మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6
4-తుక్కా దేవి -2
కుమార దూర్జటికవి తన ‘’కృష్ణరాయ విజయం ‘’కావ్యం లో తనకూతుర్నిపెళ్ళిచేసుకోమని రాయలతో ప్రతాపరుద్రుడు చెప్పినట్లు ఉంది.’’నీ రుణ మెండు దీర్చుకొన నేర ,మదీయ కుమారి ,జారు శృం-గారమమణిన్ గుణో న్మణిణి గైకొను మిచ్చితి నీకు గీరతు –క్ఖార సమాన రూప,హిమకైరవ బంధు యశః కలాప ల –క్ష్మీ రమణా,ప్రతాప నరసింహ కుమార,కుమార విక్రమా “’.రాయల మంత్రి తిమ్మరుసు మేనల్లుడు ,కొండవీటి రాజ్య ప్రతినిధి నాదిండ్ల గోపన్న కవి ప్రబోధ చంద్రోదయ వ్యాఖ్యాన పీఠికలో ఒక శ్లోకం లో –‘’ప్రతాపరుద్రస్య గజేశ్వరస్య –పుత్రీం పవిత్రీకృత భూత ధాత్రీం –ప్రత్యగ్రహీద్య ప్రకట ప్రతాపో –భద్రం శుభద్రామివ పా౦డవేయః’’-అలాగే రాయల ఆస్థానకవి కుమార సరస్వతి అనే ద్రావిడకవి కూడా రాయల తుక్కా దేవి వివాహం ప్రస్తావించాడు .
ఇంతకీ తుక్కా దేవి పేరు ఏమిటి అదే అసలుపేరా అనే సందేహాలున్నాయి అసలుపేరు భద్ర ,లేక సుభద్ర అయి ఉండచ్చు .నాదిండ్ల గోపన్న పొరబాటు పడ్డాడని శ్రీరంగాస్వామి సరస్వతి భారతిలో రాయగా ,ఖండిస్తూ శ్రీ మానవల్లి రామకృష్ణకవి 1925 జూన్ భారతిలో కళింగరాజుల కులదైవాలు శ్రీకృష్ణ సుభద్రలు కనుక తుక్కా కాదని భద్రకాని సుభద్ర కానీ అయి ఉంటుంది అన్నారు .రాయవాచకం లో ఆమె పేరు జగన్మోహిని గా ఉంది.ఒక కన్నడ గ్రంధం లక్ష్మీ దేవమ్మ అన్నది .కైఫీయత్తులలో ‘’లుఖి ‘’,అని ఉంది బహుశా తుఖా బదులు లుఖా అని పడి ఉండచ్చు.మెకంజీ పుస్తకాలను ఇంగ్లీష్ లోకి అనువదించిన టైలరు కూడా ఆమెను రుచీ దేవి అన్నాడు .ప్రజలకోరికలు తీర్చటం వలన వరద రాజేశ్వరి అయింది .సేవాతత్పరతతో అన్నదానం తో అన్నపూర్ణ గా మారాక ,రాయలు ఆమెను మళ్ళీ రాణిగా స్వీకరించాడు అనటానికి ఒక ఆధారం కనిపి౦చి౦దిన్ది అన్నారు ఆండ్రవారు . రాయల ఆముక్తమాల్యదలో చిన్నాదేవి పేరు చెప్పకుండా తిరుమల దేవి, అన్నపూర్ణ అని చెప్పాడు .కనుక పెరుమారిన అన్నపూ ర్ణయే తుక్కా దేవి అని ఊహ .
మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6
5-తిరుమలాంబ
విజయనగర రాజ్యంలో గంగాదేవి రాజపుత్రుని భార్య ,తుక్కాదేవి రాజ్యాధిపతి భార్య .కాని తిరుమలాంబ సామాన్యురాలు .కానీ వైదుష్యం లో పై వారిద్దరితో పోటీ .ఈమె ‘’వరదాంబికా పరిణయ ‘’సంస్కృత కావ్యం రాసింది .కృష్ణరాయల సవతి తమ్ముడు ఆతర్వాత రాజ్యపాలకుడు అయిన అచ్యుత రాయల పట్టమహిషి వరదాంబిక. సకల రాజు కుమార్తె .అచ్యుతరాయల మంత్రి సేనాపతి అయిన సకలం పెద్ద ,చిన్న తిరుమల యొక్క సోదరి .రాజ కీయాల జోలికి పోకుండా వ్యవహరించింది .విజయనగరం దగ్గర వరద రాజమ్మ పేట ఈమెపెరుతోనే వెలసిల్లింది .కంబం చెరువు నిర్మించి౦ది కూడా ఈమె అనే అనుమానం .1532లో కంచి వరద రాజ స్వామిని సకుటుంబంగాకుమారుడు వేంకటాద్రితో సహా దర్శించిన అచ్యుతరాయలు రాణి ముత్యాలతో తులాభారం తూగి ,భూరి దానాలు చేసింది వరదాంబిక .భర్త చనిపోయాక తనకొడుకు స్థిరస్థానం కోసం బీజాపూర్ ఇబ్రహీం ఆదిల్ షా తో రాయబారాలు నడిపింది .వీటిని తనకావ్య౦ లో తిరుమలాంబ చక్కగా వర్ణించింది .-‘’ఒకసారి వింటే చాలు కొత్తకావ్యం అవగాహన అవుతుంది నాటకాలంకార పురాణాదుల పై అవగాహనమున్నది విద్వత్ కవివరుల పోషణలో నేర్పున్నది సరస ప్రబంధాలు కూర్చగల నేర్పరి .అనేక విద్యలలో ఆరితేరిన అచ్యుతరాయల ప్రేమను పూర్తిగా పొందింది .ధర్మ నిర్మల హృదయ .అనేక లిపులు రాయటం లో సిద్ధ హస్తురాలు .వీణానాదంలాగా గొప్ప శ్రావ్యమైన కంఠస్వరం .భూలోక సరస్వతి .వాజపేయ ,పౌ౦డరీకాది యాగాలు చేసి సోమయాజులైన బ్రాహ్మణ ప్రముఖుల ఆశీస్సులు పొందింది ‘’.
కానీ తిరుమలా౦బకావ్యం గంగాదేవి కావ్యానికి తీసికట్టు .పెళ్ళితో కావ్యం పూర్తికాలేదు .దా౦పత్యజీవితం ,కొడుకు వెంకటాద్రి పుట్టుక దాకా సాగింది .అచ్యుత రాయల వంశ వర్ణనం విపులంగా ఉంది .చంద్ర వంశం లో తిమ్మరాజుపుట్టాడు. భార్య దేవకీ .కొడుకు ఈశ్వరరాజు .ఇతడు బుక్కమ్మ తో నరసరాజును పొందాడు .నరసరాజు యుద్ధ వర్ణన విపరీతంగా చేసింది .వీర విక్రమ ప్రదర్శన చేసి విద్యానగరం తిరిగివచ్చి ఓబులా౦బను పెళ్ళాడి అచ్యుతరాయలనుకన్నాడు .నరసరాజు అంతకు ముందే పెళ్ళాడిన తిప్పా౦బ కు వీర నరసింహరాయలు ,నాగామా౦బకు కృష్ణ దేవరాయలు పుత్రులు .ఈ విషయాలు చెప్పలేదు కవయిత్రి .నరసరాజు చనిపోయాక అచ్యుతుని యవ్వనం తిరుమలాంబ వరదాంబికలతో వివాహం వర్ణన చేసింది .వెంకటాద్రీశ్వరుని దయవలనకలిగిన కుమారుడికి చిన వెంకటాద్రి పేరు .ఇతడినే రాజ్యానికి వారసుడిని చేశాడు .చివరలో తనపోషకుడైన అచ్యుతరాయలు దేవేరి వరదాంబికలను చల్లగా కాపాడమని తిరుమల స్వామిని వేడుకొంటూ కావ్యం ముగించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-3-23-ఉయ్యూరు