాలోని నార్త్ కరోలినాలోని రాలీ లో ఉద్యోగం చేస్తున్నాడు.అక్కడ స్వంతిల్లు ఉంది ఇద్దరబ్బాయిలు .వాడికి ఫోన్ చేసి తర్వాత మాకు ఫోన్ చేశాడు మనవడు రవి .హైదరాబాద్ లో ఉన్న బంధువులకు తెలియజేయగా వీలున్న వారు వెళ్లి ఆఖరి చూపు చూశారు .పార్ధివ శరీరాన్ని తీసుకోని రవి ఆమధ్యహ్నం అంబులెన్స్ లో విజయనగరం జిల్లా గరివిడి కి బయల్దేరి తెల్లవారు జామున చేరాడు .మా అమ్మాయి వేదవల్లి ,కోడలు,మనవడు ఆమధ్యాహ్నం ఫ్లైట్ లో విశాఖ చేరి గరివిడి స్వంత ఇంటికి చేరారు .
నేను ,మా శ్రీమతి ,మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు,మా అబ్బాయి రమణ కోడలు మహేశ్వరి శుక్రవారం ఉదయం 8గం లకు కారు లోబయల్దేరి సాయంత్రం 5గం లకు గరివిడి చేరాం .సాయంత్రం 6 గం లకు హరి ఫ్లైట్ లో షార్లేట్ ,న్యూయార్క్ ,బాంబే ,మీదుగా విశాఖ చేరి కారులో -గరివిడి చేరాడు .అప్పటికే అక్కడ కావాల్సిన ఏర్పాట్లుఅన్నీ వారి కుటుంబానికి సన్నిహితులు శ్రీమతి సావిత్రి, కొడుకు వర్మ ఏర్పాటు చేశారు .శనివారం ఉదయానికి రామకృష్ణ ఇద్దరు తమ్ముళ్ళు ,భార్యలు అక్కగారు ,ఢిల్లీ లో ఉన్న మేనకోడలు హేమ ,మేనల్లుడు ,రవి మామగారు చేరుకొన్నారు .బంధువులందరి సమక్షంలో రవి హరి సోదరులు తండ్రికి అంత్యక్రియలు భక్తీ శ్రద్ధలతో నిర్వహించారు .ఆ సాయంత్రం మేము తిరుగుప్రయాణం చేసి రాత్రి పదిన్నరకు ఉయ్యూరు చేరాం .అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం ‘’అన్నదానికి రామకృష్ణ మరణం ఒక గొప్ప ఉదాహరణ .నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఆతను అలాగే నవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయాడు కుటుంబానికి పెను దుఖం మిగిల్చి .
వేదవల్లీ –రామ కృష్ణీయం
మా అన్నయ్య శ్రీ లక్ష్మీ నరసింహ శర్మగారు 1957లో బళ్ళారి దగ్గర హాస్పేట్ లో రైల్వే స్టేషన్మాష్టర్ గా పనిచేస్తూ ,అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణించాడు .అప్పటికి మా అన్నయ్యకు వేదవల్లి ,రాం బాబు పిల్లలు .నెలల పిల్లాడు రాంబాబు .ఆకుటుంబాన్ని మా నాన్న గారే మాతో పాటు పెంచారు .1961లో మా నాన్న గారి మరణం తర్వాత ,ఆబధ్యత నేను తీసుకొని వారిద్దరి చదువు ,పెళ్ళిళ్ళు మాదంపతులం చేశాం .అప్పటికి మా మామ్మగారు, ,మా అమ్మగారు ఉన్నారు .వేదవల్లి బెజవాడ స్టెల్లా కాలేజి లో పియుసి చదివింది కానీ తప్పింది .ఆరోగ్యమూ అంత బాగా ఉండేదికాదు. చదువు మాన్పించేశాం .ట్రీట్మెంట్ తో బాగానే కోలుకోన్నది .పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాం .తెలప్రోలుదగ్గర చిరివాడ అగ్రహారం లో వేలూరి వారబ్బాయి ఉన్నాడని ఎవరో చెబితే ,నేను ,మా తమ్ముడు మోహన్ వెళ్లి ,అక్కడ మా రెండవ బావగారు వేలూరి వివేకానంద గారి తండ్రిగారు కృష్ణమూర్తిగారు అంటే శతావధాని శ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారి తమ్ముడు గారింటికి వెళ్లి అడిగాం .ఆయన ‘’వేలూరి వెంకటేశ్వర్లు గారబ్బాయి రామకృష్ణ ఉన్నాడు .మంచి బుద్ధిమంతుడు ,బికాం పాసై ఉద్యోగ౦ చేస్తున్నాడు .అతనికి ఇద్దరు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు .వేరుగా ఆలోచి౦చక్కర్లేదు .దాదాపు ఇరవై ఎకరాల మాగాణి ఉంది ఎకరాకు 30 బస్తాలు వరి పండుతుంది ఎకరాకు అయిదు బస్తాల మినుము పండే దివ్యమైన భూములు .వెళ్లి కలిసి మాట్లాడండి .పిల్లల చదువుకోసం గుడివాడలోని బేత వోలులో కాపురం పెట్టారు ‘’అని చెప్పగా ఎంతో సంతోషంతో మేము బేత వోలు వారింటికి వెళ్ళాం .అప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇంట్లో లేరు .పనిమీద ఎక్కడికో వెళ్లారు .భార్యగారు మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా పలకరించి కాఫీవగైరాలిచ్చి భోజనం చేసి వెళ్లాలని చాలా బలవంతం చేశారు .’’కతికితే అతకదు అంటారు ఎలా అండీ ‘’అన్నాం .’’ఫరవాలేదు పెళ్లి సంగతి తర్వాత .మీరు మేము బంధువులం .మా అన్నయ్య రాయప్రోలు కోదండరామయ్య గారు ఉయ్యూరు లోనే ఉంటారు ‘’అని చెప్పారు .సరే అన్నాం .వంటచేసి చాలా రకాల పదార్ధాలతో ,కొత్త ఆవకాయ మాగాయ ,ఇంట్లో మగ్గేసిన రసాల మామిడి పళ్ళతో కమ్మని విందు భోజనం పెట్టారు .హాయిగా లాగించేశాం .ఇంతలో వెంకటేశ్వర్లు గారు వచ్చారు .ఆయనతో వచ్చిన విషయం చెప్పి పెళ్లి చూపులకు రమ్మని కోరాం .ఆయన సరే అన్నారు .మంచి రోజు వచ్చి చూశారు .తర్వాత తమ్ముళ్ళు ఆతర్వాత ఆడపడుచులు నాయనమ్మ తాతగారు వరుసగా వచ్చి చూసి వెళ్లారు .మాకు పిల్లాడు ,వాళ్లకు పిల్లా నచ్చారు .లగ్నాలు పెట్టుకోవటానికి రమ్మన్నారు
మేమిద్దరం మా తమ్ముడు ,మా మేనమామ గంగయ్యగారు కలిసి బస్ లో వెళ్లి చిరివాడ అడ్డరోడ్డు దగ్గర దిగి వాళ్ళు పంపిన రెండేడ్ల బండీలో వారింటికి వెళ్ళాం .వెంకటేశ్వర్లుగారు 8 వేలు అడిగారు .మా నాన్నగారులేరు .1972 లో నేను సైన్స్ మాష్టారు గా పామర్రు హైస్కూల్ లో పని చేస్తున్నాను. మా తమ్ముడు పూనాలో డిఫెన్స్ ఫాక్టరీ లో పని చేస్తున్నాడు .వ్యవసాయం ఉందికాని ఫలసాయం తక్కువే కౌలుకిచ్చాం .ఆయన మెట్టు దిగలేదు .మేము మూడు రోజులు పెళ్లి చేస్తాం అన్నాము ఆయన రెండు పూతలు చాలు అన్నారు .సరే అనుకొని ఆయన అడిగినట్లే ఇవ్వటానికి ఒప్పుకోన్నాం దేవుడిపై భారం వేసి . మా బ్రాహ్మణులలో అంత కట్నం ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు .మేమే మొదట సాహసం చేశాం .ఈమాట అందరూ చెప్పుకొనేవారు. మా బావగారి తల్లీతండ్రీ కృష్ణమూర్తిగారు ,భార్య కాన్తమ్మగారు ,వారి బంధు గణాలు వచ్చారు .మామేనమమ జ్యోతిష్యం తెలిసిన వాడే కనుక ఉభయులకు అనుకూలమైన ముహూర్తం ఖాయ౦ చేశాం .శ్రావణ మాసం లో ముహూర్తం .
జోరు వానలో పెళ్లి
మగ పెళ్ళివారికి చోడవరపు చంద్ర శేఖర రావు గారి డాబా ఇంట్లో విడిది ఏర్పాటు చేశాం .వాళ్ళు జోడెడ్ల బండీలపై వచ్చారు .కాలేజి దగ్గర మా ఎలిమెంటరి స్కూల్ దగ్గర చింతల తోపులో బళ్ళు దింపారు .ముహూర్తం ముందు రోజునుంచి కుండ పోత వాన .మాది మండువా పెంకు టిల్లు . వర్షం లో పెళ్లి ఎలా అని ఆలోచిస్తున్నాం .రోడ్డు మీదనుంచి మా గొడ్ల దొడ్డి సందులో నుంచి ఇంటికి రావాలి .మా పాలేరు చిన్తయ్య ఒక ఉపాయం చెప్పాడు .సరే అన్నా .వాడు మామంయ్యగారి పాలేళ్ళు కలిసి గడ్డివాములో నుంచి గడ్డి కట్టలు తీసి ఇంటినుంచి సందు బయటివరకు కట్టలు కట్టలుతడవకుండా పేర్చారు .గడ్డి మీద నడక కనుక బురద అంటుకోదు .గొడుగులు సప్లై చేశాము పెళ్ళి వారంతా తడవకుండా ఇంట్లోకి వచ్చారు .మా ఇంటి హాలులోనే పెండ్లి .వర్షం కొంచెం ఊపు తగ్గింది .వంగల సుబ్బావధానులుగారుమా ఇంటి బ్రహ్మగారు .మాన్న గారి శిష్యుడుకూడా ఆయన ఆధ్వర్యంలో వివాహం వైభవోపేతంగా జరిగి వేదవల్లి రామకృష్ణ లు ఒక్కటయ్యారు .వంటలు పశుమర్తి సీతా రామయ్య గారు భలే కమ్మగా పదార్ధాలన్నీ వండి వడ్డించారు .పామర్రు హైస్కూల్ నుంచి హెడ్ మాస్టర్ రామక్రిష్ణయ్యగారు స్టాఫ్ అంతా వచ్చారు .వీరందరికీ మా మేనమామ గారి డాబాపై భోజనాలు ఏర్పాటు చేశాం .అందరూ చాలా సంతోషించారు ఇంతవానలో పెళ్లి ఎలా చేశారని ఆశ్చర్య పడ్డారు .దైవ సంకల్పం .అంతే.తర్వాత కార్యక్రమాలు అన్నీ యధావిధిగా జరిగాయి .
విశాఖ –గరివిడి లో ఉద్యోగం
పెళ్లి అయ్యే సమయానికి రామకృష్ణ విశాఖ లో ఏదోకంపెనిలో నేలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడు . నేనేమీ ఆశ పెట్టలేదుకాని మా తమ్ముడు తాను ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. అది రూపు దాల్చలేదు మా అమ్మాయిని కాపురానికి విశాఖ పట్టణం కు తీసుకు వెళ్ళాం .చిన్న ఇంట్లో కాపురం .రామకృష్ణ చాలా నెమ్మదైనవాడు .సరదా మనిషి సినిమాలు బాగానే చూసేవాడు .సిగరెట్లు ఎక్కువగా తాగేవాడు ఆరగా ఆరగా కాఫీ తాగేవాడు మాకూ ఇచ్చేవాడు .తర్వాత ఇద్దరబ్బాయిల్కు ఆడంపతులు తలిదంద్రులయ్యారు . వేద వల్లి సలహాతో గరివిడిలోని FACOR సంస్థలో అకొంట్ సెక్షన్ లో చేరాడు .క్వార్టర్ ఇచ్చారు .క్రమంగా జీతమూ పెరిగింది .కంపెనీ మార్వాడీలది .హెడ్ అయ్యాడు .మా అమ్మాయి వేదవల్లి ప్రైవేట్ గా పియుసి పాసై డిగ్రీ చేసి బిఎడ్ చేసి ఫాక్టరి వాళ్ళ హైస్కూల్ లో సోషల్ మాస్టర్ ఉద్యోగం లో చేరి లా చదివి పాసై లాయర్ గా కూడా కొంతకాలం ప్రాక్టీస్ చేసి ,సమర్ధురాలైన టీచర్ గా పేరుపొంది ఉద్యోగ విరమణ చేసి హౌస్ వైఫ్ గా ఉంది.స్వయం సిద్ధ అనిపించింది . రామకృష్ణ 2000లో రిటైర్ అయ్యాడు .కానీ ఫాక్టరి అతని సర్వీస్ ను కొనసాగించగా రిటైర్ అయ్యాక 23 ఏళ్ళు ,చనిపోయేదాకా ఉద్యోగించాడు .కారణం అతని విశ్వాసం,నమ్మకం నిజాయితీ .ఫాక్టరి ఓనర్స్ ఢిల్లీ లో, నాగపూర్ లో ఇంకేక్కదేక్కడో ఉండేవారు .వారికి ఫాక్టరి డబ్బు తీసుకొని వెళ్లి ఇచ్చే బాధ్యత ఇతనికి అప్పగించారు .ఒక్కోసారి కోట్లరూపాయలు తీసుకొని వెళ్లి అందజేసేవాడు .మాకు భయంగా ఉండేది .ఫస్ట్ క్లాస్ ఎసి లో జర్నీ ఫాక్టరీయే బుక్ చెసెది. ఆనమ్మకంతోనే రిటైర్ అయినా అతని సర్వీస్ బాగా వినియోగించుకోన్నది ఫాక్టరి .ఫాక్టరి లోపల అత్యంత కాన్ఫిడేన్షి యల్ గా ఉండే ఒక గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యతలో ఉండి మరణించాడు .ఎంత నిజాయితీ లేకపోతె మార్వాడీలు అంతగా నమ్ముతారు ? ఎన్నో సార్లు ఫాక్టరి లాక్ డౌన్ లు ప్రకటించింది .అన్నీ తట్టుకొని ఆకుటు౦బ౦ నిలబడింది . మమ్మల్ని ఏనాడూ ఎంత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ఒక్కరూపాయకూడా సాయం కోరలేదు .అంతటి బాధ్యతతో కుటుంబ నిర్వహణ చేశారు .ఇద్దరు కొడుకు బంగారు తండ్రులు .హరి భీమవరం లో ఇంజనీరింగ్ చదివాడు .కోడళ్ళు వాళ్లకు తగినవాళ్ళే.మనవళ్ళు అంటే మహా ఆపేక్ష వారిద్దరికి .రెండేళ్లక్రితం మార్చిలో మా మూడవ అబ్బాయి మూర్తి అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో మరణిస్తే ,విషయం తెలిసి మాట్లాడలేక మాట్లాడలేక గుండె బరువుతో మాట్లాడారు .సంవత్సరీకాలకు ఇద్దరూ వచ్చారు .వేదవల్లి ఉయ్యూరు ఎప్పుడువచ్చినా మా శ్రీమతి ఒళ్లో చలిమిడి పెట్టి కొత్త చీరాజాకేట్ ఇచ్చి పంపుతుంది .
పెద్దవాడు రవి పెళ్లి మా చేతులమీదుగా పెద్దరికం ఇచ్చి గుంటూరులో చేయించారు .హరి పెళ్ళి శారిక తో హైదరాబాద్ లోజరిగితే కూడా వెళ్ళాం .2017లో మేము అమెరికాలో నార్త్ కరోలినా షార్లేట్ లో మా అమ్మాయి విజ్జి అల్లుడు అవధాని గార్ల ఇంటికి వెళ్ళినప్పుడు రాలీ వెళ్లి హరి కుటుంబం తో రెండు రోజులు గడిపి వచ్చాం .ఈ పిల్లల బాల్యం మాదగ్గరే గడిచింది వేసవిలో తప్పక ఉయ్యూరు వచ్చేవారు .అప్పుడు మామిడి పళ్ళ సీజన్ కనుక రసాలు కొని కడుపు నిండా తినిపించేవాళ్ళం .’’తాతయ్యా !ఇంకతినలెం తాతయ్యా ‘’అనేవారు ఇద్దరూ .హరికి పాప్లిన్ పాకెట్స్ ఇష్టం ఎన్నికావాలంటే అన్ని కొని ఇచ్చేవాళ్ళం వాడిన ‘’పాప్లిన్ పాపారావు ‘’అని పిలిచేవాడిని .మా మనవడు చరణ్ ఉపనయనం ఉయ్యూరులో కిందటి ఏడాది మేలో జరిపినప్పుడు రవి గాయత్రి దంపతులు వస్తే మాంచి జాతి రసాలు అందరితోపాటు వాళ్ళకూ 50పళ్ళు పాకెట్స్ లో పెట్టి ఇచ్చాం .చాలాసంతోషించారు . గాయత్రి నన్ను తాతయ్యా ,అని మా ఆవిడను అమ్మమ్మా అని మహా ఆప్యాయంగా పిలుస్తుంది .ఆఅమ్మాయి అంటే మాకు చాలా ఆదరం అభిమానం .శారిక నా ఫేస్ బుక్ లైవ్ చూస్తుంది .
రామకృష్ణ కు బావమరదులు అంటే విపరీతమైన అభిమానం .వాళ్ళతో జోక్స్ బాగానే పేల్చేవాడు .నవ్వుతూ నవ్వించేవాడు. పెద్దలంటే మహా గౌరవం .గరివిడి లో అన్ని సంస్థలతో మంచి అనుబంధం ఉంది.ప్రతి ఏడాది తిరుపతి వెళ్లి దంపతులు స్వామివారికి కళ్యాణం చేయిస్తారు .ఉయ్యూరు వస్తే ఆ దంపతులు మా శ్రీ సువర్చలా ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఆకుపూజ చేయిస్తారు .వీలైనప్పుడల్లా స్వామికి ధనరూపం లో కానుక సమర్పిస్తారు .తలిదండ్రులు అతని చేతిమీదుగానే పోయారు .సంతృప్తి కరమైన జీవితం గడిపాడు .అయిదారేళ్ళ క్రితం రామ కృష్ణకు హైదరాబాద్ లో బైపాస్ అయింది .జాగ్రత్తగా మందులు వాడుతూ ,ఆరునెలలకోసారి హైదరాబాద్ వెళ్లి చెకప్ చేయించుకొంటూ ఉన్నాడు .వేదవల్లి ఆరోగ్య సమస్య కూడా ఉంటే ఈసారి ఇద్దరూ వెళ్లి చెకప్ చేయించుకొన్నారు .అతన్ని చెకప్ చేసిన డాక్టర్ ‘’ఇక ఫర్వాలేదు .మళ్ళీ ఆరునెలల దాకా ఢోకాలేదు .అప్పుడు మళ్ళీ రండి ‘’అని భరోసా ఇచ్చాడు .అందరూ సంతోషించారు గరివిడికి గురు వారం రాత్రికి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకొన్నాడు ,కానీ విధి వైపరీత్యం .ఆరోజు ఉదయమే అనాయాసంగా మరణించాడు .అతనికి ఉత్తమ గతులు కలగాలనీ,ఆ కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-3-23-ఉయ్యూరు