మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2
మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2
2-నాచి
సుప్రసిద్ధ పండితుడు ఏలేశ్వరోపాధ్యాయుని కుమార్తె నాచి . మహా విద్వాంసురాలు .గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా ,నాగార్జునకొండ దగ్గర కృష్ణానదికి అవతలి ఒడ్డున ఏలేశ్వరం ఉంది.దక్షిణకాశి గా ప్రసిద్ధం.అనేక దేవాలయాలున్న పుణ్య తీర్ధం .శివరాత్రి తీర్దానికి వేలాది భక్తజనులు వచ్చి స్వామిని దర్శించి పరవశిస్తారు .క్రీ శ.7వ శతాబ్దిలో మహా పండితుడు ఏలేశ్వరోపాధ్యాయుడు ఇక్కడ ఉండేవాడు .వేద వేదాంగాలలో సంస్కృత సాహిత్యం లో ఉద్దండ పండితుడు .ఆయుర్వేద అభిజ్ఞుడు .జ్యోతిషాన్ని అ౦తు చూసిన వాడు .సర్వ శాస్త్ర పారంగతుడు .అందుకే ‘’ఏలేశ్వరోపాధ్యాయ’’ బిరుదు పొందాడు. అది ఆయన అసలు పపేరుకాదు ఆపేరు ఎవరికీ తెలీదుకూడా ..ఈనాటికీ మహా పండితుడు ఎవరైనా కనిపిస్తే ‘’ఏలేశ్వరోపాధ్యాయుడు అంతటి వాడు ‘’అని గౌరవంగా చెప్పుకోవటం పరిపాటి .బ్రాహ్మణులలో వైదీక తెలగాణ్యాది భేదాలు కల్పించింది ఆయనే .ఆయనకున్న కుమార్తెలలో ఒకమ్మాయి పెళ్ళికులవిషయం లో పొరబడ్డాడు .చాలాకాలానికి ఆ అమ్మాయికి జరిగింది కులాంతర వివాహం అని ఆయనా, ,కూతురు గ్రహించారు . సంతానవతి అయిన ఆఅమ్మాయి జరిగిన దానికి విపరీతంగా బాధపడి అవమానం పాలై ఒక అర్ధరాత్రి ఇంటికి నిప్పు అంటించుకొని భర్త పిల్లలతో సహా కాలిపోయింది.దీనితో ఏలేశ్వరుడు నాడు భేదాలు ఏర్పరచి ,ఏ నాడు వారు ఆ నాడు వారినే పెళ్లిచేసుకోవాలనే కట్టడి ఏర్పరచాడు .దీనిపై ‘’ఏలేశ్వర విజయం ‘’అనే ఉద్గ్రంధం రాశాడు .అందులో కులాలు శాఖలు వేగినాడు వెలనాడు మొదలైన విభాగాలను వివరించాడు .దాదాపు ఇప్పటిదాకా ఆయన శాసనాన్నే అందరూ పాటిస్తున్నారు .’’స్మృతి దర్పణం ‘’అనే దాన్ని గౌతమ స్మృతికి వ్యాఖ్యానంగా రాశాడు .తాను నేర్చిన సర్వ విద్యలు శిష్యులకు బోధించి విద్యావ్యాప్తి చేశాడు .నిరంతరం వందలాది శిష్యులకు .నిత్యం సంస్కృత విద్యాదానం చేసేవాడు .నిరంతరం ఆయన ఇల్లు వేద ఘోషతో సంస్కృత కావ్య గానంతో మారుమోగేది .ఆయన ఇంటిలోని స్త్రీలుకూడా సంస్కృతం బాగా మాట్లాడేవారు .
ఏలేశ్వరుడికి పుత్ర సంతానం లేదు. ముగ్గురు కూతుళ్ళు .నాచి రెండవ కూతురు .యుక్త వయసులో వివాహం జరిగింది దురదృష్టవశాత్తు కొద్దికాలం లోనే భర్త మరణించగా ,వైధవ్యంతో పుట్టినిల్లు చేరింది .కూతురు పొందుతున్న అనంత దుఖాన్ని మనోవేదనను గ్రహించి ,ఆమెకు ఊరట కలిగించాలని సంస్కృతం నేర్పటం ప్రారంభించాడు .ఆమెకూడా చాలా దీక్షతో నేర్చుకొన్నది .కొంచెం మందమతి అవటం వలన బాగా కష్టపడాల్సి వచ్చింది .ఇలాంటి మందమతులైన ఒకరిద్దరు విద్యార్ధులు కూడా ఆయన వద్ద ఉన్నారు. వారందర్నీ సరస్వతీ పుత్రులను చేయాలని ఆయుర్వేదం నేర్చి ‘’జ్యోతిష్మతి ‘’అనే తీగ రసం తాగితే మేధా శక్తి పెరుగుతుందని గ్రహించి దాన్ని చక్కగా కూతురుతోపాటు శిష్యులకు కూడా మందుగా వాడి వారందర్నీ అధిక మేధా సంపన్నులుగా తీర్చి దిద్దాడు .అతి త్వరలో విద్యావంతురాలు కావాలనే ఆరాటం తో నాచి ఒకరోజు మోతాదుకు మించి ఆరసం సేవించింది .అది వికటించి ఆమెలో తాపం ,విదాహం అంటే లోపలి తాపం ,మండుతున్నట్లు అనిపించటం పెరిగాయి .తట్టుకోలేక దొడ్డిలోనిబావిలో దూకేసింది .పెద్దగా లోతు లేని ఆ నూయి నీటిలో ఎనిమిది గంటలు ఉండిపోయింది .కూతురు కనిపించక ఊరంతా వెతికించాడు తండ్రి.చివరికి బావి దగ్గరకు వచ్చి ‘’నాచీ నాచీ ‘’అంటూ ఏడుస్తూ తిరిగాడు .ఆమెకు తాపం తగ్గి తండ్రి పిలుపుకు బదులు పలికింది .జరిగినదంతా తండ్రికి చెప్పేసింది .ఆరోజు నుంచి నాచి మహా విద్వా౦సురాలై ,సమస్త శాస్త్ర పాండిత్యం సాధించి తండ్రితో సమానురాలైంది .
నాచి కవితా వ్యాస౦గం అంతా ‘’నాచీ ‘’అనే దృశ్యకావ్యంగా వెలసింది .ఈనాటకం లో భాషా చాతుర్యం భావ మాధుర్యం అనితర సాధ్యంగా ఉంటాయి .కానీ ఆనాటకం మనకు దొరక లేదు . అదులోది అంతా నాచి స్వీయ చరిత్రమే .దుఖం దయనీయమైన తన వైధవ్య జీవితాన్ని హృదయాన్ని కదిలించే కరుణా రసంతో వర్ణించింది .భవభూతి కవి కరుణ రసానికి పట్టాభిషేకం చేసి ఉత్తర రామ చరిత నాటకం రాశాడు .సీతా దేవి విరహంతో శ్రీరాముడు పడే ఆవేదనను వజ్ర కఠిన హృదయుల్ని కూడా కరగించే సామర్ధ్యం ఉన్న శ్లోకాలు అందులో ఉన్నాయి .పరిణత వయసు రాగానే నాచి తీర్ధయాత్రలు చేసి కాశీ రామేశ్వరాదులను సందర్శించి మానసిక స్థైర్యం పొందింది .కాశీ మొదలైన పండిత క్షేత్రాలలో మహా పండితులతో శాస్త్ర చర్చ జరిపి వారిని ఓడించి దిగ్విజయం సాధించింది .ఢిల్లీ ,ఆగ్రా రాజాస్థానలో కూడా విద్వాంసులతో వాదం చేసి గెలిచి బహు బహుమతులు పొందింది .వాటిని ఇంటికి తెచ్చి తండ్రికి చూపిస్తే తండ్రి మహా ముచ్చట పడి ‘’నాకు కొడుకులు లేరు అనే విచారాన్ని నా కూతురు తీర్చింది’’అంటూ గర్వంగా పొంగిపోతూఅభినందించాడు మనసారా .ఇటీవలికాలం లో స్త్రీ పురుషులు తమ అమోఘ కవిత్వ శాస్త్ర చర్చలలో దేశం లోని ప్రముఖ ప్రాంతాల్లో రాజాస్థానాలలో తమ ప్రతిభ నిరూపించి ఘన సన్మానాలు పొంద టానికి ఆనాటి నాచి వేసిందే తొలిఅడుగు.ఆమె మార్గదర్శి .జనకమహారాజు ఆస్థానం లో యాజ్న వల్క్య మహర్షి తో అశ్వల, ఆర్తభాగ, ,కహోల ,ఉపమన్యు వంటి కొమ్ములు తిరిగిన పండితులు చర్చించలేక చేతు లేత్తేస్తే ,ఆవాదాన్ని అందుకొని నిర్దుష్టంగా ,సంపూర్ణంగా వాదించి ఓడించి జయ పత్రం పొందింది గార్గి .ఆయన భార్య కూడా అయింది .
కవిత్వం రాసిన తొలి తెలుగు మహిళలలో తెలుగులో రామాయణం రాసిన మొల్ల ,సంస్కృతంలో నాటకం రాసిన నాచి మార్గదర్శనం చేశారు .నాచి ‘’తొలి స్వీయ చరిత్ర కారిణి’’ కూడా .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-23-ఉయ్యూరు