సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
శీర్షిక –శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం
1-శ్రీ కందికొండ రవికిరణ్ –విజయవాడ -94912 98990
తరంతరం నిరంతరం ఈ పయనం
మిగిల్చాయి ప్రజాలోకానికి –శార్వరీ ప్లవలు –మున్నెరుగని చేదు అనుభవాలు – తూకమేసి చూస్తె తీపికంటే మిక్కిలిగా.
అయినాఅంతెత్తున నిలిపి –మన సంప్రదాయ సంస్కార ప్రాధాన్యతను ప్రపంచానికి తెలిపాయి
ప్రాణాలు నిలిపే దాని విలువ –డాలర్ రూబుల్ ,పౌండ్ లకన్నా అధికమని .
శుభ కృత్ వచ్చింది ఘన సంప్రదాయాన్ని ద్రవీకరించింది
హృదయాల గాయాలకు లేపనమై –కించిత్ ఉపశమనం కలిగించింది .
వాడి వడలి రాలిపోయిన గానీ –అక్షర ప్రసూనాల సుగంధ సౌరభాలను
కైక సుతునిలా శిరసున దాల్చి సాగిపోదాం –ముందుకు చేర్చుదాం ముందు తరాలకు
ఆశిద్దామిప్పుడు శోభ కృత్ లో మొలకెత్తిన శుభాలు
చిగురులేసి ,పుష్పించి ఫలభరితమవాలని
దిగులు మబ్బుల తెరతొలగిన దివాకరునిలా –మానవాళి హృదయాలు ప్రకాశించాలని
షికారు చేస్తున్న కొత్త వైరస్ ,పుకారు కావాలని –శోభ కృత్ సార్ధక నామగా శ్లాఘింప బడాలని
మంచే జరగాలని ,ఎప్పుడైనా శత్రు నివహానికైనా
దేశమాత చుట్టూ చేరే ఆపదలు రాహు కేతు గ్రస్ధ గ్రహణాలై
కర్రతాకిడికి తునాతునకలై చెల్లా చెదురయ్యే మట్టి కుండ లవ్వాలని
భరత జనతకు సరిపడా శక్తి యుక్తులిచ్చి – ఆ విశ్వనాథ శ్రీరాములు రక్ష చేయాలని
అభిలషిద్దాం మంచి మనసున్న మనుషులుగా
నేను బాగుపడాలంటే దేశం బాగు పడాలి –దేశం బాగు పడాలంటే దైవం అండగా ఉండాలి .
2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ -97037 76650
శుభ కృత్ పోయిరమ్మ
1-శుభములిత్తువనుచు శుభ్రంపు మనసుతో –స్వాగత గీతాలు పాడినాము
ఎవ్వరికే మేలు ఇంపుగా నిచ్చెనో –ఆంధ్ర దేశ స్థితి అట్టే యుండే
శుభముకోరని పరిశుద్ధాత్ము లీరనుచు –శుభము లీకనే యేగే శుభ కృతౌర
ఊరు దిబ్బైనపుడు పేరు గొప్పేముంది –శుభ కృత్ తానేమి శుభములిచ్చు ?
పోయిరావమ్మ శుభ కృత్ పోయి రమ్ము –సుకృతి షష్టి పూర్తికి నీవు శుభము లెన్నో
తెచ్చి ఈవమ్మ ఆంధ్రులు మెచ్చగాను –కాల చక్ర౦పు రధముపై కమ్రగతిని .
ఓయి శోభ కృత్ వసంతమా !
2-నీ వచ్చు దారిలో ఏ గోతిలో నీవు- పడకుండమడుగులన్ పరచమైతి
ఫ్లెక్సీల స్వాగతాల్ లెస్సగా పెట్టించ –తెలుగేల నిదియంచు త్రు౦చినారు
మామిడి తోరణాల్ మక్కువతో కట్టించ –చెట్టంచు భ్రమతోడ కొట్టినారు
పీతాంబరములతో వీధులన్ నిలుచుండ –ఆబోతులే క్రుమ్మె నావలకు
కొమ్మ రెమ్మలందు కోయిలల్ కాదు మా-చెట్లదారులన్ని చిన్న బోయే
శోభ కృత్ నీకు సుస్వాగతముపల్క-సరసభారతి యిట సభను దీర్చె .
ఆకాంక్ష
3-బుద్ధులౌ నీతికి బద్ధులౌ నేతల -పావన పాలనన్ దేశమ్ము భద్రమౌత
శిరమెత్తు శైలాల శిఖరాల పైనుండి –ప్రవహించు నదులెల్ల పారుగాక
ఋషుల కొండలపైన క్రీడించు శాంతమ్ము –అశ్రాంత మట్టులే అలరుగాక
రాజ్యాధికారమ్ము భోజ్యాధికారమన్-స్వార్ధ చింతన లేని ప్రభుత అగుత
దుష్టగ్రహములన్ దూరాన నిలబెట్టి –గురు శుక్రయోగమ్ము కూర్చుగాక
తెలుగు పీఠమ్ము పై నిలిచి’’ వెన్నెల రేడు’’ –తెలుగుల వెలుగులన్ వెలయుగాక
అక్షరాభ్యాసమ్ము ఆంగ్లాన జరిపించు –కాలమ్ము రాకుండకాచుగాత
అమరావతీ శోభ అమృతంపు విభవమై –పెనుపొందిలోకాన వెలయుగాక
అభయ మౌనట్టి జీవన మమరుగాక –తెలుగు నేలలు సౌభాగ్యాల నెలవులగుచు
తెలుగు భాషయే భాష్యమై నిలుచుగాక-శోభ కృతు !మాకు శుభముల శోభనిమ్ము .
3-మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –మచిలీ పట్నం -92993 03035
శోభ కృత్ కు స్వాగతం
-1-ఉ-రాగదే నవ్య వత్సరమ లాలిత సద్గుణ రూప మందుచున్ –రాగదవే శుభా కృతిని రంజిలజేసెడిపాలనంబుతో
రాగదే శోభనా కృతిగ రమ్య రసంబులు పంచ వేడ్కతో –రాగదే దివ్యభావమూల రాసి ని పెంచు నెపంబు తోడుతన్ .
2-స్వాగతమోయి శోభ కృతు స్వాగతమంచు పల్కు తుంటి –ఏ రోగములేని జీవితము రోద నెరు౦గని మానవత్వమున్
ఆగని భక్తిభావములు ఆశ్రిత దీన జనాలి రక్షయున్ – సాగగ చేయవె సతతము సత్యము ధర్మమూ దాటకు౦డగన్ .
3-ఆరురుచులు నేడు యణగారిపోయెను –కొత్త రుచులు పెరిగే ,కోర్కె పెరిగే
కలియుగంబు నందు కనిపించదే నీతి –కరుణ జూపు నవ్యకాంతి నిచ్చి.
సశేషం
రేపు శ్రీరామనవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-23-ఉయ్యూరు