శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు కవిగారు తమ ’శ్రీమదాంజనేయ శతకం ‘’లో మొదట శ్రీ రామ జనక పంచకం గా అయిదు సీసాలు రాసితర్వాత శతకం ప్రారంభించారు .ఇది శార్దూల పద్య శతకం .మొదటి శార్దూలం –శ్రీ రామా౦ఘ్రి సరోరుహంబుల సదా చింతించి దీర్ఘాయువున్-మీరన్ మీరగ గాంచి ,భూమిపయి సందీప్త ప్రభావంబుతో –బారన్ ద్రోలుచు భూత సంఘముల ,సద్భక్తాలి రక్షించు చున్ –వీరత్వ స్థితి నున్న వాడ విటసద్వీరా౦జనేయ ప్రభూ ‘’రెండోపద్యంలో హనుమ బాలక్రీడగా సూర్యుని మింగే ప్రయత్నం ,దేవతలవరాలు తర్వాతసుగ్రీవ మంత్రిత్వం రామ లక్ష్మణ పరిచయం చెప్పి సీతమ్మ జాడ తెలుసుకొనే ప్రయత్నం లో సముద్ర లంఘనాన్ని –‘’’’హుంకార స్ఫుట భీకరాంగవిలసద్వ్యోమ ప్రచారోద్ధతిన్-ఘీమ్కారంబుల దిక్కుళేల్ల నవియన్ ,గేళీ విలాసంబుగా –శంకాతంకములేక యర్ణవము నిచ్ఛా శక్తిలంఘించి ము –ద్రాంకంబున్ ,సతి సీత కిచ్చితివి కదా !ఆంజనేయ ప్రభూ ‘’అంటూ ఆదృశ్యాన్ని కళ్ళ ముందు ఫోటో తీసి పెట్టారు .
వేదా౦తార్ధ విచక్షణుడు,బ్రహ్మచర్యోదాత్తప్రతిభాయుతుడు ,యోగైకరూపుడు ,వేదజ్ఞాన విశారదుడు ,నిజాభీష్ట సంవేది,నాద బ్రహ్మ అని హనుమ స్తుతి చేశారు .సారాచార విచార భౌతిక దిదృక్షా దీక్ష సంకల్ప ,సంచారోద్భూత వివేక విస్ఫురిత విజ్ఞాన ప్రకాశ,ధీరస్వాంత ,సుస్థిరంగా ధాత్రిపై ఉండేవాడా అంటూ హనుమ గుణ గాన కీర్తన చేశారు లాయర్ కవి .’’మా భాగ్యవశాన యడ్లపాడు సౌభాగ్యం దీపి౦పగా ,,శోభాముద్ర పరీత విగ్రహ ,శుభ శ్లోకా ,భీకర ,తేజో స్వరూపునిగా మోక్ష దాయునిగా ఉన్నావు .’’కష్టా ర్త్యోగ శిలీ ముఖ ప్రకర శుష్క ప్రాణ సంజీవనా –దుష్ట వ్రాతవనీ కుఠార ,సుగుణ స్తోమైక రక్షేశ్వరా – -శిష్టాచార విశుద్ధ కార్యవిదిత స్వీకార నైవేద్య సం –తుష్ట వినోద గీతిక నిదానూ ఆంజనేయ ప్రభూ ‘’అని కష్టమైన పద్యాన్ని అత్య౦త సులభంగా రాసి స్వామి భక్తి చాటుకొన్నారు .హనుమ పేరు ఎత్తితే కవికి పులకరి౦పే, జలదరి౦పే. అందుకే ఇ౦పు గొలుకు పదభూయిష్టంగాశతకం అల్లారు-‘’దివ్యజ్ఞాన సమాధి రాగ హృదాయో ద్రిక్త ప్రభా శోభితా –భవ్యాకార,విసూక్ష్మ రూప ధర ,విశ్వ వ్యాపి విశ్వేశ పుత్రా –వ్యోమార్గ చరాను వర్తీ ,సుగుణ వ్యాపార పారీణ-రామ వ్యాపార జయా౦క చిహ్న వరధామా ‘’అంటూ ఉప్పొంగిపోయి హనుమలీలా వర్ణన చేశారు .మాటలు రాని వాడిగా స్తబ్ధతగా మా ఊళ్ళో ఎందుకున్నావు ?భూత ప్రేత పిశాచాలు నీకు ‘’ఆమ్యామ్యా ‘’ఏమైన సమర్పించాయా ?మాలోపాలు చూపి బాధలు పోగొట్టు స్వామీ అని చమత్కారంగా చెప్పారు .
నీకోసం గులాబి పువ్వు కోయబోతే ముళ్ళు గుచ్చుకొన్నది .మొగలి కోయబోతే బస్సు బస్సు అని పాపరేడు భయపెట్టాడు .కాపాడు తండ్రీ అని భక్తీ యుక్తి చాటుకొన్నారు .తన అనుభవాన్ని చెబుతూ –‘’కనుమూయన్ గనుగొందు దివ్యతరసుజ్ఞానప్రకాశంబు,వే –కనువిప్పన్ కనుగొందు మౌఢ్యతర మౌ కామా౦ధకారంబు ,మా-యను జన్మంబును బొంది మాయవలలో వ్యాలోలమై పోవు –నీ తనువున్ గావు మటంచు వేడెదను సద్భక్తా౦జనేయ ప్రభూ ‘’అని మాయామోహ జగత్తు లీలా వర్ణన చేసి, అవలలో పడకుండా జారకుండా రక్షించమని ఎలుగెత్తి ప్రార్ధించారు కవి .ధన ధాన్యాలు కోరలేదు .ఎందుకు పరి వేదనతో ఇబ్బంది పెడతావయ్యా .వాత్సల్యం చూపి మోక్షం ప్రసాదించు మహాప్రభో అన్నారు .లక్ష్మీ వంశ సంజాత ధర్మపత్ని అయిన నారాయణ స్వరూపి శ్రీరాముని సేవాభాగ్యం పుష్కలం గా ఉన్న వాడివి .నన్ను ఆదుకోకపోతే నీ వీరత్వానికి లోటు కదా అనిఫిట్టింగ్ పెట్టారు ఎంతైనా లాయర్ కవికదా.
99వ శార్దూలం లోతనతండ్రి నరసయ్య తల్లి సుబ్బమాంబ ,అనీ ,రామయ్య ,రాజ్యమా౦బలకు దత్తత వెళ్లి ,యడ్లపాటి సుబ్బారావు పేరుతొ శతకం రాశానని చెప్పారు .చివరి శత శార్దూలం లో ‘’వసుధన్ నీదుమహత్వమెంతదనుకన్ వర్దిల్లునో ,రామ నామ నా –మ సహస్రంబులు నెంతకాలమవనిన్ భక్తాళికిన్ జ్యోతులో –వసురూపంబున నంతకాల మవనిన్ పద్యాళి వర్దిల్లగన్ –వెస దీవించు మటంచు వేడెదను సద్వీరా౦జనేయ ప్రభూ ‘’అని ముగించారు .మంచి ధార, బిగువైన శోభాయుత భావాలు భక్తీ దానికి తగిన వివేకం,దానికి తగ్గ పాండిత్యం ,ఊహా శబలత ,విశిష్ట శైలి తో యడ్లపాటి లాయర్ కవి చక్కని శతకం కూర్చి తమ దైవం శ్రీ ఆంజనేయస్వామికి కానుకగా సమర్పించారు పద్యం నడక శార్దూలంలాగానే నడిచ శోభస్కరంగా ఉంది .1935లో తండ్రిగారు రాసి ముద్రించిన శతకాన్ని మళ్ళీ 2006లో కుమారుడు’’ శ్రీ రచన శాయి’’ ముద్రించిలోకానికి అందించినందుకు అభినందనలు .ఈ శతకాన్ని, ఈ కవి గారిని పరిచయం చేసినందుకు మహదానందంగా ఉంది .
రేపు శ్రీ శోభకృత్ ఉగాది శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-23-ఉయ్యూరు .