మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-5
4-తుక్కా దేవి -1
తుక్కా దేవి ఒరిస్సా రాష్ట్ర సంస్కృత విదుషీ మణి .తెలుగింటి ఆడపడుచు .ఒకమహారాజు కూతురు ,మరొక మహారాజు భార్య .కటకాధిపతి ప్రతాప రుద్రగజపతి కుమార్తె ,విజయ నగరాధిపతి శ్రీ కృష్ణ దేవరాయల రాణి .స్వయంగా పండితుడైన ప్రతాపరుద్రుడు పండితాదరమున్నవాడు.కృష్ణదేవరాయలు స్వయంగా సంస్కృతా౦ధ్ర కవిపోషకుడు ,భువనవిజయం లో ఎన్నెన్నో విద్వాద్గోష్టులు నిర్వహించిన వాడు .సాహితీ సమరాంగణ సార్వ భౌముడు .తుక్కాదేవికి జరిగిన వివాహం రాజకీయం తో జరిగింది .1509లో రాయలు విజయనగర సింహాసనం ఎక్కే నాటికి ,నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకు సముద్రతీర తెలుగు దేశమంతా కటక రుద్ర పతి అధీనంలోనే ఉంది .ఈ ప్రాంతాలను జయించి విజయనగర సామ్రాజ్యంలో కలపటానికి కృష్ణ దేవరాయలు 1913-1917 వరకు నాలుగేళ్ళు ఉదయగిరితో ప్రారంభించి ,ఓఢ్రుల రాజధాని కటకం వరకు దండయాత్ర చేయాల్సి వచ్చింది .ప్రతాప రుద్రుడు ,కొడుకు వీరభద్రుడు రాయలకు ఖైదీలుగా చిక్కారు .అదే సమయంలో ప్రతాపరుద్రునిపై ఉత్తరం నుండి వంగ సురత్రాణుడు దండెత్తి వచ్చాడు .ముదునుయ్యి వెనుకగొయ్యిలా ఉన్న పరిస్థితులలో ప్రతాప రుద్రుడు రాయలతో సంధి చేసుకొన్నాడు .తనకూతురు తుక్కాదేవిని రాయలకిచ్చి పెళ్లి చేశాడు రాయలు దీనికి బదులుగా కృష్ణానది అవతలి ఒడ్డునుండి కటకం వరకు ఉన్న దేశాన్ని మామగారికిచ్చేశాడు .ఈ పెళ్లి, ఈ సంధి ఇష్టంలేక అవమానం తో రుద్రుడికొడుకు వీరభద్రుడు జైలులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు .
సోదరుడి చావు తండ్రి ఓటమి కొంతరాజ్యం కోల్పోవటం కూతరు, నవ వధువు తుక్కా దేవిని కలత చెందించాయి .అప్పటికే రాయలకు చిన్నా దేవి, తిరుమల దేవి ఇద్దరు భార్యలు .తాను ఇప్పుడు మూడవ భార్య .సంసార సుఖం పెద్దగా అనుభవించినట్లు లేదు .తుక్కాదేవితో వివాహం జరిగాక రాయలు పుష్కరకాలం విజయనగర సామ్రాజ్యాన్ని జగజ్జేగీయమానంగా పరిపాలించాడు .కానీ ఆచక్రవర్తి తుక్కాదేవిని పాలించిన దాఖలాలు లేవు .ఆలన ,పాలన లేక ఆమె ఒంటరిగా అఘోరించిందనే చెప్పవచ్చు .ఈ సందర్భంగా జనం లో బాగా ప్రచారమైన కథ ఒకటి ఉంది.తన భర్త గజపతి కృష్ణరాయలతో చేసుకొన్న సంధి గజపతి రాణికి ఇష్టం లేక ,తనకూతురు తుక్కా దేవితో అల్లుడు రాయలును చంపించే ఎత్తుగడ పన్నింది .బంగారు ఖడ్గం తయారు చేయించి కూతురుకిచ్చి భర్త రాయలను చంపమని పురికొల్పింది .ఒకవైపు అన్న ఆత్మహత్య ,తండ్రి భంగపాటు గత్యంతరం లేని తన పెళ్లి వలన ఆమె తల్లి చెప్పిన మాట సబబే అనిపించి,తలూపింది .కానీ రాయలతో సరససల్లాపాలు ఆడుతుండగా ఒకరోజు ఒడ్డాణ౦ సవరించు కొంటుంటే ,చేయి వణికి,వడ్డాణం అనుకోకుండా రాయల పాదాల దగ్గర పడింది .అందులో భద్రంగా దాచిన బంగారుకత్తి బయట పడి,పన్నాగం బట్టబయలైంది .ఆమెను చూడగా కంగారు కనపడి ,తనను చంపే పన్నుగడ తెలిసి భార్య తుక్కా దేవిని కర్నూలు మండలం నల్లమల అరణ్యాలలో ప్రవాస శిక్ష విధించాడు .నిజానికి మరణ శిక్ష విధించాలి .రాయల కనికరానికి ఆమె ఆశ్చర్యపోయి భర్త మంచితనం నెమ్మదిగా మనసులో నాటుకు పోయింది .
అరణ్యంలో తాను గడుపుతున్న ప్రవాస జీవితం లో తనపేరును ‘’వరద రాజేశ్వరి ‘’గా మార్చుకొని ,ఆప్రాంతం లో చెరువులు బావులు త్రవ్వించి ప్రజోపకారమైన పనులు చేసింది .పేదప్రజలకు నిరతాన్నదానం చేస్తూ ‘’అన్నపూర్ణ ‘’గా ప్రసిద్ధి చెందింది .తన భార్యలో లో వచ్చిన హృదయ పరివర్తనాన్ని రాజు రాయలు గుర్తించాడు .ఆమెపై క్రమంగా సుముఖత కలిగింది ‘’ఇదీ ప్రచారంలో ఉన్న గాథ. ఇందులో నిజానిజాలు దేవుడికే ఎరుక .దీనికి చిలవలు పలవులుగా మరికొన్ని కతలు ప్రచారమయ్యాయి రాయలు ఆమెను ప్రవాసం పంపలేదని ,సపరివారంగా కటకానికి పంపుతుంటే ,ఇష్టం లేక నల్లమల లో ఉంటూ,తండ్రిఇచ్చిన కట్నకానుకలతో సత్కార్యాలు చేసిందని మరోకథనం.కంబం చెరువు ఆమె త్రవ్విన్చిందట .మరోకతలో ముక్కుతిమ్మనకవి ఆమెకు అరణపుకవి .ఆమెకు రాయలకు మధ్యజరిగిన ప్రణయ కలహమే పారితాతాపహరణ కావ్యం .ఇది చారిత్రకంగా నిజం కాదు .గజపతి ఆస్థానం నుంచి రాయల ఆస్థానానికి కొందరుకవులు వచ్చారుకాని అందులో మనముక్కుకవి లేడు.పారిజాతాపహరణం గజపతి పై దండయాత్రకు ముందే రచింపబడింది .తాను ‘’సత్యా వధూప్రీణనం’’రాసినట్లు రాయలు ఆముక్తమాల్యదలో చెప్పుకొన్నాడు .
గజపతితో యుద్ధ విజయం పొంది ఆయన కూతుర్ని పెళ్ళాడినా రాయలకు ‘’సహచారిణీ సుఖం’’లేకపోవటం చూసి ,ఆ విషాదగాధకు చలించి ఆర్ద్ర హృదయంతో కవులు అక్షర బద్ధం చేశారు .అందులో శ్రీ వంగూరి సుబ్బారావు కవి ‘’ప్రభాతం ‘’అనే నవల రాశారు .శ్రీమతి కనుపర్తి వరలక్షమ్మమ్మ ‘’వరద రాజేశ్వరి ‘’శీర్షికతో భారతి మాసపత్రికలో (సంపుటి 7,సంచిక 1) రాశారు .శ్రీ చిరుమామిళ్ళ శివరామ ప్రసాద్ ‘’రుచీ దేవి ‘’పేరుతొ ఆంధ్రభూమి మూడవ సంపుటం లో రూపకం గా రాశారు .ఇలా చాలామంది వివిధ ప్రక్రియలలో తుక్కాదేవి విచారగాథకు సాహిత్యం లో చోటు కల్పించి సహృదయత చాటుకొన్నారు .
చాలాకాలం వియోగ దుఖం పొందిన రాయల రాణి తుక్కా దేవి అన్యాపదేశంగా భర్తకు అయిదుశ్లోకాలు రాసి పంపింది .ఇవి భ్రుంగం అంటే తుమ్మెద ను ఉద్దేశించి చెప్పబడటం చేత ‘’భ్రుంగ పంచకం ‘’గా ప్రసిద్ధి చెందాయి . పండితలోకం ‘’తుక్కా పంచకం ‘’అన్నారు .వాటిని తెలుసుకొందాం .
1-‘’చరన్వనాంతే నవ మంజరీషు –న షట్పదో గంధఫలీ మజిఘ్రత్ –సాకిం న రమ్యా సచకిం నరంతం –బలీయసీ కేవల మీశ్వరాజ్ఞా’’-భావ౦ –అన్ని పుష్పాల వాసనా అ౦గీ కరించే తుమ్మెద ,సంపెంగ పువ్వుపై వాలక పోవటం బలీయమైన ఈశ్వర ఆజ్ఞకాదా.చివరిపాదం లోకం లో బాగా ప్రచారంగా ఉన్న సంగతి మనకు తెలుసు .
2-‘’మా కింశుక ప్రకట యాత్మ నిమేష మాత్రం –మన్మస్తకే విహరతీతి మధువ్రతోయం –కిం మాలతీ విరహ వేదన యా త్వదీయం –దృష్ట్వా ప్రసూన మచిరాదనల భ్రమేణ’’-మోదుగ పుష్పమా !తుమ్మెద నీ మీద వాలిందని గర్వించకు.తనకిష్టమైన మాలతీ పుష్పం లభించక పోవటం వలన ,విరహవేదన భరించలేక ,ప్రాణత్యాగం చేసుకోవటానికి నీ ఎరుపు రంగు అగ్నిగా భావించి తుమ్మెద నీ మీద వాలింది .
3-‘’భ్రమర భ్రమతా దిగంతరాళే-క్వచితాస్వాదిత మీక్షితం శ్రుతం వా –వదన సత్యమపాస్య పక్షపాతం –యది జాతీ కుసుమానుకారి పుష్పం ‘’-తుమ్మెదా !అన్ని చోట్లా తిరుగుతావుకదా!జాజి పువ్వుకంటే కంటే మంచిపువ్వు వేరే ఏదైనా ఉందేమో పక్షపాతం లేకుండా చెప్పు .
4-‘’కుసుమాని లిఖంతు నామ చిత్రే –కచి చిత్కారు విశేష రూఢ శిక్షా –సురభిత్వ మమూని కిం లభంతే –కిము చైతేషు రసం పిబ౦తి భ్రుంగా’’-చిత్రకారులు పువ్వుల్ని చిత్రిస్తారు .కానీ వాటికి వాసన హత్తి౦చగలరా?రసాస్వాదనకు వాటిపైకి తుమ్మెదలు వస్తాయా అసలు ?
5-‘’కిం మాలతిం మా యసి మాం విహాయ –చుచుంబ తుంబీ కుసుమం షడంఘ్రిః-లోకే చతుర్భిశ్చరనైః పశుస్యాత్ –స షఢ్భిరత్యర్ధ పశుర్నకిం స్స్యాత్’’-తుమ్మెదా !మాలతీ పుష్పాన్ని అయిన నన్ను వాడిపోయేట్లు రసాస్వాదన చేసి ,ఇప్పుడు తుమ్మిపువ్వుపైకి వెడుతున్నా వేమిటి ?లోకం లో నాలుగు కాళ్ళజంతువుల్ని పశువులు అంటారు .నీకేమో ఆరుకాళ్ళు .కనుక నువ్వు ఒకటిన్నర పశువువా ?
ఈ అయిదు శ్లోకాలు తుక్కాదేవి గా ప్రచారం లో ఉన్నా ,అవి ఆమె రాసినవి కావనీ ,ప్రాచీన కవులరచనలనుంచిసేకరించి కూర్చినవనీ కనుక ఆమె కవయిత్రికాదు అంటారు .అంతమాత్రం చేత ఆమె విదుషీమణి కాదు అనటానికి వీల్లేదు అన్నారు ఆండ్ర వారు .ఇందులో రెండు వల్లభ దేవుని సుభాషిత రాత్నావలిలో ,మరోటి ముకులభట్టు ‘’అభిదా వృత్తిమాతృక ‘’లోనివి .ఈఇద్దరు తుక్కా దేవికి పూర్వకవులు .బహు ద్రష్ట కనుక వీటిని సేకరించి ప్రకరణ శుద్ధిగా పొదిగి తన వైదుష్యాన్ని ప్రకటించింది అని ఆండ్ర శేషగిరిరావు గారు చెప్పినమాట యదార్ధం కావచ్చు .ప్రతాప రుద్ర గజపతి ఆశ్తానం నుంచి కృష్ణ దేవరాయల ఆస్థానానికి లొల్ల శ్రీధర పండితుడు ,లక్ష్మీ నారాయణ మొదలైన సంస్కృత కవిపండితులు వచ్చారు .వారి పా౦డిత్యగరిమ ఆమెకు స్పూర్తికలిగించి ఉంటుంది అనుకొంటే పోలా ?.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-23- ఉయ్యూరు