మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3
3- గంగాదేవి -1
సంస్కృతం లో ‘’మధురా విజయం’’ లేక ‘’వీర కంపరాయ చరితం’’ అనే చారిత్రకకావ్యాన్ని రాసిన గంగాదేవి ,విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కరాయల మూడవ కుమారుడు కంపరాయల భార్య . తాను రాజకన్య అని ఆ కావ్యం లో చెప్పుకొన్నది .భర్త వీర విక్రమ పరాక్రమాలను ,విజయ గాథలను వర్ణించింది .
మధురా విజయం ఎనిమిది సర్గల కావ్యం .సర్గానికొక ఛందస్సును ఉపయోగించింది .మొదట అనుష్టుప్ రెండులో ఉపజాతి మూడులో వంశస్థ ,నాలుగులో అనుష్టుప్ ,అయిదులో ద్రుత విలంబిత ,ఆరులో పుష్పితాగ్ర౦ వగైరాలతో ఛందో వైవిధ్యంతో రాసింది .మొదటి సర్గలో దైవ స్తుతి ,కవి స్తుతి కుకవినింద రాసి కావ్యనాయకుని విజయనగర పట్టణాన్ని విపులంగా వర్ణించింది .రెండవ సర్గలో బుక్కరాయలభార్య దేపాయి , ముగ్గురు కుమారులు కంపన, సంగన,కుమార కంపన లను వర్ణించి ,తాణు కుమార కంపరాయల ధర్మపత్ని అని చెప్పుకొన్నది .మూడవ సర్గలో తండ్రి బుక్కరాయలు కొడుకు కంపరాయలకు చేసిన హిత బోధ వివరంగా రాసింది .నాల్గవ సర్గలో కుమార కంపరాయలు దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయల్దేరటం వర్ణించింది .యుద్ధభేరిమ్రోగించి కర్ణాట విషయం ఆక్రమించి ,అయిదారురోజుల్లో క౦టకానన పురం వెళ్లి ,కొంతకాలం ఉండి,తర్వాత చంపరాజు ను జయించి ,రాజగంభీరం అనే గిరి దుర్గాన్ని స్వాధీన పరచుకొన్న వృత్తాంతం చెప్పింది .అయిదవ సర్గలో కాంచీ పురం రాజధానిగా కంపరాయలు వర్షాకాలం శీతాకాలం గడపటం వర్ణించింది .ఆరులో దండ విడిదిలో కంపరాయల జీవితం వర్ణించింది .ఏడవ సర్గలో తనకు భర్తకు జరిగినసంభాషణ ప్రస్తావించింది .ఈ సందర్భంగా రాయలు కావ్యప్రియుడై భార్య చేత వెన్నెల ను వర్ణింప చేసుకొని ఆనందించాడు .చివరి ఎనిమిదవ సర్గలో కంపరాయలకు మధురా పుర దేవత ప్రత్యక్షమై మహమ్మదీయులు దక్షిణ దేశంపై దండెత్తి వచ్చి హిందూ దేవాలయాలను ఎలా విధ్వంసం చేశారో ,తురకల పాలనలో దేశ ప్రజలు ఎలాష్టకష్టాలు పడుతున్నారో గుండెలు కరిగేలా వర్ణించి చెప్పింది .అమ్మవారు ఒక కరవాలాన్ని రాయలకు ఇచ్చి కర్తవ్య పరాయణుడిని చేసింది.దానితో కుమార కంపరాయలు మధురపైకి దండెత్తి వెళ్లి ,అక్కడి సుల్తానును ఓడించి ,అక్కడి అనేకదేవాలయాలకు దాన ధర్మాలు చేసిన విషయం వర్ణించింది .ఈ కావ్యంలో జరిగిన విషయాలన్నీ క్రీ . శ .1346-1356 మధ్యకాలం లో జరిగాయి .
మధురా విజయ కావ్యాన్ని తిరువాన్కూర్ పురాతత్వ శాఖ 1916లో ప్రచురించింది .చందోలుకు చెందిన సంస్కృతాంధ్ర మహా పండితకవి లలితా పరమేశ్వరీ భక్తులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు తెలుగులో ఈ కావ్యాన్ని చంపువుగా అనువదించారు .గంగాదేవి తనకావ్యాన్ని వైదర్భీ రీతిలో ,మృదు మధురంగా సులభ సుందర శైలిలో రచించింది .ఉపమాలంకారాలను ప్రకృతినుంచి గ్రహించటం ఈ కావ్య విశేషం .పాండిత్య ప్రకశ్ర్ష వ్యర్ధ పదా ఆడంబరం లేనికావ్యం .సమకాలిక సంస్కృత కవుల మార్గానికి భిన్నంగా ఉచితజ్ఞత ప్రదర్శించింది గంగాదేవి .తన అభిమానకవి కవికులగురువు కాళిదాస మహాకవిని అనేక చోట్ల అనుసరించి కావ్యం రాసింది .కాళిదాసు తన రఘు వంశ కావ్యం నాలుగవ సర్గ 32 వ శ్లోకం లో రఘుమహారాజు జైత్రయాత్ర ప్రారంభం లో –‘’ససేనాం మహతీం కర్షన్ –పూర్వ సాగర గామినీం –బభౌ హర జటా భ్రష్టాం-గంగామివ భగీరధః’’-అంటే రఘుమహారాజు తూర్పు సముద్రం వరకు వ్యాపించి ఉన్న తన సైన్యాన్ని వెంట బెట్టుకొని పోతూ,ఈశ్వర జటాజూటం నుంచి జారిన గంగానదిని వెంట బెట్టుకొని తీసుకు వెడుతున్న భగీరధుడు లాగా ప్రకాశిస్తున్నాడు ..అని రాశాడు .దీన్ని అనుసరిస్తూ కవయిత్రి గంగాదేవి –‘’సనయన్ మహతీం సేనా-వ్యరుచద్వీర కుంజరః –పయోద మాలా మాకర్షన్ -పౌరస్త్య ఇవ మారుతః ‘’అని వర్ణించింది –అంటే వీర కున్జరుడైన వీర కంపరాయలు సేనను వెంటపెట్టుకొని పోతూ ,మేఘమాలను వెంటపెట్టుకొని పోతున్న తూర్పుగాలి లాగా శోభిస్తున్నాడు .చక్కని ప్రకృతి సామ్యాన్ని కవితలో నిబద్ధించింది .
కావ్యారంభం లో గంగాదేవి గణేశుని –‘’కల్యాణాయ సతాం భూ భూయాత్ – దేవో ద౦తావలాననః –శరణాగత సంకల్ప –కల్పనా కల్ప పాదపః ‘’-శరణాగతుల ప్రార్ధనలకు కల్ప వృక్షం గజాననుడు సత్పురుషులకు విశేష శుభాలనిస్తారు .పార్వతీ పరమేశ్వరులను –‘’స్రష్టు స్త్రీ (పుంస నిర్మాణ )ణ-మాతృకా రూప ధారిణౌ-ప్రపద్యే ప్రతిబోధాయ -చిత్ప్రకాశాత్మ కౌశివౌ ‘’-బ్రహ్మ యొక్క స్త్రీ పురుషాత్మకమైన సృష్టికి మాతృకా రూప ధారిణు లైన ,చిత్ప్రకాశాత్ములను ,పార్వతీ పరమేశ్వరులను జ్ఞానాభి వృద్ధికోసం సంస్తుతిస్తాను .సరస్వతీ దేవిని –‘’మహాకవి ముఖా౦భోజ –మనిపంజర శారికాం –చైతన్య జలధిజ్యోత్శ్నాం-దేవీం వందే సరస్వతీం –‘’మహాకవుల ముఖపద్మాల మణి పంజరాలలో శారిక ,చైతన్య సముద్రానికి వెన్నెల గాప్రకాశించే శారాదేవికి నమస్కారం .
తర్వాత గురుస్తుతి చేసింది –‘’అసాధారణ సార్వజ్ఞం –విలసత్సర్వ మంగళం –క్రియా శక్తి గురుర్వందే –త్రిలోచన మివాపరం’’ -అసాధారణ పాండిత్యంతో సర్వజ్ఞుడు ,సర్వ శుభాలచే విలసితిడు అయి రెండవ ఈశ్వరుడు అనతగిన గురు దేవునిడైన క్రియాశక్తికి నమస్కారం. క్రియా శక్తి అంటే కాళీ విలాస క్రియా శక్తి .గంగాదేవికే కాక బుక్కరాయలమంత్రి మాధవ మంత్రికి క్రియా శక్తి గురుమూర్తి అని భావం .క్రియాశక్తి కాశ్మీర పాశుపత శైవ గురువు .ఈ వర్గం వారిని కాలముఖులు అంటారు .హరిహర బుక్కరాయలు క్రియాశక్తి శిష్యులు .రాయల సీమలోఅనేక దేవాలయాలు నిర్మించాడు క్రియాశక్తి .తన భర్త వంశానికి గురుపాదుడైన క్రియాశక్తిని ప్రార్ధించి గంగాదేవి తనకావ్యానికి విజయం కోరటం ఔచిత్యం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-3-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.