సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023
ఉయ్యూరులో వైభవంగా సరస భారతి ఉగాది వేడుకలు
ప్రపంచానికి ఆదర్శంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన మన సాహితీ – కళ సంపదను నేటి తరం సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు లోని శ్రీమతి నాగళ్ళ రాజేశ్వరమ్మ జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాత్రి సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శోభకృత్ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు. సరసభారతి వ్యవస్థాపక అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉగాది వేడుకలలో కవి సమ్మేళనం తో పాటు వివిధ రంగాలలోని విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక పురస్కారాలను ప్రధానం చేశారు. భారతదేశంలో హరికథకు తొలి పద్మశ్రీ అవార్డు పొందిన హరికథ గాన కళాపీఠం వ్యవస్థాపకులు హరికథ సామ్రాజ్య సార్వభౌమ పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ తో పాటు ప్రముఖ సినీ నటులు ప్రయోగాత్మక రంగస్థల నటులు బుల్లితెర దర్శకులు తెలుగు చలనచిత్ర నంది అవార్డులు గ్రహీత ఎస్.కె.మిస్రో లకు సరస భారతి తరపున కీ.శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి భవానమ్మ దంపతుల స్మారక ఉగాది పురస్కారాలను ఈ వేదికపై అందజేశారు. వారితో పాటు సాహిత్య, కళా రంగాలలో విశేష సేవలు అందించిన పలువురు వ్యక్తులకు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు శోభకృత్ ఉగాది పురస్కారాలను ప్రధానం చేశారు. అనర్గళ పద్య గానం తో ప్రఖ్యాతిచెంది,మెమరీ పవర్ తో 5 ప్రపంచ రికార్డులను బద్ధలుకొట్టిన మున్నంగి హాసిని శ్రీరూప ని ఈ వేదికపై సత్కరించారు. సరసభారతి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు రచయితలు,కవులు హాజరై కవి సమ్మేళనంలో తమ కవితా మాధుర్యాన్ని పంచారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు , ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ హాజరయ్యారు. కార్యక్రమంలో సరస భారతి గౌరవాధ్యక్షులు జె. శ్యామల దేవి ,సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన ముఖ్యులు పాల్గొన్నారు. తెలుగు రచయితలు,కవులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సరస భారతి కార్యదర్శి మాదిరాజు శివలక్ష్మి , సరస భారతి కోశాధికారి గబ్బిట వెంకటరమణ పర్యవేక్షించారు.