మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు
‘’హెరిటేజ్ ఆఫ్ ఇండియా సిరీస్ లో ‘’పోయెమ్స్ బై ఇండియన్ వుమెన్ ‘’లో భారత దేశం లోని అనేక భాషల ప్రాచీన ఆధునిక కవయిత్రుల రచనలనుంచి కొన్ని మచ్చుతునకలు ఏరి ,ఇంగ్లీష్ లోకి అనువదించారు .వైదిక వాజ్మయానికి ఒకరు ,పాళీ భాషకు తొమ్మిది ,,సంస్కృతానికి నలుగురు తమిళానికి ఇద్దరు ,కర్నాటకానికిముగ్గురు ,మహారాష్ట్రకు అయిదుగురు, బెంగాలీకి పది,హిందీకి ఆరుగురు ,గుజరాతీకి ఇద్దరు ,మలయాళానికి ఒకరు ,ఉర్దూకు ఇద్దరు ,పార్శీకి అయిదుగురు ,కాశ్మీరీ కి ఒకరు ,ఇంగ్లీష్ కు అయిదుగురు మొత్తం 14 భారతీయ భాషలకు 56 మందికి మాత్రమె చోటు దక్కింది .అందులో తెలుగులో ఒక్కరంటే ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదు తెలుగు రచనలకు అనువాదానికీ కూడా చోటు ఇవ్వకపోవటం శోచనీయం ,’’అని ఎంతో బాధపడిన సాహితీ వేత్త ,ఆంధ్రభూమి పత్రిక సంపాదకుడు శ్రీ ఆండ్ర శేషగిరిరావు ఎన్నో శ్రమ దమాలకు ఓర్చి ‘’ఆంద్ర విదుషీమణులు ‘’పేరిట ఒక గ్రంథాన్ని రెండు భాగాలుగా రాసి ఎంతో మేలు చేశారు .మొదటిభాగం లో సంస్కృతం లో ప్రతిభ చూపిన వారినీ ,రెండవ భాగం లో తెలుగులో తమ సాహితీ ప్రతిభను చూపిన వారి జీవితాలగురించి రాశారు .ఇవన్నీ 1930లో వివిధ పత్రికలలో ప్రచురితాలు .ఇందులో మొదటిభాగం ఆధారంగా ‘’మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు ’ శీర్షికతో వారిని పరిచయం చేస్తున్నాను .
1-శాతవాహన రాణి
శాలి వాహనుడికి పర్యాయపదమైన శాతవాహనుడు మొదటి ఆంద్ర మహా చక్రవర్తి .అతని తర్వాత చాలా కాలం ఆ వంశీయులు కృష్ణా తీరంలోని అమరావతి రాజధానిగా రాజ్యపాలన చేశారు .రెండవ రాజధాని గోదావరి తీరంలోని ప్రతిష్టానపురం రాజధానిగా మధ్యభారతాన్ని ఏలారు .ఆంద్ర దేశం ‘’శాతవాహన దేశం గా కూడా పిలువబడింది .ఇప్పటికీ మనం శాలివాహన శకం ను అనుసరిస్తూనే ఉన్నాం .శాతవాహన సామ్రాజ్య ఔత్యానికి కారణం అతని రాణి .విదుషీమణి అవటం చేత చదువురాని భర్తను ఉపదేశ హితోక్తులతో ప్రోత్సాహ పరచి విద్యా వంతుని చేసి పాలనా సామర్ధ్యాన్ని సాధించటానికి తోడ్పడింది .అలాగే ‘’చూడాల’’ అనే స్త్రీ తన భర్త శిఖి ధ్వజుడు ‘’కు రాజ్యపాలనం లోనేకాక ,బ్రహ్మ తత్త్వం బోధించి ఉద్ధరించిందని జ్ఞాన వాశిష్టం లో ఉన్నది .
అయితే శాతవాహన రాణి అలాకాక భర్త అజ్ఞానాన్ని కళ్ళకు కట్టేట్టు చేసింది .ఉచితజ్నుడైన అతడు అందులోని భావాన్ని గ్రహించి విద్యావంతుడై గొప్ప పాలనా సామర్ధ్యాన్ని చూపాడు. దీనికి ప్రేరణ భార్య మాత్రమె .దీనికి సంబంధించిన ఒక ఉదంతం ఉంది . మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకొన్నాం .శాతవాహనుడికి చాలా మంది రాణులున్నారు .అందులో విష్ణు శక్తి కూతురు గొప్ప విదుషీ మణి.శబ్ద వ్యాకరణ శాస్త్రాలలో దిట్ట .ఆమెతో ఇతర రాణులతోకలిసి చక్రవర్తి వన విహారం చేసి ఒక పద్మ సరోవరం లో జలక్రీడల్లో పాల్గొన్నారు .రాజు రాణి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకొంటున్నారు .విష్ణు శక్తి కూతురు సుందర కోమల సుకుమారి .రాజు ఉద్ధృతంగా నీళ్ళు చల్లటం వలన అలసిపోయి సహించలేక ‘’రాజన్ !మాం మోదకైస్తాడయ ‘’అని వేడుకొన్నది .గురువుగారికి అక్షరజ్ఞానం లేదు కదా .అందులో మోదకం అంటే ఉండ్రాళ్ళు అని ఒక్కదానికే అర్ధం తెలిసి ,రాణికి కుడుముల మనసైనది కాబోలు ననుకొని తెమ్మని సేవకులను పంపాడు .వాళ్ళు వెంటనే తెచ్చారు అది చూసి రాణి నివ్వెర పోయింది జలక్రీడకు మోదకానికి సంబంధం ఏమిటి ?అని ఆలోచించి రాజు అర్ధజ్ఞాన శూన్యత్వానికి విపరీతంగా నవ్వింది .రాజుతో ‘’మా అంటే వద్దు ఉదకం తో కొట్టవద్దు ‘’అని కదా అర్ధం .సంధి విషయం కూడా మీకు తెలీదా ?’శబ్ద వ్యాకరణాలలో మీపరిచయం పూజ్యం లాగా ఉన్నదే’’ అన్నది .ఇతరరాణులు దాసీజనమూ కూడా పగలబడి నవ్వారు .
అప్పుడు గురూజీకి తెలిసింది తనకు భాషాజ్ఞానం ఏమీ లేదని .సిగ్గుతో బాధపడ్డాడు . వెంటనే నగరానికి తిరిగివచ్చి విద్యా సముపార్జలో పూర్తి దృష్టిపెట్టాడు .శర్వ వర్మ అనే మహా పండితుడిని గురువుగా చేసుకొని వ్యాకరణ శాస్త్ర పారంగతుడయ్యాడు .ప్రౌఢ వయస్సు,వివాహమై సుఖం భోగలాలస లో ఉన్న రాజు అన్ని క్లేశాలను అధిగమించి విదుషిగా పరివర్తనం చెంది విదుషీ మణి అయిన భార్యకు తగిన భర్త అయ్యాడు .తన విద్యాగురువు శర్వ వర్మకు తన సామ్రాజ్యం లోని నర్మదా నదీ తీరం లో ఉన్న ‘’భరు కచ్ఛప’’అంటే రాన్ ఆఫ్ కచ్’’ రాజ్యాన్ని గురు దక్షిణగా సమర్పించాడు శాతవాహనుడు .విద్యాప్రియుడు విద్యా విశారదుడుగా మారిన చక్రవర్తి విద్యా పోషకుడు కూడా అయ్యాడు .బృహత్కథ రాసిన గుణాఢ్యుడు శాతవాహన చక్రవర్తి ఆస్థాన కవి అయ్యాడు.తఎందరోకవిపండితులను పోషించాడు .తనను విద్యా వంతునిగా మార్చిన భార్యను పట్టమహిషి ని చేసి మళ్ళీ పట్టాభి షిక్తుడయ్యాడు.
మన దేశం లోనే కాదు విదేశాలలో కూడా ఇలాంటి ప్రేరణ మూర్తులున్నారు .అమెరికా నవలాకారుడు నథానియల్ హథారన్ భార్య అన్న ఎత్తిపొడుపు మాటలకు కలత చెంది వివేకం పొంది ‘’స్కార్లెట్ ఫీవర్ ‘’అనే మహా నవల రాశాడు .అమెరికాకే చెందిన మరో మహారచయిత ఫెనిమోర్ కూపర్ ఒకరోజు ఒక నవల చదివి బల్లపైన పెట్టి ‘’నేను ఇంతకంటే గొప్ప నవల రాయగలను ‘’అన్నాడు .భార్య ఆమాటలువిని ‘లైట్ తీస్కొని ‘’’’దమ్ముంటే రాయండి చూద్దాం ‘’అని సవాల్ విసిరింది .మనవాడిలో పౌరుషం ప్రకోపించి ‘’ప్రికాషన్ ‘’అనే నవల రాయటం మొదలుపెట్టి ,కొద్ది రోజుల్లోనే పూర్తిచేసి భార్యకు సమాధానం చెప్పాడు .కానీ ఇది క్లిక్ కాలేదు .అదైర్య పడక ‘’ది స్పై ‘’నవల రాయగా అద్భుత విజయం పొంది కీర్తి ఎన్నో రెట్లు పెరిగింది .ఇలా భార్యల అధిక్షేపాలతో శాతవాహన సామ్రాట్టు నథానియల్ హథారన్ ,ఫెనిమోర్ కూపర్ లు సాహిత్య రంగంలో విశిష్టులై వికసిచారు .
శాతవాహన ఉదంతాన్ని శ్రీ వేదం చంద్ర శేఖరయ్య ఒకపద్యం లో ఇలా వర్ణించారు –‘’భార్య విద్యా ముదమ్మున బల్కినట్టి –హాస్య వచనమ్ములకు గడు వ్యసనమొంది
హృదయ పరివర్తనము చెంది కృషి యొనర్చె –అతడు శ్రీ శాతవాహన క్ష్మాధిపుండు ‘’
సశేషం