శీర్షిక:– స్వాగతం శోభకృత్
రచన:– సింహాద్రి వాణి
ప్రక్రియ:– పద్యం
ఊరు:– విజయవాడ
చరవాణి:–7569820872
ఉ.మా. స్వాగత మమ్మ నీకు కడుసాదర పూర్వక , శోభకృత్ భళా
రాగల వత్సరమ్మ, భువి రాల్చుము కల్మష మీర్ష్య ద్వేషముల్
సాగగ నీతి న్యాయముల సవ్యపు బాటను నెల్లవేళలన్
రోగములన్ని గూల్చి, ప్రజ రోయగ జేయుము స్వార్థ భావనల్
2) ఉ.మా. ఏదినమందునైన జనులెల్లరు సౌఖ్యము పొందు రీతిగా
యాదినముల్ యుగాది ప్రజ కాదర మొప్పగ నీయగావలెన్
నాది యనల్ప భావనను, నైచ్యపుటూహలు కూల్చివేయ, రా
వా,దిశలన్నియున్ వెలుగు వాగులు పొంగగ లోకమందునన్.
3) సీ. ఈర్ష్య క్రోధములను నిలపైన బాయగా
కనువిప్పు కలిగించు కలుష ప్రజకు
ప్రేమానురాగాలు పెంపొంద జేయుమా
కులమత భేదాలు కూల్చివేసి,
మోసాలు కుట్రలు మొదలంట తొలగించి
మనుషులు మనసున మమత పెంచు
చదువు జ్ఞానములిచ్చి చల్లగా కాపాడు
పెడదారి పోకుండ పిల్లలెపుడు
ఆ.వె. కష్ట సుఖములందు కలిగి సంయమనమ్ము
సాగిపోవగ ప్రజ స్థైర్యమిడుము
శాంతి సౌఖ్యములిచ్చి చల్లగా దీవించు
దినము దినము గడువ దివ్యముగను
5)ఆ.వె. యువత భవిత గూల్చు వివిధ దారులు మూసి
చదువు వైపు శ్రద్ధ చాల గూర్చు
విజ్ఞత కడు పెంచు విజ్ఞాన మును నిచ్చి
దేశ భవిత వెలుగు నాశ నింపు