సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )
–శీర్షిక -శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం –
11-ఆంద్ర భాషా భూషణ –డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య –నెల్లూరు -9490400858
నేటి ఉగాది
1-ఉ-కోకిల కూతలేవి యిట ?కూల్చిన మానులే ఎల్ల తావులన్ –సోకిన రేడియేషను కు చూడగ లేమిక పక్షిజాతులన్
పాకలు కూలిపోయినవి ,పాడియు పంటయు గాన రావయా –మాకిక పండు గేమిటని మానె జనాళి సంప్రదాయముల్ .
2-చేరి ఉగాది పచ్చడిని చేయుట రాక దుకాణ మందునన్ –కోరిన రీతిగా కొనగ కోరిక దీరగ నేటి కాలమున్
గారెలు బూరెలున్ దొరకు ,కా౦తలకిప్పుడు చింతలేదయా –మారెను లోక మంత యను మాన్యుల మాటలు నిక్కమాయెగా.
3-శోభల బెంచు కాలమున సోదర భావము నెల్ల వేళలన్ –లాభము గోరకుండమరి లౌక్యము తోడను జీవనమ్ములన్
శంభుడు దీర్చు బాధలను సవ్యము నందవే సర్వ క్లేశముల్ –శోభిత భావముల్ బెరుగ సౌభగ మబ్బదెదైవ లీలచే .
4-చింతలు మాని కార్యములు సిద్ధము జేయుడు వేగమై చనన్ –ద్యోతల్ మై వెలుంగుగద దూరపు కొండలు నిన్ను జేరుటన్
నేతల నెన్ను వేళలను నిద్దురబోయిన సర్వ నాశమే –పాతక మందగా వలదు పట్టకు నోట్లను ఎన్ను వేళనన్ .
12- శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు-9290995112
నవనాయకులకు స్వాగతం
శోభ కృత్ లొ నవనాయకులలో ఎనిమిది మందిశుభులు
అందరూ ఇస్తారు శుభ ఫలితాలు –శని ఒక్కడే ఇబ్బంది పెడతాడు
పెత్తందార్లమాట గోచికిచాలదు –శత్రుదేశాలకు అహంకారమెక్కువే
రవికుజులకు పెత్తనం హుళక్కి –ముందు చూపులేని వారు మూలుగుదురట.
జాగ్రతో౦ జాగ్రత జాగ్రత జాగ్రత .
13- విశిష్టకవి దా బందా వెంకటరామారావు –విజయవాడ -6281754709
సర్వ శుభముల ఆకృతి శుభ కృతి –ఆశుభాల శోభల స్వీకృతి శోభ కృతి
శుభముల శోభలకు స్వాగతమ౦టున్నా- గతమున మించిన ప్రగతిని కోరుకొంటున్నా .
వత్సరమేడైనా వాంఛలు కొన్నేఅవే-ఆరోగ్యం ఆదాయం బాగుండి పెరగాలని
అందరూ బాగుండాలి అందులో నేను౦డాలి –కలలు పండి కోర్కెలు తీరాలని
పంచాంగాలు చినిగినా ఇదే మానవ నైజం –రాశిఫలాలు కంటికి కనపడినా ఏదో ఆశ
శుభకర శోభ తిలకించేందుకు అహోరాత్రాలు ఎదురు చూపు
షడ్రుచుల పచ్చడి మామూలే అయినా ఎదురు చూసి తినడం మహదానందమే .
ఇదే ఉగాది వేదనల త్రికాల వేదం – అలుపెరుగని ఈ బందా నాదం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-23-ఉయ్యూరు