హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు

హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
తమిళనాడు లోని తెలుగు గడ్డ హోసూరులో ఉన్న బస్తి యువక బృందం వారు శ్రీ శోభకృత్ ఉగాది సందర్భం గా డా. ఎం .వసంత్ గారి ఆధ్వర్యంలో’’ పలుతావుల ‘’కవులనుంచి కవితలు తెప్పి౦చి ఈ కవితా కదంబమాల కూర్చి, నాకు ఆత్మీయంగా పంపితే ,ఇవాళే అంది, వసంత్ గారికి ఫోన్చేసి చెప్పాను..ఈ సంఘం హోసూరు తెలుగు వారి గుండె చప్పుడు .2007 నుంచి ప్రతిఉగాదికి ఇలా సంకలనాలు తెస్తూనే ఉన్నారు .ఇదంతా సాహితీ జీవి అయిన డాక్టర్ గారి పట్టుదల ,కృషి .చక్కని దేవాలయ ముఖచిత్రం తో పుస్తకం మహా ఆకర్షణీయంగా ఉంది ..అందుకే శ్రీ పలమనేరు బాలాజీ ‘’ప్రతి సంవత్సరం ఒక ఉత్సాహ భరిత ప్రయాణం ‘’అన్నారు సార్ధకంగా .ఈ కవితా సంకలనాన్ని కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ సభ్యులు కీ .శే .శ్రీ నా గొండపల్లి కృష్ణప్ప గారికి అంకితమివ్వటం సముచితం గా ఉంది .ఇందులోని45 ‘’కవితలను ‘’వసంత కేళి ‘’అన్నారు .
మొదటికవిత ‘’మరో వసంతం కోసం ‘’లో పొత్తూరి సుబ్బారావు –‘’’’మా వూరి రావి చెట్టు అవిశ్రాంత శ్రామికురాలు –అనాదిగా సూర్య కిరణాలను జల్లెడ బట్టి ‘’రచ్చబండ జనాలకు నీడ నిస్తోందన్నారు .వలసపోతున్న వారికి వీడ్కోలు వలసపక్షులకు స్వాగతం చెబుతుంది .కళ్ళ ముందు దొర్లిపోతున్న వసంతాలను చూస్తూ తృప్తి పడక మరో వసంతం కోసం ఎదురు చూస్తూనే ‘’ఉందట .కవిగారి నాష్టాల్జియా కు అద్దం పట్టిన కవిత .మిత్రుడు ఉప్పలధడియం వెంకటేశ్వర తలుపు చప్పుడుకు గొళ్ళెం పెట్టి ,పక్షులఅలికిడికి కిటికీ రెక్కలుమూసి ,’’అన్నీ మూసుక్కూర్చున్నాక లోపల్లోపల ఒకటే ఉక్క పోత ‘’భరించలేకపోయాడు .’’నేనుకట్టిన పన్ను వాడికి స్వర్గమై ,వాడు కట్టని పన్ను నాకు నరకమైంది ‘’అని వ్యధ చెందారు అడిగోపులకవి .ప్రశ్నలు చంపేసిన వాడే బతగ్గలగడని,కాలం కడుపుతో ఉండిప్రశ్నల ప్రసవ వేదన పడాలన్నాడు ‘’శ్రీనివాస గౌడ్ .కులం వాసన ఇల్లు అంటే కవి ఇల్లే ‘’అన్నాడు పలమనేరు బాలాజీ .పేద, బడుగు, గరీబు పదాలు నిఘంటువు నుంచి తొలగించాలని’’ మౌని ‘’ఎలుగెత్తి చెప్పాడు .శ్రీ శ్రీ బాటలో నడవమని బొగ్గవరపు సలహా .’’దేశం నీకోసం ఎదురు చూస్తోంది భయ్యా –నీలోని అంబేద్కర్, కలాం, అల్లూరి కోసం ఎగసి పడే కెరటంలా రారా ‘’అని తొందరపెట్టాడు పాండురంగ .’’ఉషస్సులా ,యశస్సులా శ్రీ శోభకృత్ ‘’ను ఆహ్వానించాడు తాడినాడ.
‘’శాంతినుంచి శాంతి ప్రక్కకు తొలగి అశాంతిగా –మనిషినుంచీ తొలగి –మనిషిజాడ ప్రశ్నార్ధకమై –పచ్చని పల్లెలో ఫాక్షన్ పడగ నీడ కింద చరిత్ర రక్తసిక్తమై –ఇంటి బతుక్కి తాళం వేసి తననుండి తనను తరిమేస్తున్న వైనాన్ని ‘’వడలి రాధాకృష్ణ సహజ గంభీరంగా చెప్పాడు .’’నన్ను నన్నుగా మన్నించే –మనిషికావాలి ‘’అని ఆక్రోశించాడు రంగస్వామి కవిమిత్రుడు .తెలుగుపాట కు విదాతయై సిరివెన్నెల కురిపించాడు సీతారాముడు ‘’అని జోహారుపలికాడు ఆకుల రఘురామయ్య .ఇంట్లోకి రాకు అని ఎలుకను అర్ధించాడు మిత్రుడు, మద్రాస్ కవి, గుడిమెట్ల చెన్నయ్య.’’నిజమైన వసంతం అంటే –అస్తిత్వం ఆవలి వైపు నుండి ఉనికికోసం –ఉత్సాహం ఉరకలు వేస్తూ ఆహ్వానిస్తేనే వస్తుందిట డా కడలి కి .మోహన రావు మరో అడుగుముదుకేసి ‘’దేశం సుభిక్షంగా ఉండాలంటే –రామభజన కాదు –రైతు భజన చేయండి ‘’అని పాలకులను హెచ్చరించాడు .తాను దగ్ధమౌతూ వెలుగునిచ్చే వత్తి, తానుకాలిపోతూ పరిమళించే అగరుబత్తి ‘’లను చూసి త్యాగ గుణం అలవారచుకొమ్మన్నాడు ప్రతాపరెడ్డి. ‘’ఇంగ్లీషంటే –ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ –మరి పాస్ట్ ?-అ దెందుకహే వేష్ట్’’అన్నాడు నేటి విద్యార౦గాన్నిఎద్దేవ చేస్తూ జొ. రా.మూర్తి .
‘’ఒడిలో పోసుకొన్న జ్ఞాపకాల పూసలను ‘’దారంలోకి కూరుస్తుంది భావుక’’ వారిజ’’ మనసు ..సందర్భాన్ని బట్టి కాకి హంసలాకనిపించింది సునీల్ కు .’’ఒకే ఒక రోజే జీవితకాలమని తెలిసీ ధీరత్వం తో-రాలిపోయే గడ్డిపువ్వుల –చిరుదరహాసం వాటిస్వేచ్చాజీవన౦’’లో చూసింది కంచి కుమారి .’’నీరో ప్రభువులు ,నిర్లక్ష్య ప్రజలు ఉన్నంతకాలం –ముసురు ఆగదు –శవాలు ప్రవహిస్తూనే ఉంటాయి ‘’అని అద్భుతంగా చెప్పాడు సిద్దార్ధ ..ధర్మా రెడ్డి కి ‘’కొన్ని ఉదయాలు ఒడ్డుకు కొట్టుకొచ్చి,మెలిదిరిగిన శవాల్లా’’భయపెట్టాయి .కుమార స్వామి రెడ్డికి ‘’సూర్యకాంతి కలకు కంటి వెలుగై ,తనను విడుదల చేసి గగనంలోకి బావుటాలా ఎగరేస్తాయట నల్లని చేతులు .త్యాగధనుల గుణగణాలు స్వీకరిస్తే –ఆంధ్రులకు వస్తుంది అందమైన జీవితం ‘’అన్నాడు శంకరరాజు .శ్రీ మతి తుర్లపాటి రాజేశ్వరి –‘’వసుధైక కుటుంబం కోసం ,ప్రతివ్యక్తీ పరమాత్మాను సంధానం కోసం .జన సౌభాగ్యం కోసం ‘’జీవన చైత్రం లో ఆరాటపడ్డారు .తమకనుకూల చట్టాలు వాళ్ళు చేయించుకొ౦ టే –తెలియని చట్త్రం లో నలిగిపోతున్నారు వీళ్ళు ‘’అని సానుభూతి చూపాడు దేవీ ప్రసాద్ గడ్డం .జీవితం వింతా, మాయ అని మారుతీదేవి ,సజావైన సామాజిక జీవనాన్ని స్థాపించటానికి కదలమని రాము ,అన్నారు .
‘’మొక్కలు వదిలేగాలి –జంతువులకు ప్రాణాధారం –జంతువులూ వదిలేవి మొక్కకు ప్రాణాధారం ‘’పరస్పర ఆధారమే ప్రపంచం అని డా వసంత చెప్పాడు సై౦టిఫిగ్గా.’’పురుషత్వాన్ని సుఖ పెట్టె మాంసపు వస్తువులుగా –అమ్మాయిల్ని చూసినంతకాలం –ఈ విశ్వ గృహాన్ని సజీవంగా ఉంచే అమ్మలు –అమ్మలుగా మిగలరు ‘’అనే నగ్న సత్యాన్ని ఢిల్లీ సంఘటనాదారంగా చెప్పాడు బాధా తప్త హృదయంతోఆచార్య ఈశ్వర రెడ్డి .’’మనకోసంమనల్ని –ఊపిరి పీల్చుకోమని భరోసా ఇచ్చేది అక్షరాలే ‘’అని అక్షర సత్యంగా అనంత అనుభవంతో చెప్పారు శీలాసుభాద్రాదేవి .’’పాట సూర్యుడి లాగా వెలుగుతుంది ‘’అన్నారు డాక్టర్ సుంకర .తన భావతీవ్రతకు రాగటి సోపానం తన నాన్న ‘’అని పొంగిపోయాడు యువశ్రీమురళి.’’సంగమించడం –సమూహమవ్వటమే జీవితం –కలవడమంటే –కైవల్యమె ‘’అన్నాడు సురేష్ తాత్వికంగా ..’’కోటదారిలో-తోట గేరి ప్రయాణం ‘’చిలుకూరి దీవేన మనసును ఉప్పొంగిస్తుంది ,కొండమీద నాన్నవేసిన ఈలగానం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది .దుఖపు వలువలు కప్పుకొన్న వొంటరి ఆత్మకోసం –వసంతాన్ని తెస్తుందని నమ్మింది ఝాన్సి .’’అమ్మ ,నానమ్మ చేతులు రక్త మాంసాల పనిముట్లుగా ‘’ఎందుకు మారాయో తెలీదు అని ,మగాళ్ళను వంటి౦టికి పంపి, చేతుల్లో టేపు పెట్టి వాళ్ళు నడవ బోయే దూరాలను కొలుచుకోమని ఆర్డర్ వేసింది’’ డేర్ డెవిల్’’ గీతాంజలి. చివరిగా ’’ఇప్పటికైనా మాట్లాడటం మన బాధ్యత-మౌనంగా ఎంతోకాలం ఉండలేం ‘’అన్నాడు సంపత్ రెడ్డి .
45 గొంతుల ఉగాది వసంతగానం ఇందులో దర్శనమిస్తుంది .ఒక్కొక్కరిది ఒక్కో తీరు .అయితే అందరిదీ ఒకటే దారి మనిషి మనిషిగా బతకాలి స్వేచ్చ అనుభవించాలి .తెలుగు మర్చిపోకుండా భావితరాలక౦దించాలి. ప్రతిఉగాది నవ వసంతోదయం అవ్వాలి .ఇంత మంచి సంకలనం తెచ్చిన మిత్రుడు డా.అగరం వసంత్ కు ,కవులకు ఉగాది శుభాకాంక్షలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-23 –ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.